Wednesday, August 30, 2017

నాకెంతో మక్కువ

సంధ్యాదేవి నుదటి గుండ్రని బొట్టులా
అరుణారుణ యిన బింబం కనబడటం లా (లేదా)
శిరసొంచి ప్రకృతి కాంతకు ప్రణమిల్లాలని పించేలా
నా మనసంతా ఏదో తెలియని ఆనంద పారవశ్యం
దూరంగా సాగర గర్భంలోంచి పైపైకి వస్తున్న
ఎఱ్ఱని హిరణ్య గర్భ  నవసౌందర్యం
నాలో ఎన్నెన్నో ప్రశ్నలు రేకెత్తించడమే కాదు
మరో క్రొత్త పట్టుదలతో పనిచేయమని
అవరోధాలతో  సాధన మరింత రాటుదేలాలని
అవహేళనలే హెచ్చరికలుగా భావించమనీ
నా కని పిస్తుంది అలా నా కళ్ళకు కనిపిస్తుంది
పడమటి సంధ్యారాగం మరో యవనిక పైన
సరి కొత్త అవకాశాలు అందుకో మంటుంది
చల్లని సాయం సమయాలు మానసోల్లసాలు
శరద్జ్యోత్స్నా నిషధ్వరీ పునీత నా కవిత
ఆ వెన్నెల లలో నా ఎదలో ఆనందాల హరివిల్లు
ఆరుబయట ఒంటరిగా ఝామురాత్రి కూర్చుంటే
జీవనగమన పునస్సమీక్షలూ పునరంకితాలు
పుంఖానుపుంఖంగా ఆలోచనా పరంపరలు
అందుకే పల్లె పట్టున ప్రకృతి ఒడిలో జీవనం
నా కెంతో మక్కువ అది నా కెంతో ఎక్కువ.

Tuesday, August 29, 2017

ఆశ పడతా పాటు పడతా

ఎదిరించడం బెదిరించడం నా అభిమతం కాదు
మంచితనం ఈ మౌనం  నా అశక్తతలూ కావు
వివేకంతో ఆలోచించి ఆచి తూచి మాటాడే
నా ప్రతి మాట నా మనసు మూల్గుల తూటాలే
ఎద పరచి స్వాగతిస్తా సద్విమర్శ నేదైనా
ఆత్మావలోకనం తో నన్ను నేను సరి చేసుకుంటా
నా పై విసిరే విసిగింతలూ వెక్కిరింతలూ
నవజీవన హోమంలో పేలి పోయే పేలాలు
శాంతం మౌనం సహనం ముప్పిరి గొన్న వైనం
నా అంతరంగం నా భాధాతప్త మనో గతం
కాలం దైవం సమవర్తులై నన్ను చేరదీయాలి
సమిధను కాలేను అహంకార యజ్ఞానికి
శలభం కాలేను దురహంకార అగ్నికి
ప్రజ్ఞానం విజ్ఞానం తోడూ నీడగా
అడుగు లోన అడుగు వేస్తూ పయనిస్తా
ఆసాంతం శాంతంగా ఆలోచిస్తా
దైవం నన్ను సన్మార్గంలో నడి పించాలనీ
ఆశయాలూ అవకాశాలూ అంది పుచ్చు కోవాలనీ

ఆశ పడతా పాటు పడతా.


Sunday, August 27, 2017


ఒంటరితనాన్ని వెంటాడుతున్నాయి
మరలా మరలా తీపి జ్ఞాపకాలు
ఎంత కాదన్నా ఎంత వద్దన్నా
కథ మొదటికీ సకల కలలూ చివరికి
కాలం కన్నా మంచి ఓషధీ
ఈ బాధ నుంచి తప్పించేది 
కనుచూపు మేరలో కనిపించడం లేదు
ఎంతో ప్రాణంగా పెంచిన కూతురు
ఎరువు సొమ్ము ఐ పోయింది
వారిద్దరూ అన్యోన్యంగా ఆనందంగా
ఉంటే అంటీ ముట్టనట్టు 
దూరదూరాల నుంచి సంబర పడ వచ్చు
పది రోజులైనా మనసు స్తబ్దత
ఏదో నిర్లిప్తత అనాలోచిత నిశ్శబ్దం
ఇకపై నూతన జీవన విధానం
పోగు చేసుకుని మనసు దిటవు చేసుకుని
సాగాలి ముందుకు ముందు చూపుతో
జగన్మాత కావలసిన మనో నిబ్బరం
కార్య దక్షతా స్థిర సంకల్పం ఆరోగ్యం
ప్రసాదించు గాక.

Tuesday, August 22, 2017

ఆవేదనలు ఆలోచనలు

అన్యాయాన్ని ఎదిరించలేక సహించలేక
అక్రమాలను అడ్డుకోలేక సర్దు కోలేక
అసత్యాలను ఒప్పుకోలేక తప్పుకోలేక
నా మదినిండా ఎన్నో ఎన్నెన్నో
అంతులేని ఆవేదనలు ఆలోచనలు

ప్రజాధన దుర్వినియోగాన్ని చూడలేక వీడలేక
దేశ సంపదల దోపిడీ ఆపలేక ఓపలేక
ప్రజా ప్రతినిధుల ఆగడాలను ఓర్వలేక నేర్వలేక
నా మదినిండా ఎన్నో ఎన్నెన్నో
అంతులేని ఆవేదనలు ఆలోచనలు

లంచగొండితనం సమ్మతించలేక నిమ్మళిచలేక
అడుగడుగునా అవినీతికి కళ్ళుమూసుకోలేక
               కుళ్ళు మోయలేక
అక్రమార్జనల చేయలేక చేవలేక
నా మదినిండా ఎన్నో ఎన్నెన్నో
అంతులేని ఆవేదనలు ఆలోచనలు

విశృంఖలత్వం భరించలేక ధరించలేక
పశ్చిమానుకరణను ఆమోదించలేక విబేధించలేక
సద్యఃఫలాశక్తులను ప్రోత్సహించలేక తృణీకరించలేక
నా మదినిండా ఎన్నో ఎన్నెన్నో
అంతులేని ఆవేదనలు ఆలోచనలు.
సీ. ఇన్నాళ్ళుగా పెంచి పెద్ద చేసిన ఒక్క
గానొక్క సంతు బంగారు బొమ్మ
చిరు నవ్వుతో పెనిమిటితో కదలి సాగి
  పోయెను అత్తింటి కోడ లగుచు
కొడుకు కన్నను మిన్నగా మలచినఫల
  మామె యన్నింట తా ముందు నిలచు
అమ్మ దయ వలన కుదిరిన సంబంధ
  మగుటచే అమ్మ సమస్త మగును
తే.గీ. జోడు బ్రతుకుల ఒంటరి జంట మాది
        రెక్కలొచ్చిన పక్షులు ఎగిరి పోవు
        అలసి సొలసిన మాకు కొండంత అండ
       నేను పాసించిన లలిత నాదు బలము.

Thursday, August 10, 2017

ఎదురు చూస్తా

గుండె నిండా ప్రేమతో
మనసు నిండా అభిమానంతో
ప్రతి పలకరింపులో ఆప్యాయతతో
నిండు మనసు తో కొండంత అండగా
అడుగడుగునా అనుసరించే జాబిలి కూన గా
ఎదరు పడి ఎదపరిచే ఆదరించే ఆ మంత్ర బాలగా
చిరునగవుల  విరి తావుల పలుకరింత కోసం
సరిసమమై చెరిసగమై ఆశయ సిద్ధి కోసం
అనుక్షణం పరితపించే పరిశ్రమించే నీ కోసం
అలుకల కినుకులు అసలెరుగని సమయం కోసం
నీ కోసం ఓ బాలా ఈ జీవితమంతా ఎదురుచూస్తా
నా కోసం ఓ బాలా ఏమివ్వగలవో వేచి చూస్తా
నాన్నగారూ అనే నీ కమ్మని పిలుపు కోసం
ప్రతి రోజూ ప్రతి నిమిషం ఎదురు చూస్తా.

Sunday, August 6, 2017

My preference

Preferring to be a brother
to shoulder more you bother
Prefixing to be an attitudinal father
bringing frustrating rewards rather
the ideal role to be an admiring Guru
to teach preach and reach inner heart
to receive perceive and creative yet.
Sure I remain maintain and sustain
to be a student at the learned
and a Guru among the being learned
 a father to the up coming wings
 a brother to my dearest sisters.

ఇదండీ మన నవభారతం

పదే పదే పాకులాడితే పలుచనై పోతాం
వ్యామోహం లో పడితే మిగిలేది అగౌరవం
మోజు పడితే కొండెక్కి కూచోవడం రివాజు
పలుకే ప్లాటినం అన్నట్టు అనుకునే మారాజు
ఉలుకే బంగారమనుకునే వారిదే ఈరోజు
కాని వారితో కలుపుగోలు గా ఉండటం
అయిన వారికి ఆమడ దూరం నిలవడం
తలిసీ తెలియని ఒంటరి తెంపరితనం
వచ్చీ రాని ప్రాయం విరిసీ విరియని పరువం
మంచి అని ఎఱిగినా ఏమీ ఎరుగనట్టు ముఖం
ఇదండీ మన పదహారేళ్ళ నవ భారతం
మేలు కోరి ఊసాడితే అపార్థం
మేలాడి బ్రతిమాలితే అసహనం
ఇదండీ ఇంటింటా జరుగుతున్న భాగోతం
కాదు కూడదు అంటే మరో భారత  సంగ్రామం.

Friday, August 4, 2017

స్వార్థం - నిస్వార్థం

స్వార్థం లేకుండా మనగలమా
ఏ చర్యలో చూసినా దోబూచులాడుతూ
విజయ గర్వంతో వెక్కిరిస్తుంది స్వార్థం
ముక్కుమూసుకుని తపస్సు చేసే
ముముక్షువుకు మోక్షం అనే స్వార్థం
మంచు కొండల మీద గస్తీ కాస
వీర సైనికునికీ కుటుంబమనే స్వార్థం
గుడి మెట్ల మీద యాచించే వానికీ
సంసార వ్యామోహం కుటుంబ స్వార్థం
ప్రతి మొక్కకూ మనిషికీ ప్రతి జీవికీ
అంతిమంగా ఎదో ఒక స్వార్థం
కనీసం మేలైన బ్రతుకు కోసం
తన వంశ, జాతి విస్తరణ కోసం
తరతరాలకూ తరగని సంపద కోసం
కూడబెట్టే హక్కేలేకుంటే
కూడు గూడూ అంతా అన్నీ ప్రభుతే ఇస్తే
స్వార్థం ఆమడ దూరంలో ఆగవచ్చు
కాని అపుడెందుకు పని చేయాలి
సోంబేరితనం విశ్వ వ్యాప్తం కాదూ
అందుకే ఆర్జనకూ ఒక అవధి ఉండాలి
సంపద ప్రోది చేతకూ సంకెలలుండాలి
చేతనకు ప్రతి ప్రాణీ ప్రయత్నించాలి
ఉన్నంతలో కొంత దానధర్మాలకై వెచ్చించాలి.

Thursday, August 3, 2017

ప్రాప్తమున్న తీరానికి పడవ చేరిపోతుంది

ప్రతి ఉదయం భాను ప్రతాపం
ప్రతి సాయంత్రం వరుణ రసార్ద్ర వృష్టి
ఒక ఉదయం ఆహ్లాద భరిత రసస్ఫూర్తి
మరో ఉదయం ఆందోళనాజనిత ఊహావ్యాప్తి
కాలగమనంలో అసదృశ ఆరోహణావరోహణలు
కర్తవ్య నిరతిలో ఎన్నెన్నో ఉథ్థాన పతనాలు
లక్ష్య సాధనలో అనేకానేక అవరోధాలు
అపోహల సాలెగూళ్ళు అభియోగాల సందళ్ళు
కిమ్మన కుండా నమ్మిన నిజం కోసం
నమ్ముకున్న జనం కోసం నమ్మక పోయినవారితో
సాగుతూంది పయనం కొనసాగుతూంది గమనం
ప్రాప్తమున్న తీరానికి పడవ చేరి పోతుంది
ఆర్ద్ర మైన గుండెల్లో మనికి చోటు ఉంటుంది
మరో శుభఘడియలో ఓ నవోదయం వికసిస్తుంది
చెదపురుగులూ చీడపురుగులూ రాలి పోతాయి
చిరు ఎడదల చిరునగవులు పలుకరిస్తాయి
చిన్నారులతో స్నేహాలు మనోబలిమి నిస్తాయి.