Tuesday, February 28, 2017

విసివి వేసారి పోవా

ఎవరిఉన్నతి నీ లక్ష్యంగా
ఎవరి సన్నుతి నీ అందలంగా
ఎవరి ఆదరం నీ ఆదరువుగా
ఎవరి నడవడి నీ సవ్వడి గా
ఆశించావో ఆశ్రయించావో
అదే ఆ విలసిత విషణ్ణ
అవహేళన చేస్తే
అపహాస్యం చేస్తే
మిన్నేట పన్నీట
కన్నీటి మున్నీట
మునిగి నీరుగారి పోవా
కరిగి కడదేరి పోవా
విసివి వేసారి పోవా
అలసి అణగారి పోవా
అభిమానమే అలసత్వమా
అవమానమే  చపలత్వమా
మౌనమే బహుమానమా.

Monday, February 27, 2017

మనో వైకల్యం

నా మనో నిబ్బరాన్ని దెబ్బతీసే
నీ మనో వైకల్యం నయ గంతవ్యం
ఆ అర్ధ నిమీలిత నేత్రాలు
అయిష్టతా సూచికలు
ఏం సాధించాలని
ఎందుకు వేధించాలని
పుట్టగతులు లేకుండా చేసే
వక్ర గతులు వక్రాలోచనలు
నీ అనుక్షణ కాంక్షితాలు
నీ కవే సమున్నత లక్ష్యాలు
ఎందుకిలా పతనాలు
నోరు జారినా నయమే
కాలు జారడం కన్నా
మనసు జారితే బ్రతుకే సున్నా
సమాజంలో ఉన్నత స్థానం పొందడం
చదువులలో మేటిగా నిలవడం
నీ లక్ష్యం కావాలి
చెలం గారి మైదానం
కోన్ కిస్ కాయ్ ల
జీవిత ఆటల మైదానం
నీలాంటి సంసారికులకా?
నాలాంటి సన్యాసులకా?
క్షణికానందపు ఆవేశం
కుక్షింభరత్వానికే పెను శాపం
ఆనందాతుర చపలత్వం
నీ అస్థిత్వానికే సంకటం
లక్షణంగా లక్ష్యం వైపు
తదేకంగా నిలుపు నీ చూపు
అహరహం శ్రమించు దాని కోసం
చిరు దరహాసంతో విజయం
నీ ముంగిట నిలవటం ఖాయం.


Wednesday, February 22, 2017


సాంత్వన


చిరునవ్వుల చిరుజల్లుల
తొలకరి తొలి చినుకులు
ఎద లోపల మరు అలజడి
చిరు సవ్వడి నదిమి ఉంచి
నెమ్మది నెమ్మదిగా నెమ్మది
కలిగించే అందించే ఓషధులు,
కనీనికల జాలువారే కన్నీటి
కపోల చారికల తుడిచి వేసే
చల్లని  అమ్రృత హస్త స్పర్శ,
ఆమడ దూరాల హిమ నగ
పవన కిశోర సౌకుమార్యాలు,
ఎదలో రగిలే అనల జ్వాల
లా‌రుప జాలెడు కన్నీటి చన్నీటి ధార,
శ్రవఃపేయ సాంత్వన వచన హేల
అనపేక్షిత ఆసరాగా నా సంగడి
ఆపన్న హస్తం సాదర సోదర హస్తం
కలిమి బలిమి పసిమి మిసిమీ
అందించే అపురూప
ఉపకరణాలూ ఉద్దీపనలు.





Monday, February 20, 2017

విభావరి

నా పేరు విభావ‌రి
నాబ్రతుకు సరాసరి
మా వూరు  తిరు నగరి
నా చెలిమి నీలాంబరి
నా కలిమి కాదంబరి
నా బలిమి కవితాంబరి
నా 'చేత' ఆడంబరి
నా మాట కనకాంబరి
నా తలపు తరుణాంబరి
నా గెలుపు వినయాంబరి
పున్నమి రేయి నే ధవళ విభావరి
తొలకరి చినుకుల కావల
తూరుపు కనుమల నే సప్త వర్ణ విభావరి
తెలుగు పలుకు బడులలో  నేనొక శార్వరి
తెలుగు పలుకే నా ఊపిరి.

మంది కోసమే బ్రతకాలని


అరుణ కిరణ బాల సూర్యోదయాన్ని
అ‌రచేతులతో అడ్డుకునే తెలి మంచు తెరలు
త‌రుణోదయ చ‌రణాంకిత నవ సోయగ
విత‌రణాతుర సంక్లిష్ట మురిపాల మాయ పొరలు
పూర్వాపరాలుగా కుడి ఎడమలుగా
వెల్లి విరిసిన ఒక నవోదయం
నా ఎదురుగా వెలిసిన ఓ ప్రభాతం
ఆద మఱచి నిలిచానో
అథః పాతాళం అంచులకే
ఎద విరుచుకు నిలిచానో
సమున్నత లక్ష్య శిఖరాల కొనలకే
ఎదలో ఏదో చాంచల్యం
మదిలో మరో సంశయం
కిం కర్తవ్యతా విమూఢత్వం
మెల్లగా మెలమెల్లగా
గుండె లుగ్గపట్టుకుని
మురిపాల నదిమి పట్టుకుని
ప్రగతి పథం నా మనోరథం
అని నిమ్మళంగా సమ్మాళించుకుని
ప్రాచీ వీచికల వైపే
సాధికారంగా అడుగేసా
ప్రాణ ప్రథంగా అధ్యయనం
వ్యామోహంగా వ్యసనంగా మలచుకున్నా
విజయాలు అపజయాలు
అవమానాలూ అభిమానాలు
అన్నీ యథా యోగ్యం చవి చూసా
మంది కోసమే బ్రతకాలని

మరో మారు తలపోసా.

Sunday, February 19, 2017

ఒప్పుకుంటావా తప్పు కుంటావా 

కలలలో కలసినా
కనులలో మెదలినా
ఎదురుగా నిలచినా
ఎడదలో మిగిలినా
అది నీకే సాథ్యం
పలువరుస కననీని మందహాసం
అంపాగ్రమౌ ఆ నిటారు కనుచూపు
గుండె లోతుల్లో గాయపెట్టే  ఆ తూపు
నిలువునా నన్ను కట్టి పడేసే
గారుడ తంత్రం.
ఎకాఎకీ నా పైనే చుర కత్తులు విసిరే వైనం
ససేమిరా నామాటే వినకూడదనే నీ నైజం
పనికి మాలిన వాటిపై
వల్లమాలిన మోహం
తలపుల తటిల్లతల
నదిమి పెట్టని మంకుతనం
అవి నీకే చెల్లు.
ఏకాంతంగా కూర్చుని
నిదానంగా ప్రశాంతంగా
ఆలోచించి విలోకించితే
నీ అంతరాత్మ నిన్ను
నిలదీసి కసితీ‌రా
అక్షింతలు వేసాకైనా
తప్పు నాదికాదు నీదే అని
ఒప్పుకుంటావా
అప్పుడు కూడా
దూరంగా తప్పుకుంటావా.


Monday, February 13, 2017

నా ఆశల అంతరిక్షం

ఊహల కందని అంతరిక్షం
దూర దూరాన చంద్ర సూర్యోదయాలు
ఎక్కడెక్కడో తారా సమూహాలు
లక్షల కోట్ల మైళ్ళ దూరాలు
ఈక్షణంలో కనిపించే కిరణం
నిన్న మొన్నటి ది కాదు
కొన్ని వత్సరాల కిందటిది
కాంతితో సమానంగా
ఏదో ఒక నాడు నేనూ పయనిస్తా
ఇనబింబానికి ఆవల కాలూనుతా
నభో వీధిలో నడయాడుతా
నవ లోకాలను వెదుకాడుతా
ఆ జీవ కోటితో నెయ్యం పొందుతా
చతుర్దశ భువనాల చి‌రునామాలు
అందరికీ అందుబాటులో ఉంచుతా
ఱెక్కలు కట్టుకుని ఎగిరో రోజులు
మనిషికి ఆమడ దూరం లో ఉన్నాయ్
నా ఊహల వియత్పథం
నా ఆశల అంతరిక్షం
సరదాగా చూసొచ్చే
సమయం అతి త్వరలోనే
ఆసన్నమౌతుంది.
ఆ శుభ ఘడియ కోసం
ఎదురు చూద్దాం.
ఎద పరచి స్వాగతిద్దాం.




Friday, February 10, 2017

సాగర తీరం

అది సాగర తీర సుందర ఆరామం
ఆ సైకత ప్రాంతం సముద్రునికో మణిహారం
విశ్రృంఖల కవితా విపంచి ని అందించిన
మాలతీ సోయగాల తీరం
వైశాఖుని దశాబ్దాలుగా జలావాసం కి నెట్టిన తటి
ఎందరో మహనీయుల నాలోచింప జేసిన కట్ట
ఎఱ్ఱమట్టి దిబ్బల పై అనురాగ అపురూపి ఒక వంక
ఒక్క ఉదుటున అపురూపిని అందుకోను ఆరాట పడే వీచీ బాలిక మరోవంక
అడ్డుగోడలా ఈ చెలియలి కట్ట
వికారి బికారి శ్రేయశీ ప్రేయశీ పిపాసి సారసి
ఎందరికో సాంత్వన నిచ్చిన నేల
అది ఓ సోయగాల ఒయ్యారం
నా సుందర  విశాఖ నగర
సాగర తీరం.