Thursday, August 13, 2020

శ్రీ చక్ర సంచారిణీ

 శా.

శ్రీ విద్యా విభవాంతరంగ!  ఘన సుశ్రీవై సదా నా మదిన్

నీ వాల్లభ్యము గల్గనిమ్ము కవితా నీరాజనమ్ముల్ మహా

భావా వేశముతోడ నర్పణము సంభావ్యమ్ము గానిమ్ము నీ

సేవా భాగ్యమనన్య సామ్యముగదా శ్రీ చక్ర సంచారిణీ.౧


సాంగోపాంగ వివర్ధమాన క్రమ మాసాంతంబు నాకబ్బనీ

శృంగేరీ గురు సంప్రదాయమున విజృంభింపుమీ జ్ఞానమున్

గంగాసంగమ నీటిలో స్నపనుడై కాంచీపురాధీశ్వరీ!

చెంగున్ బట్టితి కావవే వరద! నన్ శ్రీ  చక్రసంచారిణీ! ౨

మ.

సరఘల్ నా తలపుల్ సదాభ్రమర సంచారమ్ములై దుర్ధరా

కరమై యొక్కొక తూరి భూరి సంఘర్షమ్ము జేకూర్చుచో

వరమై వచ్చిన మంత్ర తంత్రముల సావాసంబుతో నెట్టుచున్

స్థిర చిత్తంబున నీదు మ్రోల మనెదన్ శ్రీ చక్ర సంచారిణీ. ౩

మ.

మును నే జేసిన పున్నెమో యితరమో ముద్దారగా నాకు నే

ర్పిన తల్దండ్రుల నిశ్చయమ్మొ నిను నర్చింపం దొరంకొంటి దీ

వెనతో నా గురు లగ్ర భాగ్యమిడినన్ వేదోక్త విద్యన్ వరిం

చిన భాగ్యంబిది నీ కృపా ఫలమనన్ శ్రీ చక్ర సంచారిణీ.౪


మనసెల్లప్పుడు దైవకార్యముల నామంత్రించుటన్ చక్కగా

చనువొప్పంగను విద్య నేర్పుటకు తచ్చాడున్ మహానందమౌ

నని యత్నింపగ నెన్ని క్లేశములొ యెన్నాళ్ళుండునో యాయువున్

చినుగన్ జేయకు నాదు యాశయములన్ శ్రీ చక్రసంచారిణీ.౫


నిను సేవించుచు నీ పయిన్ కవితలన్ నే జెప్పుచున్ బోవ జా

లిన నా భాగ్య మనంతమౌను యనుకూలింపం దయాసాగరీ

వినతుల్ జేయుచు వేడుకొంటి నిను శ్రీ విద్యా మహారాజ్ఞి!చే

సిన పాపంబుల నెంచకమ్మ  జననీ! శ్రీ చక్ర సంచారిణీ. ౬ 

శా.

సంతోషంబుగ నింటనుండక నెదో సాధించు పేరాశతో

పంతంబొప్పగ సాగి నందులకు లబ్దంబయ్యె దారిద్ర్యమున్

యెంతోకొంత శుభంబు నిత్తువని నాయీ యాపదన్ ద్రుంతు వం

చెంతో నమ్మితి భక్తవత్సలతవే! శ్రీ చక్రసంచారిణీ! ౭


అంబా! శాంభవి! నిత్యకృత్యములు యీయా యాపదల్ శక్తి లే

కం బోరాడ దరంబె?  యట్టి బలమున్ కాసింత నాకీయవే

డంబాలాపముజేసినానె??తగువాడన్ గానె? నీ చేయూతకున్

సింబధ్వంసము జేయవే మనసుకున్. శ్రీ చక్రసంచారిణీ.౮

శా.

ప్రారబ్దం బెటులున్నదో యటులె సంప్రాప్తించు సంభావ్యముల్

నీ రాజ్యంబున ప్రతిహారినై మనియెదన్ నీసేవలో మ్రగ్గెదన్

యే రీతిన్ నను స్వీకరింతువొ త్వదీయేచ్ఛా ప్రకారంబుగా

జీరం గోరెద భద్రదా! శుభప్రదా! శ్రీ చక్రసంచారిణీ. ౯


నాలో నేనగుచున్ శుభాయతన విన్నాణంబు నిర్మించుచో

హేలా భావపరంపరల్  తగునె? నా యిచ్ఛాశుభాకాంక్షలన్

కాలాధిక్యము పొందనీక నిజమున్ గానిమ్ము పోనిమ్ము నా

శీలమ్మున్ నిరపాయమై మిగులనీ శ్రీ చక్రసంచారిణీ.౧౦

మ.

కలరే వేరెవరో ననున్ మనుచు సంకల్పంబుతో నిత్తఱిన్

గలరే మాన్పగ నన్యులీ యిడుము లాకర్ణించి రక్షింపగన్

గల నీవొక్కరు మౌనముద్ర దనియంగా నెట్లగున్ శాంకరీ!

సెలవిప్పించిన చాపచుట్టెదను మా! శ్రీ చక్రసంచారిణీ. ౧౧


ఏలా నెత్తిన బెట్టుకుంటి బడి నేడేలా విచారించుటల్

యేలా మంచి పనంచు నే దిగితి నేడేలా ధనాభావంబుతో

కాలక్షేపమె కష్టమై బ్రతుకు నిక్కంబింక కష్టంబె నా

శీలంబిప్పటితో యకాలహరమా? శ్రీ చక్రసంచారిణీ. ౧౨

శా.

సంసారమ్మను బంధనమ్మునకు నా సాంగత్యమంతంతయే

హంసానంద వివేకమున్ దవిలి యాయానందవల్లీ సదా

సంసేవారతి గోరు నామతికి యీషణ్మాత్ర మైం హ్రీంలకున్

శ్రీం సంయుక్త విభూతి నాకొసగవే శ్రీచక్రసంచారిణీ. ౧౩

మ.

అనుకూలంబుగ నొక్కమారు కలలో సాలంకృతాదీప్తితో

కనువిందౌచును మున్ను సాంబశివునిన్ కన్నార దర్శించినన్

జననంబందిన దింత సార్థకతకం చాసాంతమున్నుండనే

చినుగన్నీకుము భావవస్త్రమును మా! శ్రీచక్రసంచారిణీ.౧౪

మ.

పదిలంబైనది నీదు మంత్రమదియే భాగ్యంబు నాబోటికిన్

మదిసింహాసనమౌ మదీయ పలుకుల్ మంత్రార్థసంపన్నమౌ

మృదు భావంబుల నీదు సేవలను సమృద్ధిన్ యొసంగన్  తరిం

చెద నమ్మా! భవహారిణీ! పరుల! యో శ్రీచక్రసంచారిణీ. ౧౫

శా.
ఏ శీతాంసు ఖరాంశు యంశువులొ యేయే యొజ్జలాశీస్సులో
రాశీభూతములై మహా విభవ ప్రారబ్దాంతరోదంచితా
రాశీ సమ భాగ్యమై నెలకొనెన్ రాకేందు బింబాననా!
శ్రీ రాజ్ఞీ! నిను నిత్యమున్ గొలువగా శ్రీ చక్ర సంచారిణీ! ౧౬

శా.

ఏలా యీ నరజన్మ నిచ్చితివి నన్నేలా గృహస్థై చనన్

శీలా మాలపు చింతలన్ గడుపగా చింతించి శాసించితో

యేలా కానల ముక్కుమూసుకొని నే నెల్లప్పుడున్ భక్తితో

శ్రీ లాలిత్య పధమ్ము నుండ మనవో  శ్రీ చక్ర సంచారిణీ. ౧౭

శా.

ఏలా నా మెడ నంటగట్టితివి? నీ యీవింతియా? భ్రాంతియా?

యాలున్ చూలని వేసరింపగను యాయాసంబుతో ద్రిమ్మరన్

చాలన్ జాల యఘమ్ములన్  సలుపగన్ సంసార భారంబునన్

శ్రీ లావణ్య విహారిణీ! శిఖరిణీ! శ్రీ చక్ర సంచారిణీ! ౧౮

శా.

అంతా మోహ వశమ్మె యీ బ్రతుకునన్ అంతా స్వకీయమ్మె లే

దింతైనన్ పరపీడనారహిత మంతే గాని యోచింప రా

వంతైనన్ సుమనస్కులై పరహితం బాసాంతమున్ సదా

చింతాక్రాంత మనోగతిన్ దునుమవే శ్రీ చక్ర సంచారిణీ.౧౯

శా.







0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home