Tuesday, June 22, 2021

నా మొహం

         నా మొహం

అద్దం‌లో చూసుకుంటే

నా మొహం నాకే యెబ్బెట్టుగా వుంది

ఓడిన ప్రతిసారి దీనంగా నిర్జీవంగా

గెలిచిన ప్రతిసారి ఉల్లాసంగా ఉత్సాహంగా

జయాపజయాల నడుమ సాలోచనగా అయోమయంగా

కింకర్తవ్యం అంటూ పునరాలోచిస్తూ పునరంకితమౌతూ

ధ్యానముద్రలో పరాఙ్ముఖమౌతూ  పరిభ్రమిస్తూ

సత్త్వప్రభా భాసురమై సత్యప్రధానమై

వెలుగుతూ విరాజిల్లే నా మొహం

ఎందుకో వేదాంతిలా నిర్లిప్తంగా నిర్మోహంగా ఉంది.

అందగాడినా? కాదే!  కామవికారమా? లేదే!

అయినా

 నా మొహంలో భావాంబుధి యలలూ కలలూ

అక్షర విన్యాసాలు విలాసాలు ప్రతిబింబిస్తాయి

అలాంటిది ఎందుకో నిమిత్తానిచ పశ్యామి యంటోంది

పర్యవసానాలు ప్రతిచర్యలు ప్రస్తుతం అప్రస్తుతం

నామొహం,  అందుకే 

నా మొహం నాకే యెబ్బెట్టుగా వుంది.

నా మోహం నాకే అసమంజసంగా వుంది.


Monday, June 21, 2021

పరు‌లా? పరులా!

 పరులా? పరులా!

తే.గీ.

పరుల శుభ సుఖాల కొఱకు పరితపించి

స్వంత లాభము నెంచక సాయపడనె?

పరుల చరణములంటి నే పరితపించి

పరవశించిపోనా? వసివాడి పోన?


పరుల సహకార యుపకార ఫలములంది

వృద్ధి పొంది బ్రతుక సమృద్ధి గలిగె

పరుల నిత్యార్చనాదుల బ్రతుకు సాగ

పరులుభయతారకంబు సంభ్రమముగాగ.


పరసుఖానందనాథుడ భాగవతుడ

షోడశీ యజన సుమనస్కుడ విబుధుడ

పరుల సంతోష సౌఖ్య సౌభాగ్య మలర

పరుల! శక్తియుక్తుల నిమ్ము పరుల కొఱకు.


పరులు పరుల! స్వపరమంచు పలుక నేల?

స్వార్థమెక్కుడు పూను సంసారులైరి

పరమ దుష్టులైరి ధరకు భారమైరి

పరుల! తవ యుదాసీనతే పరుల బలము.

 ( పరుల1 = ఇతరుల, పరుల2 = పార్వతి)