Tuesday, July 9, 2019

                      ప్రభల తీర్థం
'సంక్రాంతి కి ఓ రెండు రోజులు ముందే ఇంటికి రారా శంకరం.' నెలగంట పెట్టగానే అమ్మ ఆర్డర్.
'చెల్లిని కూడా శలవు పెట్టుకుని రమ్మన్నా.' అంది అమ్మ.
'ఒరేయ్ నలుగురం కలిసి మురమళ్ళ వెళ్ళి వీరేశ్వరస్వామిని దర్శించుకుని ప్రభల తీర్థం నాటికి సంబంధాలు ఓ కొలిక్కి తేవాలి' నాన్న గారి ఆలోచన.
శంకరం ఎం.టెక్ చేసి బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. వైష్ణవి బి.టెక్ చేసింది. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తోంది.
అవధాన్లు మేష్టారిది ఏనుగుల మహల్. కొత్తపేట గవర్నమెంట్ కాలేజీలో తెలుగు లెక్చరర్.
ఆంధ్రాలో సంక్రాంతే పెద్దపండుగ. అందరూ తమతమ గ్రామాలకు చేరుకుంటారు. ప్రతి ఇంటా సందడిగా ఉంటుంది. బ్రాహ్మణవీథిలో ఇంకా ఓ పదిబ్రాహ్మణ కుటుంబాలు వంశ పారంపర్యపు ఆస్తులను కాపాడుకుంటూ వస్తున్నారు.
అవధాన్లు మేష్టారి ఇంటి ఎదురుగా కఱ్ఱి సూర్యనారాయణ మూర్తిగారి యిల్లు. వారి పిల్లలు అందరూ సెటిల్ ఐపోయారు. అందులో అమ్మాజీ అంటే మేష్టారికి చాలా ఇష్టం. ఆమె అత్తవారు పప్పువారు. ఢిల్లీలో ఉద్యోగం.
ఆమె ఎప్పుడు వచ్చినా మేష్టారింట ఓ పూట భోంచేయాల్సిందే. ఈ సారి వారూ పండక్కి వస్తారట.
'ఏవండీ కోస్తా సంబంధాలు వద్దండీ. సంప్రదాయమూ పాడూ ఏమీ తెలియని చెక్కబొమ్మల్లా ఉంటారు. అబ్బాయి అవునంటే  రావులపాలెం కడిమి వారి పిల్లని ఖాయ పెట్టేద్దాం.' శారదమ్మగారు.
సరే వాడికీ నచ్చాలి కదా. ఆదివారం ఉదయం కొత్తపేటలోనే   పెళ్ళిచూపులు ఏర్పాటు చేయమన్నా. ఆదివారం సాయంత్రం విజయనగరం జయంతి వారు అమ్మాయిని చూడ్డానికి వస్తారు.' అన్నారు మేష్టారు.
'అలాగే. అమ్మాయికి ఆ సంబంధమో విశాఖ పట్నం రాచకొండ వారి సంబంధమో ఖాయ పెట్టండి. ఆచారాలు అవీ పెద్దగా పట్టింపు ఉండదు. అమ్మాయి సుఖపడుతుంది'
శని ఆదివారాలు కలిసి రావడంతో శనివారం ఉదయానికే శంకరం, వైష్ణవీ కూడా వచ్చేసారు. భోగినాటికి పప్పు వారూ వస్తారు.
కొత్తపేటలోనే కడిమి వారి బావమరిది యింట పెళ్ళిచూపులు ఏర్పాటు చేసారు. అమ్మాయి బాగానే ఉంది. హైదరాబాద్ లో పనిచేస్తోందట.
శంకరం వంట వచ్చా అని అడిగాడు. కుక్కర్ పెట్టడం వచ్చు అని చెప్పింది. ఆఫీస్ కి ఎలా వెళతారు అనడిగాడు. స్కూటీమీద అంది.
కోపం వస్తే ఏం చేస్తారు అనడిగాడు. చేతిలో ఉన్నది కింద పడేసి చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుని కూచుంటా.
ఉదయం ఎన్నిగంటలకు పక్క దిగుతారు అని అడిగింది ఆ అమ్మాయి. ఏడుగంటలకు అన్నాడు శంకరం.
శని ఆదివారాలేం చేస్తారు అంది
బట్టలు ఉతికి ఇస్త్రీ చేసుకోడం , ఓ సినీమాకి వెళ్ళడం అన్నాడు. మీ నాన్నగారు రిటైరయ్యాక ఎక్కడ ఉంటారు?
అనడిగింది.
'అమ్మా! చూడు ఈ ఏనుగుల మహల్ దాటి
ఎక్కడిఎక్కడికీ వెళ్ళం. మేము ఇక్కడే ఉంటాం జంటగా ఉన్నంత కాలం.' అన్నారు మేష్టారు.
'అమ్మాయి అలా అడిగిందని ఏమీ అనుకోకండి' అమ్మాయి తండ్రి.
'భలేవారే. ఇక్కడ శ్రీ చక్ర ఆలయం ఒకటి ప్రబోధానంద స్వామి నిర్మించారు. ప్రతిరోజూ అక్కడకి వెళ్లి దర్శనం చేసుకోకుండా ఉండలేం. అది సాలిగ్రామ శిలతో చెక్కిన శ్రీ మేరువు. ఇటువంటి ఆలయం మరెక్కడా లేదమ్మా. అందుకే మేం ఇక్కడే ఉంటాం' అంది శారదమ్మగారు.
 శంకరం ఓ.కే.అని అక్కడే చెప్పేసాడు. మీరూ మాయింటికి ఓ సారి రండి మీ అమ్మాయి ఓ.కే. అంటే అని తేల్చేసారు మేష్టారు.
సాయంత్రం వీరింటనే చూపులు వైష్ణవికి.
అబ్బాయి పొడగరి. లావు కాదు సన్నం కాదు. నల్లటి జుత్తు. నూనె రాసాడేమో నిగనిగలాడుతోంది.
స్టేట్ బేంక్ లో రిస్క్ ఎనలిస్ట్ ఉద్యోగం. డెబ్బైవేల పైనే జీతం.
వైష్ణవికి విప్రోలో ముప్పైవేల జీతం.ఇద్దరూ హైదరాబాదే.ఆ అబ్బాయి మొహమాటపడి ఏమీ అడగలేదు. మేష్టారు అడిగిన వాటికి జవాబులు బాగానే చెప్పాడు. కథలు రాస్తాట్ట. ఒకడే అబ్బాయి వాళ్ళకి. ఏవో భూములూ ఇల్లు ఉన్నాయి. ఆయన రివెన్యూ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారట.
ఆ రాత్రి చక్కగా ముగ్గుల గోల అయ్యాక వాకిటలో కూర్చుని చర్చించుకుంటున్నారు.
'ఏమే వైష్ణవీ ఏమంటావు? నీకు నచ్చాడా?' శారదమ్మగారి ప్రశ్న.
'అమ్మో. నూనె ముద్దలగాడా? నాకొద్దు బాబోయ్' అంది
'అదేంటే? మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులూ ' చూడక్కరలేదు.దేనికీ లోటుండదు.
'కథలు రాస్తాట్ట. మనం ఏం అడిగినా ఏదో కథ చెప్తాడేమో' అంది వైష్ణవి.
'కనుమనాడు జగ్గన్న తోటలో ప్రభల తీర్థానికి వెళ్ళి ఏకాదశ రుద్రుల దర్శనం చేసుకుందాం. అక్కడ సాంబ పరమేశ్వరులను స్మరిస్తే ఓ నిర్ణయం మీ మనస్సుకు తడుతుంది.
రేపు మురమళ్ళలో వీరేశ్వరస్వామిని దర్శించుకుని మా పిల్లలు ఇద్దరికీ కళ్యాణం జరిగితే మధుపర్కాలతో వచ్చి కళ్యాణం చేసుకుంటారని మొక్కుకుంటే పని తేలిక అవుతుంది' అన్నారు మేష్టారు.
నిత్య కళ్యాణ స్వామి వీరేశ్వరస్వామిని దర్శించుకుని అనుకున్నట్టుగానే మొక్కుకుని వచ్చారు.
అమ్మాజీ శ్రీ వారూ పిల్లలతో వచ్చారు. ముగ్గురూ ఆడపిల్లలే. అరుణ ,రమణి , అనిత. అరుణకు వైష్ణవితో దోస్తీ.
అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ మా యమ్మాజీ అని దీవించారు మేష్టారు. ఆ మాటకు ఆమె భర్త ఎంత సంతోష పడ్డారో చెప్పలేం.
ప్రభల తీర్థం రానే వచ్చింది. అందరూ బయలు దేరారు.
అరుణ, వైష్ణవిలదే సందడి అంతా. పదకొండు ప్రభలకు దండం పెట్టుకుంది. లౌడు స్పీకర్ల గోల తప్పించుకోడానికి ఆ వెనకగా వెళ్ళింది.
ఆశ్చర్యం.
అక్కడ నిలబడి తననే చూస్తున్నాడు మొన్నటి పెళ్ళికొడుకు.
వైష్ణవికి భయం వేసింది. కాని ఓ సారి మాటాడొచ్చుగా అనుకుంది.
' హలో వైష్ణవీ డు యు లైక్ మి?' అంటూ అడిగాడు శరత్.
' వై నాట్' అనేసింది.
అరుణా! రెండు నిమిషాలు అని చెప్పి శరత్ దగ్గరగా వెళ్ళింది. ఓ ఐదు నిమిషాలు మాటాడు కున్నారు.
'మా వాళ్ళూ వచ్చారు తీర్థానీకి. మరోసారి కలవండి' అంది.
' స్యూర్' అన్నాడు శరత్.
శంకరంని కలిసాడు శరత్.
కడిమి వారూ తీర్థంలో కలిసారు మేష్టార్ని. వారికి సమ్మతమే అని చెప్పారు.
రాత్రి మేష్టారింటివద్ద ఒకటే సందడి. వాకిట్లో మంచాలు వేసుకుని కబుర్లు. అమ్మాజీ కుటుంబం మేష్టారి కుటుంబం కలిసి.
' శంకరం! నీది ఫైనల్ ఐనట్టే. వారు సరే అన్నారు.'
'వైష్ణవీ ఏమంటోంది' ఆన్నారు మేష్టారు.
'ముహూర్తం ఎప్పుడు? అంటోంది' అరుణ జవాబు.
' నూనె ముద్దలగాడు దానికి నచ్చలేదేమో' అన్నారు.
అరుణ ఇంకా ఏదో చెప్పబోతూంటే ' చంపేస్తా.' అంది వైష్ణవి అరుణను చూస్తూ.
'మీ ఇష్టం నాన్నా' అంది.
అరుణ మేష్టారి చెవిలో అంతా చెప్పేసింది.
' నే చెప్పలేదూ ప్రభల తీర్థంలో ఏకాదశ రుద్రుల దర్శనం మనకు ఓదారి చూపిస్తుందని' మేష్టారు.
రేపు ఉదయం శ్రీ మేరు ఆలయంలో పసుపు కుంకుమ ఇచ్చుకుని వద్దాం' శారదమ్మగారు.
'వేసవి శలవుల్లోనే పెళ్ళిళ్ళు ఉండాలి. లేకపోతే మేం రాలేం' అరుణ కండిషన్.
' నువ్వే తోటి పెళ్ళికూతురువి'  శంకరం మాట.
మాఘమాసం కోసం తతిమ్మా వ్వహారం కోసం ఎదురు చూపులు.
ఎలాగైతేనేం మొత్తానికి ప్రభల తీర్థం మేష్టారికి ఓ మార్గం చూపించింది.



0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home