Monday, March 30, 2020

  ఇదో లెక్కా
గమ్మున పడి ఉండమంటే
కిమ్మనకుండా ఏడవమంటే
ప్రారబ్దమా ప్రకృతి వైపరీత్యమా
మానవులకు ముచ్ఛెమటలు
పట్టిస్తున్న కరోనా వ్యవహారాలు
ఇంటి పట్టున ఉండాలన్నా
వంట మట్టుకు కావాలన్నా
సరుకులు సంబారాలు మందులు
పొందాలన్నా గుమ్మం దాటాలే
రోడ్డెక్కితే పోలీసుల లాఠీలు
ఇంటింటికీ అందరికీ కూరలు దినుసులు
అందించాలే గాని ఇదేం గోల
కరోనావా కాకరకాయా అన్నారే
దేనికీ ముందుచూపు లేని ఏలికలు
ప్రతిదానికీ ప్రజల ఎదురు చూపులు
తొక్క దళసరి తెలుగోడికి
ఇదో లెఖ్ఖా ఆవకాయ డొక్కా.

Thursday, March 26, 2020

కోవిడ్ 19


నేరం నాదికాదు

ఈ నేరం నాది కాదు నేతలదే
కని పెంచిన వారి కార్పణ్యంతో
అఖండ భూమండలం నా వశం
ఖండాంతరాలలో నేనున్నా
నా ఉనికిని పీకేసే మనిషే లేడు
నాకు జడవని నరుడే లేడు
నాగరీకుల నిస్సహాయతా
పాలకుల ఉదాసీనతా
నా విశ్వ వ్యాప్తికి కారణాలు
ఈ గృహ నిర్బంధాలకు ముందే
సరిహద్దులు మూసేసుకో వద్దూ
ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం
అని గగ్గోలు పెట్టడానికున్న
మీ మీ ముందుచూపు
పొరుగు వాకిట నేనుప్పుడే ఉండాలి
ఈ పాపం దేశదేశాల ప్రజలందరిదా
ఈ నేరం ముందుచూపు లేని నేతలదా
ఖర్చులేని ఆయుధంతో యుద్ధం గెలిచిన
దురహంకారపు పెత్తందారులదా
కోవిదులందరకూ మింగుడు పడని
కోవిద్ 19 అనే నేను అసామాన్యమా.

Tuesday, March 24, 2020


గృహ నిర్బంధంలో ఉగాది

ఎక్కడా కోయిల గొంతు వినబడటం లేదు
సంతలూ అంగళ్ళూ తెరిచే అవకాశం లేదు
ఉగాది పచ్చడికి వేప పువ్వు కూడా లేదు
గృహ నిర్బంధంలో యావత్ భారత జనత
కరోనా మహమ్మారి పై యుద్ధం లో ప్రభుత
మందు లేని మాయరోగం అంటకుంటే ఘనత
ఎక్కడా ఎవరి నోటా ఉగాది ఊసే లేదు
బహుశా కోయిలకూ కరోనా భయమేనేమో
కనుచూపు మేరలో కనబడదు వినబడదు
చేదు అనుభవంతో ముగిసేనే 'వికారి'
ఆశావహ దృక్పథంతో స్వాగతమో 'శార్వరి'
నీవైనా దయార్ద్ర హృదయవై ఆదుకోవాలి
స్వాగతం శార్వరీ నీకు సుస్వాగతం.
ఆత్మీయులందరికీ ఉగాదీ శుభాకాంక్షలు.💐

Monday, March 23, 2020

 Judge it.

In search of livelihood
In search of a better pay
Migrated to distant lands
Many a people of this land
Having served and stayed
Away from the mother land
In an alien place for a long period
Does he not permitted to return
Atleast to have the last breath
If denied because of a Corona
If shunted to where he lived
Is migration a crime on his part
Is his desire to come back a curse
To the Nation and to its people?


Tuesday, March 17, 2020

  ఘనత

తన కనుసన్నల్లోనే పనిచేస్తే
చట్టాలు నియమాలు అనకుంటే
వద్దనది మానేస్తే చెప్పింది చేసేస్తే
అధికారులు అవధ్యులైపోతే
అతనో జనరంజక యువ అధినేత
అతనే మా నయవంచక యమదూత.
ఓటేస్తేనే గెలిచారో
మర నేమారిస్తే గెలిచారో
ఊ కోట్టిన జనానికి కోటి దండాలు
కాదన్నవారికి చీటికీ మాటికీ అరదండాలు
ఇది ప్రజాస్వామ్యమా
ఏకస్వామ్యమా ఏమో
ముసుగేసుకున్న నియంతృత్వమా
వంధిమాగధుల వంత పాటలు
కుల ప్రముఖుల వత్తాసులు
మత పెద్దల విధ్వంసాలు విద్వేషాలు
పదినెలలకే పలుచనైపోయిన ప్రభుత
ఎటూ పాలుపోక ఏమౌతుందో భవిత
ఏమారి అడ్డంగా ఇరుక్కున్న జనత
ఇదండీ ఈనాడు ఆంధ్రుల ఘనత.

Saturday, March 14, 2020


కం./సీ.

మల్లెల మొల్లల జాజుల  ,   మాలల
                                 జేసి తురుమ బోరు చింతలేల
చెల్లియొ జెల్లకొ దునిమిరి చిరకాల
                      మటు(ల్) ,  లని పగతుర మనుట వలదు
తొల్లి గతించె విరి దురుమ ,/ మి మురియు
                           వారేరి భారత వర్షమందు
పిల్లలు మానిరి నవతర బిగువది
                            కనరే.  ల విరులార కనులు దెఱచి
కం./తే.గీ.
రూప సిరులు సౌరభముల.   రోహిణములు
జూపరులకు హాయి నొసగు సుమముల నిక ( పై)
మీ పగతురమని యనకన్  , మిత్రుల వలె
కాపరులుగ మమ్ము గనుడు గడుసరి లన. (గా)
   

Tuesday, March 10, 2020


ఈ దేశంలో పుట్టినందుకు గర్వించనా
ఇలాంటి దేశంలో ఉన్నందుకు తలదించుకోనా
హంతకులు నేరస్తులు పాలకులై పరిపాలించే
అభియోగాలే ఊడిగానికి అవరోధాలుగా వల్లించే //ఈ //
ప్రతిభ కన్న కులం చూసి అందలమెక్కించే
ప్రగతి కన్న పందేరమే ఆదర్శంగా భావించే // ఈ //
పదవి కోసం నగదు కోసం పార్టీలు మారిపోయే
ప్రజాసేవ ముసుగులో ప్రజాధనం దోచుకునే
అధికారం చేతిలో ఉంటే అయినవారికి పందేరం
కాదన్న వరికి కారాగారం నిత్య నరకం చూపించే // ఈ //
హత్యలు అత్యాచారాలు చేసినా తక్షణ శిక్షలు లేకుండా
ఎంతటి నేరాగాడినైనా శిక్షలు అమలుకు రాకుండా
వాదించే వేధించే సాధించే కచేరీలు వకీళ్ళు ఉన్న// ఈ //
స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా
అన్నదాత పంటను కళ్ళంలోనే అమ్మేసుకునే
అడుగడుగునా పురుషాధిక్యంతో విఱ్ఱవీగే మేథావులున్న
ఆడదంటే అవమానాలు పరాభవాలు షరా మామూలే అన్న // ఈ //

Monday, March 9, 2020


సీస గర్భిత మత్తేభం.
సీ.
వినుత సౌందర్యమ్ము మీదు సొత్తు కలదే
           నూనూగు నెత్తావి నాప గలుగ
ప్రకృతిలో మీకొక స్థానమున్నదని యా
           క్రోసింతురే యెవ్వరున్ గడుసరి
సుమతి! చాంచల్యము జెందనీకు మనసే
           మార్ఛన్ తలంచున్ సుమా మరిమరి
విగత వాద ప్రతి వాదముల్ మరచి
           సాంగత్యమ్ము సాగింపవే కుసుమమ.
తే.గీ.
ఏల విరుల గోయు తలపదేల మనుజు
లేల మిమ్ము త్రుంచు తెగువ లేదదేల
మనిషి పై గురి కలదే లమకుడ నేను
సమ్మతింతు ననరె చాలు చాలు నాకు.
మ.
నుత సౌందర్యము మీదు సొత్తు కలదే నూనూగు నెత్తావి నా
కృతిలో మీకొక స్థానమున్నదని యాక్రోసింతురే
యెవ్వరున్
మతి చాంచల్యము జెందనీకు మనసేమార్చన్ తలంచున్ సుమా
గతవాద ప్రతివాదముల్ మరచి సాంగత్యమ్ము సాగింపవే.

కం.
ఏల విరుల గోయు తలప
దేల మనుజులేల త్రుంచు తెగువ లేదా
యేల మనిషిపై గురి కల
దే లమకుడ నేను సమ్మ తింతున్ యనరే.

ఆ.వె.
ఏల విరుల గోయు తలపదేల మనుజు
లేల త్రుంచు తెగువ లేదదేల
మనిషి పై గురి కలదే లమకుడ నేను
సమ్మతింతు ననరె చాలు చాలు.


ఛందపు టందం కందం.
(పుష్ప వికాశం అనే ఒక ఖండిక కోసం చేస్తున్న అక్షర విన్యాసం )
( ఈ క్రింది కందమే ఓ తేటగీతి మరో ఆట వెలది కూడా)
కం.
పంతములిక మాను కొనుడు
బంతి సుమములార మీరు భాగ్యలయిరి లా
వింతయు కలదే నరులకు
శ్రాంతియు వడయన్ విశేష శాంతియు నరసిన్ .

తే.గీ.
పంతములిక మానుకొనుడు బంతి సుమము
లార! మీరు భాగ్యలయిరి లావొకింత
యు గలదె నరులకున్  శ్రాంతియు వడయ (న్)
(వి)శేష శాంతియు నరసిన్ స్థిరముగ నిక.

ఆ.వె.
పంతములిక మానుకొనుడు బంతి సుమము
లార! మీరు భాగ్యలయిరి లావొ
కింతయు గలదె నరులకు శ్రాంతియు వడయన్
(వి)శేష శాంతియు నరసి(న్) స్థిరముగ.

Friday, March 6, 2020


సీ.
*ఎంతటి భాగ్యమొ విరులక దెంతటి
            సౌభాగ్యమో గదే చంపకమ! మిము
నంతనె వేలుపు లైనను యెంతగ
            నిష్ట పడుదురొ యిదేమి ఫలమొ
*భగవంతునిదరి జేరగ నగునే మము
            బోంట్లకు తమకగు పువ్వు లార
సిగబంతిగ ధరియింపరె మగువలు మిము
            మరువిల్లగుట వరమదియు గనరె
తే.గీ.
*పూలిక విరబూయాలని బోలెడు తమి
తో లలనలు పూ దురుమక  దూరములను
నిలువ యజితు చరణముల నిలుప దలతు
ఓల మింకేల సుమి మనకొద్దు తగవు.


కం.
ఎంతటి భాగ్యమొ విరులక
దెంతటి సౌభాగ్యమో గదే చంపకమా
అంతనె వేలుప లైనను
యెంతగ నిష్టపడుదురొ యిదేమి ఫలమ్మో. 1.
కం.
భగవంతుని దరి జేరగ
నగునే మము బోంట్లకు తమకగు పూలారా
సిగబంతిగ ధరి యింపరె
మగువలు మరువిల్లగు వరమదియున్  గనరే. 2.
కం.
పూలిక విరబూయాలని
బోలెడు తమితో లలనలు పూ దురుమక దూ
రాలను నిలువ యజితు చర
ణాల నిలుప దలతు ఓల మింకేల సుమీ. 3.
( అజితుడు = జయింప బడని వాడు / భగవంతుడు  ఓలము = దాపరికము)
గమనిక: పై సీస పద్యం లో * గుర్తు దగ్గర నుంచి చూస్తే కంద పద్యాలు వస్తాయి.)

చతుర్థ పాదగోపన చంపకమాల.

చం.

అరివిరి జేరువై గలసి యాకులమున్ గనగల్గు మీరు మే

లరిలు నిజానికిచ్చకపు లావిక జెయ్యక మేము గూడ నం

దరి దరి గామె కూరిమియె దన్నుగ నోమును పట్ట కుందుమే.

(ప్రతి మూడవ అక్షరం క్రమంగా ఒకటవ పాదం నుంచి మూడవ పాదం వరకూ జోడిస్తే నాల్గవ పాదం లభిస్తుంది.)



విరులకు గల్గు మేలు నిక వియ్యము నందమె మిన్ను ముట్టమే.

Wednesday, March 4, 2020

ప్రతి పాద యమక స్తబకం.
సీ.
విరిబాల గనవేల వినవేల మాగోల
             యననేల నిన్నేల యలుసు నగుచు
సొగసైన తనువైన నీకైన మాకైన
              తావేల యీవేల  తలుప వేల
విరబూసి నినుజూచి తలయూచి  కనుమూసి
             రాలిపో నేల పో రసిక రాజ
మూన్నాళ్ళ ముచ్చటై మూన్నోళ్ళ ముచ్చటై
             కన్నోళ్ళ కన్నీళ్ళ కట్టెదుటనె
తే.గీ.
విరిసి మురిసిన మెరిసిన విభవ మంత
ఎదురు చూచిన జనకుల యెదలు గదియ
త్రుంచగా నేల నీవేల తుంటరగుచు
మానవా నీకు జోహారు మమ్ము విడుము.
కం.
ఓరమణీయ సరసిజా
పూరక మందున నిను గొన బూనుట కగునా
బారక మౌ మది నాకే
లా రస రాజ్ఞి వనుచు మరలా కలిసేనా. ( ఓ పూ బా లా. పాదాద్యక్షర సంబోధన గోపనీయం)

Sunday, March 1, 2020

చతుర్విధ కందం మరో రకం.
కం.
నరవర విరులన్ తగునా
చెరపన్ శుభకర విభవపు సిరులన్నరయన్
హరహర సిడిముడి దొరవే
వెఱపున్ కలుగని నరులిట విరివిన్ గలరే. 1

చెరపన్ శుభకర విభవపు
సిరులన్నరయన్ హరహర సిడిముడి దొరవే
వెఱపున్ గలుగని నరులిట
విరివిన్ గలరే నరవర విరులన్ దగునా.2

హరహర సిడిముడి దొరవే
వెఱపున్ గలుగని నరులిట విరివిన్ గలరే
నరవర విరులన్ తగునా
చెఱపన్ శుభకర విభవపు సిరులన్నరయన్.3

వెఱపున్ గలుగని నరులిట
విరివిన్ గలరే నరవర విరులన్ తగునా
చెఱపన్ శుభకర విభవపు
సిరులన్నరయన్ నరవర విరులన్ తగునా.4