Thursday, April 29, 2021

శ్రీ రామరక్ష

    శ్రీ రామ రక్ష

కాలకంఠునికి కోపం వచ్చిందో

చిత్రగుప్తునికి చిరాకు పుట్టిందో

కాలనాగు కన్నుకుట్టి కాటేసిందో

అనేకమంది ఆయువు మూడిందో

మందేలేని రోగంతో యెందరో విలవిల

కరోనా ప్రళయానికి ప్రపంచం వెలవెల

చిన్నా చితక బీదా బిక్కీ ముతక లేత

భేదం చూపని సమవర్తి విలయతాండవం

దశదిశలా ఒకటే మరణమృదంగం

ఈ బ్రహ్మాస్త్రానికి అందరిదీ అవనత వదనం

ప్రకృతికాంత మన అకృత్యాలకు కన్నెఱ్ఱ జేసిందా

పరపీడన పరాయణత్వానికి సాస్తి జరిగిందా

నోరూ వాయీ లేని వారిని సైతం కబళిస్తూ

ఉన్నోడినీ లేనోడినీ మరుభూమిలో ఒక్కటి చేస్తూ

బ్రతుకు జీవుడా అనుకుంటే ఆశ ఉంటే

ముక్కూ నోరు మూసుకొని పడి ఉండమంది

నిక్కూ నీలుగూ నాముందు పనికిరావంది

అందుకే ఓ మనిషీ! ప్రకృతిపై నీ పెత్తనం మానుకో

ఉన్నంతలో నీ బ్రతుకు తెరువు చూసుకో

మీ పాలకులూ ఏలికలూ చేసేది కొంచెమే

నీకోసం నీవే మూతిగుడ్డతో  ఊపిరి పీల్చుకో

అంటరానితనం అనకుండా దూరం పాటించు

అవే అవొక్కటే ఆపత్కాలంలో శ్రీ రామ రక్ష!

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home