Wednesday, July 29, 2020

కల్పవల్లి


సీ.
దిక్కేమి లేనట్టి దిక్కుమాలిన వార్కి
             పేరున్న నీవుగా పెద్ద దిక్కు
సంతత దౌర్భాగ్య సంతతి కీవెగా
            చేయూత నిచ్చేటి చిన్న దిక్కు
ఆశ నిరాశల యల్లికల కుచేల
         మును గట్టు వారికి మొదటి దిక్కు
ఈతి బాధలతోడ యిట్టట్టు నలిగెడి
        ప్రాణులందరకు సంప్రాప్త దిక్కు
తే.గీ.
ఆర్తితో అమ్మ నిన్నడిగినా యాదుకోవ?
సుబుధ జన బన్నముల చూడ బోవ?
నన్ను కడదేర్చ రావె యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.

Tuesday, July 28, 2020

ఏ వంక చూసినా

       ఏ వంక చూసినా

కాలం వీలుకాదంటోంది  మారడానికి
కరోనా వల్లకాదంటోంది వదిలి పోడానికి
సర్వే సర్వత్రా ఆర్థిక రంగం నడ్డి విరిగింది
మాయరోగానికి వైద్యరంగం మందే లేదంది
ప్రభుతల ఘనతలు చేతల్లో కాదని తేలింది
సామాన్యుడికి జీవనయానం గగనమౌతోంది
నిజానికి కరోనా కల్పిత భయానకమంటోంది
పేరున్న ఓ విజ్ఞాన శాస్త్రరంగ మేధావి వర్గం
గుండె దిటవును మించిన ఔషధం లేదంది
నోయి వైద్యుడెఱుగు నిజం దేవుడెఱుగు
అతలాకుతలం అవనీతలంలో ప్రజానీకం
పెట్టుబడిదారీ అసామాన్యులకిదో వరం
ఏది ఎంతకైనా అమ్ముకునే అవకాశం
వలసలు వేదనలు ఆవేదనలు రోదనలు
ఎన్నో కథలు ఇంకెన్నో వ్యధలు ఒకటే కన్నీళ్ళు
ఏ వంక చూసినా ఏ దేశమనుకున్నా
నిరాశా నిస్పృహలు నిర్వేదపు నిట్టూర్పులు
దురితాపహారిణి దుర్గే దీన్ని తుదముట్టించాలి
దాక్షాయణి తామసహారిణి దయదలచాలి
మానవజాతి సమస్తం మరలా మనుగడ సాగించాలి.

Friday, July 24, 2020



శా.
ఏలా మానవు డొక్కొసారి మృగమై యిచ్ఛా విహారంబునన్
చాలా హేయపు క్రూరకర్మముల వాంఛాపూర్తికై చేసెడిన్

సత్య శోధన (కథ)


"రావే యీశ్వరి కావవే వరద సంరక్షించు భద్రాత్మికే"
మెల్లగా వినిపిస్తోంది మేష్టారి గొంతు.
నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ "పూలకు గుండెలుండవని పోకిరులెవ్వరు చెప్పిరట్లు" అంటూ వినిపించింది సత్య.
మేష్టారు పూదోటలో ప్రతి మొక్కకూ స్వయంగా పాడి తవ్వి నీరుపోస్తారు. అన్ని మొక్కలనీ తన చేతులతో నిమురుతారు. ఆయన వాదనల్లోదే పూలకు గుండెలుండవా అని అన్న మాట.
ఆ మాట వినగానే సత్యా!  ఇదుగో ఇక్కడ సంపెంగ మొక్క దగ్గర. ఇటురా"
"వెదుకంగా నేల యీ యా యెడన్" అలాగేనండీ.
" నమస్తే మాష్టారు. మద్యాహ్నం రెండు గంటలకి వచ్చాను ఊర్నుంచి".
"మంచిదమ్మా. బాగా చదువుతున్నావా?" "అన్నీ సక్రమంగా నడుస్తున్నాయా?"
"అవును మాష్టారు."
"ఏమిటి విశేషం? ఏమైనా సందేహాలా?"
"కొంతమంది కేట్ కి తయారవుతున్నారు. నేను ఎటూ నిర్ణయించుకోలేక మీ సలహా కోసం వచ్చాను."
"సరేరా ఆ సిమెంటు బల్లమీద కూర్చుని మాటాడుకుందాం."
మేష్టారి స్కూల్లో ఎక్కువ మంది ఆడపిల్లలే చదువుతారు. ఆయన ఒక ఆశయంతో బడి పెట్టారు. చురుకైన పిల్లలను బాగా చేరదీసి మరింత చురుగ్గా తయారు చేయడం పెద్ద చదువులకు పంపించడం అవుసరం అయితే ఫీజులు కూడా ఆయనే కట్టడం చేస్తారు. ప్రతి సంవత్సరం ఒకరికైనా ఐఐటి సీటు వచ్చేలాగ తీర్చిదిద్దుతారు. ఇంటరు విశాఖలో ఏదో కాలేజీలో చేర్పించినా అన్నీ స్వయంగా చూసుకుంటారు. ఆ వరుసలో సత్య ఐదవ అమ్మాయి. తను ఆర్.ఇ.సి. ట్రిచీలో బి.టెక్ మూడో సంవత్సరం చదువుతోంది.
"ఏంటి నీ సంశయం?'
"ఎం.బి.ఏ చేయాలా వద్దా?అని"
"నీకు నిజంగా సోషల్ సర్వీస్ చేయాలి అని ఉంటే సివిల్స్ రాయడం మంచిది. కాని అక్కడ బాధ్యత చాలా ఎక్కువ. సమయం సరిపోదు. ఏ క్షణంలో అయినా విధి నిర్వహణకు సిద్ధంగా ఉండాలి."
"ఎం.బి.ఏ. చేస్తే మంచి ఉద్యోగం  వస్తుంది. కానీ సాంఘిక సేవకు అవకాశం ఉండదు."
"ధనమూల మిదం జగత్"
"డబ్బు లేకుండా సేవ ఎలా చేయగలం మేష్టారు?"
ఐ.ఏ.ఎస్. అయితే ప్రభుత్వం ఎన్నోరకాల పథకాలను పేదలకు అందిస్తుంది. దానికి జిల్లా కలెక్టర్లదే ప్రధాన బాధ్యత.
"అర్హులైన ప్రజలకు అందించి ఆశించిన ఫలితాలు రాబట్టడం కర్తవ్యం."
"సొమ్ము ప్రభుత్వానిదీ సేవ మనది."
" సరేకాని అది చాలా కష్టమైన పరీక్ష అంటారు. మరి నేను సాధించగలనా?"
"ప్రయత్నం మానవ లక్షణం. కృషితో నాస్తి దుర్భిక్షం."
"కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు."
" నిజమే మేష్టారు. దానికి ఎలా ప్రిపేర్ కావాలో చెప్పండి. కొడితే సిక్సే కొట్టాలి అని అదే చేస్తాను."
" మంచిదమ్మా! ప్రస్తుతానికి బి.టెక్ మీద దృష్టి పెట్టు. కేంపస్ ప్లేస్ మెంట్స్ లో మంచిది సాధించు. ఓ రెండేళ్ళు ఉద్యోగం చేసాక అయితే సివిల్స్ కి తయారు కావచ్చు."
"మీ ఆశీస్సులే నాకు దిశానిర్దేశం. యథా యోగ్యం తథా కురు."   
          *  *  *  *  *
" నమస్తే మేష్టారు. టి.సి.ఎస్ లో  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో క్రియేటివ్ డిజైనింగ్ ఇంజనీర్ గా సెలెక్ట్ అయ్యాను. 23 లక్షల పేకేజి సార్."
" చాలా సంతోషం సత్యా! మొదటినెల జీతం రాగానే అమ్మకీ నాన్నకీ బట్టలు కొను. అమ్మ చేతులో ఆ డబ్బులు పెట్టు. ఆమె కళ్ళల్లో ఆనందం చూడు. అది వెల కట్టలేనిది."
"తీరిక సమయాల్లో కరెంట్ ఎఫైర్స్ ఆఫ్ ఇండియా చదువుతూ ఉండు."
"అలాగే మేష్టారు."
తెలుగులో శ్రీ శ్రీ, దేవులపల్లి, విశ్వనాథ వంటి వారి రచనలు చదువుతూ ఉండు.

Monday, July 20, 2020

వసుంధర - అసహనం

      వసుంధర -- అసహనం
ఈషణ్మాత్ర నిస్స్వార్థతాభావరహిత
ఏలికలు ఎలుగుల్లాగ మితిమీరిన దందాలు
దురాశాపూరిత దోర్బలసంపన్న యువత
వినాస్వేదసంభావితోచిత తాయిలాలకు బానిసలై
పాలితులు పాలికలై పాలెగాళ్ళై సేవకులై
నిరాశాజనక భవిష్యద్దృగ్గోచరమవగా
అపరిణతామనో చాంచల్యమో ప్రారబ్దమో
సాధారణ ధరణీ లలామ యసాధారణ
రాజరికం నడినెత్తిన భరిస్తోంది సహిస్తోంది
విరుగుడు లేని అంటురోగం ఎల్లెడలా ఎగబ్రాకి
అవనీతలాన్ని అల్లకల్లోలం చేస్తుంటే
ఱెక్కాడక డొక్కాడక సర్వ జనత నిశ్చేష్టితమైతే
అధికార దురహంకార దురంధరావేశ రక్షకులు
సామాన్యజన పీడిత ప్రాణ భక్షకులై విఱ్ఱవీగుతుంటే
పాపం పండని పాలకులతో వేగలేక వేగ చనలేక
సస్యశ్యామల వసుంధర అపసవ్యంగా నోరు మూసుకొని
అవమానాలు అవహేళనలు భరిస్తోంది సహిస్తోంది
శ్రీ కర శుభకర శుభమంగళ నవోదయం కోసం
సాలోచనగా ఎదురు చూస్తోంది అసహనం కనబరుస్తోంది.


Thursday, July 16, 2020

పాలింపవే భార్గవీ.


మ.
ఉపవాసంబులు జేయుచున్నుభయ సంధ్యోపాసనల్ జేయుచున్
యపవాదంబులు లేని మార్గమున ధర్మాధిక్య చిత్తంబుతో
విపరీతంబుగ మంత్ర తంత్రముల శ్రీ విద్యాను రక్తిన్ మనో
చపలత్వంబులు మాని నిత్య యజనా చాతుర్య భక్తుండనై.

ఉపలబ్దంబగు లేశమున్ శత శతంబుల్గానె భావించుచున్
కపటంబొల్లక కల్లబొల్లి కథలన్ కాదంచు నే నమ్మితిన్
సుపథంబియ్యది యంచెఱింగి త్వదుపాస్యోద్ధతిన్ సాగుచున్
యపకారంబుల జేయనొల్లని మదిన్నాకాంక్ష పోదేలనో.

మరణంబొక్కటె సర్వ క్లేశ హరమా? మార్గాంతరంబుండదే
శరణంచున్ ననుగావుమంచు మమ వాచాలత్వమున్ జూపుచున్
చరణద్వంద్వము నంటి వేడితిని విశ్వాసంబుతో కావవే
పరులా నమ్మిన వారి విశ్వ వపుషా!పాలింపవే భార్గవీ.

నిను సేవించిన పున్నెమో కడకు నన్నీరీతిగా నిల్పగా
మును నే జేసిన పాపమో యితరమో మోమాటమో
యప్పులన్
నను ముంచెత్తిన పాఠశాలకిక నైనా మోక్షమిప్పించవే
యనుకూలించవె భార్గవీ దయలు నాయందున్ జూపింపవే.

కరుణించాలని నీకు లేనపుడు నాకాధార మేముంటమిన్
మరణించాలను నిశ్చయమ్మొకటి సమ్మానంగా కన్పడన్
ధరణీ బంధము వీడిపోవుటలు సంధర్భోచితమ్మందు నే
సరిపోజాలనె నీ కృపాబ్ది మునుగన్ సంతోషమే యంతమున్.

Tuesday, July 14, 2020

పోతన పద్యాలు-1

పోతనగారి ఆణిముత్యాలు ఒక అవలోకనం
రోజుకో పద్యం చూద్దాం.

శా.
శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేక స్తంభకు గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్.
భావం:
సమస్త లోకాల రక్షణయే ధ్యేయంగా సంకల్పించుకున్న వాడు, భక్తులను పాలించే కళలో నిష్ణాతుడు, రాక్షసుల ఉద్రేకాలను అణచివేసేవాడు, ఏదో సరదాగా ఆటలా చూసే చూపులతోనే అనేక లోకాలను సృటఠజించే వాడు, నందుని కుమారుడు అయిన శ్రీ కృష్ణుని ఆ పరమోత్కృష్టమైన కైవల్యం పొందడం కొఱకు ధ్యానింతును.
పోతన లక్ష్యం మోక్షం మాత్రమే. అందుకే తొలిపలుకులోనే నొక్కి చెప్పేసారు. ఇది ఎవరి మెప్పు కోసమో వారిచ్చే సంపదల కోసమో వ్రాయాలనుకోలేదు.
ఇందులో భాగవతంలో కథను నాందీప్రస్తావనగాా ఉటంకించారు.
పరీక్షిత్తు కు మోక్షప్రాప్తికోసం శుకయోగీంద్రుల వారు భాగవంతం చెబుతారు. అలాగే సూతుల వారు సౌనకాది మునులకు అదే దృక్కోణంతో ఈ కథలు చెబుతారు. మనమూ మోక్షగాములమై ఈ భాగవతాన్ని చదువుకోవాలనే దిశా నిర్దేశం అంతర్లీనం.
ఈ పద్యంలో మరో విశేషం ఉంది. భగవంతునికి ఆరు గుణాలు. అవి 1. సర్వేశ్వరత్వం 2 ధర్మ సంస్థాపన 3. శిష్ట రక్షణ 4.దుష్ట శిక్షణ 5 విశ్వ కర్తృత్వం 6. ఆనందమయత్వం.వాటిని సూచిస్తూ ఆరు సమాసాలు ప్రయోగించారు.. దీనిని షడ్దళ కమలం అంటారు.
శ్రీ కైవల్య పదంబు జేరుటకునై అనే దళంలో మోక్ష కాముకత్వమూ అది ప్రసాదించే భగవానుని సర్వేశ్వరత్వమూ ప్రతిపాదించబడ్డాయి
లోకరక్షైకారంభకున్ అనడంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపు కంస యవనాదులచే అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన కథలలో ధర్మసంస్థాపన చేయడం సూచితం.
భక్తపాలన కళా సంరంభకున్ అనడంలో ఒక చమత్కారం ఉంది. ఆ భగవానుడు భక్తులను రక్షించడం అనే ఒక కళలో  బహు నేర్పరి. ఇట శిష్ట రక్షణ సూచితం.
దానవోద్రేక స్తంభకున్ అంటే బలి ఇంద్రపదవిని ఆశించడం వామనరూపంలో ఆ కార్యాన్ని నిలువరించడంలో దుష్ట శిక్షణ సూచితం.
కేళిలోల…...భవాండ కుంభకున్ అనగా భగవానుని విలాసవంతమైన చుపులతో లోకాలు సృజింపబడతాయి అనడంలో సూర్య చంద్ర వంశాలు స్ఫురించాయి. ఇది స్వామి యొక్క విశ్వకర్తృత్వాన్ని సూచిస్తుంది.
మహానందాంగనా డింభకున్ అనగా కృష్ణావతారం కృష్ణలీలలు స్ఫురించాయి. ఇక్కడ ఆ నందునికీ గోపాలురకూ ఆనందం పంచడము ఆనందమయత్వం సూచితం.
ఈ పద్యం తెలుగులో వచ్చిన భక్తి సాహిత్యానికే సిగబంతి లాంటిది. మొత్తం భాగవత కథా సూచితంగా మానవ జన్మకు సార్థకతా నిర్దేశకంగా
తన లక్ష్యం ఇదీ అని విస్పష్టంగా వివరించబడ్డ పద్యం. ఇన్ని విషయాలను ఒక్క పద్యంలో ఇమడ్చి చెప్పడం ఒక్క పోతనకే చెల్లింది.
ఉదయం లేవగానే ఈ పద్యం చెప్పుకుని ఆ పరమాత్మను మనస్సులో తలచుకోవడం అందరికీ ఎంతో మేలు కలిగే శుభసంకల్పం కాగలదు.
(సశేషం)



శా.
పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పత్రంబునన్
నెట్టం గల్గను గాళి గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీ
దెట్టే వెంట రచింతు తత్సరణి నీవీవమ్మ యో యమ్మ మేల్
పట్టున్ మానకు మమ్మ నమ్మితి జుమీ బ్రాహ్మీ దయాంభోనిధీ.
భావం: పుట్టలో పుట్టలేదు. అంచేత వాల్మీకిని కాను.
బాణంలోంచి రాలేదు. అంచేత బాణుడు కాను. లేదా.
రెల్లు దుబ్బులో మొలకెత్తలేదు. కనుక కుమారస్వామిని కాను. నీటిపై వాహనమైన నావలో నిజానికి నేను  పుట్టలేదు. కనుక వ్యాసుడంతటి వాడను కాను. కాళికా దేవిని కొలచినది లేదు. అందుచే కాళిదాసంతటి వాడను కాను.
అయినాసరే పురాణం చేయాలని సంకల్పించాను. అంచేత వారందరి దారిలోనే (మీదు ఎట్టే వెంట) రచిస్తాను. ఆ విధానం నువ్వే ప్రసాదించాలి. ఓ అమ్మా! సరస్వతీ! ఈ శుభ సంకల్పానికి అండగా ఉండడం మానకు అమ్మా!  ఓ దయకు సముద్రంలాంటి తల్లీ! నిన్నే నమ్ముకున్నాను సుమీ.
పోతన గారికి మనసులో  ఒక ప్రక్క  ధృఢ సంకల్పం మరో ప్రక్క భయం. చెప్పవలసినది భగవంతుని బృహత్కథ.
తను వీరశైవుడు. భాగవతం విష్ణుచరిత. కలలో కనిపించినవాడు శ్రీ రామచంద్రుడు. అతనికి అమ్మంటే మహా ప్రీతి. ఏదో జంకు వెంటాడుతోంది. భారం ఆ వాగ్రూపిణి మీదనే ఉంచి ముందుకు సాగాలి గాని 'నాన్యః పంథా విద్యతే అయనాయ' అని నిర్ణయించుకుని 'తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్' అని మనసులో తలచుకుని శుభారంభానికి పూనుకున్నాడు.
పోతన గారింట ఇతఃపూర్వం కవిత్వం గాని పురాణాలు చెప్పడం గాని ఎవరూ చేయలేదు. ఈ పని అనువంశికం కాదు. గురువుల ఆశీస్సులు మాత్రమే ఉన్నాయి మంచి కవిత్వం చెప్పడానికి . అంతే. అంచేత 'లోనానయు భీతియున్ గదుర' అన్నట్టున్న వారి మనస్సు ఇక్కడ ఆవిష్కృతమైంది.
పురాణాలు ప్రవచనాలు చెప్పేవారెవరైనా సరే ఇంత వినయంగా ఉండి కార్యోన్ముఖులు కావాలనే ఒక మార్గదర్శనం చేయబడింది.
కావ్యారంభంలో పూర్వకవులను మెచ్చుకోవడం ఒక ఆనవాయతీ. పోతనగారు పూర్వకవి స్తుతికి ముందే పూర్వ పౌరాణిక కవులను తలచుకోవడం విశేషం. 'శరంబునన్ మొలవ' అని సుబ్రహ్మణ్యుని ప్రస్తావించుట అప్రస్తుతమని కాబోలు తి.తి.దే. వారి అచ్చులో 'శిరంబునన్' అని మార్చినారు.
ఇప్పటి ప్రతులలో 'చరింతు' అని ఉంది. కాని 1967 ప్రాంతంలో నేను 'రచింతు' అనే నేర్చుకున్నాను.

  • (సశేషం)


ఉ.
అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.
భావం:
అమ్మలందరకూ అమ్మ. ఆమె జగన్మాత. లక్ష్మీ పార్వతీ సరస్వతులు మువ్వురకూ మూలమైన తల్లి. అందరికీ ఆమే తల్లి. అసురమాత యైన దితికి కడుపు మంట కలిగించిన అమ్మ. దేవతా మాతల మనస్సులలో ఉండే అమ్మ. అటువంటి దుర్గ మా అమ్మ. దయాసాగరి. మహత్తరమైన కవిత్వ పటుత్వమనే సంపదను ప్రసాదించు గాక.
ఈ పద్యం చూస్తే పోతన శ్రీ విద్యా ఉపాసకుడు అని అనిపిస్తుంది నాకు. ఆ విషయం మరోమారు చూద్దాం.
జగన్మాత తత్వం స్పృశించడం జరిగింది యీ పద్యంలో.
జగన్మాత శ్రీ లలిత. ఆమె ముగ్గురు ఆరాధ్య మాతృశ్రీ లకు తల్లి. అప్పలకు అమ్మ కనుక అప్పలమ్మ.( పోతనగారికి కేసన అనే ప్రౌఢ సరస్వతీ బిరుదున్న కొడుకు ఉండెను. ఆయనకు ఇరువురు భార్యలు. అప్పలమ్మ వెంకమ్మలు.అప్పలమ్మ అనే పేరును హీనంగా చూసే దౌర్భాగ్యం మనది. శ్రాద్ధ కర్మలలో ఆడవారికి పేరు చివర అప్ప అనే చెప్పాలి. ఉదా: సీతప్ప వల్లప్ప వెంకప్ప )
తనను నమ్మిన వారి మనస్సులలో ఎల్లప్పుడూ ఉండేతల్లి.ఆమెయే దుర్గ. ఆమె ఏమిటి యివ్వాలట?
మహత్తరమైనది అంటే 'ఓం'
కవిత్వం అంటే వాగ్భవ బీజం 'ఐం'
పటుత్వం అంటే శక్తి బీజం 'హ్రీం'
సంపద అంటే లక్ష్మీ బీజం 'శ్రీం'
శ్రీ చక్ర నవావరణ అర్చనలో చాలా వరకూ మంత్ర తంత్రాలన్నీ 'ఓం ఐం హ్రీం శ్రీం' అనే నాలుగు బీజాక్షరాలతోనే మొదలవుతాయి. ఐం హ్రీం శ్రీం అనేవి వరుసగా సరస్వతీ గౌరి లక్ష్మీ బీజాక్షరాలు.
అంటే ఈ భాగవతం ఆ మువ్వురమ్మల కృపను వర్షించాలని ఆ బీజాక్షరాలు సంకేత రూపంలో నిక్షేపించడం జరిగింది.
నిన్నటి పద్యంలో నమ్మితి జుమీ బ్రాహ్మీ అని ఈ రోజు   ఓం ఐం హ్రీం శ్రీం అనే బీజాక్షరాలతో ఆ జగన్మాతను ప్రార్థించడం జరిగింది. అమ్మ దయ వుంటే అన్నీ వున్నట్లే అనేది జగమెరిగిన సత్యం. ఆ అమ్మకు బీజాక్షరాలతో ప్రార్థించడం ఎంతో ప్రయోజనకారి. ఈ బీజాక్షరాలు మంత్రానుష్ఠానము కొన్ని నియమాలకు కట్టుబడి చేయాలి. అది అందరికీ వీలుకాని పని. అందుకని వాటిని యీ రకంగా నిక్షిప్తం చేసారు.
దురితములను హరింప చేయునది కనుక ఆమె దుర్గ. అటువంటి దుర్గ మాకు ప్రసన్నమగు గాత!
(సశేషం)


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు
      (4 వ పద్యం )

బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్
గూళల కిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్
హాలికు లైన నేమి గహనాంతర సీమల కందమూల గౌ
ద్దాలికు లైన నేమి నిజదార సుతోదర పోషణార్థమై.
భావం:
నునులేత చివురలతో కోమలమైన చిన్న మామిడి చెట్టు వంటిది భాగవతం అనే కావ్య కన్య. దానిని ప్రతిఫలాపేక్షతో క్రూరుల చేతిలో పెట్టి ఆవచ్చిన దానితో లభించే అన్నం వేశ్యావృత్తిచే వచ్చిన దానితో సమానం. అటువంటి దానిని తినడం కన్నా మంచి కవులు నాగలి పట్టుకుని దున్నుకుంటే తప్పా? ఏ అడవుల్లోనో కందమూలాలు (తియ్య దుంపలు) తిని బ్రతికే కౌద్దాలికుడైతేనేమి? (కౌద్దాలికుడు అంటే కందమూలములను భూమినుండి త్రవ్వి తీసుకొను వాడు). ఇంతకీ ఈ తాపత్రయమంతా కట్టుకున్న పెళ్ళాం పిల్లల కోసమే కదా.
ఈ పద్యం భాగవత సందర్భంలోనిదే కాని భాగవతంలోనిది కాదు. ఇది పోతన గారి చాటువు. ఒకసారి శ్రీ నాథుడు పల్లకిలో వస్తూ బావగారైన పోతన నాగేటి సాలు పట్టుతూ పొలంలో ఉండడం చూసి ఎగతాళి గా "బావగారు హాలికులా?" అని పలుకరించగా పోతన ఈ రకంగా సమాధానం చెప్పెనట. కథమాట అటుంచి ఈ పద్యం రసరమ్య గీతం అనేది నిర్వివాదాంశం.
ఈ కథ నిజమే అయితే శ్రీ నాథుడి గుండెల్లో గునపం పోటులాంటి మాట "నిజదార సుతోదర పోషణార్థమై" అన్నది. శ్రీ నాథులవారికి నిత్యమూ ఆటవెలదులూ మైథున్యాలపై మక్కువ. అంచేత పోతన కట్టుకున్న భార్యా పిల్లల కోసం అని దెప్పిపొడిచాడు. ఆయన సంపాదన అంతా బజారు సరుకు కోసం శలవుచేసిన బాపతు.
రసాలము అంటే మామిడి చెట్టు. నిజంగా భాగవతం ఓ మామిడి చెట్టే. రసాలు అనే రకం పళ్ళు. వాటిని కోసుకుని జుఱ్ఱుకోవడమే మనపని.

పోతన పద్యాలు --- ఆణిముత్యాలు
   (5వ పద్యం)

శా.
తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లంజేయుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షి!సరస్వతీ! భగవతీ! పూర్ణేందు బింబాననా.
భావం:
అమ్మా! సరస్వతీ!ఓ విచ్చిన కమలములవంటి కనులున్నదానా  జడ్డితనం లేకుండా చేసేదానా  నిన్ను తలచుకుని పుస్తకం చేతిలోకి తీసుకున్నాను. నీవు నా ఎదలో నిలచి పుష్కలంగా మంచి మంచి మాటలను నా నోటంట పలికించు. దానితో సంతృప్తి కలగాలి. !ఓ భగవతీ!
ఎంత చక్కటి ఆర్తి. అమ్మ జ్ఞానప్రసూన. ఆమె వాగ్రూపిణి. అంచేత ఆమె గుండెల నిండుగా ఉండి మంచి తలంపులనూ మంచి మాటలను పండించమనే వినతి. అంతకు మించినది మరోమాట  బద్ధకం అనేది లేకుండా చేసే తల్లి. ఆమెను అంతకన్నా ఏం కోరుకోవాలి? అందుకే కొన్ని శతాబ్దాల పాటు ప్రార్థనా పద్యంగా వెలుగొందిన పద్య రాజ్ఞి యీ పద్యం.
ఈ పద్యం కూడా చాటువుగానే ఉండిపోయింది. భాగవత ఆరంభంలో త్రిమూర్తులు, గణపతి , ముగ్గురు అమ్మలను ప్రార్థిస్తూ తలో పద్యం చెప్పినా సరస్వతీ దేవిమీద ఎక్కువ పద్యాలు చెప్పాడు.
అవి.
1.పుట్టన్ బుట్ట శరంబునన్ మొలవ
2. శారద నీరదేందు ఘనసార పటీర
3. అంబ నవాంబు జోజ్వల
4.తల్లీ నిన్ను దలంచి
5. కాటుక కంటినీరు
6. బాలరసాలసాల
ఈ ఆరు పద్యాలు కూడా చదువుతూంటే హృదయం ద్రవిస్తుంది. పోతన ఎంత ఉద్విగ్నమైన మనస్సుతో ఈ రచనకు ఉపక్రమించాడో అనిపిస్తుంది. ఈ పద్యాలన్నీ ఎవరికి వారే అన్వయించుకునేలాగ వ్రాయడంతో విద్యార్థులు తప్పనిసరిగా నేర్చుకునేవారు.
ఈరోజు చెప్పుకున్న పద్యం మొన్నమొన్నటివరకూ ప్రతి బడిలోనూ ప్రార్థనలో ఉండేది. ప్రార్థన ప్రేయరుగా మారిపోయాక కనుమరుగున పడింది.
(సశేషం)

పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు
     (6 వ పద్యం )
ఉ.
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషారఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధా పయోధి సితతామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ.
భావం:
అమ్మా! సరస్వతీ! శరదృతువు మేఘము చంద్రుడు కర్పూరము మంచిగంధం హంస మల్లెపూదండ మంచు నురుగు వెండికొండ రెల్లుపువ్వు  ఆదిశేషుడు అడవిమల్లె కల్పవృక్షం పాలకడలి తెల్లని పద్మము అమరవాహిని యైన గంగ వంటి వాటిని మించిన స్వచ్ఛధవళ సుందర మూర్తివి నీ అపురూప రూపం నా మనస్సులో ఎప్పుడు ఆవిష్కృతం అగునో!
తెల్లదనానికి అంటే స్వచ్ఛతకు నిర్మలత్వానికి ప్రతీకలుగా ప్రకృతిలో ఉన్న పదునేడు ఉపమానలను ఉటంకించాడు. అదీ మాటల మధ్య ఏ విభక్తులు ప్రత్యయాలు లేకుండా. ఎందుకంటే ఆ పద్యపాదంలో ఈ ఉపమానాలన్నీ మూడు పాదాలలో ఇమిడి పోవాలి. అంత ఒద్దికతో పొందికతో చెప్పి వీటిని మించిన నిర్మలత్వము నీదికదమ్మా. అటువంటి నిన్ను ఒక్కసారి నా మనోఫలకం మీద చూసే క్షణం ఎప్పుడు కలుగునో అని ఎదురు చూస్తాడు.
అయితే యీ పద్యం చదలువాడ ఎఱ్ఱాప్రగడ అంటే కవిత్రయంలో మూడవవారు వ్రాసినది అని  నృసింహ పురాణం లోనిది అంటారు.
(సశేషం)

పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు
   (7వ పద్యం )
ఉ.
అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్రచంద్రికా
డంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ శ్రుతి సూక్తి వివిక్త నిజప్రభావ భా
వాంబర వీథి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతీ.
భావం:
అమ్మా! పద్మములవంటి చేతులలో అప్పుడే వికసించిన పద్మములు కలదానా, శరత్కాలపు చల్లని తెల్లని వెన్నెలవంటి దర్పముగల స్ఫురద్రూపివి, దిగ్దిగంతాలకు కాంతులు వెదజల్లుతున్న రత్నాభరణములు ధరించినదానా, వేదవాక్కులకు/నిర్దేశములకు సానుకూల ప్రభావము కలదానా, తలంపులనే ఆకసమందు విరివిగా విహరించుదానా నన్ను అనుగ్రహించవమ్మా! ఓ సరస్వతీ!

ఇక్కడ కూడా ప్రకృతిలో ఉన్న స్వచ్ఛతకు నిర్మలత్వానికీ ప్రతీకలైన, సరస్వతీ దేవికి అలంకారమైన వస్తువులనే ఉపమానాలుగా తీసుకోబడింది.
శరత్కాలపు వెన్నెలను పుచ్చపువ్వులా ఉందనీ పిండారబోసినట్లు ఉందనీ అంటారు. ఆ వన్నెల వెన్నెల వెలుగులో ఆటలు పాటలు మాటలు వెల్లివిరుస్తాయి. సంగీత సాహిత్య క్రీడా వేడుకలకు అది సానుకూల సమయం. భారతీదేవిది ఆ వెన్నెల దర్పాన్ని కలిగి ఉన్న అందమైన రూపమట.
ఆడవారికి ఆభరణాల ప్రదర్శన గొప్ప కదండి. మన భారతీదేవి కూడా బయటకు కనిపించే లా వేసుకుంది రత్నహారాలు. ఆ మెడలో వేసుకున్న రత్నహారాల కాంతులు దిగంతాల వరకూ వ్యాపించాయట. వేదోక్తమైన నియమాలను విస్తృతంగా పాటించుచున్నదట. నిజమే భర్తగారైన బ్రహ్మగారు భారత శ్రుతి విధాత మరియు వేద పదార్థజాత విజ్ఞేత. మరి ఆ చతుర్ముఖుని కుటుంబినిగా  తూ.చ. తప్పకుండా ఆ నియమాలను ఆచరించే తల్లి యీమె. భర్తగారి అడుగు జాడలలో నడచుకోవడం భారతీయత కదా.
కలం లేదా ఘంటం పట్టిన కవుల మనస్సులలో నిరంతరం ఒక భావం వెంబడి మరో భావం జనిస్తూనే ఉంటాయి. ప్రతి జీవి మనస్సులోనూ తలపుల మధ్య విరామం ఉండదు. ఆ తలపులకు ఒక వాగ్రూపం కల్పించడమే ఆమెకు దినచర్య. అందమైన ఆలోచనలకు ఒద్దికైన శబ్ద సంపదను ప్రసాదించితే అది కవిత్వం అవుతుంది. అందుకే ఆమె భావంబర వీథిలో విస్తృతంగా విహరించే విహారిణి.
ఆమె దయదలిస్తే పండు వెన్నెల వంటి స్వచ్ఛమైనవి వేదోక్తమైనవీ అయిన భావములు పుంఖానుపుంఖంగా కలిగి, యవి సుశబ్దముల రూపములో వెలువడి దిగంతాల వఱకూ వ్యాపించగలవు. అందుకే ఆమె దయకు అఱ్ఱులు చాచడం. గోవు అంబా అని అఱ్ఱులు చాచి అమ్మని పిలుస్తుంది. ఆ అంబా రావము వినా మరో మాట పలకని ధన్యజీవి గోవు. అటువంటి ఆర్తితో చెప్పినది కనుక 'అంబ' అని మొదలిడడం జరిగింది.
అయితే యీ పద్యం కూడా ఎఱ్ఱన ప్రణీతమని అంటారు. భారతం అరణ్యపర్వంలో (4-216) యీ పద్యం ఉంది.
శారద నీరదేందు అన్న పద్యమూ ఈ పద్యమూ శైలీ పరంగాను ధారా శుద్ధిలోను పోతన కృత కవిత్వమే అనిపిస్తుంది. అలా కాక ప్రబంధ పరమేశ్వరుడు వ్రాసినవే అయినా ఆయన మీద భక్తిని ప్రకటించుకొనుటకు యథాతథంగా స్వీకరించి ఉండవచ్చు. ఇప్పటిలాగ copy rights అనే గోల ఆ రోజుల్లో లేదు కదా.
 ఎఱ్ఱన కూడా శైవుడు. కాని వ్రాసిన కావ్యాలు విష్ణు కథలు. పోతన వీర శైవుడు. వ్రాసినవి విష్ణు కథలే. పోతన   ఎఱ్ఱనలు ఇద్దరూ అలంకార ఆడంబర ప్రియులే. అందుచేత ఎఱ్ఱన పద్యాలనే పోతన వాడుకున్నా వారిలో వారికి గాని అనువంశీకులతో గాని గొడవలు లేవు.
(సశేషం)


పోతన పద్యాలు ---ఆణిముత్యాలు
    (౮వ పద్యం)
ఉ.
మూపున వామకుండలము మోవి నొకించుక మోడ్పు చందమున్
జూపెడు నోరజూపు సొగసుంబొమ నొక్కెడ నిక్కుగన్పడన్
గ్రేపులు సొక్క కల్పకము క్రింద త్రిభంగిగ నిల్చి యంగుళీ
వ్యాపిత వంశమూర్తి యయి వర్తిలు మోహన మూర్తి గొల్చెదన్.
సందర్భం:
కృష్ణపరమాత్మ  ఓ పొద్దు కల్పవృక్షం కింద నిలబడి గోవులు కాసుకుంటున్నాడు. పిల్లన గ్రోవి వాయించుతూ ఎడమ కాలు వంచి కుడి పాదంకు బయట ఉంచి నిలుచున్నాడు. (అదే మూడంకెలాగ నిలుచోడం). తల కాస్త వారగా ఉంది. చేతి వేళ్ళు మురళీ మీద కదులుతూ పెదవుల దగ్గరగా ఉన్నాయి. ఎడమ చెవికి ఉన్న కుండలము భుజానికి తగులుతోంది.
భావం:
ఎడమ భుజంపై చెవి కుండలము తగులుతూ చేతి వేళ్ళు పెదవులకుతాకుతుండగా లేగదూడలు ఆనందంగా అఱ్ఱులు సాచి ఆలకిస్తూండగా మూడంకె వేసినట్టుగా కల్పవృక్షం కింద మురళిని వాయిస్తున్న సుందర స్ఫురద్రూపిని కొలచెదను.
సుమారు 52/53 వత్సరాల క్రితం నేర్చుకున్న పద్యం యిది. అప్పుడు మాయింట 1945 లో అచ్చయిన వావిళ్ళ వారి ప్రతి భాగవతం మా యింట ఉండేది. అందులో కృష్ణుడు బొమ్మ ఈ పద్యంలో చెప్పినట్లు వేసి దానికింద ఈ పద్యం ఉండేది. ఈమధ్య వచ్చిన ప్రచురణలలో ఈ పద్యం కనిపించదు. అంచేత పై నుడికారంలో ఒకటి రెండు స్కాలిత్యాలుండవచ్చు. నా జ్ఞప్తి మేఱకు పొందుపిచాను.
ఈ పద్యం ఒక సుందర దృశ్యాన్ని మనకళ్ళ ఎదుట నిలబెడుటతోంది. అక్కడ ఒక వృక్షము. దానికింద మూడంకెలాగ నిలుచున్న కృష్ణుడు అతడిని మెడసాచి వింటున్న లేగదూడలు అతని చేతిలో మురళీ తలకాస్త ఎడమవైపుకు వాల్చి ఉండటం వలన చెవి కుండలం భుజానికి తాకుతూ పిల్లనగ్రోవిపై వ్రేళ్ళు మురళిపై చివరి వఱకూ వ్యాపించుతూ ఉన్నటువంటి కృష్ణుణ్ణి కొలుస్తాడట.
భావుకులు తప్పనిసరిగా ఆ దేవదేవుని మనోఫలకం మీద ఆవిష్కరించుకో గలరు.
ఇది కూడా ఎందుకు భాగవతంలోంచి బయటపడిందో నాకైతే తెలియడం లేదు.  కాని ఇదొక అద్భుత దృశ్య కవనాన్ని కనువిందుగా మైమరపించే పద్యం.
(సశేషం)




పోతన పద్యాలు --- ఆణిముత్యాలు
        (౯వ పద్యం  )
ఉ.
ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులన్
సొమ్ములు గొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలు చే
సమ్మెట పోటులన్ బడక సమ్మతితో హరి కిచ్చ జెప్పె నీ
బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్.
భావం:
ఈ పరిపాలకులైన నృపతులనే తక్కువ వారికి అంకితంగా ఇచ్చి ప్రతిఫలంగా ఓ అగ్రహారం వాహనాలు నగలు/నగదు పుచ్చుకోవచ్చు. కాని చనిపోయాక యముడి దగ్గర నానా తన్నులు తినడం ఇష్టంలేక ఆ శ్రీ హరికే అంకితం ఇచ్చుటకై బమ్మెర పోతన అనే ఒకడిని ఈ జగత్తుకు హితం కలిగించే భాగవతాన్ని చెప్పదలచాను.
ఈ పద్యం భాగవత ప్రారంభ సందర్భంలోనిది కాదనిపించుచున్నది. కారణం "హరికిచ్చ/హరికిచ్చి జెప్పె"
అనే మాటయే. జెప్పె అనే భూతకాల క్రియాపదం భాగవతం వ్రాయక ముందు చెప్పే అవకాశం లేదు. కొంత వఱకూ వ్రాశాకో పూర్తిగా వ్రాశాకో ఎవరికైనా అంకితమివ్వగలగడం సహజం. అలా కాదనుకుంటే ఏ రాజులైనా వదాన్యులైనా తమకు అంకితంగా ఏదైనా వ్రాయమని అడిగితే సమ్మతించడం కూడా ఉంది.
సరే ఆ విషయం అటుంచితే తొలిమాటగానే కైవల్యం కోసం వ్రాస్తాననుకుని తీరా వ్రాసాక అమ్ముకోవడం మింగుడుపడని విషయం.
ఇక రాజులు వారి కొలువులు పోతనకి తెలియనివి కావు. ఏదో మోక్షం కోరి ఈ పనికి పూనుకుని ఆపైన కక్కుర్తి పడే మనస్సు పోతనకు లేదు.
ఇక ఈ భాగవతం ఎలాంటిదయ్యా అంటే జగత్తంతటికీ అంటే దీనిని చదివిన ప్రతిఒక్కరికీ శ్రేయోమార్గాన్ని చూపించి నడిపించి ముక్తిని మూటగట్టి ఇప్పించగల బృహద్గ్రంథం. అంత పవిత్రమైన దాన్ని ఎవరికి బడితే వారికి ఎలా ఇవ్వడం.
మరోటి. అది ఒక కావ్యకన్య. బమ్మెరవారి కావ్యకన్యని పనికిమాలిన వారి చేతిలో పెట్టగలడా? కావ్యాన్ని కూతురులాగ చూసుకుంటారు కవులు. అందుకే కన్యాదానం లో ఏ జాగ్రత్తలు పాటిస్తామో కావ్యకన్యా దానంలో కూడా ఆ ప్రేమానురాగాలు భవిష్యత్ బాగు కోరుకోవడం సహజమేకదా.
(సశేషం)
పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు
 ౧౦వ పద్యం)
తే.గీ.
చేతులారంగ శివుని పూజింపడేని
నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువడేని
దయయు సత్యంబు  లోనుగా దలుపడేని
కలుగ నేటికి తల్లుల కడుపు చేటు.
భావం:
తనివి తీరా చేతులతో ఈశ్వరుని పూజింప లేని వాడు, నోరారా హరి కీర్తనలు పాడుకోలేని వాడు ,
దయ సత్యము అనే రెండింటినీ నిరంతరమూ ఆచరించని వాడు తన తల్లి కడుపున చెడ బుట్టినట్లే.

పరమేశ్వరుడు జగత్పిత. ఆయనే జగద్గురువు. అటువంటి ఆదిపురుషుని మనస్ఫూర్తిగా ఆరాధించడం
స్థితి కారుడైన శ్రీ హరి నామ సంకీర్తనంలో  తృప్తి పొందడం ఇతరులపైన ప్రాణికోటి పైన దయ కలిగి ఉండటం , సత్యాన్నే ఎల్లప్పుడూ మనసులో నిలుపుకోవడం మానవ జన్మకు సార్థకతను ఇచ్చే సత్వగుణాలు. అవి లేని వ్యక్తిని చూసి కన్న తల్లి కూడా దుఃఖించును. ఆ తల్లికి కడుపు చేటుగా తలపోయును.
తమ సంతానం ఉత్తమ జాతి వారసత్వంతో ఋజువర్తనులుగా సమాజంలో మనగలగలగితే వారి జన్మలూ ధన్యమే.
అన్ని అవగుణాలతో ఉన్న సంతానం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.
మనం మన పిల్లలను తీర్చి దిద్దడంలో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పే పద్యం.భక్తి దయ ఋజువర్తనం అనే మూడు జీవితానికి ఎంత ప్రాముఖ్యమో ఎఱుంగవలయును.
శైవ వైష్ణవ బేధం అసమంజసం అనేదీ ఆయన భావన. ఈ విబేధం వల్ల రెండు వందల యేండ్లు భారత ఆంధ్రీకరణ అటకెక్కింది. నన్నయ్య తరువాత ఆ పనికి ఎవరూ వెనువెంటనే పూనుకోపోవుటకు కారణం శైవ వైష్ణవ విబేధాలే. అందుకే హరిహరులిరువురి ప్రస్తావన పోతన చేయడం జరిగింది.
మిగిలిన ప్రార్థనా పద్యాలు అంటే 1.ఆదరమొప్ప మ్రొక్కిడుదు 2. ఆతత సేవ జేసెద 3. క్షోణి తలంబునన్ నుదురు సోకగ 4 హరికిం పట్టపు రాణి
కూడా గొప్ప పద్యాలే. కాకపోతే సీతారామ దర్శనం పద్యం బాగా తొందర పెడుతోంది. అందుకే ఒక లఘువు వేసాను.
(సశేషం)

పోతన పద్యాలు --- ఆణిముత్యాలు
(౧౧వ పద్యం)
సీ.
మెఱగు చెంగట నున్న మేఘంబు కైవడి
         నువిద చెంగట నుండ నొప్పువాడు
చంద్రమండల సుధాసారంబు పోలిక
          ముఖమున జిఱునవ్వు మొలచువాడు
వల్లీయుతతమాల వసుమతీజము భంగి
           బలు విల్లు మూపున బరగువాడు
నీలనగాగ్ర సన్నిహితభానుని భంగి
            ఘన కిరీటము దల గల్గువాడు
ఆ.వె.
పుండరీక యుగము బోలు కన్నుల వాడు
వెడద యురము వాడు విపులభద్ర
మూర్తి వాడు రాజ ముఖ్యుడొక్కరుడు నా
కన్నుగవకు నెదుర గాన బడియె.
సందర్భం:
పోతన గారు తన వేల పూర్వ జన్మల తపఃఫలంగా భగవత్కథాసుధాసారమైన భాగవతాన్ని ఆంధ్రీకరించ దలంచి ఒక పున్నమినాడు చంద్రగ్రహణ సమయమున నదికి పోయి క్రుంకులు సమర్పించి ఇసుకపఱ్ఱపై కూర్చుని పరమేశ్వరధ్యానం చేస్తున్నారు కొద్దిగా కళ్ళు మూసుకుని.
భావం:
మెఱుపుతీగ పక్కనున్న మేఘంవలె, స్త్రీ మూర్తి పక్కనుండగా ఒప్పువాడు,
చంద్రమండలం నుంచి స్రవించే అమృత ధారలా ముఖంలో చిఱునవ్వు చిందువాడు
గానుగచెట్టుకు అల్లుకున్న లతలాగ భుజాన విల్లు వేలాడిన వాడు
నీలగిరి చేరువలో నున్న సూర్యబింబం వలె తలపై కిరీటం కలవాడు
తెల్లతామరద్వయము వంటి కన్నులు గలవాడు
విసాలమైన వక్షస్థలం  , విస్తారమైన శుభలక్షణములు గల ప్రముఖుడైన రాజు నా కనుదోయి ఎదుట కనబడెను.
విశేషం:
మెఱుపు పక్కన మేఘమూ భార్య పక్కన మగాడు ఒబ్బిడిగా ఉండడం సహజం. భార్య పక్కన లేకపోతే ఎన్ని వేషాలైనా వేస్తే వేస్తారు మగవారు.
 ముఖంలో చిరుదరహాసం అమృతధారలా చల్లగా ఆహ్లాదంగా ఉంది.
భుజానికి వేలాడుతున్న చాపంపాదాల వఱకూ ఉందేమో అది చెట్టుకి అల్లుకున్న లతలా ఉంది.
రాముడు నీలమేఘశ్యాముడు. ఆయన తలపైన కెంపులూ పగడాలు పొదగబడ్డ కిరీటం ఉంది. అందుకే ఆయన నల్లటి కొండలమీది ఎఱ్ఱని సూర్యబింబంలా ఉన్నాడు. తెల్లతామరల వంటి కళ్ళు వెడల్పైన ఱొమ్ము నిర్మలమైన వర్ఛస్సుతో ఉన్న సీతా సమేత శ్రీ రామచంద్రులవారు ఆయన కనుల ఎదుట సాక్షాత్కరించారు.
ఆయన పరమేశ్వర ధ్యానం చేస్తున్నారు వీరశైవుడుగా.భవిష్యత్ కర్తవ్యానుకూలంగా నారాయణుడు కనిపించాడు.ఆయన ఎన్నోసార్లు పరమేశ్వరా అనే ప్రార్థించడం, శ్రీ మన్నారాయణుడు ప్రత్యక్షం కావడం భాగవతంలో చాలాసార్లు చూస్తాం. శివకేశవ బేధం కూడదు అని గ్రహించడం మనకు విధి. అంతకు మించిన భాగ్యం ఇంకేమి ఉంటుంది?
(సశేషం)


పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు
    (౧౨వ పద్యం )

కం.
పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట నే
పలికిన భవహర మగునట
బలికెద వేఱొండు గాథ పలుకగ నేలా?
భావం:
చెప్పేది భగవంతుని కథలు. చెప్పించు చున్నవాడు శ్రీ రామచంద్రమూర్తి. చెప్పినందువల్ల భవబంధ విముక్తి కలుగునట. మరి వేరే కథలెందుకు చెప్పాలి?

ఉత్కృష్టమైన రచనలన్నీ ఈ రకంగానే భగవంతుడు కలలో కనిపించి ఫలానా కావ్యం వ్రాయమని చెప్పడం , కవులు యథావిథిగా వ్రాయడం పరిపాటి.
ఆ రకమైన భగవత్కృప లేకుండా కావ్యాలు వెలువరించడం సులభమైన పనికాదు. నిజానికి ఆ భగవంతుడి గుఱించి చెప్పడం సృష్టికర్త బ్రహ్మకు గాని స్వయానా ఆ పరమేశ్వరునికైనా కష్టమే. అందుకే వినమ్రంగా పెద్దల వద్ద విన్నంత, తను చదివి తెలుసు కున్నంత, తను ఊహించుకోగలిగినంత మేఱకు చెప్పే ప్రయత్నం చేస్తానని పూనుకున్నాడు. అందుకే విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియ వచ్చినంత తేటబఱతు అన్నాడు. ఒకపక్క శ్రీ ధర వ్యాఖ్య మరోపక్క ఇతర కవులు వ్రాసిన కావ్యాలలోని తత్సంబంధ ఘట్టాలు చదువుకుని సమంజసమనుకున్న చోట మూలాన్ని అధిగమించి ఒకోచోట కుదించి ఔచిత్యానుకూలంగా ఆంధ్రీకరించడానికి దాదాపు ఇరవై సంవత్సరాలు పట్టింది.
(సశేషం   )


పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు
   (౧౩వ పద్యం.)
మ.
లలితస్కంధము కృష్ణమూలము శుకాలాపాభి రామంబు మం
జులతా శోభితమున్ సువర్ణసుమనస్సుజ్ఞేయమున్ సుందరో
జ్వల వృత్తంబు మహాఫలంబు. విమలవ్యాసాల వాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజ శ్రేయమై.
భావం: ఈ పద్యం ద్వ్యర్థి. అంటే రెండు రకాలుగా అర్థం వచ్చేది కాదు ని. ఒకటి కల్పవృక్ష పరంగాను మరోటి భాగవతార్థము గాను. రెండు విడివిడిగా చూద్దాం.
నాజూకుగా పెఱిగిన మాను/ బోదె కలిగి నల్లని వ్రేళ్ళతో చిలుకలు మున్నగు పక్షుల కిలకిలా రావములకు నిలయమై చక్కని లతలచే ఆవరింపబడినదై మనస్సును ఆకట్టుకునేటటువంటి రంగుల పూలతో కనిపించు చున్న అందంగా ఏపుగా గుండ్రంగా  పెఱిగిన మంచి లావు కలిగిన భగవత్ప్రసాదిత కల్ప తరువు  ఇలలో శుక పికాది మంచి పక్షులకు శ్రేయమమై వెలుగొందును.
అతిసుతి మెత్తని నుడికారముల బాటలో కృష్ణుని కథలే ప్రథానమైన శుకయోగీంద్రుల చే ప్రవచింపబడిన మనోహరమైన మాటలతో చక్కని  బంగారంలాంటి పదప్రయోగాలతో  అందమైన కథ కలిగి వ్యాసుల వారు వివరించినట్లుగా ఈ భాగవతమనే ఉద్గ్రంథము  భువిలో సజ్జన సద్విజ శ్రేయమును కూర్చునదిగా వెలయును.

పరీక్షిన్మహరాజుకు ఏడురోజులలో మోక్షానికి అర్హుడిని చేయటకు శుకయోగీంద్రుల సంకల్పం. అలాగే పోతన గారు కూడా ముక్తి కోసమే ఆంధ్రీకరణకు పూనుకున్నారు. ఆయనతోపాటు మనందరకీ కూడా కలగాలని ఆ బాటలో మనమూ నడవడం కోసం మంత్రముగ్ధంగా ఆంధ్రీకరించెను.
అందుకే ఇప్పటికీ భగవత సప్తాహం చేయడమే వాడుకా వేడుకా కూడా.
(  సశేషం )



పోతన పద్యాలు ----- ఆణిముత్యాలు
  ( ౧౪ వపద్యం)
మ.
వరగోవింద కథాసుధారస మహావర్షోరు ధారా పరం
పరలం గాక బుధేంద్రచంద్ర ! యితరోపాయానురక్తిన్  బ్రవి
స్తర దుర్దాంత దురంత దుస్సహజనుస్సంభావితానేక దు
స్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలంబారునే.
భావం:
ఓ గుణగరిష్ఠులలో చంద్రునివంటి వాడా! ఎంతో విస్తరించిన, అణచుటకు వీలుపడని, అనంతమైన, సహింపరానిది, లోతైనది, కఠినమైనది, గతజన్మల పాప సంచయము అనునది కాలుచున్న కాఱ్చిచ్చు వంటిది. దానిని ఆర్పివేయుటకు విష్ణుకథలు అనే అమృతవర్షపు ఎడతెరిపపి లేని ధారల వలన వీలగును కాని మరో ఉపాయంచేత సాధ్యపడదు.
సందర్భం:
భాగవత కథా ప్రారంభం అయింది. నైమిశారణ్యం లో శౌనకాది మునులందరూ పౌరాణిక శ్రేష్టుడైన సూతుని వద్దకు చేరి వేదవేదాంతాలు శాస్త్రాలు ఎన్ని తెలుసుకున్నా మాకు తనివి తీరడం లేదు. పరమాత్మ స్వరూపమైన ఆ కృష్ణుని కథలు వినాలని కుతూహలంగా ఉంది. కనుక మాకు కృష్ణ కథలు వినిపించుము అని అడిగే సందర్భంలోనిది.
విశేషం: మానవ జన్మ అందునా పురుష జన్మ అనేక జన్మల అనంతరం లభిస్తుంది. అటువంటి ఈ జన్మలో పరమాత్మ సన్నిధానానికి మనస్సును చేర్చుకోవడం పరమోత్కృష్టము. దానికి ఆలంబన నవ విధ మార్గాలు. అందులో భక్తిమార్గము చాలా ప్రధానమైనది.
గతజన్మలలో మూటగట్టుకున్న పాపం ఎలాంటిదంటే ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహ ..దుస్తర గంభీర కఠోర మైనది. అది ఒక కాఱ్చిచ్చు. దానినుంచి ఉపశమనం పొందడానికి ఉన్న ఏకైక మార్గం శ్రీ హరి కథాశ్రవణమే. ఆ కథలనబడే అమృత వర్షపుధారలచేత మాత్రమే ఈ పాపాల మంట చల్లార గలదు.
ఈ పద్యంలో ఏదో తెలియని మైకం ఉంది. ఎన్నిసార్లు చదివినా తనివితీరదు. మా బడిలో అందరికీ కంఠతా వచ్చిన అందరికీ నచ్చిన పద్యం ఇది. ఎల్.కే.జీ. పిల్లలకూ ఈ పద్యమే ఇష్టం. అమృత బిందువులాంటిది యీ పద్యం. మీరూ ప్రయత్నించండి.
(సశేషం)

పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు
(౧౫వ పద్యం)
ఉ.
ధాతవు భారతశ్రుతివిధాతవు వేదపదార్థజాత వి
జ్ఞాతవు గామముఖ్యరిపుషట్కవిజేతవు బ్రహ్మతత్వ ని
ర్ణేతవు యోగినేతవు వినేతవు నీవు చలించి చెల్లరే
కాతరు కైవడిన్ వగవ గారణమేమి పరాశరాత్మజా.

సందర్భం: వ్యాకుల చిత్తుడై యున్న వ్యాసునిచూచిపోదమని నారదుడు వచ్చెను.
భావం:
ఓ పరాశర పుత్రా! నీవే బ్రహ్మవు. భారతమనే పంచమవేదమును సృష్టించిన వాడవు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే అరిషడ్వర్గములను జయించిన వాడవు. బ్రహ్మ జ్ఞానము యొక్క తత్వమును నిర్ణయించిన వాడవు. మహా యోగివి. జితేంద్రియుడవు.అటువంటి నీవు ఒక దీనుని వలె దుఃఖించుట తగునా? ( తగదు అని భావం)
పురాణాలు వేద విభజన మహాభారతం ఇన్ని చెప్పినా వ్యాసులవారి మనసులో ఏదో అసంతృప్తి. దానికి నారదుడు విష్ణుకథలను వివరంగా చెప్పకపోవడమే నీ అసంతృప్తికి కారణం కనుక భగవత్కథలను భాగవతం అనే పేరుతో ఒక గ్రంథం వెలయించమని ఉచిత సలహా ఇస్తాడు. ఆయన తదనుగుణంగా ఆలోచించి తన కుమారుడూ వైరాగి అయిన శుకమహర్షికి భాగవతం చెప్పెను. ఏదో క్లుప్తంగా చెప్పాను కానీ వివరంగా నీవు ప్రబోధించు నాయనా అని కూడా చెప్పడం చేత మొట్ట మొదటిసారిగా భాగవతాన్ని సప్తాహం గా ప్రవచించిన మహానుభావుడు శుక యోగి. ఆయనకి ఒంటిమీద గుడ్డ ఎలా ఉండదో తనుపు కూడా అలాగనే ఉండదు. ఒక చోట కాలు నిలువదు. కానీ పరీక్షిత్తు కు మోక్షం సమకూర్చిన ఘనుడు. వ్యాసుల వారి "తనివి తీరలేదే" అన్న వ్యథ మనకు భాగవతంగా లభించింది.
(సశేషం)


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు
(౧౬వ పద్యం)
మ.
ఆపశబ్దంబుల గూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వ పా
ప పరిత్యాగము సేయుగావున హరిన్ భావించుచున్ బాడుచున్
జపముల్ సేయుచు వీనులన్ వినుచు నశ్రాంతంబు గీర్తింపుచున్
దపసుల్ సాధులు ధన్యులౌదురు గదా తత్త్వజ్ఞ! చింతింపుమా.
భావం:
అక్కడక్కడా చెడుమాటలు ఒకటిరెండు దొర్లినా ఆ విష్ణుకథల ఆలాపన అన్ని పాపాలను హరించగలదు. కనుక ఆ విష్ణుమూర్తిని తలంచుకుంటూ అతని గురించి పాడుకుంటూ జపం చేసుకుంటూ అవే వింటూ ఎల్లప్పుడూ ఆ హరినామస్మరణతో సాధువులైన తపస్సంపన్నులు ధన్యులు అగుచున్నారు కదా. ఆలోచించు మహర్షీ.
సందర్భం:
వ్యాకుల చిత్తుడైన. వ్యాసునికి నారదుడు కర్తవ్య బోధ చేయుట.
విశేషం:
చాలా మంది అనాలోచితంగా చెడుమాటలు పలుకుతూ ఉంటారు. అలా తప్పుడు మాటలు వస్తాయనే భయంతో భగవంతుని కథలు చెప్పడానికి గాని పాటలు పాడటానికి గానీ జంకుతారు. సాధువులు సన్యాసులు ఎల్లప్పుడూ హరినామస్మరణ చేసి సంతృప్తి చెందడం లేదా? అలాగని అపశబ్దాలు వారు పలుకరని కాదు.
నిజంగా వ్యాసునికి చెప్పిన హితబోధ కాదు. మనందరికీ చెప్పినదే. లేకపోతే వేదవ్యాసుల వారి నోటంట అపశబ్దాలు వస్తాయా? అంచేత ఉన్నంతలో ప్రతి మనిషీ ప్రయత్నించవలసినది ఇదీ అని నారదుని మాటగా పోతన మనకు చెప్పిన సూక్తి.
(సశేషం)


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు
   (౧౭ వ పద్యం)
మ.
అపచారంబులు లేక నిత్యపరిచర్యాభక్తి యుక్తుండనై
చపలత్వంబును మాని నే గొలువగా సంప్రీతులై వారు ని
ష్కపటత్వంబున దీన వత్సలతతో గారుణ్య సంయుక్తులై
యుపదేశించిరి నాకు నీశ్వర రహస్యోదార సర్వస్వమున్.
భావం:
ఏ అపచారం చేయకుండా శ్రద్ధగా భక్తితో  చాతుర్మాస్యాల కాలం వారికి నిత్య పరిచర్యలను అకుంఠిత దీక్షతో చేయగా ఆ యోగి పుంగవులు చాలా సంతసించిన వారై  నా మీద పుత్ర వాత్సల్యం తో దయగలవారై ఏ కపటం లేకుండా నాకు పరమేశ్వర రహస్య తత్వమును ఉపదేశించారు.
సందర్భం:
వ్యాసుల వారికి నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతమును తెలుపు సందర్భం.
పూర్వ జన్మలో నారదుడు వేదాధ్యయన సదాచార సంపన్నుల ఇంట పనిమనిషి కి కొడుకు. తల్లి వెనకాలే వెళ్ళి చీర కొంగు పట్టుకుని నిలుచుండేవాడు. ఒకసారి చాతుర్మాస్యాల సమయంలో కొందరు యోగులు మార్గస్థులై ఆ వూరిలో బస చేసారు. వర్ష శరదృతువులు నాలుగు నెలలు ఒకేచోట ఉండే దీక్షని చాతుర్మాస్య దీక్ష అంటారు. ఆ నాలుగు నెలలు వారికి కావలసిన సపర్యలు చేయుటకు ఈ బాలుని నియమించారు. అతడు వారి మడి ఆచారములను భంగపరచకుండా భక్తి శ్రద్ధలతో చెప్పినదే తడవుగా నిశ్చలమతియై సేవలు చేసాడు. దానికి వారు సంతోషించి ఈశ్వర విజ్ఞానం బోధించారు.
ఆ నాలుగు నెలల కాలంలో వారు కృష్ణ చరిత్రలు చదువుతూ పాడుతూ ఉంటే అవి నాకెంతో వీనులవిందుగా తోచేవి. అప్పుడు నేను కూడా ప్రారంభించితి విష్ణు సేవ కితర ప్రారంభ దూరండనై.
విశేషం.
గురుశుశౄష ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే గురువులు అంత సంతోష పడతారు. ఎంత సంతోష పడితే అంత జ్ఞానం ప్రబోధిస్తారు. గురువులకు అనేకమంది శిష్యులుంటారు. కాని అందులో అంకితభావంతో సేవచేసే వానిని లేదా విద్య మీద సునిశిత దృష్టి కలిగిన వానిని ప్రత్యేకమైన వాత్సల్యం తో చూస్తారు. ఉదా:
ద్రోణాచార్య వద్ద కౌరవ పాండవులందరూ శిష్యులే. కాని తన కొడుకు కన్న ఎక్కువగా అభిమానించినది అర్జనుడినే. కారణం అతనికి విద్యమీద ఉన్న తదేక దృష్టి. ఆదిశంకరుల శిష్యులలో తోటకుడు కాస్త మందమతి. గురువుగారి సేవే పరమావధిగా మెలిగేవాడు. ఒకసారి శిష్యులందరూ గురువుని ఏదో అడుగుతారు. అందుకు శంకరులు కొంచెం సేపు ఆగండి తోటకుడు కూడా వచ్చాక చెప్తానన్నారు. దానికి ఆ శిష్యులు ఆ మందమతి వచ్చినా ప్రయోజనం ఏమిటి? ఏమైనా నేర్వగలడా అని గేలి చేస్తారు. ఇంతలో తోటకుడు వస్తాడు. శంకరులు తోటకుని కళ్ళలోకి సూటిగా చూస్తారు. అప్పటికప్పుడు తోటకుడు చెప్పినది తోటకాష్టకం.
విదితాఖిల శాస్త్ర సుధాజలధే
మహితోపనిషధ్ కథితార్థనిధే
హృదయే కలయే విమలం చరణం
భవశంకర దేశికమే శరణం||
అంటూ చెప్పేసరికి విస్తుపోయారందరూ. ఆ గురువుల దృష్టి అతడిని పునీతుణ్ణి చేసింది.
శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పలేదా?
భక్తోసి మే సఖాచేతి
రహస్యం హ్యేత దుత్తమం. అని.
అంచేత గురువుల మనసు గెలిచిన వారికి మహా రహస్యమయ విజ్ఞానం పంచుతారు. అంతేకాని ప్రతివారికీ అంతా చెప్పేయరు.
దీనిని బట్టి గురువు పట్ల మనకుండవలసిన శ్రద్ధాభక్తులు ఎంతగా ఉండాలో తెలుసుకోండి.
(సశేషం)



పోతన పద్యాలు ---  ఆణిముత్యాలు
 (౧౮ వ పద్యం)
చ.
వెఱచినవాని దైన్యమున వేదురు నొందినవాని నిద్ర మై
మఱచినవాని సౌఖ్యముగ మద్యము ద్రావినవాని భగ్నుడై
పఱచినవాని సాధు జడభావము వానిని గావుమంచు వా
చఱచినవాని గామినుల జంపుట ధర్మము గాదు ఫల్గునా.
భావం:
ఓ అర్జునా! భయపడిన వానిని దీనంగా ఉండి మతి పోగొట్టుకున్న వానిని భగ్నహృదయంతో అల్లాడే వానిని సాధుగుణముల వానిని మందబుద్ధి వానిని శరణు అని వేడుకున్న వానిని  స్త్రీ లను చంపుట ధర్మము గాదు.
సందర్భం:
పుత్రఘాతి యైన అశ్వత్థామను అర్జనుడు రథానికి బంధించి ద్రౌపది వద్దకు తీసుకు వచ్చినప్పుడు ద్రౌపది తన మనసులోని మాటను చెప్పే సందర్భం లోనిది.
విశేషం:
పూర్వం ధర్మ యుద్ధాలు జరిగేవి. సూర్యోదయం తరువాత రణభేరి మ్రోగించి యుద్ధం ఆరంభించేవారు. అలాగే సూర్యాస్తమయం తరువాత, ఆరోజు ఎక్కువ ఏ పక్షం నష్టపోయిందో ఆ పక్షం ఎప్పుడంటే అప్పుడు యుద్ధాన్ని ఆ రోజుకు ముగించేవారు.
సాధారణ జన జీవనంలో కూడా ప్రతివారి మీద కత్తులు దూసి హత్యలు చేయడం ఒప్పని సమాజం అది. అంచేతనే ద్రౌపది ప్రాణభయంతో పారి పోతున్నవానిని చంపడం అధర్మం అని హెచ్చరిస్తుంది. అశ్వత్థామను బంధించిన త్రాళ్ళు విప్పి నిలబెడతారు. తలదించుకుని ఉంటాడు ద్రౌణి.అతనా గురు పుత్రుడు. అతనిని చంపడం ధర్మం కాదు. అలాగే మందుకొట్టి మత్తులో ఉన్నవానిని నిద్రలో ఉన్న వానిని చంపకూడదు అని ధర్మశాస్త్రము చెబుతోంది.
(సశేషం)



పోతన పద్యాలు --- ఆణిముత్యాలు
  (౧౯ వ పద్యం)
మ.
పరగన్ మా మగవార లందఱును మున్ బాణప్రయోగోప సం
హరణాధ్యాయుద్ధ విద్య లన్నియును ద్రోణాచార్యుచే నభ్యసిం
చిరి పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశమున్
కరుణాసంగము లేక శిష్యసుతులన్ ఖండింపగా బాడియే!
భావం:
ఓ గురు కుమారా! మా మగవారు ( భర్తలు) అందరూ కూడా మీ తండ్రిగారైన ద్రోణాచార్యుల వద్దనే సకల బాణ ప్రయోగ ఉపసంహారాలు నేర్చుకున్నారు. నువ్వేమో పుత్రుని రూపంలో ఉన్న ఆ ద్రోణుడవు. కనీసం శిష్యుల సంతానం అనే కనికరం లేకుండా ఎలా చంపేసావయ్యా? ఇది నీకు తగునా?
సందర్భం: అశ్వత్థామను చూసిన ద్రౌపది ఆయనకు నమస్కరించి  ఆయన ముఖం వైపు చూసి పలికిన మాటలలోనిది.
విశేషం:
గురువు గారి మీద భక్తి గౌరవం ఎంత మఖ్యమో గురువుగారి కుటుంబం పైన కూడా అంత గౌరవం ఉండాలి. అశ్వత్థామను చూడగానే ఆమెకు గురువు గారే గుర్తుకొచ్చారు. అందుకే తన కొడుకులను చంపినా సరే గురువుగారి అబ్బాయిగా ఆతనికి నమస్కరించింది.
గురుకులంలో ఎప్పుడైనా గురువుగారు అందుబాటులో లేకుంటే గురుపత్నిగాని గురువు గారబ్బాయి కాని గురువు గారు చేసే పనిని పూర్తి చేస్తారు. అంచేత శిష్యులకు గురు కుమారుడిపై కూడా అంత గౌరవం ఉంటుంది. మరి ఆ గురు పుత్రునికీ అంతటి అనురాగం ఉండాలి కదా.
మరో ఉదంతం చూద్దాం. ప్రహ్లాద చరిత్రలో.
హిరణ్యకశిపుడు తనయుడికి ధర్మశాస్త్రాలు కావ్యాలు నేర్పించమని కులగురువైన శుక్రాచార్యులకు అప్పగిస్తాడు.
"చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ" అని చెప్పి.
చదువు ఎప్పుడూ ఆర్యుల వద్దనే నేర్వాలి. మరి ఆ గురువుగారు వారి కుమారులైన చండ అమార్కులకు ఆ పని అప్పజెప్పారు. ఈ బుడతడు గురువులు చెప్పినదొకటైతే తను నేర్చుకున్నది మరోటి.అయినా గురు పుత్రులను విశ్వసించుతాడు హిరణ్య కశిపుడు.
భారతంలో ఉదంకోపాఖ్యానం లో ఉదంకుణ్ణి గురుపత్ని పౌష్యమహరాజు భార్య నుంచి కుండలాలు అడిగి తెమ్మంటుంది. ఉదంకుడు ఎన్నో శ్రమలకు ఓర్చి ఆ పని చేస్తాడు. గురువు గారి కుటుంబం అందరి మీద అంత గౌరవం శిష్యులకు ఉండాలి అని సూక్తి.
(సశేషం)


పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు
  (౨౦ వ పద్యం)
శా.
ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు  కిం
చిద్ద్రోహంబును నీకు జేయరు బలోత్సేకంబుతో జీకటిన్
భద్రాకారుల జిన్నిపాపల రణ ప్రౌఢక్రియా హీనులన్
నిద్రాసక్తుల సంహరింప నకటా ! నీ చేతు లెట్లాడెనో!
భావం:
అయ్యా! నీచే చంపబడ్డ నా బిడ్డలు ఏనాడు నీ మీదకు దుడుకుగా దూకలేదే. పోనీ యుద్ధభూమిలో ఆయుధాలు ధరించి నిలుచో లేదే. నీకు ఏ రకంగానూ అపకారం చేయలేదే. నీకు బలం ఉందని ఉద్రేకంతో మంచి రూప సంపన్నులైన చిన్న పిల్లలను సరిగా యుద్ధ నైపుణ్యం లేనివారిని చీకటిలో నిద్రావస్థలో ఉన్నవారిని చంపడానికి నీకు చేతు లెలా వచ్చాయయ్యా!
సందర్భం:
అవనత వదనుడైన గురు పుత్రుని ద్రౌపతి ప్రశ్నించు సందర్భం లోనిది.
విశేషం:
అత్త మీది కోపం దుత్త మీద చూపించడ మంటే ఇదే మరి.
శిష్యులు అనిగాని వారి సంతానం అనిగాని వారిపై వాత్సల్యం గాని నీకు లేవాయె. నా పిల్లలు చిన్నవారు. ఆయుధాలు బట్టి యుద్ధం చేసే నేర్పు ఇంకా నేర్వలేదు. అటువంటి సాధువులను అదీ చీకటిలో నిద్రించిన వారిని చంపడం ధర్మమేనా? ధర్మాన్ని బోధించ వలసిన వారే ధర్మం తప్పితే ఎలాగ?
ద్రౌపదిది ధర్మనిష్ఠ. గురుపుత్రుడనే గౌరవంతో నమస్కరించింది. ధర్మం తప్పినందుకు నిలదీసింది. అంతేకాని దెబ్బకు దెబ్బ చెల్లు అనలేదు. తను మాత్రం ధర్మంగానే నడచుకుంది. "బ్రాహ్మణో నహంతవ్య" అని వేద ప్రమాణం. అపకారికి ఉపకారం చేసే నేర్పరి తనం.
ఆ ధర్మనిష్ఠయే పాండవులకు ఆసాంతం శ్రీ రామ రక్షగా నిలచింది.
ధర్మాన్ని ఎలాంటి పరిస్థితి లోనూ విడువరాదు అనే సందేశం మన మనస్సులకు అందితే చాలు.
(సశేషం)


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు
   (౨౧ వ పద్యం)
ఉ.
ద్రోణునితో శిఖింబడక ద్రోణ కుటుంబిని యున్నదింట న
క్షీణ తనూజ వివశీకృతనై విలపించు భంగి నీ
ద్రౌణి తరల్చి తెచ్చుటకు దైన్యము నొందుచు నెంత పొక్కునో
ప్రాణ విముక్తుడైన నతి పాపము బ్రాహ్మణహింస మానరే.
భావం:
ద్రోణునితో సహగమనం చేయకుండా ఆయన పత్ని ఇంటనే ఉన్నారు. పిల్లలు పోయారని తరుగని దుఃఖంతో బాధపడుతున్న నాలాగే ఈ అశ్వత్థామను ఇచ్చటికి బంధించి తీసుకు వచ్చినట్లు తెలిస్తే ఆ గురుపత్ని ఎంతగా దుఃఖించునో కదా! అతని ప్రాణం కాని పోయిందా అది మహా పాపం. బ్రాహ్మణ హింస చేయరాదు.
విశేషం:
సతీ సహగమనం అనేది అప్పటి ఆచారం. కాని గురుపత్ని అయిన కృపి తద్భిన్నంగా ఇంట్లోనే ఉంది. అంటే అప్పుడు కూడా సిద్ధాంత రద్ధాంతం వలనో మరో రకంగానో సంఘ కట్టుబాట్లను వ్యతిరేకించడం అనేది అప్పుడూ ఉంది.
పరేంగితం ఒక పక్క ధర్మం మరో పక్క మూర్తీభవింఛం ఈమె. తన బిడ్డలు చనిపోతే తను ఎంతగా బాధపడుతోందో అలానే ఈతనిని బంధించి తీసుకు వచ్చినట్లు తెలిస్తే ఆమె ఎంతగానో దుఃఖించును.
అసలే బాపడు ప్రాణం గటుక్కు మంటే. అది మహాపాపం.
" బ్రాహ్మణో న హంతవ్య" అన్న వేదవాక్కు శిరోధార్యం. అందుచేత ఈ పుత్రఘాతిని విడిచి పెట్టేయండి అని శెలవిచ్చింది.
యుద్ధానంతరం విజయం పొందిన పక్షంగా పరిపాలించ వలసిన వారు ధర్మాన్ని ఆచరించి మార్గదర్శకులుగా నిలవాలి గాని వ్యక్తిగత కార్పణ్యాలకు తావులేదు.
పాలకులకు ఉండవలసిన ధర్మ నిబద్ధత అటువంటిది.
మన సనాతన ధర్మం ప్రకారం
"అకృత్యం నైవ కర్తవ్యం ప్రాణత్యాగేప్యుపస్తితే
 నచకృత్యం పరిత్యాజ్యం ఏష ధర్మో సనాతనః-"

(సశేషం)


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు
(౨౨ వ పద్యం)
ఉ.
కోపముతోడ నీవు దధికుంభము భిన్నము సేయుచున్నచో
గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన భాష్ప తోయ ధా
రా పరిపూర్ణ వక్త్రము గరంబుల బ్రాముచు వెచ్చనూర్చచున్
బాపడవై చరించుట కృపాపర నా మది చోద్యమయ్యెడిన్.
భావం:
ఓ దయామయా! ఒకరోజున నీవు కోపగించి ఉట్టిలో ఉన్న పెరుగు కుండను పగుల గొడుతూ ఉంటే మీ అమ్మ యశోద తాడుతో నిన్ను దూరంగా కట్టేసింది. అప్పుడు నీ కాటుక కళ్ళవెంట కన్నీళ్లు ధారలా జాలువారుతుంటే ఏడుస్తూ కళ్ళు నులుము కుంటూ చిన్న పిల్లాడిలా ముఖం అంతా పాముకున్నావే! అది తలచుకుంటే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది.
విశేషం:
తను విష్ణువు అయిఉండీ కూడా పాలు పెరుగులు దొంగిలించడం, పట్టబడితే తల్లి దండించడం, కంట తడి పెట్టడం అన్నీ ఆశ్చర్యంగా అనిపించేవే. ఆరన చిన్ని బాలునిగా నటించిడో జీవించాడో చెప్పగలమా!
(సశేషం)


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు
(౨౩ వ పద్యం)
శా.
శ్రీ కృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగార రత్నాకరా!
లోక ద్రోహి నరేంద్రవంశ దహనా! లోకేశ్వరా! దేవతా
నీక బ్రాహ్మణ గో గణార్తి హరణా! నిర్వాణ సంధాయకా!
నీకున్ మ్రొక్కెద ద్రుంపవే భవలతల్ నిత్యాను కంపానిధీ.
భావం:
ఓ కృష్ణా! యాదవ వంశ తిలకమా! అర్జనుని స్నేహితుడా! శృంగార రసమునకు సముద్రము వంటివాడా! లోక కంటకులైన రాజులను సంహరించువాడా! దేవతలకు ద్విజులకూ గోవులకూ కలిగే బాధలను తొలగించువాడా! మోక్షాన్ని ప్రసాదించ గలవాడా! శాశ్వతమైన దయకు నిలయుడా! నీకు మ్రొక్కెదనయ్యా ఈ భవబంధాలను తెంచివేయుము.
సందర్భం:
కృష్ణుని ప్రార్థిస్తూ కుంతి ఈ భవబంధాలకు అతీతంగా మనస్సు పరమాత్మపై ఉండేలా చూడమని కుంతి వేడుకునే సందర్భం లోనిది.
విశేషం:
శ్రీ కృష్ణ చరిత్రనంతటినీ ఒకే పద్యంలో ఇమడ్చిన ఘనత పోతనది.
అతను యదువంశంలో జన్మించాడు అర్జనుడిని స్నేహితుడిగా భావించాడు రాసలీలలు చూపిన శృంగాలప్రియుడు దుష్ట శిక్షణ చేసిన లోకేశ్వరుడు దేవతల, బ్రిహ్మణుల, గోవుల బాధలను తొలగించినవాడు, మోక్షాన్ని ఇవ్వగలవాడు ఆ శ్రీ కృష్ణుడు. ఆయన చరిత్ర చదువుకుంటూ పాడుకుంటూ భవబంధ విముక్తి పొందడం ఆనేది అందరికీ సూచితం.
(సశేషం)

పోతన పద్యాలు --- ఆణిముత్యాలు
(౨౪ వ పద్యం)
ఉ.
వాయు వశంబులై యెగసి వారిధరంబులు మింట గూడుచున్
బాయుచు నుండు కైవడి ప్రపంచము సర్వము గాలతంత్రమై
పాయుచు గూడుచుండు నొకభంగి జరింపదు కాల మన్నియుం
జేయుచునుండు గాలము విచిత్రము దుస్తర మెట్టివారికిన్.
భావం:
ఆకశాన గాలివాటాన్ని అనుసరించి మబ్బులు కలుస్తూ విడిపోతూ ఉంటాయి. అలాగే ప్రపంచం సమస్తమూ కాలానికి లోబడి విడిపోతూ కలుస్తూ ఉంటుందిగాని ఒకేరకంగా ఎల్లప్పుడూ ఉండదు. కాలమే అన్నిటినీ చేయించేది, చాలా చిత్రమైనది మరియూ చాలా కష్టమైనది కూడా.
సందర్భం:
ధర్మరాజాదులు అంపశయ్య మీదనున్న భీష్ముని చూచుటకు వెళ్ళినప్పుడు భీష్ముడు యుధిష్టరునితో అన్న మాటల లోనిది.
విశేషం:
కాలం అనేది కాలుడి అధీనంలో ఉంటుంది. అది ఎవరికోసం ఆగేదీ కాదు, ఆపగలిగేదీ కాదు. ప్రాణికోటి సమస్తాన్ని శాసించేది కాలమే. అదును పదును కుదిరితే ఆరుగాలమూ ఆనందమేనట. అదును అంటే కాలమే.
రాజే కింకరుడగు, కింకరుడే రాజగు కాలానుగుణ్యంబుగా. ఇది మనందరికీ తెలిసిందే. ఈ కలయికలూ విడివడుటలూ నడిపించేది కాలం. ఎలాగంటే ఆకాశంలో మేఘాలు సాగిపోతూ ఉంటాయి. కొన్ని కలిసి పోతాయి. మరికొన్ని విడిపోతూ ఉంటాయి. వీటన్నింటికీ మూలమైనది కాలము. దాని మహిమ చేతనే బంధాలు అనుబంధాలు ఏర్పడటం ముక్కలవడం జరుగుతుంది.అందుకే సనాతన ధర్మంలో కాలాయనమః అని కాలానికి నమస్కరించమని చెప్పబడింది.
(సశేషం)



పోతన పద్యాలు --- ఆణిముత్యాలు
   (౨౫ వ పద్యం)
మ.
త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప బ్రాభాత నీ
రజబంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాడు మది నావేశించు నెల్లప్పుడున్.
భావం:
ముల్లోకాలకూ మోహనమైన నీలమేఘ శ్యామ రూపం ప్రకాశించుచుండగా ఉదయ భానుని కాంచన వర్ణపు వస్త్రము భుజముపై కాంతులీనుచుండగా గాలికి  కదలాడుతున్న నల్లని ముంగురులతో కూడిన పద్మము వంటి మోముతో  మా అర్జనుడి దగ్గరున్న చూడ చక్కని ఆ అందగాడు నా మనస్సులో ఎల్లప్పుడూ కదలాడుచుండును.
సందర్భం:
అంపశయ్య పైనుండి భీష్ముడు ధర్మరాజుకు అనేక రకములైన ధర్మాలని వివరించాక ఉత్తరాయణం ప్రవేశించిందని ఇక తను తనువును చాలించే సమయం ఆసన్నమైందని తలచి మనస్సును కృష్ణునిపై కేంద్రీకరించి కృష్ణుని స్తుతించే ఘట్టంలోనిది.
విశేషం:
ఆయనది నీల మేఘశ్యామ వర్ణంతో మెఱిసిపోయే రూపం. అది ఎంత అపురూపమో! ముల్లోకాలనూ మోహింప జేయగలదు. బంగారు రంగు ఉత్తరీయంతో పిల్లగాలికి నల్లని ముంగురులు ముఖం మీద అటూ ఇటూ కదులు తుంటే ఎంతటి వారికైనా మరోసారి చూడాలనిపిస్తుంది. గోపికలు కృష్ణుడు కనిపించక వాపోయినప్పుడు "నల్లనివాడు పద్మనయనమ్ముల వాడు" అంటూ తలచుకోలేదూ.
అలాగే భీష్ముడు కూడా యుద్ధంలో అర్జుని రథం నొగల మీదనున్న కృష్ణుని పదేపదే తలచుకుంటాడు.
శ్రీ హరి అన్ని అవతారలలోనూ కృష్ణావతారము అందరినీ అలరించింది. పశుల కాపరులతో చల్దులు తినడం, వెన్నల దొంగగా ఆగిడీలు చేస్తూ యాదవ కులస్త్రీలకు కాలక్షేపంగా గోపికలకు ఆరాధ్య ప్రియుడై పాండవులకు కుడిభుజమై రాజనీతిజ్ఞుడై అన్ని వయసుల వారినీ అలరించడం చేత కృష్ణావతారం అన్ని వయసుల వారికీ చేరువైంది.
(సశేషం)

Saturday, July 11, 2020

ఉషోదయం

    ఉషోదయం

వినువీథులలో స్వేచ్ఛా విహంగమై
మిన్ సరోవరములో వరలు రాయంచనై
కనుకొలకులలో జాలువారు ఆనందబిందువై
 నడిసంద్రపు అలజడిలో ఉత్తుంగ తరంగమై
విహరించాలనీ నడయాడాలనీ
ఎన్నెన్నో అత్యాశలు ఏవేవో తీరని కలలు
ఒంటరి మనసుకు ఆనందాన్నీ ఆహ్లాదాన్నీ
పంచి యిచ్చే మరీచికలూ నీహారికలు
వ్యతిరేక పవనాల వాకిలిలో
వ్యసనాల కవనాల లోగిలిలో
క్రొక్కారు వూహలే క్రొంజివురు ఆశలే
నిషద్వరీ పరిష్వంగంలో నవోదయం
నిరంతర నిస్పృహావేశాలలో ఉషోదయం.

Tuesday, July 7, 2020


శా.
రాకన్మానవు క్షీణ పక్షములు యారాకా కళావంతుకున్
లేకన్పోవునె వృద్ధి సంతసము లేలీలన్ సినీవాలికిన్
పోకన్మానవు రాజ్యసంపదలు సంపూర్ణంబుగా దుర్దశన్
కాకన్పోవునె రాజె కింకరుడు యౌ కాలానుగుణ్యంబుగా.

రాకన్మావు కష్టనష్టములు యే రాజన్యు కైనన్ విధిన్
లేకన్పోవునె మాన్యమోత్తమపు హృల్లేఖ్యార్థ సన్మానముల్
కాకన్పోవునె నిన్నమొన్నటి శ్రమల్ కామ్యార్థ సంప్రీతులున్
పోకన్నుండునె దుర్దశా సమయముల్ పోనాడగా నేలనో్

ఆశావ్యాహృతి యొక్కటే బ్రతుకుపై నాసాంతంబు విశ్వాసమున్
లేశంబైనను గూర్చు పెన్నిధి కపాలీ సన్నిధానంబుగా
పాశాబంధ విముక్తికై తలుపవే బాధావ్యధాగారమై
రాశీభూతపు పాపసంచయము వైరాగ్యమ్ము జూపింపదే.

Friday, July 3, 2020

   సర్వే జనాః సుఖినో భవంతు!
ఊబిలో దున్నలా గిజగిజ లాడుతోంది లోకం
కంటికి కనిపించని కరోనాతో కుస్తీ పడుతూ లేస్తూ
కుడితిలో పడ్డ ఎలుకలా విలవిల లాడుతోంది ప్రపంచం
వైద్య కోవిదులకే అంతుపట్టని కోవిద్ పంతొమ్మిదితో
దేశదేశాల ఆర్థిక రథం యిరుసును విరిచిన కరోనా
లక్షల కొద్దీ మరణాలు వాడవాడలా హాహాకారాలు
అంతు చిక్కని అంటురోగం అగమ్యగోచరం మార్గాంతరం
ఆకాశంలో కనిపించీ కనిపించని అరుంధతీ నక్షత్రంలా
మిణుకు మిణుకు మంటూ ఏదో తెలియని ఓ ఆశ
త్వరలో విరుగుడు మందు రాకుండా పోతుందా అని
ఏన్నాళ్ళకు మరలా మునుపటి జన జీవనగమనం
మరలా ఎన్నాళ్ళకు ఉరుకుల పరుగుల జీవితం
ఇంకా ఎన్నాళ్ళకు అందరికీ చేతినిండా పని దొరికేనో
కంటిమొయ్యా నిద్ర కడుపు నిండా బువ్వా కలిగేనో
మరో నవోదయం మరో నవజీవన సూర్యోదయం
త్వరలోనే ఆవిష్కృత మౌతుందని కోటి ఆశలతో
ముక్కోటి దేవతలకూ ప్రణుతి జేస్తూ ప్రణతులిడుతూ
వేడుకుందాం జీవకోటి శ్రేయస్సును కోరుకుందాం
సర్వే జనాః సుజనో భవంతు సుఖినో చ భవంతు.


Wednesday, July 1, 2020

కం.
తెలికాగితమీ జీవిత
ము లిఖించుట నీదు ప్రజ్ఞ మున్నుడి నీయన్
తలిదండ్రులు గురు లాపై
సలహా లీయగ లిఖింప సాధ్యము యనెదన్.

అనుభవమే మలి గురువగు
తన సాధనయే  గెలుపుకు తలవాకిలియౌ
మనగలుగుట ముఖ్య మగుచు
ఘన జీవన కావ్య మొకటి కల్పించ వలెన్.

ఒడిదుడుకులు తప్పవు యే
బడి చదువులును కొఱగాక భయమగు బ్రతుకే
తడబడక విడక సాగిన
వడిగా విడిగా కలిగెడి భాగ్యమ దెంతో.

మంచి చెడులుండు గాని యే
వంచన చేయక మెలగిన ప్రాభవ మిదిగో
కాంచ మనుచు యనుభవముల
పంచుటె గ్రంథమగును యిహపరమౌ నపుడే.

జీవిత చరితము యితరుల
కై వెలయింతురు చదువరి యా కవి గాడే
జీవిత సత్యము తెలిపిన
జీవింతురితరులు ధర్మ సేవకు లనుచున్.