Thursday, August 6, 2020

నా కవితాకన్య

      నా కావ్య కన్య
తే.గీ.
చారుతర శారదా నిశా చంద్రికలను
మైమఱచి రేయి రేయంత యాకశాన
ఆశగా  జూడగా కనులందు మెఱిసె
తన్వి తలిరాకుబోడి నా తనివి దీర.

మృదు వచో విభవ ప్రభవ ధృతస్వభావ
మనసు నుఱ్ఱూత లూగించు మధురహాస
పరుల మాణిక్యవీణా సుభాషిణి కల
స్వనముల బలుకు బలుకున బలుకు నట్లు.

సుందరోజ్వల వృత్త రసోచితౌచు
కావ్య భావోచితపు యలంకార సొబగు
గ్రుమ్మరించి సూక్తులను వాక్రుచ్చ నేర్చె
నవనవోన్మేష ప్రత్యూష నభము వోలె.

ఆమె నా కవితా జ్యోత్స్న యనవరతము
నన్ను కవ్వించి నవ్వించి నాట్యమాడు
కలము చేబూని వ్రాయగా గడువు నీదు
కలల కిన్నెర యప్సర కఱకు ఠవర.

పద్యమై హృద్యమై ముని పంట నొక్క
లాస్యమై రసరమ్యమై  హాస్యమై య
మేయ శంపా లతాంతమై మిణుకుమనగ
శబ్దసాగర జన్యమై సదరు కవిత

అక్షరస్ఫురద్రత్నమై యాంధ్ర భార
తికి యలంకారమై స్థిరమై య
మోఘమై సుసంపన్నమై ముచ్చటై సు
గంధ భరితమై యలరారు కావ్యకన్య.



0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home