Tuesday, July 9, 2019


సీ.
కనవటే ఓ పాలి కాళి నన్ను కపాలి
         చూసి చూడక నన్ను జూడవమ్మ
వినవటే నాసొదల్ విశ్వ జనని నా వ్య
       ధలు కథల్ మూగ వేదనలె పరుల!
కనవటే ఓమాటు కరుణతో  నా పాటు
          చరణ మంటితి నాకు శరణు మిమ్ము
వినవటే పతితుల వినతులన్ పురుహూతి
         పతితపావని శివే భద్రకాళి
తే.గీ.
వినవె చూడవె తలుపవె విన్నపముల
వేగ వేవేగ దీర్చు మా వేడుకోలు
నా మనవి వినవే తల్లి ఆనందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.23
సీ.
సూర్యేందు నయన! స్ఫురదిందు వదన!ఘన
        చిద్గగన సదన!  చేదుకొమ్మ!
దరహాస సుందరీ దశభుజ మంజరీ
        మంజీర జికుర! మమ్మాదుకొమ్మ
ఓ విశ్వేశు దయిత! యో చలిమల దుహిత!
         శ్రీ లలిత! యపర్ణ! శ్రీ ల నిమ్మ
ముగురు యమ్మల యమ్మ! ముద్దుగుమ్మ యపర్ణ
          వమ్మ! యభయమిమ్మ! ఆదుకొమ్మ
తే.గీ.
నగజ! నగుబాటు కానీకు నలుగు రెదుట
హిమజ! మమ్మేల కనవేల హితము గోరి
నా మనవి వినవే తల్లి ఆనందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.24

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home