Thursday, December 7, 2017

         విరి బాల

తే.గీ. మొన్న మొన్నను పెరటి లో  మొక్క నాటి
         పాడి జేసి నీరును పోసి ప్రాణ
        సాకి నా యాశనే ఎరువుగా జేసి జేసి
        పెంచి పెద్ద జేసితి ప్రాణ ప్రదముగాను.
        ఆకు ఆకున నా వల పాకు పచ్చ
        నై మెరియ ఎదిగి ఎదిగి మొగ్గ తొడిగె
        ప్రసవ వేదనల కనలి  ప్రసవ మిడగ
        తళుకు మన్నది మా చిట్టి దో గులాబి.
ఉ.
ఆ విరి తోటలో విరిసె నొక్క గులాబి సువాసనా లవ
మ్మే విధి నబ్బెనో మధుర మంజుల రూపము ఎట్టులబ్బెనో
ఆవిరి బాల  నా మనసు నన్య మనస్కము జేయు నెప్పుడున్
నా విరి బాల నాకు మనసా వచసా ప్రియ మెల్ల వేళలన్.
ఆవిరి తావి నా ఎదను తాకిన యంత ఉపేక్ష చేయజాల కే
నే విధి నైన ఆ ఎఱుపు చెక్కిలి నిన్ నిమిరంగ జూతు నా
భావ మొకింత నొద్దికగు బాహ్యప్రపంచము కాననంతటన్.

ఏవిధి దాపురించెనొ వివేక విహీనత నా సుమమ్ములం
దున్ వలపెంత గాఢమొ నిగూఢమొ నా మనం బెటుల్
పావకమందు దగ్ధ మను భావన చేయక మూతి త్రిప్పగన్
బావురు మంటి నొంటరిగ పండిత పామరు లేమి యన్నయున్.
నన్ను నా గులాబీ నా గలాబి నేను
వలచు కొన్నాము మనసార వరుస గలిపి
ఆపె నా బాల నేనామె తండ్రి నగుచు
ఒదలి మేముండ గాలేము ఒకరి నొకరు.
కాని పూబంతి ఓ ఇంతి కన్ను కుట్టె
మాలకరి యొక డచటనే మాటు వేసె
పట్టుమని పదినాళ్ళకే  పగలు పెరిగి
క్రూర కర్కశార్క  కిరణ కుపిత మొకటి
అచట ప్రసరించ వసివాడి మా గులాబి
కుమిలి పోవ
రాలి పోయె నా రతనాల రాశి యపుడు.
వ్రయ్య లైనది నా గుండె వేన వేల
నెరియ లైపోయె తోటలో నచటి నేల
సాను భూతిగా జాలిగా చూడ రైరి
రాల లేదొక కన్నీటి బిందువేని.
మాన వత్వము లేని ఈ మహిని కలరు
నిర్దయులు భూత దయలేని  నరులు పరుల
మేలు కోరలేరు బ్రతుక నీరు వారు
వట్టి స్వార్థ పిశాచులై వరలు చంండ్రు.

 నేనె విస్తు పోయిన వాడ నగుచు నగుచు
 కాల మేరీతి గా పోవ గనుచు గనుచు
 తెల్ల తెల్లని వెన్నెల తెలుపు తెలపు
 ననుచు తలుపగా నా మన సలుపు సలుపు.




0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home