Sunday, May 29, 2016

దారిద్ర్య మ్ 

కడుపు నిండా తిండి దొరకని  వాడు దరిద్రుడా? 
         కాదు ఆకలి పై యుద్ధం  చేసే రుద్రుడు. 
ఒంటి నిండా గుడ్డ లేని వాడు దరిద్రుడా?
         కాదు, అందాల ఒలకబోతల పిసినారి
మనసు నిండా ఆలోచనలేనివాడు దరిద్రుడా?
        కాదు, భావాభావ మధ్యముడు. 
జేబులో డబ్బు ఉన్నా  లేకున్నా 
పల్లెలో ఉన్నా గుడిసెలో ఉన్నా 
భావనా పటిమ ఉండి 
మాటలో తీయదనం 
 తలపులో కరకుతనం 
పనిలో చురుకుతనం 
ఈ మనో వాక్ కర్మణ లు 
మెండుగా వున్నవాడు 
మహా సంపన్నుడు. 
  

Saturday, May 21, 2016

గతం లోకి 


గతం లోకి మనసు జారుకుంటే 
జ్ఞాపకాలు నెమరుకు వస్తుంటే
కాలుడి ప్రాప'కాలు' విరగ్గొట్టి 
ప్రాయాన్ని  గిర్రున వెనక్కి నెట్టి 
కాయాన్ని కిశోర కోమలంగా సాన పట్టి 
జీవనం సాగించాలనిపిస్తుంది. 
ఓనమాలు దిద్దుకుంటూ 
ఓటి మాట లాడుకుంటూ
నీటి మీద రాసుకుంటూ 
ఎరుకలేని ఈడు కలసి రాని జోడు 
కుడి ఎడమలగా బడి బుడతనిగా 
మరోసారి ఆరంభించాలనిపిస్తుంది. 
'కాకి ఎంగిలి' తోడుగా 
డబ్బు మొక్క నాటినా
పులుసులో ముక్కలా 
ఆటలో అరటి పండుగా 
మిగిలి పోవాలనిపిస్తుంది. 
మాయదారి కాలం 
వెనక్కి పోనివ్వకుంది. 
ఆ గుట్టేదో చెప్పేసే ....వేత్తలు 
ఇంకా పుట్టుకు రాలేదేమో 
ఆ విద్యలు ఆ మాయలు
కనిపెట్టితే ఎంత బాగుణ్ణు
కని కట్టులా వింతగా ఉణ్ణు.   
    

Friday, May 20, 2016

 ఏది శాశ్వతం?

బుద్బుద ప్రాయం మనిషి జీవితం
 అద్భుత ప్రాయం  మనిషి అందం
 సిరి సంపదలూ తాత్కాలికాలే
 అశాస్వతమైన వీటి కోసం
 వెంపరలాడటం వెర్రితనం
 ఊపిరి ఉన్నప్పుడే  ప్రయత్నించు
పరమేశ్వర  అనుగ్రహం కోసం
ఆర్యా మహాదేవి కనుసన్నలలో
కడతెరిపో ముక్తి మార్గాన్ని అందుకో
అదే శాశ్వతం, ఏ మనిషి శాశ్వతం?
ఈ సృష్టిలో అన్నీ అశస్వతాలే.



Saturday, May 7, 2016

సీ. నీ కోసమెన్నెన్నొ బరువులెత్తి పరువు
               లెత్తి కంటికి రెప్ప లాగ చూసి
     నీ కోసమే గద  పరితపించి తపించి
               బరితెగించితి ముద్దు బిడ్డ! నిన్ను
     నా గుండెలవిసినా నా కండ లలసినా
              పొత్తిళ్ళలో హత్తి పెంచి నాను
    నా కన్నీటి సుడులలో కలలో నిన్ను
              అపురూప రూపిగా సాకినాను
తే. గీ.  ఆడు  బిడ్డని ఎవ్వరే మన్న గాని
           అందలా ల నెక్కించి నే  పరవ శిస్తి
           ఆడు  బిడ్డా! మరువకే నా మాట లెపుడు
           కన్నవారికి కీర్తి తే  గలవు నీవు.

                        ఇట్లు
మమతా మూర్తి
 మీ అమ్మ.   

సహజ సౌందర్య0

వికారాలు పోకుండా 
ఆకారాలు చెదరకుండా 
కనిపించే పల్లెపట్టు ఆడ పిల్ల 
అసలు సిసలు సొగసైన తెలుగు పిల్ల. 

ఆ కళ్ళలో దీప్తి,
ఆ చూపులో ఆర్తి, 
ఆ రూపుకే కీర్తి 
తెచ్చే అందం 
పల్లె పిల్లలకే సొంతం. 
మెరుగులు దిద్దడమంటూ 
సొగసుల అంగడి (Beauty parlour) ఇంకా ఎందుకు?
అంగాంగాల కొలతలు తెలిసే 
బిగుతు బట్టలవుసరం లేదు
ఎత్తు మడాలక్కర లేదు 
పెదవులపై పై పూత కనరాదు 
పల్లె పిల్లకు సాటి వేరెక్కడ?
అదే స్నిగ్ద మోహన రూపం 
అదే అదే సహజ సౌందర్య0.  

నాన్న 

అన్నిటికీ ఊ కొట్టేవాడు ఆప్తుడు కాడు 
               అవసర వాది. 
అన్నిటినీ మెచ్చుకొనే వాడు ఆత్మీయుడు కాడు 
               అవకాశ  వాది. 
తప్పొప్పులు  చెప్పేవాడు ఈర్ష్యాళువు కాదు 
శ్రేయోభిలాషి. 
ఆపదలో అండగా, ఆనందంలో నీడగా 
నిన్ను గమనిస్తూ 
హెచ్చరిస్తూ, ధిక్కరిస్తూ 
సదా నీ హితం కోసం 
బాధ్యతగానో అభిమానం తోనో 
అపురూపం గానో 
వెంపర్లాడే వాడే 
కన్న తండ్రి.