Friday, August 28, 2020

తెలుగు భాష

       తెలుగు భాష

మన అన్నయ్య నన్నయ్యకు పూర్వం జనం నాలుకలపై

యతిప్రాసల పద్యాల వరకూ ఎదిగింది తెనుగు బాస

రాణ్మహేంద్రిలో గౌతమీ తీరాన రాకాడింది ఆ యాస

భారత భారతీ లలామకు దీటుగా కావ్యాలంకార

రుచిమయ నవలా లలామ ఆంధ్ర కవితా వధూటి

పదార్చనలలో వేయి వసంతాల మహోజ్వల ప్రస్థానం

ఎందరెందరినో పునీతులను చేసింది.దశదిశల ప్రాకింది.

ఇంతలో ద్విరుక్తశ్రీ కట్టుబాట్ల శృంఖలాలను త్రుంచేసి

విశృంఖల విహారం చేయిస్తే మైదానంలో నిలబెట్టాడో చెలం

ఏభైయ్యారక్షరాల పరిధితో తరతరాలుగా వస్తున్న దానికి

కుదింపులూ మదింపులూ జోడింపులూ కత్తిరింపులూ

మొదలయ్యాయి యీ మధ్య కాలంలో

ఒరవళ్ళ పరవళ్ళ ఉరకలేసిన భాషామతల్లికి

అచ్చతెలుగంటూ గీర్వాణ ప్రాకృత పదాలను

పీకి పారేయాలంటూ వితండవాదం ఓ పక్క

బడిలో గుడిలో తెలుగును పీకేసే ప్రభుత మరోపక్క

మా పిల్లలకు తెలుగు రాదని గొప్పలుపోయే వారింకోవంక

నానా తప్పులతో నాలుగు మాటలు వ్రాస్తే చప్పట్లు

నిర్దుష్టంగా నిర్దోషంగా పద్యం చెబితే తెల్లమొహాలు

అదీ యీనాటి తెలుగు భాషా దీనావస్థ

ఏదో ఓ నవోదయం లేదా శారద్జ్యోత్స్నా వికాసం

కలిగి తెలుగు భాష ఏభైయ్యారక్షరాలతో వెలగొందుననీ

ఆశిస్తా వ్రాసిస్తా ప్రయత్నిస్తా తెలుగు బావుటా ఎగరేస్తా.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home