Friday, December 4, 2020

 ఆర్యా శతకం


కారణ పరచిద్రూపా

కాంచీపుర సీమ్ని కామపీఠగతా

కాచన విహరతి కరుణా

కాశ్మీరస్తబక కోమలాంగలతా.1

భావం: కారణ పరచైతన్య రూపా కాంచీపుర మందలి కామకోటి పీఠాధిష్టాత్రీ పూగుత్తి వంటి ఒకానొక దయ అక్కడ విహరించు చున్నది.

మూక శంకరుల పంచశతి లోని మొదటిదైన ఆర్యా శతకంలోని తొలి శ్లోకం యిది. దానికి నా స్వేచ్ఛానువాదం.

కం.

శ్రీ కర కాంచీపుర స్థిత

శంకర మఠ కామకోటి శాంకరి! మాతం

గీ! కారణ పర చిద్రూ

పీ కరుణామయి లతాంగి శ్రీ కామాక్షీ. 1

శ్లో.

కంచన కాంచీ తిలకం

కలధృత కోదండ బాణ సృణి పాశమ్

కఠినస్తనభర నమ్రం

కైవల్యానందకంద మవలంబే. 2.

భావం;

ఒకానొక కాంచీపుర విశేషము చేతులందు ధనస్సు బాణము అంకుశము పాశము ధరించినట్టియు, కఠినముగానున్న వక్షోజభారముచే ముందుకు వంగినట్టిదియు కైవల్యానందమునకు నెలవైనదియు అయయిన ఆమెను ఆశ్రయింతును.

కం.

కాంచీపుర తిలకే అం

బాం చిరపాశాంకుశ సుమ బాణ ధరే! ఓ

కుంచిత స్థనభార వతీ

యంచిత కైవల్య వరద నవలంబింతున్. 2

శ్లో.

చింతితఫల పరిపోషణ

చింతామణిరేవ కాంచినిలయామే

చిరతర సుచరిత సులభా

చిత్తం శిశిరయతు చిత్సుధాధారా. 3

భావం:

కోరిన కోర్కెల దీర్చుటలో కాంచీపురమందుండు  ఆమె చింతామణియే. ఎన్నో పున్నెముల సులభముగా లభించుచూ ని చిత్తమును చైతన్యామృత ధారలతో చల్లబఱచుగాక!


కం.

చింతిత ఫలముల నిచ్చెడి

చింతామణి  నా గుబులణచెడు చిత్సుధలన్

సంతత సుచరిత సులభా!

భ్రాంతుల దొలగించు కాంచివర కామాక్షీ. 3

శ్లో.

కుటిలకచం కఠినకుచం 

కుంద స్మితకాంతి కుంకుమఛ్ఛాయమ్

కురుతే విహృతిం కాంచ్యాం

కులపర్వత సార్వభౌమ సర్వస్వమ్. 4

భావం:

వంకరలు తిరిగిన ముంగురులు గల, గట్టిగానున్న చనుదోయిగల, మొల్లలవంటి నవ్వుల కాంతిగల, కుంకుమపూవు వంటి ఎఱ్ఱని కాంతిగల హిమవత్పర్వత సర్వస్వము అయిన కామాక్షి కాంచీపురమందు విహరించును.


కం.

కచములు వంకర కఠినపు

కుచముల కుందహసిత జిగి కుంకుమ ఛాయన్

విచరించు కాంచి నాగరి

క, చలిమలవిభు సుత కంచి కామాక్షి యనన్. 4

శ్లో.

పంచశర శాస్త్ర బోధన

పరమాచార్యేణ దృష్టిపాతేన

కాంచీసీమ్ని కుమారి

కాచన మోహయతి కామజేతారమ్. 5

భావం:

కామశాస్త్రమును బోధించుటలో పరమగురువై దృష్టిపాతముతో కాంచీపురమందు ఒక కుమారి కామారి యైన శివుని మోహింపజేయుచున్నది.

కం.

పంచ శరశాస్త్ర మెఱిగిన

కాంచి పుర కుమారి యొకతె కడు మోహమునన్

పంచ శరాసను వైరిన్

పంచాస్యుని మరు వెతలకు బందీ చేసెన్. 5

శ్లో.

పరయా కాంచీపురయా

పర్వతపర్యాయ పీన కుచభరయా

పరతంత్రా వయ మనయా

పంకజస బ్రహ్మచారి లోచనయా. 6

భావం:

కాంచీపురమందు ప్రసిద్ధిమైన పర్వతముల వంటి స్తనములుగల, పద్మనయన యగు ఈమెచే దాసులుగా చేయబడితిమి.


కం.

వరమున కాంచీ పురమున

గిరిసమ కుచభర విలసిని శ్రీ కామాక్షీ

పరతంత్రులమై యుంటిమి

యరవిందాక్షికి స బ్రహ్మచారికి యెపుడున్. 6

శ్లో.

ఐశ్వర్య మిందుమౌలే

రైకాత్మ్రప్రకృతి కాంచిమధ్యగతమ్

ఐందవకిశోరశేఖర

మైదంపర్యం చకాస్తి నిగమానమ్. 7

భావం:

చంద్రశేఖరుడైన శివుని సంపద, జీవేశ్వరైక హేతువు,  బాలేందుశేఖరి, వేదార్థ రాశీభూతమై కాంచీపురమందు వెలుగొందుచున్నది.

కం.

ఐందవ  శేఖరు కలిమా

సుందర యైకాత్మ్య రుచియు శ్రుత్యర్థములున్

యైందవ శేఖరియే తా

నందున కాంచి పుర మధ్య గత యై యుండెన్. 7

శ్లో. ౮

శ్రితకంపాసీమానం

శిథిలిత పరమశివధైర్య మహిమానమ్

కలయే పాటలిమానం

కంచన కంచుకిత భువన భూమామ్. 8

భావం:

కంపానదీ పరీవాహక భూమిని ఆశ్రయించిన, పరమశివుని స్థైర్యమును శిథిలపరచిన, భువనమంతటినీ కంచుకము (చొక్కా) గా ధరించిన ఒకానొక అరుణిమను ధ్యానించెదను.

కం.

కంపానదీతటిన్ యను

కంపామహిమన్ శిథిలము గావించె నెదో

శంపారుణిమా శివధృతి

నింపారగ భువనవస్త్రమిడి కామాక్షీ! 8


శ్లో.౯

ఆదృత కాంచీనిలయా

మాద్యామారూఢ యౌవనాటోపామ్

ఆగమ వతంస కలికా

మానందాద్వైత కందలీం వందే. 9

భావం:

కాంచీపురమందు యవ్వనగర్వపర్వతులైన వైదిక వనితలకు సిగబంతియు ఆనందాద్వైత వృక్షమునకు మొలకయు నగు దేవి(కామాక్షి) కి నమస్కరించు చున్నాను.

కం.

ఆదర వైదిక వనితల

మేదుర యవ్వన గరిమకు మేలిమి యెవరో

పైదలి కానందాద్వైత

కందళికేను ప్రణతులిడగా తలతు నెదన్. 9


శ్లో. ౧౦

తుంగాభిరామ కుచభర

శృంగారిత మాశ్రయామి కాంచిగతమ్

గంగాధర పరతంత్రం

శృంగారాద్వైథ తంత్ర సిద్ధాంతమ్. 10

భావం:

ఉన్నతమైన సుందరమైన కుచశోభతో నలరారుచూ శివుని సేవించే శృంగార అద్వైత సిద్ధాంతమగుచూ కాంచీపురమునందున్న అమ్మను ఆశ్రయించెదను.

కం.

తుంగాభిరామ కుచభర

శృంగారాద్వైత శాస్త్ర శ్రుతకీర్తి యనన్

గంగాధర సేవాతుర

జంగమ దేవేరి కంచి జననిన్ కొలతున్. 10

శ్లో. ౧౧

కాంచీ రత్నవిభూషాం

కామపి కందర్ప సూతి కాపాంగీమ్

పరమాం కలా ముపాసే

పరశివ వామాంక పీఠికాసీనామ్. 11

భావం:

కాంచీపురమునకు రత్నాలంకారమైన, మన్మథునికి జన్మస్థానమైన, పరమశివుని ఎడమ తొడపై కూర్చుని ఉన్న ఒకానొక కళను ఉపాసించెదను.

కం.

కాంచీపురశోభిత దృ

గంచల కందర్ప ప్రసూతి కటాక్షమును నే

నంచిత భక్తినొప్ప నుపా

సించెద శివ వామభాగ శ్రేయమగు కళన్. 11

శ్లో. ౧౨

కంపాతీర చరాణాం

కరుణా కోరకిత దృష్టిపాతానామ్

కేలీవనం మనోమే

కేషాంచి ద్భవతు చిద్విలాసానామ్. 12

భావం:

కంపాతీరమున సంచరించు దయ మొగ్గదొడిగిన కటాక్షములకు అనిర్వచనీయ చిద్విలాసములకు నా మనస్సు ఆటస్థలమగుగాక!

కం.

కంపా నదీ తటిన్ చరి

యింపగ కృపాంకురమైన యింతికి కించిత్

సొంపారగ నామది యను

కంపా వీక్షణ యుపవనిగా యగునే. 12

శ్లో.౧౩

ఆమ్రతరుమూల వసతే

రాదిమ పురుషస్య నయన పీయూషమ్

ఆరబ్ద యౌవనోత్సవ

మామ్నాయ రహస్య మంత రవలంబే. ౧౩

భావం:

మావిచెట్టు మొదట వసించే ఆదిపురుషుడైన శివుని నయనామృతమును యవ్వనోత్సవము నారంభించిన నిగమ రహస్యమును అందుకొందును.

కం.

చూత తరుమూలవాసిని

యా తొలి పురుషుని నయన సుధాంశువులందున్

సంతత యౌవన సంబర

చింతిత నిగమార్థగుహ్య చేతన గొందున్. 13


శ్లో.౧౪

అధికాంచి పరమయోగిభి

రాదిమ పరపీఠ సీమ్ని దృశ్యేన

అనుబద్ధం మమ మానస 

మరుణిమ సర్వస్వ సంప్రదాయేన. 14

భావం:

కాంచీపురమందలి ఆదిపురుషుడను పీఠమున పరమయోగులచే చూడబడెడి అరుణిమతో నా మనస్సు అనుబంధింపబడినది.

కం.

కాంచీపుర ప్రధమపురుషు

డంచను పీఠమ్మున ఘనుడాతని మునుల్ 

గాంచెడు యరుణిమతో మది

యించుక యనుబంధమొందె నీ మర్యాదన్. 14


శ్లో.౧౫

అంకిత శంకర దేహా

మంకురితోరొజ కంకణాశ్లేషైః

అధికాంచి నిత్యతరుణీ

మద్రాక్షం కాంచి దద్భుతాంబాలామ్. 15

భావం:

కాంచీపురమందు శంకరుని కౌగిలించుకొనుటచే ఆశ్లేషచిహ్నములతో (ఆలింగనముచే ఏర్పడిన గుర్తులు)నున్న నిత్యయౌవన యైన అద్భుతమైన బాలను చూచితిని.

కం.

శంకరు యాశ్లేషాన్విత

సాంకర్యచిహ్నములతొ యసామాన్యంబౌ

యంకిత నిత్యతరుణి నే

గాంచితి మద్భుత మది యనగా నా బాలన్. 15

శ్లో. ౧౬

మధురధనుషా మహీధర

జనుషా నందామి సురభి బాణజుషా

చిద్వపుషా కాంచిపురే

కేలిజుషా బంధుజీవ కాంతిముషా.16

భావం:

చెఱకువిల్లు, పూలబాణాలతో బంధుజీవపుష్పపు కాంతిని పొందిన చైతన్యమే శరీరముగాగల పర్వతరాచూలిని కాంచీపురమందు ఆటలాడు నామెచే ఆనందించుచున్నాను.

కం

అధికాంచీపుర మందున

మధురపు వింటిని విరిశర మవలంబించే

యధికారక చిద్వపుషా

యధికేళీ చరిత వలన యానందింతున్. 16


శ్లో.౧౭

మధురస్మితేన రమతే

మాంసల కుచభార మందగమనేన

మధ్యేకాంచి మనోమే

మనసిజ సామ్రాజ్య గర్వబీజేన.

భావం:

తియ్యనైన చిరు నగవుతో, స్తనభారముచే మందగమనముతో, మన్మథ సామ్రాజ్య గర్వబీజముతో కాంచీనగర హేతువుతో నా మనసు ఆనందించు చున్నది.

కం.

చిరుదరహాస మధురిమతొ

భరకుచ మందగమనముతొ బహుసుందరమై

వరకాంచీపుర మందున

మరుసామ్రాజ్య మదబీజ మాయమ ముదమౌ. 17

శ్లో.౧౮

ధరణిమయీమ్ తరణిమయీమ్

పవనమయుమ్ గగన దహన హోతృమయీమ్

అంబుమయీ మిందుమయీమ్

అంబా మనుకంప మాదిమా మీక్షే.18

భావం:

భూమి, సూర్యుడు, వాయువు, ఆకాశం, జలం, అగ్ని, చంద్ర, హోత లను అష్టమూర్తియైన అమ్మను కంపానది ఒడ్డున చూచుచుంటిని.

కం.

ధరణీమయి నిందుమయిని

తరణీమయి వాయుమయిని దహన మయిన్ క

ర్పుర గగన హోతృమయినా

పరులాదిమయంబ గందు పావన తటిపైన్. 18

శ్లో. ౧౯

లీనస్థితి మునిహృదయే

ధ్యానస్తిమితం తపస్య దుపకంపమ్

పీనస్తనభర మీడే

మీనధ్వజ తంత్ర పరమతాత్పర్యమ్. 19

భావం:

మునిహృదయములలో లీనమై, నిశ్చలధ్యానమై, కంపాతీరాన తపోనిమగ్నమై, వక్షోభారమై, కాదివిద్యా తంత్రార్థరూపిణియైన దేవిని స్తుతించెదను.

కం.

మునిహృదయమ్ముల లీనన్

యనవరతధ్యానతత్పరాంబన్ నతి జే

తును యనుకంపా తాపసి

యను శ్రీ విద్యానిలయను యధికుచభారన్.19

శ్లో. ౨౦

శ్వేతా మందరహసితే

శాతామధ్యేచ వాఙ్మనోఽ తీతా

శీతా లోచనపాతే

స్ఫీతా కుచసీమ్ని శాశ్వతీ మాతా। 20

భావం:

కామాక్షీ మాత శాశ్వతమైనది. ఆమె నవ్వు తెల్లగా (స్వచ్ఛంగా), నడుము సన్నంగా, మనోవాక్కులకు అతీతంగా, చల్లని చూపులతో, ధృఢమైన స్తనములతో ఉన్నది.

కం.

శ్వేతవు చిరునగవుల స్థిర

 మాతవు కృశమధ్యవు నుడి మదికందవుగా

శీతాలోచన పాతవు

స్ఫీతా కుచభార నమ్రశీలవు నీవే. 20

శ్లో. ౨౧

పురతః కదాను కరవై

పురవైరి విమర్ధ పులకితాంగలతామ్

పునతీం కాంచీదేశం

పుష్పాయుధ వీర్య సరసపరిపాటీమ్.21

భావం:

శివుని కౌగిలింతచేత పులకించిన లతాంగి కాంచీపురమును పునీతము చేయు మన్మథ వీర్యమునకు సరసపరిపాటియైన నాఎదుట యెప్పుడు కనుగొందునో!

కం.

కందర్ప వీర్యసొరిదిన్

సుందర కాంచీప్రదేశ శుభ్రపునీతన్

వందిత శివ బిగికౌగిలి

నందు పులకాంకిత నెపుడు నాదరి గాంతున్? 21

శ్లో.౨౨

పుణ్యాకాఽపి పురంధ్రీ

పుంఖిత కందర్పసంపదావపుషా

పులినచరీ కమ్పాయా

పురమథనం పులక నిచులితం కురుతే. 22

భావం:

కంపానదీతీరాన ఓ పుణ్యస్త్రీ కాముని మోహపరవశుచేయగల శరీరముతో శివుని పులకింప జేయుచున్నది.

కం

ఒక పుణ్యకుటుంబిని యో

సికతాతలచారిణి మరుసిరివపుష యెకా

యెకి త్రిపురా సంహారిని

యకళంక పులకితు జేయు యదిగో గనరే. 22

శ్లో. ౨౩

తనిమాద్వైతవలగ్నం

తరుణారుణ సంప్రదాయ తనులేఖమ్

తటసీమని కమ్పాయా 

స్తరుణిమ సర్వస్వ మాద్య మద్రాక్షమ్. 23

భావం:

కంపానదీతీరాన మద్దిమాను వంటి నడుముగల, యుక్తవయసులో అరుణిమతో సంప్రదాయబద్ధమైన తనుకాంతితో తరుణిమా సర్వస్వమును చూచుచున్నాను.

కం.

కటిసీమాద్వైతము నా

తటిసీమన్ యౌవనాఖ్య తనురూపంబున్

చటులాలక పుణ్యస్త్రీ

నట యరుణిమ సర్వ మామె నాద్యన్ గంటిన్. 23

శ్లో.౨౪

పౌష్టిక కర్మ విపాకం 

పౌష్పశరం సవిధసీమ్ని కంపాయాః

అద్రాక్ష మాత్తయౌవన 

మభ్యుదయం కించి దర్ధశశిమౌలేః 24

భావం:

కంపానదీ ప్రదేశమున మన్మథుని పౌష్టిక కర్మ పరిపాకంగా వచ్చిన యౌవన మందు అర్థచంద్రమౌళి యొక్క అభ్యుదయమును చూచితిని.

కం.

కాంచితి నత్తటిసీమను

ప్రాంచద్విరిశరజనిత విపాక పరువపుం

క్రొంచిగురు లతాంగిన్ యొ

క్కించుక నభ్యుదయకిసలయేందు సుధారిన్.24

శ్లో. ౨౫

సంశ్రిత కాంచీదేశే

సరసిజ దౌర్భాగ్య జాగ్రదుత్తంసే

సంవిన్మయే నిలీయే

సారస్వత పురుషకారసామ్రాజ్యే. 25

భావం:

కాంచీపురమునాశ్రయించిన కమలములకు శత్రువైన చంద్రుని ధరించిన జ్ఞానస్వరూపమైన సారస్వతాధికార సామ్రాజ్ఞియగు (అమ్మయందు) లీనమగుచున్నాను.

కం.

అవలంబిత కాంచీపురి

నవతంసాజలజవైరి నవధారిని గనుచున్

సంవిన్మయి సారస్వత

సంవేద్యపౌరుష మందు సంలీనుండన్. 25

శ్లో. ౨౬

మోదిత మధుకర విశిఖం

స్వాదిమ సముదాయసార కోదండమ్

అదృతకాంచీఖేలన

మాదియ మారుణ్యభేద మాకలయే. 26

భావం:

చెఱకువిల్లు, పూబాణములతో కాంచీపుర ప్రాంతమున విహరించు నొక తొలి అరుణిమను ధ్యానించెదను.

కం.

ముదమగు మధుకర విశిఖము

స్వాదిమ రసాల ధనువున సంధించెడు నా

యాదిమ యరుణిమ గొలుతున్

సాదర పరిసర విహారి శాంకరి నెపుడున్. 26

శ్లో. ౨౭

ఉరరీకృత కాంచిపురీ

ముపనిష దరవిందకుహర మధుధారమ్

ఉన్నమ్ర స్తనకలశీ

ముత్సవలహరీ ముపాస్మహే శంభోః।। 27

భావం:

కాంచీపురమును అంగీకరించిన, వేదాంతపద్మములనబడు గుహలందలి మధుధారలైన ఎత్తైన వక్షోజములగల శివసంతోష వాహినియైన ఆమెను ధ్యానించెదను.

కం.

ఓ మహిమాన్విత కాంచీ

హైమావతి నుపనిషద్సుధాంబుజ ధారన్

హ్రీమంచురోజ కలశిన్

శ్రీమంతిని శివ ముదలహరి నుపాసింతున్. 27.

శ్లో.౨౮

ఏణశిశు దీర్ఘలోచన

మేనఃపరిపంథి సంతతం నమతామ్

ఏకామ్రనాథ జీవిత

మేవంపద దూరమేక మవలంబే. 28

భావం:

లేడిపిల్లవంటి విశాలమైన కన్నులు గల, ఎల్లప్పుడూ తనకు నమస్కరించువారి పాపములను తొలగించు, ఇది యని చెప్పనలవికాని యొక ఏకామ్రనాథుని జీవితమైన కామాక్షీ దేవిని ఆశ్రయించెదను.

కం.

హరిణీబాలాలోచక

స్మరణే దురితాపహారి సతతమ్మని యే

క రసాలనాథ సతి నీ

దరి నవ్యక్తన్ గొలతు ముదావహ లహరిన్. 28


శ్లో.౨౯

స్మయమానముఖం కాంచీ

మయమానం కమపి దేవతాభేదమ్

దయమానం వీక్ష్య ముహు

ర్వయ మానన్దామృతాంబుధౌ మగ్నాః ।। 29

భావం:

చిరునగవుల వదనంతో దయజూపు చున్నట్లు కాంచీపురము చేరుచున్నట్లు అనిపించిన  ఒక దేవతా విశేషమును మాటిమాటికీ చూచి మేము ఆనందసాగరంలో మునిగితిమి.

కం.

స్మయమాన ముఖముతొ ప్రమో

ద యుత  యధిదేవత యొక్కత కాంచి నగరిన్

దయజూపగ నది గని సుఖ

మయ సంతోషాబ్దిలోన మగ్నుల మగగాన్. 29


శ్లో.౩౦

కుతుకజుషి కాంచిదేశే

కుముద తపోరాశి పాక శేఖరితే

కురుతే జనో మనోఽయం

కులగిరి పరిబృ(వృ)ఢకులైక మణిదీపే. 30





0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home