Wednesday, August 19, 2020

నా దేశపు వారసత్వం

        నా దేశపు వారసత్వం

తరాలు మారినా తలరాతలు మారుతున్నా

శతాబ్దాలు గడిచినా మహోన్నత వంశాలు నశించినా

నా దేశపు రక్తంలో ఉదాసీనతా ఔదార్యం తగ్గలేదు

ఈ దేశపు ఆలోచనలో పరపీడనా దౌర్జన్యం పోలేదు

తన వఱకూ వస్తేగాని తెలుసుకోని నిర్లక్ష్యం 

నాకెందుకులే అనే నిస్తేజం పోతే పోనిమ్మనే నైజం

వారసత్వపు అవలక్షణాలుగా సాగుతున్నాయి

సప్తశతాబ్దాల బానిసత్వం నేర్పిన గుణపాఠమో

స్వార్థప్రయోజనాల అలసత్వం నేర్పిన లౌక్యమో

నా జాతి నరనరాలలో అనూచానంగా ఇమిడిపోయింది

ప్రతిభకు పాతరేసి అత్తెసరుకు పట్టం కట్టిన నేల మీద

ముత్తాతల తాతలు చేసిన తప్పులకు శిక్షలు కక్షలు

ఇప్పటి వారి మెడమీద కత్తులై వేలాడిన ఘనత మాది

నభోవీధి వారిధరాలు భోరుభోరుమని విలపిస్తే

వర్షోరుధారా పరంపరలకు నదీనదాలు పొంగిపొర్లుతున్నాయి

అందుకే ఏభైయ్యారంగుళాల ఛాతి ఉప్పొంగిపోతుంది

ఒక సామాన్యుడు నడ్డి విఱిగి చతికిలబడితే ఎంత?

ఓ అసామాన్యుడి బ్రతుకు నడిరోడ్డున పడితే యెంత?

1 Comments:

Blogger విన్నకోట నరసింహా రావు said...

ఆవేదనతో కూడిన మాటలు బాగా చెప్పారు. భావితరాలకు ఇదే వారసత్వం కొనసాగే సూచనలే కనిపిస్తున్నాయి.
ప్రయాణంలో ఎక్కడో దారి తప్పిన దేశం. దురదృష్టకరం.

August 20, 2020 at 12:55 AM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home