Saturday, December 30, 2017


మ. మనసా నీకిది న్యాయమా తగునటే ముమ్మాటికీ
                           వ్యాకుల
      మ్మున రోదింప న పాత్రులం దవిలి నిర్మోహ ప్రబుద్ధుల్సదా
మును పేరీతిని ఈసడించితిరొ ఏమార్చంగ తాజూచిరో
     మనసున్ గెల్వగలేని వ్యక్తులకు నీమాటల్ రుచిం గూర్చునే.

Friday, December 22, 2017


సీ.మనసుంచి తనువొంచి శిరసొంచి మ్రొక్కనే
 సాష్టాంగ ములు నేల స్పృశియింప
ఆరార నోరార నూరూర పాడనే
 పొగడనే  జపియింప బోనె నిన్ను
సవన తంత్రములోన షోడశీ యంత్రాన
మంత్ర జప తపాది మార్గ మందు
ఉపవసించి ఉపాసించి తపించి తలపించి
పరవసించి పరితపించి మించి
తే.గీ. పరమ పథమున పయనించు బాటసారి
        నగుచు నగుచు నీ నగుమోము గనుచు
        షోడశీ రూప మునకే ఉషోదయమున
        కొలచి కడదేరి పోదు నో గౌరి తనిసి.

Thursday, December 21, 2017

అలా గడిచిపోతే చాలు

అమ్మా  నీకు తెలుసు నీ మౌనం
నా మనస్సాగరం లో ఒక అల్లకల్లోలం
సృష్టిస్తుందనీ నన్ను పరిహసిస్తుందనీ
నీ తిరస్కారం అత్మహత్యా సదృశమనీ
నన్ను విడచి నా చుట్టూ అందరినీ
నువు పలుకరిస్తే ఇంకా ఆదరిస్తే
నా గుండె ఎండని చెరువగను
నా నిశస్పృహా నిశ్శ్వాసముల వేడికి
దహరాకాశంలో అయోమయ మబ్బులగును
ఏకాంతపు చల్లదనంలో కరగి కన్నీరగును
నా కడుపులో చెయ్యెట్టి దేవినట్లగును
ఎడంగా జరిగి ఎడముఖంగా ఉందామన్నా
ఉండలేను నిలువలేను  నీ మనసు గెలువ లేను
నే కోరుకునేది నే ఆశపడేదీ ఆరాట పడేదీ
ఓ చిరు దరహాసం ఓ చిన్ని పలుకరింపు
నా ఇంట సుఖాసీనవై నిష్కల్మష మానసివై
తలపు విపంచిపై అనురాగం మీటితే చాలు
ఆసాంతం నీ అండ కోసమే నేనన్నట్లు
అనుక్షణం నా బలం నీవే అన్నట్లు
పరస్పరాపేక్షతో ఆప్యాయతతో
కాలం అలా గడచి పోతే చాలు
జీవితం అలా గతించిపోతే చాలు.


Monday, December 18, 2017

తెలుగు (తెంపరి) సభలు

శంకరంబాడి మా తెలుగుతల్లికి తలువకుంటే
కవిత్రయం వారి మహాభారతం కాదనుకుంటే
తిరుపతి వేంకట కవులను మరచిపోతే
పెద్దన తిమ్మన తెనాలి వంటి దిగ్గజాలను
గురజాడ గిడుగు కందుకూరి చిలకమర్తీ
పానుగంటి మొక్కపాటి వంటి ఎందరినో
 పక్కనబెట్టీ పక్కదోవ పట్టిన ఓ తెలంగాణ వాడా
నీవి ప్రపంచ తెలుగు మహా సభలు కావు
ప్రాంతీయ తెలంగాణా ఏస గోస సభలు
తెలుగు భాష తెలంగాణ ఆంధ్ర లకే కాదు
మరెన్ని రాష్ట్రల లోనో వికసించిన భాష
తంజావూరు కోయంబత్తూరు కటక్
హోసూరు మైసూరు బెంగళూరు కటక్
బరంపురం రాయగడ ఖరగ్ పూర్
మలేషియా సింగపూర్ అమెరికా ఇలా
ప్రపంచం ప్రతి మూల మూలలకు ప్రాకిన
మహోన్నత భాష మన తియ్యందనాల తెలుగు
అది ఏ ఒక్కరికో స్వంతం కాదు కాబోదు
కాదంటే తెంపరి తెగులు మహాసభలు కావచ్చు.

Friday, December 15, 2017

గురుతుంటాడా

లలిత మనో చలిత
నా ఉపాస్య దేవత లలిత
నా ఎదలో స్థిర చలిత బాల
మంత్ర ముగ్ధ మనోహర బాల
అనుక్షణం నా పెదవులపై
కదలాడే కమనీయ షోడశి
నన్ను నికృష్ట జీవుల సేవలో
కృతఘ్నుల శతఘ్నుల తూటాలో
కడదేరమనీ తనివి తీరమనీ
నిర్దేశించినట్లుంది ఆదేశించినట్లుంది
నిష్కామ పూజకు నిస్స్వార్థ సేవకు
పరమావధి కామోసు నిదర్శనం కామోసు
వల్లమాలిన వారికడ అంగలార్చి
ఎల్లలెరుగని ప్రేమ పంచిన వారితో పేచీ
కృతక బంగరు తీవె వెంట పరుగు తీసే
మాయలేడిని కోరుకునే రామసీతకు
సుందర రాముడు అగుపడతాడా?
గురుతుంటాడా? పనికొస్తాడా?

Wednesday, December 13, 2017

చర్విత చర్వణం

వాడుకుని విసిరి పారేయడం ఒక అలవాటు
ఆడగకుండానేే ఇవ్వడం మహా పొరపాటు
గుండె లోతుల్లో తూగాడని అభిమానం
నిలువెత్తు ధనం పోసినా దొరకడం అనుమానం
అది అంగడిలో కొనలేని అదృశ్య వస్తువు
కాలం విధి బలీయమైనవని తెలిసీ
వ్యాకుల పడటం ఆశ పడటం సహజం
మధుర ఫలాల నివ్వడం ఆమ్రఫలి నైజం
ప్రేమ అభిమానం లేని వారంటే అసహనం
అభిజాత్యం అభిశంసన అభిమానం
ముప్పేట దాడిలో ఓడిపోలేక నిలువలేక
విజయాకాంక్ష పలుచనై నిలువనీక
వ్యథగా అయోధ్యగా వైరాగ్యంతో
ఆకులన్నీ రాలుస్తూ రాలుపూత సాగిస్తూ
మరలా చివురుతొడిగి పూతపూసి
ఎందరికో మేతగా మారే జీవనయానం
చర్విత చర్వణం నాకైనా నీకైనా ఎవరికైనా.

Sunday, December 10, 2017

తుహిన నిర్ఘరిని

గుండె సడి విన్నావా కంట తడి పెడతావు
మనసు రొద కన్నావా ఎద పరచి నిలచేవు
నా శ్వాస లో గాలివై చల్లగా ఎదలోకి వస్తావు
ఒక వేడి నిట్టూర్పుగా నన్నొదలి వెళతావు //   //
కలలోకి వస్తావు నా కనులెదుట కదిలేవు
కనులు తెరిచితే కనుచూపు మేరలో కనరావు
ఎందుకో నా మనసు దోచేవు నన్నొదలి పోలేవు
నీ మనసులో ఏముందొ నీ తలపు ఎటులుందొ //   //
ఆకతాయి మనసు అల్లాడి పోతూంది
వేపకాయంత వెఱ్ఱి ముదిరి పోయింది
ఆగిడీ పనులు నే చేయలేను
వెంటపడి నే తిరు గాడలేను
ఊరించకో నేస్తమా ఊహించుకో మిత్రమా//   //
ప్రకృతీ నీ చేరువలో పరవసించి పోతా
మానసీ నీ చేతలతో పులకించి పోతా
కరడుగట్టిన గుబురు చెలువము నీది
కరిగి పోయే తుహిన నిర్ఘరిని నేను
నీ అనునిత్య దర్శనమే నాకు చాలు//   //

Saturday, December 9, 2017


తెలుగు బాస తిరునాళ్ళ కబురంద లేదా తమ్ముడా
దూర దేశాల తెలుగులెందరో వస్తారు తమ్ముడా
నా గుండె లయ వినవేమిరా తెలుంగాన తమ్ముడా
నా పలుకు జిలుగు నా పలుకు బిగువు కనవేర తమ్ముడా
వేదిక లెక్కి ఘనకీర్తి భుజకీర్తి తడుము కొనుటే కాదు
తియ్యందనాల తెలుగును అందలాలెక్కించు పని జూడు
ఇతర రాష్ట్రాలలో బడులు తెరచి అటనున్న తెలుగు వారి
అవుసరం తీర్చేటి కృషి జేయు తలపు చేయి
ఇరుగు పొరుగు రాష్ట్రాలలో తెలుగోడి గోడు చూడు
అమ్మ భాషలో కమ్మగా ఐదువరకైనా చదవమను
పొరుగు వాకిట జూడు ఐదు వరకు అమ్మభాషలో వినా
ఆంగ్లాది భాషలలో బోధనే పనికి రాదు
చట్ట సభలలో తెలుగు పలుకును చుట్టమన్నట్టు జూచేవు
పేరు పలకల మీద తెలుగు తప్పదని  చెప్పు
సర్కారు పనిలోన అంగడి వీధులలోన అన్ని బడులలోన
తెలుగెక్కువగ వాడ వలెనన్న తెలుగు వాడిపో వలదన్న.

Thursday, December 7, 2017

         విరి బాల

తే.గీ. మొన్న మొన్నను పెరటి లో  మొక్క నాటి
         పాడి జేసి నీరును పోసి ప్రాణ
        సాకి నా యాశనే ఎరువుగా జేసి జేసి
        పెంచి పెద్ద జేసితి ప్రాణ ప్రదముగాను.
        ఆకు ఆకున నా వల పాకు పచ్చ
        నై మెరియ ఎదిగి ఎదిగి మొగ్గ తొడిగె
        ప్రసవ వేదనల కనలి  ప్రసవ మిడగ
        తళుకు మన్నది మా చిట్టి దో గులాబి.
ఉ.
ఆ విరి తోటలో విరిసె నొక్క గులాబి సువాసనా లవ
మ్మే విధి నబ్బెనో మధుర మంజుల రూపము ఎట్టులబ్బెనో
ఆవిరి బాల  నా మనసు నన్య మనస్కము జేయు నెప్పుడున్
నా విరి బాల నాకు మనసా వచసా ప్రియ మెల్ల వేళలన్.
ఆవిరి తావి నా ఎదను తాకిన యంత ఉపేక్ష చేయజాల కే
నే విధి నైన ఆ ఎఱుపు చెక్కిలి నిన్ నిమిరంగ జూతు నా
భావ మొకింత నొద్దికగు బాహ్యప్రపంచము కాననంతటన్.

ఏవిధి దాపురించెనొ వివేక విహీనత నా సుమమ్ములం
దున్ వలపెంత గాఢమొ నిగూఢమొ నా మనం బెటుల్
పావకమందు దగ్ధ మను భావన చేయక మూతి త్రిప్పగన్
బావురు మంటి నొంటరిగ పండిత పామరు లేమి యన్నయున్.
నన్ను నా గులాబీ నా గలాబి నేను
వలచు కొన్నాము మనసార వరుస గలిపి
ఆపె నా బాల నేనామె తండ్రి నగుచు
ఒదలి మేముండ గాలేము ఒకరి నొకరు.
కాని పూబంతి ఓ ఇంతి కన్ను కుట్టె
మాలకరి యొక డచటనే మాటు వేసె
పట్టుమని పదినాళ్ళకే  పగలు పెరిగి
క్రూర కర్కశార్క  కిరణ కుపిత మొకటి
అచట ప్రసరించ వసివాడి మా గులాబి
కుమిలి పోవ
రాలి పోయె నా రతనాల రాశి యపుడు.
వ్రయ్య లైనది నా గుండె వేన వేల
నెరియ లైపోయె తోటలో నచటి నేల
సాను భూతిగా జాలిగా చూడ రైరి
రాల లేదొక కన్నీటి బిందువేని.
మాన వత్వము లేని ఈ మహిని కలరు
నిర్దయులు భూత దయలేని  నరులు పరుల
మేలు కోరలేరు బ్రతుక నీరు వారు
వట్టి స్వార్థ పిశాచులై వరలు చంండ్రు.

 నేనె విస్తు పోయిన వాడ నగుచు నగుచు
 కాల మేరీతి గా పోవ గనుచు గనుచు
 తెల్ల తెల్లని వెన్నెల తెలుపు తెలపు
 ననుచు తలుపగా నా మన సలుపు సలుపు.




Monday, December 4, 2017


అమ్మా హైమవతీ దయార్ద్ర హృదయా మాతంగకన్యా శివే
అమ్మా శాంభవి చంద్ర మౌళి రపరా కామేశ్వరీ  భార్గవీ
అమ్మా నమ్మితి నమ్మ నా మనమునన్ కాత్యాయనీ ఈశ్వరీ
కొమ్మా నా వినతుల్  పదార్చనలు కైంకర్యమ్ములున్ శాంకరీ.

Saturday, December 2, 2017

పరమావధి


నీ మౌనం
నా మనసును తోలిచేసే పెను గాయం
నా గుండెలు పిండేసే అయోమయం
నా ఆశలను ఆవిరి ఛేసే లావా దావానలం
నా ఊహలకు ఉరివేసే ఉరి కంబం
గలగల పారే గంగకు భగీరథ అనుగమనం
అయిష్టమా అప్రస్తుతమా అనుత్తమమా
భగీరథ ప్రయాస లేకుంటే పతిత పావని
కాగలిగేదా నిత్య హారతు లందు కోగలోగేదా
వల్ల మాలిన చోట పురివిప్పి నర్తించే నెమలి నీవు
అన్నులమిన్న కావలసిన చోట అనుక్ణణ నిర్లక్ష్యం నీది
 మస్తకన్యస్త శనిగ్రహ ప్రభావమా? నాకో పరాభవమా?
నీ గమనం
నిసర్గానంద సందోహ బంధురం కావాలనీ
నీ లక్ష్యం
సమున్నత సమారోహ నిశ్శ్రేణీ నైపుణి కావాలనీ
నీ కోసం
పరితపించే, పరిశ్రమించే పరిభ్రమించే
స్వాప్నికుడను సాధకుడను సాహసికుడను
యుక్తాయుక్త వివేకం పరమేశ్వరుడు నీకు ప్రసాదించు గాక.

పరసుఖానందమే నా పరమావధి అగు గాక.