Tuesday, July 30, 2019

     ఈశ్వరా
విశ్వేశ్వరా  సితకంథరా పరమేశ్వరా...
పాహి పాహి యని నిత్యమూ నినుకొలుతురా..  //   //
విశ్వశ్రేయము నీది
విశ్వాసమే నాది
వినుత గుణబంధమే మనది
ఆలించరా.. పాలించరా నను కరుణించరా... //   //
నరులమై పుట్టిన.. మాకు
నీ తలపు ఘటన..
మా బ్రతుకు నటన
ఆత్మ ,ఆత్మమూలుల బంధమే మనది..
ఔననర శంకరా! భక్తవశంకరా! ఈశ్వరా.. //   //
జగతికంతకు తల్లిదండ్రులు మీరు
సాంబ పరమేశ సంతానమే మేము
పరివార ఋణానుబంధమే మనది
సంతసమ్మీయరా.. అంబరాంబరా.. మీనాక్షి సుందరా.//  //

Wednesday, July 24, 2019

         దేవదేవా!
కష్టాల కొలిమిలో నా మనసు కాలిపోనీ
దుఃఖాల జలధిలో నా బ్రతుకు కలసిపోనీ
సమ్మెట పోటులను తప్పెట గుళ్ళుగా భావిస్తా
కర్మక్షయం అనుకుంటూ సరిపెట్టుకుంటా
ధర్మ విజయంగా గుర్తిస్తూ సరిపోల్చుకుంటా
నాహంకర్తా హరిః కర్తా అని తలమున్కలౌతా
అంతా ఆ ఈశ్వరేచ్ఛగా అవలోకిస్తా
కాకుంటే కాదనకుంటే నాదొకటే వినుతి
అన్నిటినీ భరించే సహించే బలమివ్వు
అన్నిటినీ అధిగమించే అవకాశమివ్వు
శివోహమ్మనే నమ్మికతో గరళమైనా మింగేస్తా
త్వమేవాహం అంటావని ఎన్నటికీ ఎదురుచూస్తా
తెలిసినదొకటే సర్వం అనసూయార్పణమని
తె‌లియనిదొకటే పరహితమ్మనే సంకల్ప మేలని
సర్వసంగ పరిత్యాగిలా సన్యసించాలా
గృహమేథిగా నీ దయకు పాత్రుడ గాలేనా
యోగక్షేమం వహామ్యహం అన్న నీ భరోసాతో
సంయోగ వియోగాలను ఒకేలా తీసుకో గలనా
సంకల్పం నీది ప్రయత్నం నాదిగా దేవదేవా
ఈ దేహ దేవాలయంలో నిత్య యజనం సాగనీ
నన్ను నీలో పరిభ్రమించనీ రమించనీ విశ్రమించనీ.

Sunday, July 21, 2019

👋
ఉ.
దొంగకు తాళమిచ్చి బహు దొంగల గుంపుగ కాన్కనీయ మీ
ముంగిట స్వర్గముంతుమని మున్నుడి పల్కిరి పాదయాత్రలో
అంగడి నున్నవన్నియును యల్లుని నోటనె మందు డన్నటుల్
చెంగట చంద్రుడున్న చలి చీమలు కుట్టునొ వీని మోముకున్.

ఉన్న పళంబుగా నిలచి యూరక వెక్కిలి నవ్వు నవ్వుచున్
నిన్నటి దాక యా తెలుగు యేలిక నేలిక
యీసడించునో
కొన్ని  వితండ వాదనల కొన్ని యసభ్య పదాలతో చిఛీ
నిన్నెవరాదరించిరవి నీతికి పెట్టిన పేరు నీవెగా.

వాగుడు కట్టి పెట్టి మనవారికి పంచుట మానుకొన్న నీ
లేగడి పాలనా విధికి లేని యసత్య ప్రచార జోరులా
నీ గడపన్ కడున్ కడు వినీత సమస్యలు చూడ నొల్లవో
ఆగడమేల జేసెదవు యార్తులనేకుల మేలుకోరవే.

Tuesday, July 9, 2019

                      ప్రభల తీర్థం
'సంక్రాంతి కి ఓ రెండు రోజులు ముందే ఇంటికి రారా శంకరం.' నెలగంట పెట్టగానే అమ్మ ఆర్డర్.
'చెల్లిని కూడా శలవు పెట్టుకుని రమ్మన్నా.' అంది అమ్మ.
'ఒరేయ్ నలుగురం కలిసి మురమళ్ళ వెళ్ళి వీరేశ్వరస్వామిని దర్శించుకుని ప్రభల తీర్థం నాటికి సంబంధాలు ఓ కొలిక్కి తేవాలి' నాన్న గారి ఆలోచన.
శంకరం ఎం.టెక్ చేసి బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. వైష్ణవి బి.టెక్ చేసింది. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తోంది.
అవధాన్లు మేష్టారిది ఏనుగుల మహల్. కొత్తపేట గవర్నమెంట్ కాలేజీలో తెలుగు లెక్చరర్.
ఆంధ్రాలో సంక్రాంతే పెద్దపండుగ. అందరూ తమతమ గ్రామాలకు చేరుకుంటారు. ప్రతి ఇంటా సందడిగా ఉంటుంది. బ్రాహ్మణవీథిలో ఇంకా ఓ పదిబ్రాహ్మణ కుటుంబాలు వంశ పారంపర్యపు ఆస్తులను కాపాడుకుంటూ వస్తున్నారు.
అవధాన్లు మేష్టారి ఇంటి ఎదురుగా కఱ్ఱి సూర్యనారాయణ మూర్తిగారి యిల్లు. వారి పిల్లలు అందరూ సెటిల్ ఐపోయారు. అందులో అమ్మాజీ అంటే మేష్టారికి చాలా ఇష్టం. ఆమె అత్తవారు పప్పువారు. ఢిల్లీలో ఉద్యోగం.
ఆమె ఎప్పుడు వచ్చినా మేష్టారింట ఓ పూట భోంచేయాల్సిందే. ఈ సారి వారూ పండక్కి వస్తారట.
'ఏవండీ కోస్తా సంబంధాలు వద్దండీ. సంప్రదాయమూ పాడూ ఏమీ తెలియని చెక్కబొమ్మల్లా ఉంటారు. అబ్బాయి అవునంటే  రావులపాలెం కడిమి వారి పిల్లని ఖాయ పెట్టేద్దాం.' శారదమ్మగారు.
సరే వాడికీ నచ్చాలి కదా. ఆదివారం ఉదయం కొత్తపేటలోనే   పెళ్ళిచూపులు ఏర్పాటు చేయమన్నా. ఆదివారం సాయంత్రం విజయనగరం జయంతి వారు అమ్మాయిని చూడ్డానికి వస్తారు.' అన్నారు మేష్టారు.
'అలాగే. అమ్మాయికి ఆ సంబంధమో విశాఖ పట్నం రాచకొండ వారి సంబంధమో ఖాయ పెట్టండి. ఆచారాలు అవీ పెద్దగా పట్టింపు ఉండదు. అమ్మాయి సుఖపడుతుంది'
శని ఆదివారాలు కలిసి రావడంతో శనివారం ఉదయానికే శంకరం, వైష్ణవీ కూడా వచ్చేసారు. భోగినాటికి పప్పు వారూ వస్తారు.
కొత్తపేటలోనే కడిమి వారి బావమరిది యింట పెళ్ళిచూపులు ఏర్పాటు చేసారు. అమ్మాయి బాగానే ఉంది. హైదరాబాద్ లో పనిచేస్తోందట.
శంకరం వంట వచ్చా అని అడిగాడు. కుక్కర్ పెట్టడం వచ్చు అని చెప్పింది. ఆఫీస్ కి ఎలా వెళతారు అనడిగాడు. స్కూటీమీద అంది.
కోపం వస్తే ఏం చేస్తారు అనడిగాడు. చేతిలో ఉన్నది కింద పడేసి చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుని కూచుంటా.
ఉదయం ఎన్నిగంటలకు పక్క దిగుతారు అని అడిగింది ఆ అమ్మాయి. ఏడుగంటలకు అన్నాడు శంకరం.
శని ఆదివారాలేం చేస్తారు అంది
బట్టలు ఉతికి ఇస్త్రీ చేసుకోడం , ఓ సినీమాకి వెళ్ళడం అన్నాడు. మీ నాన్నగారు రిటైరయ్యాక ఎక్కడ ఉంటారు?
అనడిగింది.
'అమ్మా! చూడు ఈ ఏనుగుల మహల్ దాటి
ఎక్కడిఎక్కడికీ వెళ్ళం. మేము ఇక్కడే ఉంటాం జంటగా ఉన్నంత కాలం.' అన్నారు మేష్టారు.
'అమ్మాయి అలా అడిగిందని ఏమీ అనుకోకండి' అమ్మాయి తండ్రి.
'భలేవారే. ఇక్కడ శ్రీ చక్ర ఆలయం ఒకటి ప్రబోధానంద స్వామి నిర్మించారు. ప్రతిరోజూ అక్కడకి వెళ్లి దర్శనం చేసుకోకుండా ఉండలేం. అది సాలిగ్రామ శిలతో చెక్కిన శ్రీ మేరువు. ఇటువంటి ఆలయం మరెక్కడా లేదమ్మా. అందుకే మేం ఇక్కడే ఉంటాం' అంది శారదమ్మగారు.
 శంకరం ఓ.కే.అని అక్కడే చెప్పేసాడు. మీరూ మాయింటికి ఓ సారి రండి మీ అమ్మాయి ఓ.కే. అంటే అని తేల్చేసారు మేష్టారు.
సాయంత్రం వీరింటనే చూపులు వైష్ణవికి.
అబ్బాయి పొడగరి. లావు కాదు సన్నం కాదు. నల్లటి జుత్తు. నూనె రాసాడేమో నిగనిగలాడుతోంది.
స్టేట్ బేంక్ లో రిస్క్ ఎనలిస్ట్ ఉద్యోగం. డెబ్బైవేల పైనే జీతం.
వైష్ణవికి విప్రోలో ముప్పైవేల జీతం.ఇద్దరూ హైదరాబాదే.ఆ అబ్బాయి మొహమాటపడి ఏమీ అడగలేదు. మేష్టారు అడిగిన వాటికి జవాబులు బాగానే చెప్పాడు. కథలు రాస్తాట్ట. ఒకడే అబ్బాయి వాళ్ళకి. ఏవో భూములూ ఇల్లు ఉన్నాయి. ఆయన రివెన్యూ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారట.
ఆ రాత్రి చక్కగా ముగ్గుల గోల అయ్యాక వాకిటలో కూర్చుని చర్చించుకుంటున్నారు.
'ఏమే వైష్ణవీ ఏమంటావు? నీకు నచ్చాడా?' శారదమ్మగారి ప్రశ్న.
'అమ్మో. నూనె ముద్దలగాడా? నాకొద్దు బాబోయ్' అంది
'అదేంటే? మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులూ ' చూడక్కరలేదు.దేనికీ లోటుండదు.
'కథలు రాస్తాట్ట. మనం ఏం అడిగినా ఏదో కథ చెప్తాడేమో' అంది వైష్ణవి.
'కనుమనాడు జగ్గన్న తోటలో ప్రభల తీర్థానికి వెళ్ళి ఏకాదశ రుద్రుల దర్శనం చేసుకుందాం. అక్కడ సాంబ పరమేశ్వరులను స్మరిస్తే ఓ నిర్ణయం మీ మనస్సుకు తడుతుంది.
రేపు మురమళ్ళలో వీరేశ్వరస్వామిని దర్శించుకుని మా పిల్లలు ఇద్దరికీ కళ్యాణం జరిగితే మధుపర్కాలతో వచ్చి కళ్యాణం చేసుకుంటారని మొక్కుకుంటే పని తేలిక అవుతుంది' అన్నారు మేష్టారు.
నిత్య కళ్యాణ స్వామి వీరేశ్వరస్వామిని దర్శించుకుని అనుకున్నట్టుగానే మొక్కుకుని వచ్చారు.
అమ్మాజీ శ్రీ వారూ పిల్లలతో వచ్చారు. ముగ్గురూ ఆడపిల్లలే. అరుణ ,రమణి , అనిత. అరుణకు వైష్ణవితో దోస్తీ.
అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ మా యమ్మాజీ అని దీవించారు మేష్టారు. ఆ మాటకు ఆమె భర్త ఎంత సంతోష పడ్డారో చెప్పలేం.
ప్రభల తీర్థం రానే వచ్చింది. అందరూ బయలు దేరారు.
అరుణ, వైష్ణవిలదే సందడి అంతా. పదకొండు ప్రభలకు దండం పెట్టుకుంది. లౌడు స్పీకర్ల గోల తప్పించుకోడానికి ఆ వెనకగా వెళ్ళింది.
ఆశ్చర్యం.
అక్కడ నిలబడి తననే చూస్తున్నాడు మొన్నటి పెళ్ళికొడుకు.
వైష్ణవికి భయం వేసింది. కాని ఓ సారి మాటాడొచ్చుగా అనుకుంది.
' హలో వైష్ణవీ డు యు లైక్ మి?' అంటూ అడిగాడు శరత్.
' వై నాట్' అనేసింది.
అరుణా! రెండు నిమిషాలు అని చెప్పి శరత్ దగ్గరగా వెళ్ళింది. ఓ ఐదు నిమిషాలు మాటాడు కున్నారు.
'మా వాళ్ళూ వచ్చారు తీర్థానీకి. మరోసారి కలవండి' అంది.
' స్యూర్' అన్నాడు శరత్.
శంకరంని కలిసాడు శరత్.
కడిమి వారూ తీర్థంలో కలిసారు మేష్టార్ని. వారికి సమ్మతమే అని చెప్పారు.
రాత్రి మేష్టారింటివద్ద ఒకటే సందడి. వాకిట్లో మంచాలు వేసుకుని కబుర్లు. అమ్మాజీ కుటుంబం మేష్టారి కుటుంబం కలిసి.
' శంకరం! నీది ఫైనల్ ఐనట్టే. వారు సరే అన్నారు.'
'వైష్ణవీ ఏమంటోంది' ఆన్నారు మేష్టారు.
'ముహూర్తం ఎప్పుడు? అంటోంది' అరుణ జవాబు.
' నూనె ముద్దలగాడు దానికి నచ్చలేదేమో' అన్నారు.
అరుణ ఇంకా ఏదో చెప్పబోతూంటే ' చంపేస్తా.' అంది వైష్ణవి అరుణను చూస్తూ.
'మీ ఇష్టం నాన్నా' అంది.
అరుణ మేష్టారి చెవిలో అంతా చెప్పేసింది.
' నే చెప్పలేదూ ప్రభల తీర్థంలో ఏకాదశ రుద్రుల దర్శనం మనకు ఓదారి చూపిస్తుందని' మేష్టారు.
రేపు ఉదయం శ్రీ మేరు ఆలయంలో పసుపు కుంకుమ ఇచ్చుకుని వద్దాం' శారదమ్మగారు.
'వేసవి శలవుల్లోనే పెళ్ళిళ్ళు ఉండాలి. లేకపోతే మేం రాలేం' అరుణ కండిషన్.
' నువ్వే తోటి పెళ్ళికూతురువి'  శంకరం మాట.
మాఘమాసం కోసం తతిమ్మా వ్వహారం కోసం ఎదురు చూపులు.
ఎలాగైతేనేం మొత్తానికి ప్రభల తీర్థం మేష్టారికి ఓ మార్గం చూపించింది.




సీ.
కనవటే ఓ పాలి కాళి నన్ను కపాలి
         చూసి చూడక నన్ను జూడవమ్మ
వినవటే నాసొదల్ విశ్వ జనని నా వ్య
       ధలు కథల్ మూగ వేదనలె పరుల!
కనవటే ఓమాటు కరుణతో  నా పాటు
          చరణ మంటితి నాకు శరణు మిమ్ము
వినవటే పతితుల వినతులన్ పురుహూతి
         పతితపావని శివే భద్రకాళి
తే.గీ.
వినవె చూడవె తలుపవె విన్నపముల
వేగ వేవేగ దీర్చు మా వేడుకోలు
నా మనవి వినవే తల్లి ఆనందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.23
సీ.
సూర్యేందు నయన! స్ఫురదిందు వదన!ఘన
        చిద్గగన సదన!  చేదుకొమ్మ!
దరహాస సుందరీ దశభుజ మంజరీ
        మంజీర జికుర! మమ్మాదుకొమ్మ
ఓ విశ్వేశు దయిత! యో చలిమల దుహిత!
         శ్రీ లలిత! యపర్ణ! శ్రీ ల నిమ్మ
ముగురు యమ్మల యమ్మ! ముద్దుగుమ్మ యపర్ణ
          వమ్మ! యభయమిమ్మ! ఆదుకొమ్మ
తే.గీ.
నగజ! నగుబాటు కానీకు నలుగు రెదుట
హిమజ! మమ్మేల కనవేల హితము గోరి
నా మనవి వినవే తల్లి ఆనందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.24

Monday, July 8, 2019

  జననీ జన్మభూమిశ్చ
గోదావరి నది అంటేనే నాకెంతో ఇష్టం విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ లా. రాజమహేంద్రిలో రైలు కమ్ రోడ్డు వంతెనపై నడవాలని, అలా నడిచి కొవ్వూరు దగ్గర గోదావరొడ్డున కూర్చోవాలనీ ఏదో ఆశ.
బొబ్బర్లంక నుంచి ఆత్రేయపురం సైకిల్ మీద వెళ్తే అదో మజా. ముమ్మిడివరం చుట్టుపక్కల పైలాపచ్చీస్ గా తిరగడమంటే భలే సరదా.
బి.కాం. అయి ఐదేళ్ళయింది. ఏ పనీ దొరకలేదు. మగాడికి నిరుద్యోగం అతివకు కన్నెరికం చాలా దుర్భరం. ఎవరో ఇచ్చిన సలహా పట్టుకుని ఢిల్లీ వెళ్ళిన నాకు పిసరంత ఆసరా ఓ దూరపు బంధువుల ఆశ్రయం.
టైమ్స ఆఫ్ ఇండియా లో వాంటెడ్ కోలమ్ చూసి ఓ ధరకాస్తు వ్రాసి స్వయంగా తీసుకు పోయి ఇవ్వటం. ఎవరైనా ఇంటర్వ్యూకి పిలిస్తే  బాగణ్ణు అనే ఆశ. ఓ నెల గడిచింది. రెండోనెల లో ఎలాగో ఓ పిలుపు అందింది.
ఏదో కెమికల్ కంపెనీలో ఎకౌంట్స్ రాయడానికి. ఆరొందల జీతం. లోడీకోలనీలో బస. మద్రాస్ హోటల్లో భోజనం. నెహ్రూ స్టేడియం దగ్గర సిటీబస్ 421 ఎక్కితే ఆఖరి స్టాప్ లో దిగితే అక్కడే ఫేక్టరీ ఎండ్ ఆఫీసు.
ఏదో కలగా అనిపించింది. ఆరునెల్లు గడిచింది. ఇంటి మీద ధ్యాస. పది రోజుల శలవుమీద ఇంటికి ప్రయాణం.
జి.టి.ఎక్స ప్రెస్ లో విజయవాడ చేరేసరికి ట్రైన్ కేన్సిల్. తుఫాను కారణంగా తుని బ్రిడ్జి కొట్టుకు పోయిందిట.

   'సార్ ఎక్కడికి ఎల్లా‌‌లి సార్' ఓ రిక్షా అబ్బి . విజయవాడ స్టేషన్ బయట మరో ఆయన 'రాజమండ్రి కి ట్రైల్ బస్ వేసారు. బస్ స్టాండ్ కి వెళ్ళి చూడండి' అంటే అలాగే బయలుదేరా.
నిజమే ఓ బస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. కండక్టర్ ను అడిగితే టైమ్ రూట్ మాకూ తెలియదు , కావాలంటే ఎక్కండి. రాజమండ్రి టికెట్ తీసుకుని ఓ సీట్లో కునికి పాట్లు పడుతున్నా. బస్ ఆగిపోయింది సడెన్ గా.
అది కైకలూరు మట్టిరోడ్డు. మాముందు ఓ లారీ బురదలో కూరుకుపోయింది.
తమిళనాడు రిజిస్ట్రేషన్. మా బస్ వెనక్కి మళ్ళిస్తే దీనికీ అదేగతి. అంచేత ఏం చేయాలో బోధ పడలేదు.
లారీని అందరూ కలిసి ముందుకు తోసేద్దాం అన్నారు.
' అన్నా ఎళిందర్ ఓ డ్రైవర్ అన్నా ఎళింద‌ర్' అంటూ గట్టిగా అరిచా.
అప్పటివరకూ ఉలుకూపలుకు లేని డ్రైవర్ లేచి ఎన్న ఎన్న అంటూ అడిగాడు. చేయవలసిన పని చెప్పా.
అతను బండి స్టార్ట్ చేసాడు. మేం ఆందరం ఆ లారీని తోయడం మొదలు పెట్టాం. ఊరివారు కూడా సాయపడ్డారు. ఓ అరగంట శ్రమపడేసరికి లారీ రోడ్డెక్కింది.
నా తమిళ పరిజ్ఞానం ఉపయోగపడినందుకు అంతా సంతోషించారు.
ఉదయం పదకొండు గంటల కావస్తోంది.
కొవ్వూరు చేరాం. రైలు రోడ్ బ్రిడ్జి మీద ట్రాఫిక్ జామ్.
సరే బస్ దిగి నడక ప్రారంభించా.
అదేంటో ఆ వంతెన ఊగుతోంది. చా‌లా భయం వేసింది. మరొకాయన భయపడకండి ఈ వంతెన అలాగే కట్టారు.
అయినా కొంత దూరం నడిచాక చూసా. బ్రిడ్జి ని తాకుతూ ఎఱ్ఱని నీటితో గోదావరి. ఈ వంతెన కూలిపోతుందేమో అన్నట్టు కిందకు మీదకు ఊగుతోంది. చేసేదిలేక మరొకాయన చేయి పట్టుకుని నడుస్తున్నా నాకైతే ఆశ లేదు. నన్నునేనే తిట్టుకుంటున్నా దేవునికి మొక్కుతున్నా.ఎలాగో ఓ గంట పట్టింది అది దాటడానికి.
మెల్లగా కోటిపల్లి బస్ స్టాండ్ చేరా.
తునికి బస్ వెళ్ళదట. గొల్లప్రో‌లు దగ్గర రోడ్డు ములిగి పోయిందిట.
సరే అని బస్ ఎక్కా. గొల్లప్రోలు దగ్గర ఏదో గెడ్డలావుంది.
విపరీతంగా నీరు పారుతోంది. మీదనుంచి చినుకులు.
ఒకరి చేతులొకరు పట్టుకుని తొడల్లోతు నీటిలో అవతలి ఒడ్డుకు చేరాం. మరలా మరో బస్ ఎక్కి తుని చేరా.
అప్పటికి 36 గంటల ప్రయాణం అయింది. తుని నుంచి నర్సీపట్నం వెళ్ళేరోడ్ బంద్. కుమ్మరిలోవ..కొఠాం రోడ్ బాగానే ఉందిట. దానికి తాండవ నది దాట నవుసరం లేదు కాని కట్రాళ్ళు దాటడం చా‌లా ప్రమాదం.
తొండంగి మీదుగా రౌతులపూడి బస్ ఉంటే ఎక్కేసా.
రాత్రి ఎనిమిది గంటలకు అక్కడ దిగా. మరో గంట సేపటికి కొఠాం బస్ వచ్చింది. అందు‌లో కె.ఇ.చిన్నయ్యపాలెం వరకూ వెళ్ళా.
చినుకులు పడుతున్నాయి. చీకటిమయం. ఇక్కడ
నుంచి మైలున్నర దూరం మాఊరు. నడిచి పోవడమే.వేరే మార్గంలేదు. ఊరి చివర షరాబు గారిని లేపి సంచి అక్కడ ఉంచమన్నా.ఆయన జాగ్రత్తలన్నీ చెప్పి ఓ చేతీకఱ్ఱ టార్చిలైటు ఇస్తే వాటితో బయలుదేరా. నేలంతా సముద్రంలా ఉంది. నేలనుయ్యి జాగ్రత్త అన్న ఆయన మాటలు మరింత భయపెట్టాయి.
మళ్ళగట్లన్నీ బాగా గుర్తే. అయనా చేతికఱ్ఱ సాయంతో రాత్రి రెండు గంటల ప్రాంతం‌లో యిల్లు చేరా.
మా నాన్నగారైతే దెబ్బలాడారు. అంత సాహసం చేయడమెందుకని.
అయినా
అపిస్వర్ణమయీం లంకా నమే లక్ష్మణ! రోచతే
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ.
అన్న ఆర్ష వాక్యం స్ఫూర్తిగా 35 ఏళ్ళ క్రితం చేసిన సాహసయాత్ర అది.
ఎలా మరచి పోగలను.

Thursday, July 4, 2019


    శ్రీ చక్రము ---- కోటిలింగాల రేవు
   'విద్యానాం కాది రుత్తమం' అని ఆర్యోక్తి.
కాది విద్య అంటే 'క' తో ఆరంభమైన మంత్ర విద్య'.
అదే శ్రీ విద్య. అందులో 'హ' ఆదివిద్య మరో రూపాంతరం.
సృష్టి ఆరంభం ఒక అణువిచ్ఛేదన వలన జరిగిందని  Big bang theory వంటివి ప్రతిపాదించాయి. సనాతన ధర్మం ప్రకారం విరాట్ పురుషుని ఒక సంకల్పం ఈ సృష్టికి మూలం. అందులో మొట్టమొదట ధ్వనించినది ప్రణవనాదం. ఆ ప్రణవమే జగన్మాత. ఆ తరువాత త్రిమూర్తులు. ఇలా లోకాలు ఏర్పడ్డాయి .
ఆ జగన్మాతకు రేఖా రూపమే శ్రీ చక్రం.
దైవోపాసనలన్నింటిలో మహోన్నతమైనది శ్రీ చక్రోపాసన లేదా శ్రీ వద్యా సాధన.
ఆ శ్రీ చక్రం భూమండలానికి ఈ కోటిలింగాల రేవులో నే అమ్మవారు ప్రసాదించారట.
ఆ కథ చూద్దాం.
భండాసురుడనే రాక్ష సంహారం కోసం శ్రీ దేవిని ఉద్దేశించి దేవేంద్రుడు ఒక మహాయజ్ఞం చేసాట్ట. ఆ యజ్ఞంలో దేవతలు తమ శరీరము లోని మాంసమునే హవిస్సుగా సమర్పించారట. వారి త్యాగానికి సంతోషించిన శ్రీ దేవి కోటి సూర్య సమప్రభగాను కోటి చంద్ర శీతల మయూఖములతో హోమాగ్ని మధ్యన ప్రత్యక్షమై శ్రీ చక్ర మధ్యస్థగా సాక్షాత్కరించింది.
అందుకే ఆమె 'చిదగ్ని కుండ సంభూతా దేవకార్య సముద్యతా' అయింది.
ఈ యజ్ఞము గోదావరీ తీరాన కోటిలింగ క్షేత్రమున జరిగెను. అచ్చటనే శ్రీ చక్రముతో ఆవిర్భవించుటచే ఆ ప్రదేశము రాజరాజేశ్వరీ మందిరమై రాజమహేంద్రవరముగా విలసిల్లెను.
(శ్రీ చక్ర విలసనం....
శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వర రావు విరచితం పుట 16.ఆధారంగా)

Wednesday, July 3, 2019

 ప్రతిభకు స్థానం లేదు
ఇది నా స్వతంత్రభారత దేశం
వందల వత్సరాల బానిసత్వం
నరనరాలలో జీర్ణించుకున్న వైనం
అణగారిన వర్గాలకు కూడా అందలం
అందించాలని సమసమాజపు కలగన్నాం
అందరి తలరాతలు మారాలని ఆశించాం
డెబ్బైవసంతాల స్వేచ్ఛా పాలనను
నెమరేసుకుంటే ఏమున్నది గర్వకారణం
ప్రతిభకు పట్టం కట్టలేం
సత్యానికి స్థానం యివ్వలేం
కులాలు మతాలు ప్రాంతాలే  ముఖ్యం
 ప్రజాస్వామ్యం ముసుగులో ధనస్వామ్యం
ఓటేసిన పాపానికి కాటేసే విషసర్పం కౌగిలిలో
 అమ్ముడు పోయే అమాయక జనం
ఉచితాలూ తాయిలాలతో సోంబేరితనం
సంపద అంతా కొందరి కైవసం
ఆపద అందరికీ తలో పిడికెడు
ఓ ఓనమాల గడుగ్గాయి
ప్రజ్ఞా పాటవాలను తేల్చే స్థాయి
అందుకే వలసవాదం
 యీనాటికీ సజీవం
ప్రతిభ కన్నా కులమే ముఖ్యం
ప్రగతికన్నా వ్యాకులమే సఖ్యం.
(అంబటి రాయుడు క్రికెట్ ఆటనుంచి
నిష్క్రమణ కు స్పందనగా)


    మగాడా! తెలుసుకో
ప్రపంచానికి జ్ఞానం ప్రవచించిన దేశం
అహింసా పరమో ధర్మః అన్న దేశం
యత్రనార్యంతు పూజ్యంతే అది నా దేశం
నవరస మంజరి నారి అని మురిసిన దేశం
వేనవేల వత్సరాల గతవైభవ చిహ్నం
శతాబ్దాల దాసీతనమే నేర్పిందో
ప్రారబ్దాల దురహంకారమే నేర్పిందో
ఆడదంటే అంతుచిక్కని అలసత్వం
పసికందులపై కూడా అత్యాచారాలు
ఆడపిల్లలొద్దంటూ గర్భస్రావాలు
అడుగడుగునా ఆడపిల్లకు వేధింపులు
చదువుకున్న ఉన్నతోద్యోగుల యింటైనా
మగవారితో సమానంగా ఆర్జిస్తున్నా
ఆడదంటే ఓ పనిమనిషిగా వ్యవహారం
మిగుళ్ళతో కడుపు నింపుకోమనడం
బాధ్యతా రాహిత్యం సోంబేరితనం
మగమహరాజులమనే దుష్ట ప్రవృత్తి
వెరశి నా భారతదేశం తిరోగమనం
అందుకే స్త్రీ పురుష సమానత్వ సూచీలో
 నా దేశానికి తొంభై అయిదవ స్థానం
స్త్రీకి ప్రమాదకర దేశాల సూచీలో ఐదోస్థానం
ఇదే కొనసాగితే ఈ మగ బుద్ధులు మారకుంటే
సగం మంది అబ్బాయిలకు పెళ్ళి కానేకాదు
కర్కశ నిరంకుస దురహంకారపు మగాడా
నీ వల్ల సమాజానికి ఎంత కీడో తెలుసుకో.