Sunday, August 2, 2020

కైమోడ్పు

కైమోడ్పు
మ.
గిరిజా వల్లభ శంకరా వినతు లంగీకారమో కావొ యా
దర మొప్పన్ నననుగ్రహింతువని సత్సాంగత్యహేలా మనో
హర భావంబు ప్రదోష కాలమున నిన్నర్చింపగా జేసె శం
కరమౌ నంచు సదాశివా! యితర శంకల్లేక నే గొల్చితిన్.
శా.
ఏ శీతాంసు ఖరాంశు యంశువులొ యేయే యొజ్జలాశీస్సులో
రాశీభూతములై మహా విభవ ప్రారబ్దాంతరోదంచితా
రాశీ సమ భాగ్యమై నెలకొనెన్ రాకేందు బింబాననా!
శ్రీ రాజ్ఞీ! నిను నిత్యమున్ గొలువగా శ్రీ చక్ర సంచారిణీ!
శా.
ఆశావాదమె వేదమై బ్రతుకు నిత్యావస్థలం కుందగా
యీశావాస్యమదెట్లు సాధ్యమగునో యేరీతి సాధించుటో
యీశానీ! దయజూపవే తపసుడన్ యేదో విధీన్ కావవే
నే శాక్తేయుడ గానె? తప్పులను మన్నింపన్ దగున్ యీశ్వరీ.
శా.
పాతాళంబుకు ద్రోసినన్ పుడమిపై బాధించి వేధించినన్
అంతా యా పరమేశ్వ రేచ్ఛయని నా యదృష్ట మంచే తలం
తున్ తాళంగల శక్తి యుక్తులిడినన్ దుర్యోగముల్ దాటనే?
పంతంబొప్పక నే చరింతు జననీ! భవ్యా! జగద్రక్షకీ!
మ.
నిను సేవించుచు నిష్క్రమించెదను నిన్నేమంబుగా గొల్చుచున్
తనుహృద్భాషల సఖ్యము న్నొసగి సద్భక్తిన్ ప్రసాదించవే
కను వేదుర్వ్యసనంబుగా మనసు నాకర్షించి దీవించవే
జన బాహుళ్యము వెక్కిరించినను చాంచల్యంబు లేకుండగన్.
మ.
నిను సేవించుచు నిష్క్రమించెదను యానీతాభ్యుయోగంబుగా
మననీయంగల భాగ్య మిమ్ము పరులా!మాహేశ్వరీ! శాంకరీ!
చననీ జీవితమెంతొ సార్థకతతో స్వార్థంబు లేకుండగా
ఘన సాయుజ్యపు టాశతో బ్రతుకనీ గౌరీ! శివే! కాళికే!

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home