Friday, April 30, 2021

మే డే

           మే డే

 శ్రమ యేవ జయతే! శ్రమ యేవ వర్ధతే!

అని త్రికరణశుద్ధిగా నమ్ముకున్న శ్రామికుడను

బొందిలోన ఊపిరి ఉన్నంతవరకూ

అలసిపోక అవయవాలు ఆడినంతవరకూ

తలపులెన్నిటికో ఊపిరులూదుతూ చిందిస్తా  స్వేదజలం

అహరహం ఆ ప్రయాసలో నాకు పట్టే ఘర్మజలం

అది నా మస్తిష్కంలో చెలరేగే ప్రశ్నల ధర్మజలం

ఇప్పటికింకా నా వయసరవై యారే

నడకలో నడతలో శ్రమలో పరిశ్రమలో

 నవయువకులతో పోటీపడగలను

'పూంజ్ వాదీ' అన్నందుకు ఆక్రోశించను

శ్రమవర్తి సమవర్తి అననందుకు ఆక్షేపిస్తా

సమాజానికి నావంతు ఏమివ్వగలననే ఆలోచిస్తా

ఆ లక్ష్యసాధన కోసం అలక్ష్యపు ఆవలివైపు

నే రమిస్తా! శ్రమిస్తా! పరిశ్రమిస్తా!

Thursday, April 29, 2021

శ్రీ రామరక్ష

    శ్రీ రామ రక్ష

కాలకంఠునికి కోపం వచ్చిందో

చిత్రగుప్తునికి చిరాకు పుట్టిందో

కాలనాగు కన్నుకుట్టి కాటేసిందో

అనేకమంది ఆయువు మూడిందో

మందేలేని రోగంతో యెందరో విలవిల

కరోనా ప్రళయానికి ప్రపంచం వెలవెల

చిన్నా చితక బీదా బిక్కీ ముతక లేత

భేదం చూపని సమవర్తి విలయతాండవం

దశదిశలా ఒకటే మరణమృదంగం

ఈ బ్రహ్మాస్త్రానికి అందరిదీ అవనత వదనం

ప్రకృతికాంత మన అకృత్యాలకు కన్నెఱ్ఱ జేసిందా

పరపీడన పరాయణత్వానికి సాస్తి జరిగిందా

నోరూ వాయీ లేని వారిని సైతం కబళిస్తూ

ఉన్నోడినీ లేనోడినీ మరుభూమిలో ఒక్కటి చేస్తూ

బ్రతుకు జీవుడా అనుకుంటే ఆశ ఉంటే

ముక్కూ నోరు మూసుకొని పడి ఉండమంది

నిక్కూ నీలుగూ నాముందు పనికిరావంది

అందుకే ఓ మనిషీ! ప్రకృతిపై నీ పెత్తనం మానుకో

ఉన్నంతలో నీ బ్రతుకు తెరువు చూసుకో

మీ పాలకులూ ఏలికలూ చేసేది కొంచెమే

నీకోసం నీవే మూతిగుడ్డతో  ఊపిరి పీల్చుకో

అంటరానితనం అనకుండా దూరం పాటించు

అవే అవొక్కటే ఆపత్కాలంలో శ్రీ రామ రక్ష!

Tuesday, April 13, 2021

ఉగాది

 గీ.

సర్వ శార్వరీ హారివై సంతస సుఖ

దాయిని వయి కరోనా విదారి వగుచు

రావమ్మ! సకలాపప్లవ రాజ్ఞి వగుచు

ప్లవ సంవత్సర యుగాది! భగ ప్రసాది!