Saturday, August 27, 2016



ప్రాప్త కాలజ్ఞత 

ఎవరి కోసమని ఎవరెస్టు శిఖరాలనెక్కావో
ఆ ఆమని అగాధాల అంచున
 అడ కత్తెరలో పోకలా
నలిగి పోతుంటే
ఏమని  సముదాయించుకోగలవు
ఎలాగున తమాయించుకోగలవు ?

మహార్ణవాన్ని ఈదాలని మొదలెడితే
ఉప్పెనలకు ఉపశమనం వెదుకాడితే
గమ్యమ్ అగమ్యగోచరం అవుతుంది
లక్ష్యమ్ అలక్షణ లక్షితమౌతుంది.

విశృంఖలత్వవిపంచి
మరీచికలా  వీచీబాలికలా
నిన్ను వెక్కిరిస్తే హెచ్చరిస్తే
నీ కనీనికలలో అశృమాల
అవుతరిస్తే పరితపిస్తే
ప్రాప్త కాలజ్ఞత కాసింత
మదిలో దోగాడితే
అద్దం లో నీ రూపం
అప్పుడే జ్ఞానోదయమైన
గౌతమ బుధ్దినిలా ప్రశాంతతని
ప్రతిబింబిస్తుంది
ప్రతి ఫలిస్తుంది.


తప్పు - ఒప్పు - చెప్పు 


ఒప్పుకున్నాక తప్పుకోకూడదు
తప్పుకోవాలనుంటే ఒప్పుకోకూడదు
ఒప్పులు ఒప్పుకున్నా ఒప్పకున్నా
తప్పులు ఒప్పుకోవాల్సిందే
మరి ఈ తప్పొప్పులు ఎలా తేల్తాయి?
అది ఆత్మానుగుణం, కాలానుగుణం.

చెప్పుకున్నా చెప్పకున్నా
'చెప్పు'కున్న సేవా భావం
నీకుంటే ఎంతో మేలు
లేకుంటే నీకంటే అదే మేలు.

అప్పుకన్నా నిప్పే మేలు
అప్పు అందరినీ దహిస్తుంది
నిప్పు  తనని తాకితేనే దహిస్తుంది

ఇప్పుడు చెప్ప0డి తప్పెవరిది?
ఇంకా ఒప్పెవరిది?