Monday, January 29, 2018

తనివితీరా నను పిలచేనా

పిలువని పిలుపు కై ఎద పఱచి ఎదురు చూసా
పలుకని పలుకుకై పలువరించి పరుగు తీసా
గుండెను గుడి గా చేసి ఓ బాలా ప్రతిష్ఠ చేసా
ఉపవసిస్తూ ఉపాసిస్తూ ఉపచారాలు చేసా
ఆ బాల తలపుల తలుపులు తెఱచి చూసేనా
మమతల కోవెల మొగసాల నను కనికరించేనా
అనురాగం మమకారం కలగలిపి ప్రసాదంగా పంచేనా
నీడలో నీడగా  బ్రతుకులో తోడుగా రాగలిగేనా
అడుగులో అడుగై పలుకులో పలుకై సాగేనా
అవ్యక్త మనోరథం ముక్తసరి సంభాషణం
కనుసన్నల చిరునవ్వుల సమాధానం
ఇదేనా ఈలాగునేనా నా మనోకలిత లలిత
నన్ను అనుగ్రహించేది పరిగ్రహించేది?
మనసు విప్పి గుండె లోతుల లోంచి
ఏనాటికైనా తనివితీరా నను పిలిచేనా?

Sunday, January 28, 2018

వందనం అభివందనం

విప్రవర్యా వందనం
వేద వేదాంగ ఐతిహాస
పురాణ ప్రవచన ఝరీ
తరంగమా వందనం
బ్రహ్మ జ్ఞానీ వందనం
సర్వజన హితైషీ
వందనం అభివందనం
ధర్మ సూక్ష్మ గ్రాహీ వందనం
అల్ప సంతోషీ  వందనంం
కవితావధూటీ లాలాటేపమా
వందనం అభివందనం
పంచాయతన ఉపాసనా ధురీణా
నిరంతర భగవదంకిత
నిష్కామ కర్మాచరణ పరాయణా
వందనం ఆర్యా అభివందనం.

ఎవ్వరి కోసం

ఎవ్వరి కోసం నీ ఒంటరి పోరాటం
ఎవ్వరి కోసం నీ తెంపరి ఆరాటం
అయిన వారికి అల్లంత దూరాన
కాని వారికి బాసటగా  బిరాన
ఏకాకివై వికారివై అహంకారివై
ఎందు కోసం ఈ పయనం
ఎంత దవ్వు ఈ పయనం
ఎవరికి నీ ఊడిగం ప్రాణంగా
ఎవరికి నీ ప్రాపకం పణంగా
ఆస్వాదిస్తున్నావో అర్పిస్తున్నావో
వారికేది నీ మీద మమకారం
వారి కేది నీ బాగోగుల అగత్యం
నీ కోసం చేయగలరా ఓ త్యాగం
నీ కోసం నిలువ గలరా ఓ నిమిషం
ఆలోచించి  అవలోకించి అనుసరించు
నేస్తం ఓ నేస్తం ప్రియ నేస్తం
నీ కుటుంబమే నీకు కొండంత అండ.

    నాకేటి వెఱపు

తే.గీ.
మనసు మెచ్చిన పనిలోన మన గలుగుచు
పిల్ల పాపల కన్ని విన్పించ దలతు
నేరుపులు నేర్ప జూతు నా నేర్చి నంత
 ఎవ్వరేమనుకున్న నాకేటి వెఱపు.
కన్ను కుట్టి కొంద రు ఏడ్చు కొందు రేమొ
కన్ను మిన్ను గానక తిట్టు కొందురేమొ
కలసి శ్రమియింప వలదటే కలసి మెలసి
ఎవ్వరేమను కున్న నా కేటి వెఱపు.
కన్న కలల సాధింపరే కరము గలిపి
కన్నులార జూచిన వారు కరగి పోవ
కుటిల బుద్ధులార  తమరు కుత్సితులన
ఎవ్వరేమన్న నా కేటి వెఱపు.
గజ గమనము నాది సంకుచిత తలపు
పూర్వ పరము లెరుగనట్టి బుద్ధి మీది
కలసి నడువ కున్న గడన కలదె మనకు
ఎవ్వరేమను కున్న నాకేటి వెఱపు.


నువ్వు నీ చిరునవ్వు
నాకు వెలలేని బలమివ్వు
మనసారా పలికే నీ మాట
కుర్తాలం జలపాతం అన్నమాట
కడదాకా నాతో నడిచొస్తానన్న బాస
వేయి ఏనుగుల బలాన్నిచ్చే భరోసా
ఇదేస్ఫూర్తితో
 శ్రమిద్దాం పరిశ్రమిద్దాం పరిశ్రయమిద్దాం
ఆశయాలే శ్వాస సమీరాలుగా
లక్ష్యాలే  నిరంతర సాధనావధులుగా
ఉభయ పదార్థ ప్రధానంగా
విలక్షణ ద్వంద్వంగా
చిరస్మరణీయంగా శృతి సూక్తద్వయంగా
సాగి పోదాం మిగిలి పోదాం .

Thursday, January 25, 2018


కం. మిగులవు మేసిన మేతలు
      మిగుల ధనాఢ్యు లధముల మిత శూరులకున్
      మిగులవు  మేరువు లైనను
      మిగులును యశో నిధులె ఇమ్మహి నెపుడున్.

Saturday, January 20, 2018



సీ. చిన్ని కూనా ! నిన్నొదలి ఉండ గలనటే
             బింకాల పోయినా బెదిరి పోకు
     పిచ్చి పిల్లా!  నిన్ను తలువని క్షణమేది
              నా మన సంత నీ నామ జపమె
     వెఱ్ఱి పిల్లా ! నా కనులలో కలలలో నీ
              రూపమే నాకపు రూప మయ్యె
     కాజావు కాదులే రాజావు నీవు!  నా
               రసరమ్య గీతాల రాశి నీవు
తే.గీ. శ్వాస లో శ్వాస నై తుది శ్వాస వఱకు
        నీకు తోడుండి నడిపింతు  నిమ్మళముగ
        నాన్న గారను పిలుపు నన్నిలుపు నమ్మ
       అమ్మలూయన్న ఓ యన్న చాలు నాకు.

సీ.  నీమీద ఏ యీగ వాలినా నేనోర్వ
                గలనటె నే తాళ గలనటె? మరి
      కన్నెత్తి నిన్నేరు (నిన్నెవరు) జూచినా నే నూరు
                కొందునే గొంతెత్తి గోల జేతు
     మోహమో వ్యామోహ మో అభి మానమో
               అవ్యాజ మా యను రాగ మంత
     బంధమో సంబంధమో అను బంధమో
               ఏది ఏమైనను దేవుడెరుగు
తే.గీ. నిజము ముమ్మాటికీ నువు  నా కుమార్తె
        గురువు గా తండ్రిగా నీకు గుప్త నిధిగ
        అడుగడుగునా శుభము గోరు ఆప్తు డగుచు
        కంటి కున్న రెప్ప వలె నిన్ కాచు కొందు.

Thursday, January 18, 2018

ఎదురు చూడనా

అచంచలమైన దీక్షతో
చంచలమైన మనస్సును
నీవైపు వాలకుండా చూస్తున్నా
కట్టడి చేస్తున్నా నియంత్రిస్తున్నా
కష్ట సాధ్యమే కాని
అసాధ్యం కాదు
అనితర సాధ్యం కాదు
అందలమెక్కి కూర్చున్నా
అందకుండా పోతున్నా
అందాలని వాపోతున్నా
తమాయించుకుంటూ
సముదాయించుకుంటూ
నన్ను నేనే
ఓదార్చుకుంటూ
తలపులన్నీ
పిలుపులన్నీ
గాలి ఊసులనీ
నీటి రాతలనీ
ఓటి మాటలనీ
నా గుండె ఘోషిస్తే
నా మనసు రోదిస్తే
నా బుద్ధి నిలదీస్తే
వీడ్కోలు చెప్పనా
నభో వీథిలో నిలువనా
ఇలాతలంపై వెదుకనా
ఓ శరద్జ్యోత్స్నా
నీ చిరు దరహాస

పరిహాస కులుకులకై

ఎదురు చూడనా?




Sunday, January 14, 2018


తే.గీ. గతము గురుతుగా భవిత సొగసుగ విరియ
        తప్పిదములింక లేకుండ తనరు నటుల
        ఒండొరుల కొద్దిక గలిగి ఒకరి కొకర
        మగుచు చేయూతగ బ్రతుక మనుచు మనల
        మకర సంక్రాంతి దీవించు మరల మనల
        ముక్కు సూటి తండ్రి కి నీవు మౌన సుతవు
        నిజము నన్నంటి నావెంట నడువ రావె
        వీడి కోలేన? ఫెవికాలొ ? విన్నవించు.

Saturday, January 13, 2018

సీ. భోగి మంటల లోన భోగి పిడకల రూప
            మున భోగ వాంఛల మంట గలిపి
     ఉత్తరాయణ పుణ్య కాలము పితృ దే
            వతల కొలువ కల్గు వంశ వృద్ధి
    అల్లుళ్ళ రాకతో అలరారు అత్త వా
            రిండ్లను ఊరు ఊరంత జూడ
   భూత దయ కలుగంగ పశుల పండువగ
             కనుమ మనల మేలు కొలుపు ననగ
తే.గీ. మకర సంక్రాంతి పండగ మూడు నాళ్ళు
        పల్లె పట్టున పెట్టింది పేరు గనుక
        పదరె పోదాము మన పల్లె బాట పట్టి
        పెద్ద పండగ మనకిదె పెద్దలార.
           

Sunday, January 7, 2018

खुल्लम खुल्ला मेरा मन

जब  दुखता है मेरा दिल 
खून बहाता है आँखों से
कभी न मिट जाए आक्रोश
जब तक प्रत्यर्थी न माने होश
कल का अनजान आज का दोस्त
आज का दोस्त कल बने महान
जाने कौन अगला दिन का जन
नकली मुश्कराहत से कुशी जादा
नकरे दिखाने वाले तेरे मू काला
आसान है कि ठुकरा मारना
प्रयास है कि सच को मानना
प्रयत्नशील  करे सही विचार
आलोचक मेरे प्रथम् पुरुष
उनके मन चोदक बाते परुष
माने न माने खुल्लम खुल्ला मेरा मन
आऐ न आए साथ तेरे लालच का मन।

Saturday, January 6, 2018

फिर क्यों नही

अगर मरना मेरा हाथ मे हो
आजतक कयी बार मर सकता था।
अगर जीना मेरा हाथ मे हो
कभी मरने को  सोचता नही था।
अजीब बात ये है कि इधर उधर
हर गमन्ड व्यक्ति के पाँव पर
कौन गिर पडेगा और नीचे गिर पडेगा?
जितना सेवा उतना मार
जितना खर्च उतना फर्ज
हर कुतिया हमें अपमान करे
कभी जिंदगी मे फिर सेवा किसी का ना करें
गल्ति यही है कि बिकार को शिर पर लेना
सोचता है कि रिस्त तोड़ कर छुप रहे
मन की स्वास्थ्य नकद का बचत
तँदरुस्ति स्तिथि अपने खाते मे
फिर क्यों नही ऐसा किया जाय्।

ఎప్పుడు వ్రాస్తానంటే

నా కడుపు కాలినప్పుడు
నా ఒళ్ళు మండినప్పుడు
నాఎద గదించి నప్పుడు
నా మది రోదించి నప్పుడు
కళ్ళు చెమరించి నప్పుడు
పళ్ళు బిగియించి నప్పుడు
మనసు కుతకుత మన్నప్పుడు
తలపు తల్లడిల్లినప్పుడు
ఆవేశం పెల్లుబికి నప్పుడు
ఆవేదన పట్టరానప్పుడు
అన్యాయం కంట పడినప్పుడు
ఆప్యాయత కోల్పోయి నప్పుడు
ఒంటరిగా ఒక తెంపరిగా
వడిగా వడివడిగా ఏదో గొలికేస్తా
అదే ఓ పద్యం కాకుంటే ఓ కవిత
నిట్టూర్పు సెగలో నా ఆక్రోసం
మాడి మసై పోతుందప్పుడు
నిదానంగా ఊపిరి పీలుస్తా
సాలోచనగా నింగిలోకి తొంగి చూస్తా.


Wednesday, January 3, 2018

తెలియని దొకటే

గెలిచే వఱకూ తెలియదు
 నాలో కసి ఎంతో వుందని
ఓడే వఱకూ తెలియదు
నాలో లోపం ఏదో ఉందని
వలచే వఱకూ తెలియదు
నాలో మగసిరి కూడా ఉందని
వగచే వఱకూ తెలియదు
 నాలో వేదన ఎంతో ఉందని
చదివే వఱకూ తెలియదు
నాకూ  అంతో ఇంతో వచ్చని
గొలికే వఱకూ తెలియదు
నాకూ మాటల కూర్పులు వచ్చని
నడిచే వఱకూ తెలియదు
 గమ్యం ఎంతో దూరం ఉందని
కొలిచే వఱకూ తెలియదు
నాకో దైవం తోడై ఉందని
పిలిచే వఱకూ తెలియదు
నా పేరుకు విలువేదో ఉందని
పలికే వఱకూ తెలియదు
నాకై చూసే మనసే ఉందనీ
తెలియని దొకటే మనకు
 దైవం పిలుపు ఎపుడని.

Tuesday, January 2, 2018

ఏమనుకోను?

రత్న ఖచిత సువర్ణ సింహాసనాధిరోహణం చేయిస్తానంటే
పెంటకుప్పల మీద నవ్వుతూ త్రుళ్ళుతూ తిరుగాడితే
మలభూయిష్ట దుర్గంధ వీధీ విహారియై కదలాడితే
గ్రామసూకర మనుకోనా సంగ్రామ సింహమనుకోనా
నానానేక రక్త మాంస భక్షణప్రీతి వారి దరి వాలితే
నానాసూన వితాన వాసనానురక్త ద్విరేఫమున్ గూడితే
స్వకపోల కల్పిత మదనావేశ భావావేశ సంచలితయైతే
భావాంబర వీధి విహారాతుర విభావరి అనుకోనా
గాఢ నిబిడాంధకార జటిల నిషధ్వరి అనుకోనా
అనాలోచిత చిలిపి వయో వల్లరీ దుడుకుకు లోనైతే
నికృష్ట నిర్లక్ష్య నిర్లజ్జావేశ సంలగ్న మనో వైచిత్రి తోడైతే
ప్రాప్తావకాశ సద్వినియోగ చాతురీ ప్రదర్శితమైతే
శరద్జ్యోత్స్నా పునీత ప్రియంవదనాతుర చకోరి యనుకోనా
నిసర్గ యువకాశల గహనానంద సందోహ వికారి అనుకోనా. 

వినవే  దుర్ధర దుర్విధీ వెతల కావాసంబుగా జేసి జీ
వన వైవిధ్యమదంత కావరిల సేవా తత్పరంబై చనన్
ఘనకీర్తుల్ భుజ కీర్తు లేమియును కల్గంలేదులే దిసీ
మనసా నీకిది న్యాయమా వగచుటే మాకింక సంప్రాప్తమా.

మనసై సాకిన మల్లెతీగ ఇపుడేమో వింతగా తేటికై
ఘన పుష్పంబులు పూయుచున్ వరలుచున్ కుందించుచున్ చూడ నా
మనసెట్లోర్చు నదంతయున్ కనలనే  మూర్ఖుండ  నేనంచు నో
మనసా నీకిది న్యాయమా  వగచుటే నాకింక  సంప్రాప్తమా.

అనువై నాకొక చూలియై తనరు నంచాశా పాశ బంధంబుతో
నను నేనొక్క వివేచనారహిత న్యూనాతీత భావాంబుధిన్
మునుగన్ జూచి బుడుంగు మంటితి గదా ముమ్మాటికిన్ ఇంతకున్
మనసా నీకిది న్యాయమా వగచుటే నాకింక సంప్రాప్తమా.