Sunday, August 9, 2020

మనసా మన్నించవా

 మ.

అనరాదే నిను ప్రాయమా!  దుడుకుగా నాలోచనా శూన్యమై

కనుదోయిన్ పడినట్టి యా సొబగులన్ కాంక్షించుటే నీ పనా?

మునువెన్కల్ కనుగొన్క నీ వరిగినన్ ముమ్మాటికీ తప్పగున్

మనసా నీకిది భావ్యమా? వదులుకోమా?  

దుష్టసంవాసముల్. ౧

నిను శాసించితినో? వితర్కములతో నిర్వేద వాదంబుతో

ఘనప్రత్యర్థి విభూతితో నియతితో కార్పణ్యభావంబుతో

పునరుత్థాన వినాశ దృక్పధముతో భ్రూమధ్య కోపంబుతో

మనసా నీకిది భావ్యమా? వదులుకోమా?  

దుష్టసంవాసముల్. ౨

ఇనుడా తూర్పున వుద్భవించుటది తానేలాగు నిక్కచ్చియో

ఘనసారంబు హరించి పోవుటది నిక్కంబన్నటుల్ నీ మదిన్

పెను యాలోచన లుప్పతిల్లుటలు సంవేశా మహద్భాగ్యమా

మనసా నీకిది భావ్యమా? వదులుకోమా?  

దుష్టసంవాసముల్. ౩


మనసై యుత్పలమాల లల్లితిని  యీ మాయా వికాసంబుతో

చనువై యో సిగబంతిగా తురుమగా శంపాలతా చంపకం

బును తారాడ సరమ్ముగూర్చితిని సంపూర్ణేందు వాగ్రూపికిన్

మనసా నీకిది భావ్యమా? వదులుకోమా? దుష్టసంవాసముల్.౪

మును నేనల్లిన మాలలన్ గొని మహామోదమ్ముతో నీ సఖీ

జన సంసేవ్యవిధానమున్ దలతువా చాల్ నీ ప్రతాపంబులున్

కని నా పద్యపు మాలలన్ గొనదె వాక్కాంతాదరంబొప్పగా

మనసా నీకిది భావ్యమా? వదులుకోమా? దుష్టసంవాసముల్. ౫

తనకున్ తానుగ వచ్చినంత మనకంతా లోకువే యంచు నీ

వనరాబోకుము యెల్ల జీవులకు రావా దుర్దశల్ దుఃఖముల్

మనకంటెన్ బలవంతు లుండదగరా మర్యాద నీకున్నదా

మనసా నీకిది భావ్యమా? వదులుకోమా? దుష్టసంవాసముల్. ౬

అనుమానంబులు యాత్మ న్యూనతలు నీకాసాంతమున్నుండులే

ధన సంపాదన యొక్కటే మనకు నిత్యంబంచు నీవందువే

యనసూయంబుగ చిత్తముండ దగదా యగ్రాసనంబొల్లవా?

మనసా నీకిది భావ్యమా? వదులుకోమా! దుష్టసంవాసముల్.౭

తనవారెవ్వరొ కానివారెవరొ నీ తారుణ్య సౌఖ్యంబులో

తనివిందీరక ప్రాకులాడుటలు యేతత్భ్రాంతితో సాగుటల్

తనువే శాశ్వతమన్న ప్రాతిపదికన్ ధర్మంబె యోచింపుమీ

మనసా నీకిది భావ్యమా‌? వదులుకోమా! దుష్టసంవాసముల్. ౮

అనురాగంబది వేరు మోహమది వేరంచున్ జనాకర్షణం

బన వేరంచు నెఱుంగవే పరువపుం బాంధవ్యమాశ్చర్యమౌ

కనుగప్పున్ నిను దుష్ట భాషణము లాకర్ణింప జేయున్ గదా

మనసా నీకిది భావ్యమా? వదులుకోమా! దుష్టసంవాసముల్. ౯

జనసామాన్యము లెక్కజేయదని దౌర్జన్యంబు సాగింతుమే

జనసామాన్యమె నిగ్గదీయునని  సచ్చారిత్రమున్ కొందుమే

మన సౌలభ్యము ధర్మ సమ్మతము నీ మాత్రంబు యోచింపమే

మనసా నీకిది భావ్యమా? వదులుకోమా! దుష్టసంవాసముల్.౧౦

పని లేదంచును పిల్లి బుఱ్ఱ గొఱుగన్ సంభావ్యమా! చోద్యమా!

విన లేదంచును కర్ణముల్ దునిమి సావేరీ భళీ! యందుమే?

కనలేదంచును గంతలుంచి పగలా కాదా యనన్ మాన్యమా?

మనసా నీకిది భావ్యమా? వదులుకోమా! దుష్టసంవాసముల్. ౧౧

వినువీధిన్ ధృవతార వలెన్ వెలుంగ వలదే యెల్లప్పుడున్ కీర్తితో

కనుగో కంచర గాడిదంచు యటుపక్కన్ వచ్చు వారన్నచో

మనకెట్లుండునొ యూహజేయ దెలియున్ మర్యాద యేమయ్యెడిన్

మనసా నీకిది భావ్యమా? వదులుకోమా! దుష్టసంవాసముల్. ౧౨

నిను వారింపగ బ్రహ్మకైన తరమా నిన్నాపు వారేరిలన్

మనికిన్ మున్నుగ నీ మనం బదుపులో మళ్ళింప లేకున్నచో

విను నిన్నెవ్వరు లెక్కజేతురు మహోద్వేగంబుతో జెల్లునే

మనసా నీకిది భావ్యమా? వదులుకోమా! దుష్టసంవాసముల్. ౧౩

తన స్వార్ధంబె యనర్ధమౌనని మహోదారంబుగా సాగమం

చును నేజెప్పిన మిన్నకుండెదవు వాచ్యోత్కర్ష వాక్యంబులన్

విని చిత్తంబున మేలుకీళ్ళ నెఱుగన్ వేవేల మేలేయగున్

మనసా నీకిది భావ్యమా? వదులుకోమా! దుష్టసంవాసముల్.౧౪.

వనితా విత్తము మ్రింగ నేర్చితివి సర్వాపత్కరం బయ్యె నీ

జనతాలోచన లంతకంతకును సౌజన్యస్ఫురద్రత్నమా

వనితా రూపము యింట నుంట నీ వ్యాఖ్యానముల్ జెల్లునా

మనసా నీకిది భావ్యమా? వదులుకోమా! దుష్టసంవాసముల్. ౧౫

మనసారన్ నిను గొల్వనీ  జనని! మీమాంసా హరంబైన నా

మనసెల్లప్పు డుపాసనా నియతి సన్మార్గంబులో నిల్చినన్

మన కే లాభము గల్గెనంచు ధనహేమంబుల్ యపేక్షించుటల్

మనసా నీకిది భావ్యమా? వదులుకోమా! దుష్టసంవాసముల్.౧౬

కనుజూపున్ గల యప్పుడే దవిలి యాకారంబు గుర్తించుచో

కనుపింపన్ ఫలముండుగాని చరమాంకంబందు దర్శించినన్

నిను గుర్తింతునొ పోల్తి పట్టనవదో నిన్నంచనంజెల్లునే 

మనసా నీకిది భావ్యమా? వదులుకోమా! దుష్టసంవాసముల్. ౧౭

కనులున్ వీనులు స్వాస్థతన్ గలిగి నాకన్నార్పకన్ జూడనే

విననే నీ మృదుభాషణాద్భుతములన్ వేసారి పోనీయకో

జననీ! యంచును మ్రొక్కినన్ కరగునా చండీ మనంబందువా?

మనసా నీకిది భావ్యమా? వదులుకోమా! దుష్టసంవాసముల్. ౧౮

ప్రణతుల్ జేయుట ప్రస్తుతించుట వృధా ప్రారబ్ద మెట్లున్నదో

చను నట్లే బ్రతుకంచు నీ శ్రమయె వాచాలత్వ రాహిత్యమే

మనలన్ జేర్చును గమ్యమంచు వినబోమా వాదనల్ నిల్చునా

మనసా నీకిది భావ్యమా? వదులుకోమా! దుష్టసంవాసముల్. ౨౯

ఒనగూడెన్ గద సౌఖ్యసంపద లనేకోత్కృష్టముల్ చాలవే

మును నీ పూజల వల్లనే యఘములున్ మున్నాపదానంతముల్

మనకేలాగున దాపురించె మఱచేమా యంచు వాదించకే

మనసా నీకిది భావ్యమా? వదులుకోమా! దుష్టసంవాసముల్. ౨౦

తనువే శాశ్వతమా? సుఖంబులను 


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home