Monday, July 8, 2019

  జననీ జన్మభూమిశ్చ
గోదావరి నది అంటేనే నాకెంతో ఇష్టం విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ లా. రాజమహేంద్రిలో రైలు కమ్ రోడ్డు వంతెనపై నడవాలని, అలా నడిచి కొవ్వూరు దగ్గర గోదావరొడ్డున కూర్చోవాలనీ ఏదో ఆశ.
బొబ్బర్లంక నుంచి ఆత్రేయపురం సైకిల్ మీద వెళ్తే అదో మజా. ముమ్మిడివరం చుట్టుపక్కల పైలాపచ్చీస్ గా తిరగడమంటే భలే సరదా.
బి.కాం. అయి ఐదేళ్ళయింది. ఏ పనీ దొరకలేదు. మగాడికి నిరుద్యోగం అతివకు కన్నెరికం చాలా దుర్భరం. ఎవరో ఇచ్చిన సలహా పట్టుకుని ఢిల్లీ వెళ్ళిన నాకు పిసరంత ఆసరా ఓ దూరపు బంధువుల ఆశ్రయం.
టైమ్స ఆఫ్ ఇండియా లో వాంటెడ్ కోలమ్ చూసి ఓ ధరకాస్తు వ్రాసి స్వయంగా తీసుకు పోయి ఇవ్వటం. ఎవరైనా ఇంటర్వ్యూకి పిలిస్తే  బాగణ్ణు అనే ఆశ. ఓ నెల గడిచింది. రెండోనెల లో ఎలాగో ఓ పిలుపు అందింది.
ఏదో కెమికల్ కంపెనీలో ఎకౌంట్స్ రాయడానికి. ఆరొందల జీతం. లోడీకోలనీలో బస. మద్రాస్ హోటల్లో భోజనం. నెహ్రూ స్టేడియం దగ్గర సిటీబస్ 421 ఎక్కితే ఆఖరి స్టాప్ లో దిగితే అక్కడే ఫేక్టరీ ఎండ్ ఆఫీసు.
ఏదో కలగా అనిపించింది. ఆరునెల్లు గడిచింది. ఇంటి మీద ధ్యాస. పది రోజుల శలవుమీద ఇంటికి ప్రయాణం.
జి.టి.ఎక్స ప్రెస్ లో విజయవాడ చేరేసరికి ట్రైన్ కేన్సిల్. తుఫాను కారణంగా తుని బ్రిడ్జి కొట్టుకు పోయిందిట.

   'సార్ ఎక్కడికి ఎల్లా‌‌లి సార్' ఓ రిక్షా అబ్బి . విజయవాడ స్టేషన్ బయట మరో ఆయన 'రాజమండ్రి కి ట్రైల్ బస్ వేసారు. బస్ స్టాండ్ కి వెళ్ళి చూడండి' అంటే అలాగే బయలుదేరా.
నిజమే ఓ బస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. కండక్టర్ ను అడిగితే టైమ్ రూట్ మాకూ తెలియదు , కావాలంటే ఎక్కండి. రాజమండ్రి టికెట్ తీసుకుని ఓ సీట్లో కునికి పాట్లు పడుతున్నా. బస్ ఆగిపోయింది సడెన్ గా.
అది కైకలూరు మట్టిరోడ్డు. మాముందు ఓ లారీ బురదలో కూరుకుపోయింది.
తమిళనాడు రిజిస్ట్రేషన్. మా బస్ వెనక్కి మళ్ళిస్తే దీనికీ అదేగతి. అంచేత ఏం చేయాలో బోధ పడలేదు.
లారీని అందరూ కలిసి ముందుకు తోసేద్దాం అన్నారు.
' అన్నా ఎళిందర్ ఓ డ్రైవర్ అన్నా ఎళింద‌ర్' అంటూ గట్టిగా అరిచా.
అప్పటివరకూ ఉలుకూపలుకు లేని డ్రైవర్ లేచి ఎన్న ఎన్న అంటూ అడిగాడు. చేయవలసిన పని చెప్పా.
అతను బండి స్టార్ట్ చేసాడు. మేం ఆందరం ఆ లారీని తోయడం మొదలు పెట్టాం. ఊరివారు కూడా సాయపడ్డారు. ఓ అరగంట శ్రమపడేసరికి లారీ రోడ్డెక్కింది.
నా తమిళ పరిజ్ఞానం ఉపయోగపడినందుకు అంతా సంతోషించారు.
ఉదయం పదకొండు గంటల కావస్తోంది.
కొవ్వూరు చేరాం. రైలు రోడ్ బ్రిడ్జి మీద ట్రాఫిక్ జామ్.
సరే బస్ దిగి నడక ప్రారంభించా.
అదేంటో ఆ వంతెన ఊగుతోంది. చా‌లా భయం వేసింది. మరొకాయన భయపడకండి ఈ వంతెన అలాగే కట్టారు.
అయినా కొంత దూరం నడిచాక చూసా. బ్రిడ్జి ని తాకుతూ ఎఱ్ఱని నీటితో గోదావరి. ఈ వంతెన కూలిపోతుందేమో అన్నట్టు కిందకు మీదకు ఊగుతోంది. చేసేదిలేక మరొకాయన చేయి పట్టుకుని నడుస్తున్నా నాకైతే ఆశ లేదు. నన్నునేనే తిట్టుకుంటున్నా దేవునికి మొక్కుతున్నా.ఎలాగో ఓ గంట పట్టింది అది దాటడానికి.
మెల్లగా కోటిపల్లి బస్ స్టాండ్ చేరా.
తునికి బస్ వెళ్ళదట. గొల్లప్రో‌లు దగ్గర రోడ్డు ములిగి పోయిందిట.
సరే అని బస్ ఎక్కా. గొల్లప్రోలు దగ్గర ఏదో గెడ్డలావుంది.
విపరీతంగా నీరు పారుతోంది. మీదనుంచి చినుకులు.
ఒకరి చేతులొకరు పట్టుకుని తొడల్లోతు నీటిలో అవతలి ఒడ్డుకు చేరాం. మరలా మరో బస్ ఎక్కి తుని చేరా.
అప్పటికి 36 గంటల ప్రయాణం అయింది. తుని నుంచి నర్సీపట్నం వెళ్ళేరోడ్ బంద్. కుమ్మరిలోవ..కొఠాం రోడ్ బాగానే ఉందిట. దానికి తాండవ నది దాట నవుసరం లేదు కాని కట్రాళ్ళు దాటడం చా‌లా ప్రమాదం.
తొండంగి మీదుగా రౌతులపూడి బస్ ఉంటే ఎక్కేసా.
రాత్రి ఎనిమిది గంటలకు అక్కడ దిగా. మరో గంట సేపటికి కొఠాం బస్ వచ్చింది. అందు‌లో కె.ఇ.చిన్నయ్యపాలెం వరకూ వెళ్ళా.
చినుకులు పడుతున్నాయి. చీకటిమయం. ఇక్కడ
నుంచి మైలున్నర దూరం మాఊరు. నడిచి పోవడమే.వేరే మార్గంలేదు. ఊరి చివర షరాబు గారిని లేపి సంచి అక్కడ ఉంచమన్నా.ఆయన జాగ్రత్తలన్నీ చెప్పి ఓ చేతీకఱ్ఱ టార్చిలైటు ఇస్తే వాటితో బయలుదేరా. నేలంతా సముద్రంలా ఉంది. నేలనుయ్యి జాగ్రత్త అన్న ఆయన మాటలు మరింత భయపెట్టాయి.
మళ్ళగట్లన్నీ బాగా గుర్తే. అయనా చేతికఱ్ఱ సాయంతో రాత్రి రెండు గంటల ప్రాంతం‌లో యిల్లు చేరా.
మా నాన్నగారైతే దెబ్బలాడారు. అంత సాహసం చేయడమెందుకని.
అయినా
అపిస్వర్ణమయీం లంకా నమే లక్ష్మణ! రోచతే
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ.
అన్న ఆర్ష వాక్యం స్ఫూర్తిగా 35 ఏళ్ళ క్రితం చేసిన సాహసయాత్ర అది.
ఎలా మరచి పోగలను.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home