Tuesday, April 30, 2019


మానవత్వమే లేని మనుషులకు
సమానత్వమంటే తెలిసేనా?
సహజత్వమే లేని మృగాళ్ళకు
నియమ నిబంధనలు భయ పెట్టేనా?
ఎంత చదువు చదివి ఏ పనిజేసినా
అలాంటి వారికి ఆడదంటే చులకనా?
అత్తమామలైనా కట్టుకున్న వాడైనా
మనిషిని మనిషిగా గుర్తించలేని పీనుగులు
కోరికలకు కొదవేలేని నర రూప రాక్షసులు
పాతరాతి యుగం ముద్దపప్పులు
గాదె కింద బలుపెక్కిన పందికొక్కులు
అమ్మాయిల జీవితాలతో చెలగాటాలు
మూటగట్టుకోరా కన్నీటి శాపాలూ పాపాలు?

Monday, April 29, 2019


ఉదాసీనమా పరధ్యానమా
మౌనమే నీ సమాధానమా
లలితా పరాభట్టారికా సేవలో
నాకింతయే సావకాశమా అమ్మా..// ఉదా//
ఇహపరానందమే ధ్యేయమై
నిత్యమూ నీ సేవలో లగ్నమై
మనగలుగుటే భాగ్యమా
కలగనుటయే సౌభాగ్యమా //ఉదా//
ధన మహిమ మతియైన
కలికాలమమ్మా మము బోంట్లకిది
పరీక్షా కాలమే నమ్మా
మంచికెక్కడా విలువ లేదమ్మా
నిలువ నీయరమ్మా...//ఉదా//
సకల సంపద్ప్రదాతవు జగదంబవు
నీవు వినా నా మొరాలించు వారేరీ
ఆర్తితో శరణాగతితో వేడినా
వినిపించుకోవా గమనించలేవా //ఉదా //

Sunday, April 28, 2019


మానవత్వము లేని విద్యాధికులకు
సమానత్వమెట్లు తెలియ గలదు
కాసుల కోసం కక్కుర్తి
జాబుల కోసం జబర్దస్తి
చలాకీ పిల్లకి గేలం

   అలజడి
బంగన పల్లెకు త్రోవేదీ
రసాల రసాలము లేవీ
సువర్ణ రేఖా మయూఖమేదీ
కర్తరి ఎండలు రాకుండానే
వసుంధర గొంతు తడారి పోయిందే
టెంక కట్టిన కాయ రానేలేదు
ఆవకాయలు పెట్టే ఊసే లేదు
ఇంతలో
ఉరుములూ మెరుపులతో
తరుము కొస్తోందో  గాలివాన
ఆపై మిగిలేది ఒకటీ అరా రాలుగాయి
అప్పుడు నూజువీడు కలెక్టర్లే 'రాలుగాయిలు'
ఈ వసంతానికి గ్రహణం పట్టిందేమో
ఈ సంవత్సరానికి కథ ముగిసిందేమో
ఆవకాయ లేకుండా ముద్ద కడెత్తని రకం
అయోమయంగా హతోస్మి యన్న వైనం
ప్రత్యుత్తర మెరుగని ప్రశ్నావళి
గమనించండీ మీ యెద నిండా అలజడి.
( రసాల రసాలము=రసాలు అనే రకం మామిడి పళ్ళు)

Thursday, April 25, 2019

  వినుతి
చం.
అరువది యేండ్లు పైబడిన యాప్తులు నా సహఛాత్రులందరున్
మరువని మిత్రధర్మముగ మాన్యమటంచు సమాదరంబుగా
చిరు దరహాస చంద్రికల చిన్ని తనంపు సకృత్తుగా మిమున్
పరులకు నీర్ష్యగా గలిపె వాట్సపు గుంపుగ ముచ్చటించగన్.
ఉ.
అందరి కొక్కటే వినుతి హాయని( హాయ్ అని) ప్రొద్దుట నొక్కమాటనన్
యందరు క్షేమమంచు తెలియన్ గల యద్భుత సంవిధానమిదే
కొందరకారణంబుగ సుగోష్టికి గుంపుకు దూరమైరి వా
రందరి క్షేమ యోగములు రాగ విలాసము లెట్లు తెల్సెడిన్.
మ.
మనసంతా యపుడప్పుడున్ తడబడున్ మా చిన్న నాడంచు యా
మనసారాట పడున్ తన బాల్య స్నేహితుల నోమారైన చూడంగ మీ
కనుచూపందిన మేర వారు కనరాకన్ బాధగా తోచెడిన్
మనసుంటే యొక మార్గ ముండునని యీ మార్గమ్ము మమ్ బోంట్లకే.
శా.
కాలక్షేపపు చర్యగా తొలుత  యింకాస్తంత సౌలభ్యమం
చా లాక్షణ్యులు కోరుచుండిరట స్వేచ్ఛార్తుల్ మొబైల్ వాడగన్
చాలా లాభము లున్నవంట మన వాచాలత్వమున్ జూపనౌ
ఏలా యాలము చేర్చరే యితరులన్ యీ గుంపులో యందరున్.

Wednesday, April 24, 2019


సీ.
ఉచితమటంచు నే నుచితమ్ముగా జేయ
             క్వచిత్తుగా గల్గె గారవమ్ము
ప్రచలిత యాశయమ్మంత ప్రజ్వలనమై
             విచికిత్స నన్నేలొ విస్తు గొలిపె
చంచల మయ్యె నా దిటవు యశ్రు జల దృ
             గంచల మయ్యె ముఖ మొకసారి
పచరించు నేరుపు నిచ్చి నిలువ నిచ్చి
             సుచరితు జేయుమో సుజన పాల
తే.గీ.
ఆచరించెడి వారికే యిక్కట్లు యన్ని గలుగు
గోచరించదు యేరికిన్ గుప్త నియతి
తోచ నీయదు సబబేదొ తొట్రుపాటు
మంచి బలమిమ్మ కంచి కామాక్షి యమ్మ.
   
(పన్నెండు పాదాలుగా భావించి అన్నిటా ఒకే ప్రాస కలిగినందున దీనిని అక్కిలి ప్రాస అంటారుట.)        

Tuesday, April 23, 2019


ఏం జరిగినా మనమంచికే అని ఈ ఎన్నికలు మన తెలుగునాట తొలి విడతలోనే ముగిసి పోయాయ్.
నిప్పులు చెరిగే ఎండల్లో
 భగ్గున మండే గుండెల్లో
వరుస కట్టి నిలవాలన్నా
పంతం పట్టి ఓటేయాలన్నా
ఎంత కష్టం ఎంత కష్టం

Tuesday, April 16, 2019


సీ.
ఆందోళనలతో యాత్మ కొట్టు మిట్టాడ
     ఆందోళి కా సేవ   యమరు టెట్లు?
ఉదయాస్త మానముల్ ఓటి బాధలటుండ
     పుణ్యమౌ యిరుసంధ్య పూజ లెట్లు?
నీటి యెద్దడి తోడ నీరసపడుచుండ
     యభిషేక జలము నీ కమరు టెట్లు?
దోసమంచను వారె ద్రోహమ్ము చేయుచో
     దోసిలొగ్గుట యెట్లు? దొలగు టెట్లు?
తే.గీ.
అంటి ముట్టక యట్టిట్టు యలమటించ
సహజ సంధ్యానుష్టానముల్ సాగు టెట్లు
ఆదరించవె తల్లి ఆనందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి?14.
సీ.
ఉచితాసనములు లే వో శివ పర్యంక! 
            హృదయ పీఠము వినా హృద్విభావ!
మందాకినీ నీరమా యిట యీనీళ్ళు
             అర్ఘ్య పాద్యములీయ ఆద్య! నీకు
మృష్టాన్న బోనముల్ మధురాంబువులు లేవు
             నైవేద్య మర్పింప నందయంతి!
కస్తూరి వంటి సుగంధ పరిమళము
             ల్లే వు యనేకముల్ లేవు లేవు
తే.గీ.
 ఉన్న దొక్కటే నీ మీద యూర్జిత గురి
 మంత్రమై తంత్రమై నన్ను మనుచు కొరకు
ఆదరించవె తల్లి ఆనందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.13.

సీ.
ఏమారి పోదునో నే మారి పోదునో
          కడదేరి పోదునో గట్టుపట్టి!
అల్లాడి పోదునో అల్లారి పోదునో
       కిల్లాడి నౌదునో గిరిజ! తుదకు
నీ పాద సేవతో నీ నామ స్మరణతో
     నిష్క్రమించ గలనె నిశ్చయముగ?
సామీప్య మెందుకు, సారూప్య మొద్దులే
     సాయుజ్య మీయవే సంతసింతు.
తే.గీ.
ఓడి పోయిన గాని నే నోడి పోను
జయము నిచ్చినచో నే విజయుడ గాను
ఆదరించవె తల్లి ఆనందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి. 12.
(ఏమారి పోవు=మోసపోవు , గట్టుపట్టి = పార్వతి , ఓడి పోను = పారి పోను)
సీ.
విసిగించు  పలుమార్లు వినతులూ ప్రణతులూ
          నే జేయబోను మన్నించ వమ్మ
తలపు తలపున నింత పలుకు పలుకున
         నిన్ను నిల్పెద గమనించ వమ్మ
కడగంటి చూపైన కడుపావ నమ్మండ్రు
         కన్నార్ప కుండ నన్ గాంచ వమ్మ
కవితలన్నిట నీవు కాలమంతయు నీవు
         భద్రునిగ బ్రతుక ప్రాప్త మిమ్ము
తే.గీ. ఖేచరీ ముద్రలో పరికించ నిమ్ము
        వలదనక యోని ముద్ర  నిర్వాణమిమ్ము
        ఆలకించవె తల్లి ఆనందవల్లి
       కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.11.

మొరాయింపుల మొర

"ఏవండీ!ఏవండీ"
"ఎక్కడ అఘోరించారు. పిలిస్తే పలకరేం?
ఈ కెంటు మిషన్ కారిపోతోందండీ"
"కారి పోవడం ఏంటీ? ఎవన్నా కన్నీరా కార్చడానికి?"
"వస్తున్నా చూస్తున్నా"
"ఛస్తున్నా! మీ వస్తున్నా వస్తున్నాతో "
"ఊ( తప్పుకో. ఎక్కడో లీకేజీ. ఇన్ లెట్ పైపులోంచే లీకేజీ"
" ఇదిగో. ఇక్కడ ఈ పైపు బ్రేక్ ఐంది. మరలా పైప్ మార్చాలి "
మరలా వాడికి కంప్లైంట్, సర్వీస్ ఛార్జీ. తడిసి మోపెడు"
" ఏవై(0దో తెలీదు కాని ఈ నెల అన్నీ ఇలాగే ఉన్నాయి.
మొన్న శనివారం  వాషింగ్ మెషీన్ మొరాయించింది.
" డ్రమ్ బెండ్ అయిపోయింది.
 దానికి మూడువేలు అవుతుంది. వారంటీ ఐపోయింది కదా"
సరే. ఆర్డరు పెడితే వారం పడుతుంది. సరేనా?"
"అలాగే బాబూ."
అది ఇంకా రాలేదు. ఆ పని పూర్తి కాలేదు.
" బోర్ లో నీరు అందడం లేదుట. మోటార్ మార్చాలట.
ఈ మోటర్ మొరాయిస్తోంది"
"బోర్ లోతు పెంచి కేసింగ్ చేసి మోటర్ మరోటి కొనడానికి ఇంటికి ఎనిమిది వేలట"
"సరే. తప్పదుగా"
 "ఈ నెల కరెంట్ బిల్లు ఎంతొచ్చిందో తెలుసా? పదకొండు వందలు"
"ఏ.సీ. రోజూ వేస్తూంటే కరెంట్ బిల్లు రాక ఏంచేస్తుంది?"
" వస్తే రానీ. స్కూల్లో పిల్లలకి దొబ్బపెట్టే డబ్బులు ముందు ఇది ఏమాత్రం."
" ఇదిగో. మీ కోవిషయం తెలుసా? రాత్రి 16 లో పెట్టినా సరే గది చల్ల బడలేదు."
" ఏ(0? ఏ.సీ. కూడా మొరాయిస్తోందా?"
" ఏమో! ఎవడికి తెలుసు"
"సరే. ఫిల్టర్ పేడ్స్ క్లీన్ చేసి చూద్దాం"
"అప్పటికీ కాకపోతే చదవాయించుకుందాం."
"ఏవిటో. ఈ మరలన్నీ మొరాయించడం మొదలు పెట్టాయ్."
" మొన్నటికి మొన్న ఈ.వీ.ఎమ్ లు మొరాయిస్తే రాత్రంతా ఓటింగ్ చేయించారు."
"అసలు ఎవడికైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఇంత ఎండలో పని చేయమంటే ఎవరు పనిచేయ గలరు? పశువులు పక్షులు మనుషులు చివరికి యంత్రాలు ఎండ భరించలేక పనిచేయమంటే మొరాయించవూ?"
"అన్నట్టు హాయిగా ఈ పోలింగ్ సాయంత్రం 5నుంచి ఉదయం 6 వరకూ పెట్టుకుంటే నూటికి నూరు శాతం ఓట్లెయ్యరూ? ఎండలో చంపకపోతే"
"ముదనష్టపు ఎన్నికలూ దిక్కుమాలిన పద్ధతులూ"
"లీలతో నా మొరాలింపడే అని ప్రతి జీవీ, యంత్రాలూ అల్లాడిపోతుంటే ఆ అనాథ రక్షకుడు ఆపద్బాంధవుడు
వినడె చూడడె తలుపడె వేగ రాడె"
"ఇదిగో మిమ్మల్నే. మిక్సీ బ్లేడు తిరగడం లేదు. చూసి అఘోరించండి. మొరాయించడానికి మిగిలి పోయింది నేనే."
"ఇవన్నీ సరి అయ్యేవరకూ ఒసే అంటూ గావు కేకలూ పొలి బొబ్బలూ పెట్టారంటే ఖబడ్దార్. నేనూ మొరాయిస్తా"
"నారాయణ. నారాయణ"
" మధ్యలో ఆ నెల్లూరు నారాయణ ఎందుకు?"
" శ్రీ హరీ. శ్రీ హరీ."
" మిమ్మల్నే. ఉదయం లేవగానే శ్రీ హరీ శ్రీ హరీ అంటూ ఎందుకు అలా అరుస్తారు? విష్ణుమూర్తి మీ చౌకీదారా? పిలవగానే పలకడానికీ పరుగెత్తుకు రావడానికీ"
" ఔనౌను. మా చౌకీదారు వాడసలు చావుకి దారు.
నీకో విషయం తెలుసా? ఈ మొరాయింపులూ ఫిరాయింపులూ అన్నీ చౌకీదారు పనే అనీ వీసా రెడ్డి పన్నాగమనీ చంద్రుడూ రాహువూ బాకాలూదుతున్నారు."
"కానీ .గన్నూ .వన్నూ  మొరాయింపుల గురించి ఏమీ అనరు. ఇది ఎలా ఉందంటే
పక్కింటి వారి ఇంట్లో అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. మన దగ్గరే నానా రచ్చ."
"నేను మా అన్నగారింటికి చెక్కేస్తున్నా. మొరాయింపులన్నీ సరిచేయించాక వస్తా. వెళ్ళొస్తా"
"లీలతో నా మొరాలింపడే మొరగుల తెరులెరుంగుచు తన్ను మొరగువాడు."


Saturday, April 13, 2019

     మనీషి నైజం
ఈ మేను నేను కాదని తెలుసు
ఐనా రూపలావణ్యం పై మనసు
మరుభూమే అంతిమ గమ్యం అని తెలుసు
ఐనా ఈ భూమే సర్వస్వంగా తలపు
తలపుల వాగ్రూపమే భాషని తెలుసు
జీవకోటిలో ప్రతి జాతికీ ఒకో భాషని తెలుసు
మనుజుల మనసులలో వ్యష్టి పై మనసు
జీవిత వ్యవధానం అతి తక్కువనీ తెలుసు
జీవించినంత సేపూ నేను నాదనే తలపు
మరణం మన వెన్నంటి ఉంటుందని తెలుసు
ఎంత బ్రతికినా ఇంకా బ్రతకాలనే మనసు
మరణం అతి సుందర గమ్యం కామోసు
వెనుదిరుగని మరో మజిలీకి తిరకాసు
జననం దుర్భర దుష్కర ముష్కరమేమో
రోదనధ్వనులతో నిరసనలతో ఆరంభం
బ్రతికినంత కాలం 'నేను' కు కావాలి ఉపాధి
ఆమేని ఉదర పోషణార్థం కావాలి మరో ఉపాధి
శ్వాస నిలిచి పోతే ధ్యాస ఏమారి పోతే
జీవం గాలిలో కలిసిపోయే  వైనం ఓ రహస్యం
ఈ మేనిలో నేను అనే ఓ ఆత్మ
ఆ ఆత్మలో సూక్ష్మమైన ఓ పరమాత్మ
ఈ రక్త మాంస చక్షువులకందని నిజం
అది తెలుసుకోవాలనుకోడం మనీషి నైజం.

Friday, April 5, 2019


తే.గీ.
ఏ వికారముల్ పోక యీ యేడు సకల
జనులు ముదమొంద సాగిపో చాలు నదియె
యో వికారి వత్సరమా సయోధ్య గరప
గలవు యానంద భైరవికారి నీవు.



Thursday, April 4, 2019

         వేసవి శలవులు


 వేసవి శలవులంటే చీకూ చింతా లేకుండా ఆటపాటలతో గడిపేయడమే. పల్లెటూర్లలో సందడే వేరు. ఒక ఈడు వారు అందరూ కలిసి రాత్రి పగలూ అనకుండా తిరిగే అవకాశం.
మాది మారుమూల ఓ చిన్న పల్లెటూరు. దానికి అప్పట్లో రోడ్డు కూడాలేదు. హైస్కూల్ 4 కి.మీ. దూరంలో ఒకటి 8 కి.మీ. దూరంలో ఒకటీ 24 కి.మీ. దూరంలో ఒకటి ఉండేవి. అన్నిటికన్నా దూరం అయినా శంఖవరం లో ఎక్కువ మంది చదివేవారు. కారణం రాజా వారి సత్రంలో వసతి , భోజనం కొందరికి ఉచితం. మా వూరినుంచి కనీసం పదిహేను మంది వరకూ అక్కడే చదివేవారు.
మరి కొందరు  దగ్గరలో ఉన్న గునుపూడి లో చదువు కోసం రోజూ నడిచి 4కి.మీ. వెళ్ళి వచ్చేవారు. మేము మాత్రం కోటనందూరులో చదివాం. మా అమ్మ పిల్లలం అక్కడ మా నాన్నగారు మా వూర్లో. వారం వారం వచ్చి వెళ్ళేవారు.
వేసవి శలవులకు అందరం మా వూరు చేరుకునే వాళ్ళం.
ఇంకేముంది. తిండికి మాత్రమే ఇళ్ళకు. మిగతా సమయం అంతా కలిసి ఒకచోటే గడిపే వాళ్ళం.
ఉదయం తొమ్మిది తరువాత కఱ్ఱ బిళ్ళ ఆట వూరికి ఓ ఎంట్రన్స లో. ఆ ఆటలో ఆడే వాళ్ళ కన్నా చూసేవారే ఎక్కువ. మంచి కత్తెర ఎండల్లో ఆట మహా గొప్పగా ఉండేది. పక్కనే చింతచెట్ల నీడన చిన్నవారం ఆడుకునేవాళ్ళం.
మధ్యలో మామిడి పిందెలు కోసి తెచ్చుకోవడం, ఉప్పు కారం అద్దుకుని తినడం బలే మజాగా ఉండేది.
మద్యాహ్నం పన్నెండు అయ్యేసరికి ఇంటికి వచ్చేసి మధుమంజరి పాటలు రేడియో లో వింటూ భోజనాలు.
ఆ వెంటనే వార్తలు.
మరలా ఒంటిగంటకి కూటమిలోకి చేరిపోయి పిచ్చాపాటీ.
అక్కడ ఒకరి ఇంటి వీధి గుమ్మం మా అందరికీ ఆవాసం. ఆ ఇంటివారు పెరటి వేపు ఉండేవారు. అక్కడే పంచాయతీ రేడియో ఉండేది. అదే అందరికీ కాలక్షేపం.
పంచాయతీ ఆఫీసుకు రెండు తలుపులు. క్రింద ఒకటి మీద ఒకటి. మీద తలుపు కొంచెం తేల్చి కింద తలుపు గడియ తీసి ఆ రేడియో ఆన్ చేసి  వినే వాళ్ళం. ఇంతలో ప్రెసిడెంట్ వచ్చి ఎవరు వేసారు రేడియో అని అడిగితే మాకు తెలీదంటే మాకు తెలీదని తప్పించుకునే వాళ్ళం. సూరెంటు యెదవలు అని ఆ రేడియో కట్టేసి పోయేవాడు.
సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో  చుట్టుపక్కల ఉన్న ఏదో ఓ పొలంలో ఉన్న నేలనూతికి వెళ్లి స్నానాలు. నేల నుయ్యి ఇరవై అడుగులు వ్యాసంతో నేల నుంచి ఐదారడుగుల కిందకు నీరుండేది. లోతు ఎంతకాదన్నా ఇరవై ఐదడుగుల వరకూ ఉంటుంది. అందులో ఈతలు దూకడాలు నూతిలో ఎదో ఓటి పడేస్తే కింద వరకూ వెళ్ళి వెతికి తీసుకు రావడం. జట్టు పదిహేను ఇరవైమంది. అందరికీ ఈత వచ్చేసింది.
ఇక రాత్రి అంతా ఒక దగ్గరే బిచాణా. ఒకరి బోడిమేడ మా అందరికీ ఆశ్రయం. దానికి సగంమేర మాత్రమే మెట్లుండేవి. ఆపైన గోడ అంచు పట్టుకుని గోడకు రెండు చిన్న కన్నాలుండేవి అందులో కాలేసి ఎక్కాలి. పిట్టగోడలు కూడా లేని ఆ మేడమీద ఆకాశం చూసుకుంటూ బాతాఖానీ.
అయితే ఈ గుంపులో ఒకరిమీద ఓకరికి ఈర్ష్య ద్వేషం ఉండేవి కాదు. అందరిదీ ఒకటే మాట.
ఆందుకే ఆ వేసవి శలవులు అయ్యాక బడి అంటే రోత.