Friday, December 4, 2020

పోతన పద్యాలు. 2

 పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

   (౨౬ వ పద్యం)

మ.

హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై

రయజాత శ్రమతోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో

జయమున్ పార్థున కిచ్చువేడ్క నని నా శస్త్రా హతిం జాల నొ

చ్చియు బోరించు మహానుభావు మదిలో జింతింతు నశ్రాంతమున్.

భావం:

గుఱ్ఱపు డెక్కల నుండి ఎగిసి పడిన దుమ్ముతో ముఖంమీద బూడిద పూసినట్లుండగా నీలి ముంగురులు ముఖంమీద పడగా రథాన్ని వేగంగా నడపడంలో కలిగిన చెమటబిందువులతో ఎఱ్ఱని కందగడ్డలా ఉన్న ఆ నిండైన ముఖంతో ఎలాగైనా అర్జనుడికే విజయం చేకూర్చాలనే పట్టుదలతో యుద్ధంలో నా బాణప్రయోగముల వలన కలిగిన దెబ్బలు చాలా నొప్పి కలిగించినా సరే అర్జనునిచేత యుద్ధం చేయించే ఆ మహానుభావుని నిరంతరం నా మనస్సులో ఆలోచించెదను.

సందర్భం: అంపశయ్య పైనున్న భీష్ముని వద్దకు శ్రీ కృష్ణ సమేతంగా చూడవచ్చిన పాండవులతో భాషించి కృష్ణుని ప్రార్థించు సందర్భం లోనిది.

విశేషం:

కృష్ణుని అవతార పురుషుడుగా భావించిన భీష్ముడికి కృష్ణ చరిత్ర అంతా తెలుసు. అయినా ఆయన కృష్ణుని తలచుకున్నప్పుడల్లా యుద్ధంలో సైంధవ వధనాటి కృష్ణుడే స్ఫురణకు వస్తునాడు. కారణం ఆరోజు సూర్యాస్తమయం లోగా సైంధవుడిని సంహరించలేక పోతే అస్త్ర సన్యాసం చేస్తానన్న కిరీటి ప్రతిజ్ఞ ఒకపక్క. రెండోపక్క భీష్ముడే స్వయంగా సేనాధిపత్యం వహించి సైంధవుణ్ణి రక్షించాలనే పట్టుదల. కృష్ణుడికి ముచ్చెమటలు పట్టించిన ముచ్చట అది. అందుకే భీష్ముడికి ఆ సన్నివేశం అంత ఇష్టం.

(సశేషం)


పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు

  (౨౭ వ పద్యం)

మ.

నరుమాట ల్విని నవ్వుతో నుభయ సేనా మధ్యమక్షోణిలో

బరు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచున్ 

బర భూపాయువు లెల్ల జూపులన శుంభత్కేళి వంచించు నీ

పరమేశుండు వెలుంగు చుండెడును హృత్పద్మాసనాసీనుడై.

భావం:

బావా ఒకసారి రథం ఆపు. నాకు భయంగా ఉంది అన్న అర్జనుడి మాటలు విని రెండు సైన్యాలకీ మధ్యలో అందరూ చూసేలాగ రథం ఆపి శత్రు సైన్యాన్ని చూపిస్తూ తన చూపులతోనే ఆ శత్రు రాజుల ఆయుష్షులను మెఱుపులా హరించివేయు ఆ పరమాత్మ అయిన శ్రీ కృష్ణుడు నా హృదయ కమలమందు ఉపస్థితుడై ఉండును.

సందర్భం:

అంపశయ్య పైనున్న భీష్ముని వద్దకు శ్రీ కృష్ణ సమేతంగా చూడవచ్చిన పాండవులతో భాషించి కృష్ణుని ప్రార్థించు సందర్భం లోనిది.

విశేషం:

సేనయో రుభయో ర్మధ్యే రథం స్థాపయమే౭చ్యుత!

అన్న కిరీటి మాటలు విని నవ్వుకున్నాట్ట కృష్ణుడు.

వెఱ్ఱి బాగులోడు కాకపోతే నా బంధువులు దాయాదులు మొదలైన వారినందరినీ ఎలా చంపడం? అలా గెలిచి సంపాదించిన రాజ్యంవల్ల లాభం ఏమిటి?అనుకున్నాడుగా అర్జనుడు.అంచేత

నకాంక్షే విజయం కృష్ణ! నచ రాజ్యం సుఖానిచ

అని చెప్పేసాడు ఞచేసాట్ట. ఆ ఘనుడు నా మనో ఫలకం మీద తిష్ట వేసి ఉంటాడు అని అన్నాడు భీష్ముడు.

మరి భీష్ముడు కోపంతో అన్నాడా? లేక ఎద్దేవా చేసాడా? లేక నిజంగా భక్తితో నమస్కరించిడా అన్నది మన మానసిక పరిపక్వత మీద ఆధారపడిన విషయం. మీరే సమాధానం చెప్పుకోవాలి.

(స శేషం)



పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు

       (౨౮ వ పద్యం)

సీ.

కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి

        గగన భాగంబెల్ల గప్పి కొనగ

నుఱికిన నోర్వక నుదరంబు లోనున్న 

        జగముల వ్రేగున జగతి గదల

జక్రంబు చేబట్టి చనుదెంచు రయమున 

         పైనున్న పచ్చని పటము జాఱ

నమ్మితి నాలావు నగుబాటు కానీకు

          మన్నింపు మని క్రీడి మఱల దిగువ

తే.గీ.

గరికి లంఘించు సింహంబు గరణి మెఱసి

నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు

విడువు మ‌ర్జున యంచు మద్విశిఖ వృష్టి

దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.

భావం:

రథం మీదనుంచి కుప్పించి కిందకు గెంతినప్పుడు చెవుల కుండలాలు అటూఇటూ ఊగగా ఆ కాంతి ఆకాశం అంతటా వ్యాపించగా

(సూర్యాస్తమయం లోగా సైంధవుని సంహరించటం దుర్లభం అనే అసహనంతో రథం మీదనుంచి గెంతేడట.)

అలా గెంతడం వలన తన కడుపులో నున్న లోకాల కదలికల అదటుకి ఈలోకం కూడా కదలగా

సుదర్శన చక్రం చేత్తోబట్టుకుని నా మీదకు పరుగెత్తుకు వస్తూవుంటే భుజాన వున్న పచ్చని ఉత్తరీయం జారిపోవగా

బావా నా శక్తిని నేను నమ్ముకున్నాను. ఇలా నువ్వు తలపడితే పదిమందిలో నవ్వుల పాలు కానా? మన్నించు అని అర్జనుడు వెనక్కి లాగుతుండగా

ఏనుగు మీదకు ఉఱుకుతున్న సింహమువలె ఉఱుకుతూ ఎలాగైనా ఈరోజు భీష్ముని చంపి నిన్ను రక్షిస్తా, విడిచిపెట్టు అర్జునా అంటూ నేను వేస్తున్న ఎడతెఱిపి లేని బాణలకు తలొగ్గుతూ వస్తున్న ఆ కృష్ణుడనే దేవుడే దిక్కు నాకు.

సందర్భం:

భీష్మ స్తుతి.

విశేషం:

కృష్ణుని ప్రత్యక్ష దైవంగా భావించేవాడు భీష్ముడు. ఆరోజు సైంధవ వధ జరగాల్సిఉంది సూర్యాస్తమయం లోగా. అర్జునుడి వల్లకావటం లేదు. గోవిందుడికి చెమటలు పట్టేేస్తున్నాయి. ఉద్విగ్నత పెఱిగి పోతోంది.

రెండోపక్క భీష్ముడే సైన్యాధిపత్యం వహించి సైంధవుణ్ణి కాపాడే పనిలో ఉన్నాడు.

తన దైవమే తన మీదకు యుద్ధానికి వస్తున్నా తను చేపట్టిన సైన్యాధిపత్యానికి వన్నె తెచ్చేలాగ యుద్ధం చేసాట్ట భీష్ముడు. ఆఖరికి కృష్ణుడికీ చెమటలు పట్టించిన అద్భుత సన్నివేశం.

మన ఉద్యోగ ధర్మమా? వయక్తిక ధర్మమా? అనే స్పర్థ వచ్చినప్పుడు వయక్తిక ధర్మాన్ని కాదని ఉద్యోగధర్మాన్ని పాటించాలి అనే ధర్మ సూక్ష్మం వివరించ బడింది. ఇది మనం గ్రహించాలి.

ఈ పద్యం చదివి ఒక్కసారి కళ్ళుమూసుకుని ఆలోచిస్తే  ఉద్రేకంతో కృష్ణుడు రథం మీంచి ఉఱకడం పరుగెత్తడం బావా అంటూ అర్జనుడు వెనక్కి లాగడం అనే దృశ్యం మన కళ్ళకు కట్టినట్లు చేసిన పోతనగారి వర్ణన మహాద్భుతం.

ఈ పద్య స్ఫూర్తితో 30 సంవత్సరాలు పనిచేసాను. (As per rule, without fear or favour).అందుకే ఈ పద్యం అంటే నాకు చాలా ఇష్టం.

(సశేషం)



పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు

      (౨౯ వ పద్యం)


మ.

ఒక సూర్యుండు సమస్త జీవులకు దా నొక్కొక్కడై తోచు పో

లిక నే దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ

న్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూ

పకుడై యొప్పుచునుండునట్టి హరి నే బ్రార్థింతు శుద్ధుండనై.

భావం:ఉన్నది ఒకడే సూర్యుడు. జీవరాశి సమస్తానికీ ఒకొక్కరికీ ఒకో రకంగా కనిపించి నట్లే ఆ పరమాత్మ సర్వకాల సర్వావస్థల యందూ తన మహా లీలతో తననుండి ఉత్పన్నమైన ప్రాణుల గుంపుల హృదయ సరస్సులలో అనేక రూపములతో కనిపించే ఆ శ్రీ హరికి నిష్కల్మషుడనై మ్రొక్కెదను.

విశేషం:

ఉన్నది ఒక సూర్యుడే అయినా ఒకొక్కరికీ ఒకో రకంగా కనిపిస్తాట్ట. ఉదా: పద్మాలకు మిత్రుడుగా కలువలకు శత్రువుగా. దిన చరులకు వేల్పుగాను నిశాచరులకు నిప్పుగాను కనిపిస్తాడట. కొందరికి దైవంగా మరికొందరికి ఒక గ్రహం లాగ ఇలా తలో రకంగా కనిపించడంలో దోషం లేదు. అలాగే అనేక రూపాలలో కనిపిస్తాడు. అతడు ప్రత్యక్ష నారాయణుడే. "ఏకం సత్ విప్రా బహుథా వదంతి"

అన్న శృతి వాక్యం మనం గుర్తుంచుకోవాలి. అంచేతనే ఒక్కొక్కరి హృదయ కమలంలో ఒకో రకంగా కనిపించడం లేదా వికసించడం భగవంతుని ఔదార్యానికి మచ్చుతునక అన్నమాట.

(స శేషం)



పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

(౩౦ వ పద్యం)

ఉ.

కుయ్యిడ శక్తి లే దుదర గోళములోపల నున్న వాడ ది

క్కెయ్యది? దా ననాథ నని యెప్పుడు తల్లి గణింప విందు నే

డి య్యిషు వహ్ని వాయుటకు నెయ్యది మార్గము? నన్ను గావ నే

యయ్య గలండు? గర్భ జనితాపద నెవ్వ డెఱుంగు దైవమా!

సందర్భం:

ఉత్తర గర్భస్థ శిశువుడైన పరీక్షిత్తు పై అశ్వత్థామ చే ప్రయోగింపబడ్డ బ్రహ్మశిరోనామకాస్త్రం ఉదరగోళం మీద మంటలు జనింపచేయగా కడుపులో నున్న పరీక్షిత్తు దైవాన్ని ప్రార్ధించే ఘట్టం లోనిది.

భావం:

ఏడవడానికి కూడా శక్తిలేని పిండాన్ని. కడుపులో నున్న నా కొడుక్కి దిక్కెవ్వరని అనాథనని తల్లి రోదించగా వింటున్నాను. ఈ బాణాగ్నిని చల్లార్చే మార్గం ఏమిటి? నన్ను రక్షించే వారెవరు? తల్లి కడుపులో ఉండగానే నాకు వచ్చిన ఆపద ఎవరికి తెలుసు?

విశేషం:

అశ్వత్థామ బాణాగ్ని ఉత్తర గర్భం మీద కూడా పడింది. తననూ పుట్టబోయే బిడ్డనూ కాపాడమని ఉత్తర ఏడవడం సహజమే. ఈ విషయం గ్రహించిన కడుపులో ఉన్న బిడ్డడు కూడా వాపోతాడు. బాహ్య.  ప్రపంచంలో జరిగేవి తల్లి ఆలోచనలూ మాటలూ పుట్టబోయే పిల్లలకూ తెలుస్తాయి.



పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు

   ( ౩౧ వ పద్యం )

శా.

పుట్టంధుండవు పెద్దవాడవు మహాభోగంబులా లేవు నీ

పట్టెల్లం జెడిపోయె దుస్సహ జరాభారంబు పై గప్పె నీ

చుట్టాలెల్లను బోయి రాలు మగడున్ శోకంబునన్ మగ్నులై

కట్టా! దాయల పంచ నుండ దగవే కౌరవ్య వంశాగ్రణీ!

సందర్భం:

కౌరవులందరూ యుద్ధంలో వీరమరణం పొందిన పిదప యుధిష్టరుడు రాజ్యపాలన చేస్తుండగా ధృతరాష్ట్రుడు గాంధారితో పాండవుల ఇంట కాలక్షేపం చేయుచుండగా విదురుడు విరక్తి మార్గమును సూచించు సందర్భం లోనిది.

భావం: ఓ కౌరవ వంశ మహాసయా! ధృతరాష్ట్రా! నీవు జన్మతః గ్రుడ్డివాడవు. ఇపుడు వయోధికుడవు. భోగాలన్నీ అంతరించి పోయాయి. నీ వైపు వారంతా గతించి పోయారు. వార్ధక్యము ఆవహించింది. నీ చుట్టాలు ఆలుమగలు ఎవరూ లేరు. దాయాదుల పంచన ఉండవలసిన వాడవా!

విశేషం:

పాండవులను నానా అగచాట్లకూ గురిచేసినా సుయోధనాదులను గద్దించలేదు. తనుకూడా భీముణ్ణి అంతం చేయాలని ప్రయత్నించాడు. చివరకు తనవారంతా మరణించినా తాము మిగిలి పోయారు. ఆ పాండవులే దిక్కయ్యారు. పిల్లలకు బుద్ధి చెప్పని గుడ్డివాడికి పిండం వండుకోమని భీముడు ఎగతాళి చేసినా నోరుమూసుకుని పడి వుండవలసిన దుస్తితి నీకు అవసరమా అంటాడు విదురుడు. విధి ఎలా వక్రించిందో చూడండి. అందుకే అన్నదమ్ములను దాయాదులకూ అన్యాయం చేయరాదని గ్రహించాలి.

  (స శేషం)



పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు

    (౩౨ వ పద్యం )

శా.

అన్నా! ఫల్గున! భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందు డా

పన్నానీక శరణ్యు డీశుండు జగద్భద్రాను సంధాయి శ్రీ

మన్నవ్యాంబుజ పత్రనేత్రుడు సుధర్మామధ్య పీఠంబునం

దున్నాడా ! బలభద్రుగూడి సుఖియై యుత్సాహియై ద్వారకన్.

సందర్భం:

అర్జనుడు ద్వారకనుంచి వచ్చి కృష్ణ నిర్యాణము చెప్పు సందర్భం లోనిది.

భావం:

నాయనా! అర్జునా! భక్తులయందు వాత్సల్యముగలవాడు, వేదస్వరూపమైనవాడు, గోవులకు ఇష్టమైనవాడు, ఆపదలందున్నవారికి శరణు ఇచ్చేవాడు ఈశ్వరడు, లోకరక్షకుడు, పుండరీకాక్షుడు అయిన కృష్ణుడు తన కొలువులో 'సుధర్మ' మండపం మధ్యలో సింహనంపైన, అన్న బలరాముడు పక్కనుండగా సుఖంగా ఉత్సాహంగా ఉన్నాడా?

విశేషం:

ధర్మరాజుకు ఎన్నో దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. ద్వారక వెళ్లిన కిరీటి ఆప్పుడే తిరిగి వచ్చాడు. కళ్ళు నులుపుకుంటూ నిలబడ్డాడు. తన ఆతురతను ఆపుకో లేక, మనసులో ఏదో కీడు సంకిస్తూ ధర్మరాజు అర్జునుని అడిగే క్రమంలో ప్రశ్నల పరంపర. ఏదో ఆదుర్దాలో ఉన్నప్పుడు ఇది లోక సహజం. మా నాన్నగారు ఎవరైనా ఊరెళ్ళి వస్తే ఈ పద్యంతో పలుకరించేవారు.

తమ్ముడైన అర్జనుడిని అన్నా అని ధర్మరాజు సంబోధించుతాడు.  తెలంగాణా లో అందరినీ అన్నా అని అనే అలవాటు పోతన నాటికే ఉందన్నమాట.

(సశేషం)


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

 ( ౩౩ వ పద్యం )

మ.

ఇభజిద్వీర్య! మఖాభిషిక్తమగు నీ యిల్లాలి ధమ్మిల్లమున్

సభలో శాత్రవు లీడ్చినన్ ముడువ కా చంద్రాస్య దుఃఖింపగా

నభయం బిచ్చి ప్రతిజ్ఞ చేసి భవదీయారాతికాంతి శిరో

జ భరశ్రీలు హరింపడే? విధవలై సౌభాగ్యముల్ వీడగన్.

సందర్భం:

అర్జనుడు కృష్ణ నిర్యాణ వార్తను చెప్పి కృష్ణునితో తమ అనుబంధాన్ని స్మరించుకునే సందర్భం లోనిది.

భావం:

కరికి లంఘించు సింహం వంటి వీరుడా! రాజసూయ యాగంలో అవభృద స్నానం చేసి పునీతమైన ద్రౌపది శిరోజములను పట్టుకొని ఆ శత్రువులు సభకు ఈడ్చుకొని రాగా ఆ శిరోజములను ముడివేసుకోకుండా అట్లే విడిచి ఆమె రోదిస్తుంటే కృష్ణుడు ద్రౌపదికి అభయం ఇచ్చి ప్రతిజ్ఞ చేసి శత్రువుల భార్యల శిరోజములను తొలగునట్లు చేయలేదా? శత్రువులు యుద్ధం లో మరణించగా వారి భార్యల సౌభాగ్యములు పోయి విధవలైనప్పుడు ముండనములు చేయబడలేదా?

విశేషం:

ఆరోజు దుశ్శాసనుడు ద్రౌపదిని కొప్పు పట్టుకుని ఈడ్చుకు వచ్ఛి నప్పుడు తను ఏడుస్తూ ఉంటుంది. అర్జనుడు లేవబోతే ధర్మరాజు వారించాడు. పాండవులందరూ మిన్నకుండిపోయారు. అందుకే నీ యిల్లాలి ధమ్మిల్లమున్ అని అర్జనుడు అనడం. ఆయన వారించక పోతే అక్కడే కథ ముగిసి పోయేది అని అర్జనుని లోతలంపై ఉండవచ్చు.

 ( సశేషం )


పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు

    ( ౩౪ వ పద్యం )


శా.

వైరుల్ కట్టిన పుట్టముల్ విడువగా వారింప నా వల్లభుల్ 

రారీవేళ నుపేక్ష సేయదగవే? రావే? నివారింపవే? 

లేరే త్రాతలు కృష్ణ! యంచు సభలో లీనాంగియై కుయ్యిడన్ 

గారుణ్యంబున భూరి వస్త్ర కలితంగా జేయడే? ద్రౌపదిన్.

సందర్భం:

కృష్ణునితో అర్జనుని గత స్మృతుల లోనిది.

భావం:

శత్రువులు కట్టిన బట్టలను విప్పేస్తుండగా అడ్డుకొనేందుకు నా భర్తలు రారు. ఓ కృష్ణా! నువ్వు కూడా చూసీ మిన్నకుందువా?  రావా? కావవా? నన్ను రక్షించే నాథులే లేరా? అని చేతులను గుండెలకు హత్తుకొని ముడిచిపెట్టుకు పోయిన ద్రౌపది దీనాలాపములు విని భూరి వస్త్రాన్ని ప్రసాదించలేదా?

విశేషం:

ఆమెకు భర్తలు ఒకరూ ఇద్దరూ కాదు ఐదుగురు. ఆ ఐదుగురు సభలో ఉండగానే వారి భార్యని కొప్పు పట్టుకుని లాక్కొచ్చాడు దుశ్శాసనుడు. భర్తలలో ఏ ఓక్కరూ కిమన్నాస్తి యని నోరెత్తలేదు ఆ దుర్మార్గుణ్ణి నివారించలేదు. ఆరోజు ధర్మరాజు కనుసన్నలతో అర్జనుడు భీముడు ఆగిపోవలసి వచ్చింది. ఆమె దీనాతి దీనంగా కృష్ణునికి మొఱ పెట్టుకుంటే విని అదృశ్య హస్తంతో భూరి వస్త్రాన్ని ఇచ్చి ఆమె మానాన్ని కాపాడేడు.

భూరి అంటే 1 ఆంకె పక్కన 32 సున్నాలు కొలత. ఆ రోజుల్లో మూర తో కొలిచిన ఆ వస్త్రం పొడవు 100000000000000000000000000000000 మూరలన్న మాట. ఆయన అంత దయామయుడు.

ఇక్కడ ద్రౌపది శిరోజాలు అవభృదస్నానంతో పునీతమైన విషయం మాత్రమే పోతన చెప్పగా భారతంలో తిక్కన గారు మరో ఆడుగు ముందుకు వేసారు. అదీ చూద్దాం. 

ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టాన్ని నెమరుకు తెచ్చుకున్న అర్జనుడు పోతన చేతిలో

అదే ఘట్టాన్ని గుర్తు చేసిన ద్రౌపది తిక్కన కలంలో ఎలా రూపుదిద్దుకున్నారో చూడండి.

భారతంలో కృష్ణుడు సంధి కోసం కౌరవుల చెంతకు వెళ్ళేముందు ద్రౌపది తన అభిప్రాయం చెప్పే సందర్భం. విషయం అదే.

" నీవు సుభద్రకంటె గడు నెయ్యము గారవముం దలిర్ప సం

భావన సేసినట్టి నను బంకజనాభ! యొకండు రాజసూ

యావభృదంబునందు శుచియై పెనుబొందిన వేణిబట్టి యీ

యేవురు చూడగా సభకు నీడ్చె కులాంగన నిట్లొనర్తురే. ( ఉద్యోగ. 310)

ఉ.

ఆ సభ కేక వస్త్ర యగునట్టి ననున్ గొని వచ్చి నొంచు దు

శ్శాసను జూచుచున్ పతులసంభ్రములై తగు చేష్ట లేక నా

యాసలు మాని చిత్రముల యాకృతి నున్న యెడన్ ముకుంద! వి

శ్వాసము తోడ నిన్ గొలువ వచ్చె మనంబదియున్ దలంపవే? (ఉద్యోగ.311)

ద్రౌపది ఏక వస్త్ర అయి ఉంది. (అంటే నెలసరి సమయంలో మూడు రోజులు ఒకేబట్టతో ఉండేవారు). అప్పుడు ఆ ఆడవారిని తాకరాదనేది ఆచారం.

తిక్కన గారిది నాటకీయ ప్రయోగం. ద్రౌపదికి ఓపలేనంత కోపం వచ్చినా ఆ సమయంలో ఆ సభలో రచ్చ చేసుకోకుండా కృష్ణుని ప్రార్ధించింది. ఆపద్బాంధవుడు ఆదుకున్నాడు. ఈ అయిదుగరూ ఉన్నారు రాతి బొమ్మల్లాగ కనీసం ఇల్లాలిని కాపాడుకోవాలని కూడా తోచని దిక్కుమాలిన మౌనంతౌ  అని తన అక్కసు వెళ్ళగక్కింది.

పోతన గారిది లలిత పద పారిజాతం.

తిక్కన గారిది నాటకీయ నవలా విన్యాసం.

(స శేషం)



పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు

     ( ౩౪ వ పద్యం )

శా.

ఆ తేరా రథికుండు నా హయము లా యస్త్రాసనం బా శర

వ్రాతం బన్యుల దొల్లి జంపును దుదిన్ వ్యర్థంబులై పోయె మ

చ్చేతోధీశుడు చక్రిలేమి భసితక్షిప్తాజ్య మాయావి మా

యతంత్రోషరభూమి బీజముల మర్యాద న్నిమేషంబునన్.

సందర్భం: కృష్ణుడు పక్కన లేకపోవడంతో తన శక్తి సామర్ధ్యాలు ఉడిగిపోయినవని అన్నకు చెప్పునప్పటిది.

భావం:

అదే రథం, అదే రథం ఎక్కిన కిరీటిని, అవే గుఱ్ఱాలు, అదే విల్లు, అవే తూణీరాలు యిదివరకు యితరులను చంపేవి ఇప్పుడు వృధా అయిపోయినవి. నాకు చైతన్యాన్ని కలిగించే కృష్ణుడు లేకపోవడంతో ఒక్క నిమిషంలో   అవి బూడిదలో పోసిన నెయ్యి వలె మాయావి పై ప్రయోగించిన మాయాతంత్రం వలె చవిటి పఱ్ఱ (ఊషర క్షేత్రం) లో జల్లిన విత్తనముల వలె మిగిలినవి.

విశేషం:

అది ఒక మానసిక ఆందోళన. ఒంటి చేత్తో ఉత్తరగోగ్రహణంలో విజయం సాధించిన కఱ్ఱి ఈరోజు వెఱ్ఱి వాడివలె మిగిలాడు. అర్జనుడి మనోబలం అంతా ఆ నల్లనివాడే. ఆ మనోబలం కోల్పోయాక శారీరక బలం నిరుపయోగం. ఎవరి ప్రాపకంలో మనం ఎదుగుతామో వారినుండి వేరుపడితే ఒడ్డున పడ్డ చేపలా ఉంటుంది పరిస్థితి అని మనం గ్రహించవలసింది.

( స శేషం )




పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు

   (౩౫ వ పద్యం)

ఉ.

పోము హిరణ్యదానములు పుచ్చుకొనంగ, ధనంబు లేమియుం

దేము, సవంచనంబుగ దీవెన లిచ్చుచు వేసరింపగా

రాము,వనంబులన్ గృహవిరాములమై నివసింప జెల్లరే! 

పామును వైవగా దగునె? బ్రహ్మ మునీంద్రు భుజార్గళంబునన్.

సందర్భం:

అడవికి వేటకు వెళ్ళిన పరీక్షిత్తు దాహంతో మంచినీటికోసం వెతుకుతూ ఒకముని ఆశ్రమం చేరతాడు. శమీక మహర్షి తపోనిష్ఠలో సమాధి స్థితిలో ఉండటంతో పరీక్షిత్తు ప్రశ్నలకు బదులు చెప్పలేదు. దానికి కోపగించిన రాజు చచ్చిన పాముని శమీకుని మెడలో వేసి వెళ్ళిపోతాడు. ఆ విషయం శమీకుని కమారుడైన శృంగికి ఇతర మునికుమారుల వలన తెలుస్తుంది. దానికి శృంగి కోపించి పరీక్షిన్మహరాజును శపించే సందర్భం లోనిది.

భావం :

ఎవరి వద్దనూ బంగారం దానంగా ఇస్తామన్నా సరే దానికోసం పోలేదే!

అలాంటి వాటికని వెళ్ళి ధనం తెచ్చుకోవడం లేదే! దీవిస్తాను (మోసపూరితమైన మాటలతో) డబ్బులిమ్మని విసిగించ లేదే! 

ఇల్లు వాకిలి వదులుకొని అడవిలో చిన్న ఆశ్రమంలో కూడా ఉండనివ్వరా! బ్రహ్మర్షి యైన యీయన మెడలో చచ్చిన పామును వేయడం తగునా?

విశేషం:

నిత్యాగ్నిహోత్రులతోను, నిత్యానుష్టాన సత్వగుణ సంపన్నులతోను మునిపుంగవులతోను, జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ అది అంతే. వారి ఆగ్రహంతో వచ్చేమాట ప్రతిదీ అక్షర సత్యమై తీరుతుంది. వారి శాపం మహా ప్రమాదం.

పోతన స్వయంగా తన మనోవృత్తినే ఈ పద్యంలో పలికాడని ప్రతీతి. ఏ రాజాశ్రమాలకో పోయి నాలుగు పద్యాలు చెప్పో లేక తను వ్రాసిన భాగవతం అంకితమిచ్చో ధన కనక వస్తు వాహన ధరణీ సంపదలు పొందవచ్చు. కాని అందుకు ఇష్టపడక స్వచ్ఛందవృత్తిచే వచ్చు గంజి మేలని నమ్మిన వాడు. అందుకే తన ఆభిమతాన్ని అంత గొప్పగా చెప్పాడు. ఇది ఒక వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం.

ఈ పద్యం మా నాన్నగారి నోటంట తఱచూ వినబడేది. ఆ ప్రభావం చాలా ఎక్కువగా పనిచేసింది. అందుకే ఈ పద్యం చాలా ఇష్టం.

( స శేషం)


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

   ( ౩౬ వ పద్యం)

ఉ.

ఏటికి వేట బోయితి? మునీంద్రుడు గాఢ సమాధి నుండగా

నేటికి దద్భుజాగ్రమున వేసితి సర్పశవంబు దెచ్చి?  నే

డేటికి బాప సాహసము లీ క్రియ జేసితి? దైవయోగమున్

దాటగ రాదు వేగిరమ తథ్యము కీడు జనించు ఘోరమై.

సందర్భం:

పరీక్షిన్మహరాజు శృంగి వలన శాపం తెలుసుకొని విచారించునప్పటిది.

భావం:

అసలు వేటకు ఎందుకు వెళ్ళాను? శమీక మహర్షి మంచి సమాధిస్థితిలో ఉండగా చచ్చిన పాముని ఆయన మెడలో ఎందుకు వేసాను? ఈ పాపపు పని ఎందుకు చేసాను? ఇదంతా దైవ యోగం. దానిని దాటగలమా? ఘోరమైన కీడు తప్పదు.

విశేషం:

అనాలోచితంగా నేను ప్రభువును అనే అహంకారంతో చేసిన దుశ్చర్యకు పర్యవశానం మరణం రూపంలో ఎదురైంది. కేవలం ఆ ముని తనను గుర్తించలేదనే దురహంకారము.

కాని ఆ ముని బాహ్యస్పృహ లేకుండా సమాధిస్థితిలో ఉన్నాడు. ఆయనకు పాము శవం వేసిన విషయం కూడా తెలియలేదు. మరి మునికుమారుడు నూనూగు మీసాలవాడు.శపించి వదిలాడు.

అందుకే సాధువుల సత్పురుషల జోలికి అనవసర రాద్ధాంతాలకూ తగాదాలకూ పోగూడదు.

(సశేషం)


పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు

  ( ౩౭ వ పద్యం )

ఉ.

పాము విషాగ్ని కీలలను బ్రాణము లేగిన నేగు గాక యీ

భూమియు రాజ్యమున్ సతుల భోగము బోయిన బోవు గాక సౌ

దామిని బోలు జీవనము తథ్యముగా దలపోసి యింక నే

నేమని మాఱు దిట్టుదు? మునీంద్రకుమారకు దుర్నివారకున్.

సందర్భం:

పరీక్షిత్తు తన తప్పును తెలుసుకొని తను ప్రతిచింత చేయక పోవుటను చెప్పునప్పటిది.


భావం:

ఏ సర్ప విషాగ్నికో నా ప్రాణము పోతే పోనీ, ఈ భూమి రాజ్యము వనితా సౌఖ్యములు పోతే పోనీ ఇంకా మెఱుపు తీగ వంటి జీవితమే శాశ్వతమని అనుకొని అనివార్యమైన ఆ ముని కుమారుడిని ఎలా తిట్టగలను?

విశేషం:

ఆత్మ విమర్శ అనేది సన్మార్గ గమనానికి ఎంతో ఆవశ్యకం. చేసిన పని ఆడిన మాట గుఱించి ఎప్పటికప్పుడు వితర్కించు కోవడం ఉత్తమ గుణ సంపన్నుల లక్షణం.

పరీక్షిత్తుకు తను చేసిన పని తప్పని తెలుసు కనుక ముని కుమారుడు శపించినా ప్రతిచర్యకు ఆలోచించ లేదు. అదే మోక్షానికి దారి తీసింది.

ప్రతిచర్య తీసుకుంటే కథ మరోలా ఉండేది. ఉదా:

మహాభారతం ఆది పర్వంలో ఉదంకోపాఖ్యానంలోకి తొంగి చూద్దాం.

ఉదంకుడు గురుపత్ని ఆజ్ఞమేఱకు పౌష్యరాజపత్నిని అడిగి కుండలాలు తేవడానికి బయలుదేరి ఎట్టకేలకు పౌష్యమహరాజును దర్శించుతాడు. సాదరంగా ఆహ్వానించి భోజనం పెడతాడు మహరాజు. ఖర్మకాలి భోజనంలో ఒక తలవెండ్రుక వస్తుంది. అది దోషం. అందుకు ఉదంకుడు "కేశ దుష్టంబైన యన్నంబు పెట్టిన వాడవంధుండవు గమ్మ"ని శపించేసాడు రాజుని. అసలే పౌరుషం ఎక్కువ. అంచేత "అనపత్యుండవు గమ్మ" ని ప్రతి శాపంబిచ్చెను. నువ్వు శాపం వెనక్కి తీసుకో అంటే నువ్వే వెనక్కి తీసుకోవాలని వాదన. రాజుకు ఆ శక్తి యుక్తులు లేవని వాదించాడు రాజు.

ఉ.

నిండు మనంబు నవ్యనవనీత సమానము పల్కు దారుణా

ఖండలశస్త్ర తుల్యము జగన్నుత విప్రుల యందు నిక్కమీ

రెండును రాజులందు విపరీతము గావున విప్రుడోపు నో

పం డతి శాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మఱింపగన్.

ఇదీ ఆయన వాదన.

పౌష్యమహరాజు లౌక్యం ఉపయోగించాడు. రాజ్యం నిలబెట్టుకున్నాడు.

పరీక్షిన్మహరాజు ధర్మం నిలబెట్టాడు. మోక్షం పొందాడు.

అంచేత ఏదేని తెలియకో కారణాంతరాల వల్లనో తప్పు చేస్తే ఆ తప్పును సమ్మతించడమే మేలు. అలా కాదని ఎదురు తిరిగితే ఎక్కడో ఒకచోట హాని కలుగుతుంది. అది మనం గ్రహిస్తే చాలు.

  ( స శేషం )



పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు

  ( ౩౮ వ పద్యం )

మ.

తులసీ సంయుత దైత్య జి త్పదరజస్తోమంబు కంటెన్ మహో

జ్జ్వలమై దిక్పతి సంఘ సంయుత జన త్సౌభాగ్య సంధాయి యై

కలి దోషావళి బాపు దివిష ద్గంగా ప్రవాహంబు లో 

పలికిం బోయి మరిష్యమాణు డగుచున్ బ్రాయోపవేశంబునన్.

సందర్భం:

పరీక్షిత్తు మునికుమారుని శాపవశంగా ఏడు రోజులలో మరణం తథ్యమని నిశ్చయించుకొని గంగానదీ తీరంలో ప్రాయోపవేశంబునకు సన్నద్ధుడగు సందర్భంలోనిది.

భావం:

తులసీ దళములతో అలరారుతూ  రాక్షసులను జయించిన శ్రీ హరి పాదరేణువుల కంటె 

చాలా ప్రకాశవంతమై దిక్పాలకులతో గూడి ప్రజలందరకూ సౌభాగ్యాన్ని ప్రసాదించునదియు కలి దోషములను బోగొట్టునది అయిన పవిత్ర దివిజ గంగా ప్రవాహంలోనికి దిగి ప్రాణములను ఉపసంహరించుకొనుటకు సిద్ధపడెను.

విశేషం:

మరణం ఎప్పుడో అనేది యెవరికీ తెలియని విషయం. కాని ఆ మరణం ఎప్పుడగునో ముందే తెలిస్తే తగు జాగ్రత్తలు పాటించడం సహజమే.

పరీక్షిత్తుకి మరణం ముందుగా తెలిసినందున మోక్షప్రాప్తికోసం ఆలోచించాడు. మరణం కాశీలో సంభవించడం శ్రేష్టం. నిజానికి గంగ కల్మషనాశిని. అందుచేత గంగాజలంలో ప్రాయోపవేశం చేయాలనుకున్నాడు.







పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు

   (౩౯ వ పద్యం) ( ద్వితీయ స్కందం )


సీ.

క్షితిపతి! నీ ప్రశ్న సిద్ధంబు మంచిది

      యాత్మవేత్తలు మెత్తు రఖిల శుభద

మాకర్ణనీయంబు లయుతసంఖ్యలు గల

       వందు ముఖ్యం బిది యఖిల వరము

గృహముల లోపల గృహమేధులగు నరు

        లాత్మతత్త్వము లేశమైన నెఱుగ

రంగనారతుల నిద్రాసక్తి జను రాత్రి

         పోవు కుటుంబార్థ బుద్ధి నహము

ఆ.

పశు కళత్ర పుత్ర బాంధవ  దేహాది

సంఘమెల్ల దమకు సత్యమనుచు 

గాపురములు సేసి కడపట జత్తురు 

కనియ గాన రంత్యకాలసరణి.

సందర్భం:

శుకమహర్షికి పరీక్షిన్మహరాజు "ఏమి చింతిస్తే ఏమి జపం చేస్తే ఏమి చేస్తే ముక్తి పొందనగును?" అని అడిగిన ప్రశ్నకు శుకుడు బదులు చెప్పే సందర్భం లోనిది.

భావం:

ఓ మహారాజా! నీ వడిగిన ప్రశ్న శ్రేష్టమైనది. దీనిని ఆత్మతత్త్వం తెలిసినవారు మెచ్చుకుంటారు. లోకంలో వినవలసిన విషయాలు పదివేలుగా (అనేకం) ఉన్నాయి. అందులో ఇది చాలా ముఖ్యమైనది. గృహస్థులైన మానవులు ఆత్మ తత్త్వమును తెలుసుకోకుండా ఉంటారు.

కుటుంబ పోషణ నిమిత్తం పగలు, నిద్ర సతీసంగమంలతో రాత్రి గడచిపోతాయి. పశువులు, ఇల్లాలు, సంతానము, బంధువులు, ఈ దేహము శాశ్వతమనునట్లు జీవించి తుదకు మరణింతురుగాని అంత్యకాల దుర్దశలను తెలుసుకొనరు.

విశేషం:

తెలుసుకోవలసిన విషయాలు అనేకం ఉన్నాయి. అయుతం అంటే పదివేలు. తెలిసినది శూన్యం. తెలుసుకోవాలని కూడా అనిపించకపోవడం మహా దౌర్భాగ్యం. సన్యాసులు మునులు మొదలగు వారేకాదు గృహస్థులు కూడా మోక్షానికి అర్హులే.అందుకే

కామి గాని వాడు మోక్షగామి గాడు.

అన్నారు. దానికి ఉన్న మార్గాలు ఏమిటి? 

ఖట్వాంగుడు రెండు ఘడియలలో ముక్తి సాధించలేదా?

పరీక్షిన్మహరాజు ఏడురోజులలో ముక్తి పొందాడు.

భాగ్యవంతులు చిఱుతప్రాయం నుంచి ఆ మార్గాలలో పయనిస్తారు. ముముక్షువులు కాగలరు.

అభాగ్యులు ఎప్పటికీ ఆ ఆలోచనలు చేయలేరు.

( స శేషం )



పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

    ( ౪౦ వ పద్యం )

సీ.

కమనీయ భూమి భాగములు లేకున్నవే?

              పడియుండుటకు దూది పఱుపులేల?

సహజంబులగు కరాంజలులు లేకున్నవే?

              భోజన భాజన పుంజమేల?

వల్కలాశాజినావళులు లేకున్నవే?

              కట్ట దుకూల సంఘాతమేల?

గొనకొని వసియింప గుహలు లేకున్నవే?

              ప్రాసాద సౌధాది పటలమేల?

తే.

ఫల రసాదులు గురియవే? పాదపములు

స్వాదు జలముల నుండవే? సకల నదులు

బొసగ బిక్షంబు వెట్టరే? పుణ్యసతులు

ధనమదాంధుల కొలువేల? తాపసులకు.

సందర్భం:

శుకమహర్షి ముక్తిమార్గములను వివరించుతూ మానవులలో బుద్ధిమంతులు ఇహసౌఖ్యములకై ఆరాటపడరని చెప్పు సందర్భం లోనిది.

భావం:

పడుక్కుని విశ్రమించడానికి దూది పఱుపులు అవసరమా? నేలమీద శయనించ లేమా?

పుట్టుకతో వచ్చిన చేతులు దోసిళ్ళు లేవా? భోజనమునకు గరిటలు  గిన్నెలూ ఎందుకు?

కట్టుకోడానికి నారబట్టలు, తోలు బట్టలు లేవా? పట్టు పీతాంబరాలు కావాలా?

ఉండడానికి గుహలు లేవా? మేడలు మిద్దెలు ఏల?

చక్కటి పళ్ళను ఇచ్చే చెట్లు

తియ్యటి నీటిని ఇచ్చే నదులు

అడిగితే బిక్ష వేసే పుణ్య స్త్రీలు 

ఉండగా

భగవద్భక్తితో బ్రతికే వారికి డబ్బుందని గర్వపడే అధముల సేవ ఎందుకు?


విశేషం:

సంసార బంధంలో చిక్కుకున్న వారికి ధనార్జనే ధ్యేయం. కాని అది దుఃఖహేతువు. దానితో అన్నీ చిక్కులే. అందుకే త్యాగయ్య

నిధి చాల సుఖమా? రాముని సన్నిధి చాల సుఖమా? అనే ప్రశ్న లేవనెత్తాడు

ధర్మం ఏమిటంటే ఏరోజుకి సరిపోవునంతయే ఆరోజు సంపాదించుకోవాలి. సంపాదన నిలువ ఉంచరాదు.

ఆదిశంకరులు ఎనిమిది సంవత్సరాల వయస్సులో బిక్ష కోసం వెళ్ళి ఒకరింటి ముంగిట బిక్షాం దేహి మాతా! అన్నపూర్ణేశ్వరీ! అని అడిగితే ఆ గృహిణి ఒక అమలకం అంటే ఉసిరికాయ తీసుకొచ్చి ఖాద్యపదార్థం ఇదొకటే ఉంది. స్వీకరించమంటుంది.

అంత దారిద్ర్యం ఎలా భరిస్తునారమ్మా? అని అడిగితే ఆమె

నా భర్త ధర్మం తప్పని మనిషి. ప్రతిరోజూ ఆరోజుకు సరిపోయేటంత మాత్రమే సంపాదించాలి కాని సంపదను నిలువ చేయరాదు అనే ధర్మానికి కట్టుబడి ఉన్నాము. ఆయన బిక్షాటనంకు వెళ్ళారు. ఇంకా రాలేదు. అని చెబుతుంది. ఆ తరువాత కథ మనందరికీ తెలిసిందే.

అంచేత సంపద మీద వ్యామోహం మంచిది కాదు అనేది సారాంశం.

ఇదే అభిప్రాయం భర్తృహరి ఎలా చెప్పాడో చూద్దాం.

తే.

తరువు లతిరస ఫలభార గుఱుత గాంచు

నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు

డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత

జగతి నుపకర్తలకు నిది సహజ గుణము.


ఒకవేళ సంపాదించి కూడబెట్టామే అనుకోండి. దురహంకారానికి పోగూడదంటాడు భర్తృహరి.

పండ్లనిచ్చే చెట్లు ఆ ఫలాల బరువుచే క్రిందకు వంగి అందుబాటులో ఉంటాయి.

ఆకాశంలో వ్రేలాడుతూ ఉండి కూడా మేఘం అమృత తుల్యమైన నీటిని వర్షిస్తుంది. ఎంచేతనంటే

నాకింత ఉంది అని గొప్పలు పోరు బుద్ధిమంతులు. కారణం లోకోపకారం కోసం బ్రతికే వారికి ఇది జన్మతః వచ్చిన సుగుణం.

అందుకే పంచుకుంటేనే పెంచుకుంటావు అంటారు రమణులు.

పోతనకు ఈ ధనమదాంధులైన ప్రభువుల కొలువులు అంటే కిట్టదు.  వారిచ్చే సంపదలను కాదని 'సమ్మతితో హరికిచ్చ జెప్పె నీ బమ్మెర పోతరాజొకడు" అంటాడు.

ఆయన ఏమి తిని బ్రతికాడో తెలీదు. కాని ఆయనని తలచుకోని తెలుగువాడు ఉండడు. తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన పేరు అలానే ఉంటుంది. అదీ అసలైన సంపద.

ధూర్జటి కూడా రాజుల సేవలను నిరసించాడు కాని ఆందులో ఒక అహంకారం ఉంటుంది. పోతన నిగర్వి.

( స శేషం )



పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

   (౪౧ వ పద్యం)

మ.

పరుడై యీశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భువస్థాన సం

హరణ క్రీడనుడై త్రిశక్తి యుతుడై యంతర్గత జ్యోతియై

పరమేష్ఠి ప్రముఖామరాధిపులకున్ బ్రాపింప రాకుండు దు

స్తర మార్గంబున దేజరిల్లు హరికిన్ దత్త్వార్థినై మ్రొక్కెదన్.

సందర్భం:

శుకుడు భక్తి మార్గమే ముఖ్యమైనదని చెప్పి శ్రీ హరిని స్తుతించు సందర్భంలోనిది.

భావం:

సమస్త ప్రాణులకూ వేరొకడు, ప్రభువు, చాలా మహిమ గలవాడు, సృష్టి స్థితి లయములను క్రీడించువాడు మూడు రకముల శక్తి గలవాడు, హృదయాంతరములందు ప్రకాశించువాడు,బ్రహ్మ మరియు ఇతర స్వర్లోక ప్రముఖులకు కూడా లభించని క్లిష్టమార్గమున ప్రకాశించు శ్రీ హరికి ఆతని తత్త్వము తెలుసుకొనుటకై ప్రార్థింతును.

విశేషం:

పరమాత్మ తత్త్వం కాని, స్వరూపం గాని బ్రహ్మాది ప్రముఖలకు కూడా విపులంగా తెలియరానిది. ఆయనే పరుడు. లోకంలో ఉన్న మనకు ఆయనే పరుడు. కాదంటే నేను కాని వారందరూ పరులే. ఆ యీశ్వరుడే పరుడు. ఎవరికి వారు తను తప్ప మిగిలిన వారందరూ ఆ పరుని ఆత్మస్వరూపులే అంటే పరమాత్మలే. ఆయనకు మూడు శక్తులూ ఉన్నాయి.

అవి:

1.ఇచ్ఛాది. అది మరలా ఇచ్ఛా జ్ఞాన క్రియా అనే మూడు రకాలు.

2. ఉత్సాహాది : ఉత్సాహమము, ప్రభుత్వం, మంత్రము అని మూడు రకాలు

3. సత్త్వాది: సత్త్వ రజస్ తమో అని మూడు రకాలు.

ఇక ఆయన బ్రహ్మాది దేవతలకు కూడా పూర్తిగా తెలియరాని వాడు.

భగవద్గీత లో ఇదేమాట చెప్పబడింది. చూడండి.

శ్లో.

యంబ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతస్తున్వంతి దివ్యైః స్తవైః

వేదైస్సాంగ పదక్రమోపి నిషదైర్గాయంతియం సామగాః

ధ్యానవస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో

యస్యాంతన్న విదుః సురాసురగణాదేవాయ తస్మై నమః.


(వేదాలలో ప్రస్తుతించ బడినవానికి, యోగులు మనో నేత్రంతో ఎవరిని చూడగలరో అతనికి , ఎవరిని

బ్రహ్మాది దేవత లందరు స్తుతిస్తూ ఉంటారో అతనికి నా నమస్సులు.)

పోతనగారే మరోచోట ఇలా అంటారు.

జలజాతాసన వాసవాదులున్ మనములో చర్చించి భాషావళిన్

పలుకన్ లేని జనార్ధనాహ్వయ పరబ్రహ్మంబు మీ యింటిలో….

అటువంటి భగవత్స్వరూపం ఇదమిత్థమని ఎవరు చెప్పగలరు? 

తస్కరుడికి తస్కరుడుగాను కపర్ధికి కపర్ధిగాను కనిపించడం ఆయన ధర్మం. ఆ పరమాత్మ బొందిలో ఉంటే శివం బయటపడితే శవం అన్నారు. బొందిలో ఉన్న ఆయన ఎలా ఉంటాడు అంటే నారాయణ సూక్తం చెప్పింది.

తిర్యగూర్ధ్వ మధశ్శాయీ రశ్మయస్తస్య సన్తతా

సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకః

తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః।।

నీలతోయదమధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా

నీవారసూక వత్తన్వీ పీతాభా౭స్వస్త్యణూపమా

తస్యా ౭ శ్శిఖాయమధ్యే పరమా౭త్మ వ్యవస్థితః.।

అని.

అటువంటి పరంజ్యోతికి మనంకూడా ప్రణతులు తెలుపుకుందాం.

( స శేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

   ( ౪౨ వ పద్యం )

మ.

తపముల్ సేసిననో మనో నియతినో దానవ్రతప్రీతినో

జపమంత్రంబులనో శ్రుతిస్మృతులనో సద్భక్తినో యెట్లు ల

బ్దపదుండౌనని బ్రహ్మ రుద్ర ముఖరుల్ భావింతు రెవ్వాని న

య్యపవర్గాధిపు డాత్మమూర్తి సులభుండౌగాక నా కెప్పుడున్.

సందర్భం:

శుకమహర్షి విష్ణుమూర్తిని స్తుతించు ఘట్టం.

భావం:

ఆ పరమాత్మ అనుగ్రహం పొందడానికి బ్రహ్మ రుద్రుడు మొదలగువారు 

తపస్సు చేయడమా? నిశ్చల మనస్సుతో సమాధి పొందడమా? మంత్రానుష్ఠానం చేయడమా? వేద వేదాంతాలను అభ్యసించడమా? మంచి భక్తిని అలవరచుకోవడమా? 

ఏ రకంగా మనకు ఆ పరుడు లభించగలడు అని మల్లగుల్లాలు పడతారో ఆ పరమేశ్వరుడు ఆత్మలన్నింటికీ మూలమైనవాడు నాకు సులభంగా లభించుగాక.

విశ్లేషణ:

ప్రణతులు చేసే వ్యక్తి ఒక మహాత్ముడు. ఆయనకు గోవు పాలు పితికేందుకు పట్టేంత సమయం కన్నా ఎక్కువ సేపు కాలు ఎక్కడా నిలవదు. మనస్సు భగవంతుని మీదనుంచి పక్కకు తొలగదు. ఆయనకి ఒంటిమీద స్పృహ కూడా ఉండదు. అదీ ఆ వైయాసి లక్షణం. మఱి ఆయనకు భగవంతుడు సులభంగా లభించడా?

మఱి మనది కోరికల చిట్టాతో కూర్చునే భక్తి. మనం అర్చనాదుల సంకల్పంలో ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం క్షేమ స్థైర్య …….అంటూ చేంతాడంత జాబితా చెబుతాం. అందుకే మనకి అంత సులభుడు కాడు భగవంతుడు. మనవి ఐహిక  అవసరాలు. అవి దాటితే కదా పరాకాంక్షితంలోకి వెళ్ళగలం.

నిష్కామం అంటే ఏ కోరికా లేని నిరామయమైన మనస్సు కలిగి ఉండటం. భగవత్సాక్షాత్కారం అయినా మోక్షం అయినా అవి కూడా కోరికలుకావా? కాకపోతే పరాకాంక్షితాలు అవి.

ఐహికాముష్మికాలు రెండూ కోరుకునే తెనాలి రామలింగడు మనసులు మనవి అని మనవి.

కాదంటారా? లోకంలో ఉన్న జనం అందరూ ముక్కు మూసుకుని కూర్చుని జపం తపం తప్ప వేరేది వద్దని కూచుంటే మరి ప్రజాపతి కార్యం ఎలా సాగేది? అప్పుడు మర్త్యలోకం తపో లోకం అయిపోదూ. అందుకే మనకి ఇహలోక వాంఛారతి ఎక్కువ.

( స శేషం )


పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు

  ( ౪౩ వ పద్యం )

మ.

అణువో కాక కడున్మహావిభవుడో యచ్ఛిన్నుడో

 ఛిన్నుడో

గుణియో నిర్గుణియో యటంచు విబుధుల్ గుంఠీభవత్తత్త్వ మా

ర్గణులై యే విభు పాదపద్మ భజనోత్కర్షంబులన్ దత్త్వ వీ

క్షణముం జేసెద రట్టి విష్ణు బరమున్ సర్వాత్ము సేవించెదన్.

సందర్భం:

శుకమహర్షి సృష్ట్యాది రహస్యములను పరీక్షిత్తుకు వివరించుటకు ఉద్యుక్తుడైన సందర్భం.

భావం:

భగవంతుడు అతి సూక్ష్మమైన అణువా? లేక ఊహకే అందని విరాడ్రూపుడా? అతను దేశకాలాదుల ప్రకారం విభజించుటకు వీలుపడనివాడా? లేక వీలుపడువాడా? సత్త్వ రజస్తమో గుణములనే గుణత్రయములు కలవాడా? గుణాతీతుడా? అని వృధా తర్కవితర్కములు చేసిచేసి తెలుసుకొనలేక ప్రజ్ఞానిధులు చేతులెత్తివేసి ఎవరి పాదాపద్మలను కీర్తించుచూ తాత్విక దృష్టితో తెలుసు కొందురో అటువంటి పరమాత్ముడు సర్వాత్ముడైన విష్ణువును కొలచెదను.

వ్యాఖ్య:

"యద్భావం తద్భవతి" అని ఎవరు ఏ రూపంతో ఊహించుకుంటే ఆ రూపంతో అలరించేవాడు భగవంతుడు. ధర్మసంస్థాపన కోసం అవతార మెత్తినప్పుడు ఆయన గుణసంపన్నుడే. శేష సమయంలో నిర్గుణుడు.

అలాగే ఆయనకు ఒక రూపం అంటూ చెప్పలేం. భక్తుల ఊహాచిత్రాలకు యదార్థభావం ఆయన. అందుకే ఆయన అరూపి మరియూ అపురూపి కూడా. ఆయన ఎవరికీ మామూలుగా కనిపించడు. తత్త్వ వీక్షణం చేయాల్సిందే. "విమూఢా నాను పశ్యంతి, పశ్యంతి జ్ఞాన చక్షుషః" అని గీతాచార్యుడు విడమరిచి చెప్పాడు. ఆయన పరుడూ పరమాత్మ. అంతేకాదు సర్వాత్మ.

అణువు అంటే కణం. ఈ సృష్టి సమస్తం అణుసంయోగము అంటే కణసమ్మేళనం వల్లనే జరిగింది గాని వేరే మార్గంలో కాదు అని వాదించిన ఋషులూ ఉన్నారు. ఒకాయన మరణ సమయంలో కూడా కణః కణః అంటూ పోయాడట. ఆయనే కణాదుడు. భగవంతుడు లేడు అన్నవాడు కూడా లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది యలోకంబగు పెంజీకటి కావల ఏకాంతంగా ఉన్న వెలుగు ఏమిటో చెప్పలేడు.

 ( సశేషం )


పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు

(  ౪౪ వ పద్యం. )

శా.

నానా స్థావర జంగమప్రకరముల్ నాయంత నిర్మింప వి

న్నాణం బేమియు లేక తొట్రుపడగా నాకున్ సమస్తాను సం

ధానారంభ విచక్షణత్వము మహోదారంబుగా నిచ్చె ము

న్నే నా యీశ్వరు నాజ్ఞ గాక జగముల్నిర్మింప శక్తుండనే.

సందర్భం: 

 నారదుడు చతుర్ముఖ బ్రహ్మను సృష్టి క్రమమును అడుగుట.

భావం:

ఓ నారదా! అనేక రకములైన చరాచర జీవులను సృజించుటకు కావలసిన విజ్ఞానం ఏమాత్రం లేక తడబడుతుంటే నాకు సమస్తమైన అవయవ క్రియా విధానాలను జతపరిచి సృష్టిని ఆరంభింప జేసే విచక్షణను ఆ పరమేశ్వరుడు చాలా ఉదారంగా  ప్రసాదించాడు. లేకపోతే ఈ లోకాలను కల్పించగలనా?

వ్యాఖ్య:

సృష్టిలో ఎనుబది నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయట. ఇవన్నీ సృష్టించడం ఎలాగ? ఒకసారి సృజించాక వాటంతట అవే పునరుత్పాదకతను కలిగి ప్రవర్ధమానం కావాలి. అది అంత సులభమైన పనికాదు. అంచేత ఆ శాస్త్ర పరిజ్ఞానం పరమేశ్వరుడు పరమేష్టికి ఇచ్చాడు. తొలి కల్పనలు బ్రహ్మ చేసిన తరువాత జీవులు తమంత తామే పునరుత్పత్తి చేసుకోడానికి నాలుగు రకాల మార్గాలు నిర్దేశించ బడ్డాయి. అవి. అండజములు, స్వేదజములు, ఉద్బిజములు, యోనిజములు అని.

యోనిజములలో కొందరు మనో సంకల్పం చేత జనించిన వారు ఉన్నారు. వారిని అయోనిజులంటారు. ఇప్పుడు కడుపు కోసి బిడ్డను పైకి తీస్తున్నారు. అలాగ పుట్టిన వారిని అయోనిజలు అనలేం కూడా.

అలాగే ప్రతీ జీవరాశికీ ఒక జీవన విధానం, నిద్ర, ఆహారం, భయం ఇవన్నీ సహజ గుణాలుగా అమర్చి ఒక జీవి మరో జీవికి ఆహారంగా ఏర్పాటు చేయడం అంత తేలికైన పనా?

( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

     ( ౪౫ వ పద్యం )

మ.

నిగమార్థ ప్రతిపాదక ప్రకటమై నిర్వాణ సంధాయిగా

భగవంతుడు రచింప భాగవత కల్పక్ష్మాజమై  శాస్త్ర రా

జి గరిష్టంబగు నీ పురాణకథ సంక్షేపంబుగా జెప్పితిన్

జగతిన్నీవు రచించు దీని నతి విస్తారంబుగా బుత్రకా!

సందర్భం:

బ్రహ్మ నారదునకు భగవంతుని గురించి చెప్పు సందర్భం లోనిది.

భావం:

నాయనా! నారదా! వేద భావమును ప్రకటించునదిగా మోక్షమును కల్పించునదిగా భగవంతుడే దీనిని రచించెను. శాస్త్రములన్నిటికంటే శ్రేష్టమైనది యీ పురాణ కథ. దీనిని క్లుప్తంగా నీకు చెప్పాను. భూలోకంలో నీవు దీనిని చాలా వివరంగా తెలియబరచుము.

విశ్లేషణ : ఆ భగవంతుని పదరాజీవముల జేరు నిర్వాణసోపాన మధిరోహణం అనేది చాలా ముఖ్రమైనది ప్రతివారికీ. అది సాధించడానికి అనేక మార్గాలు ఉంటాయి. భగవంతుడు నాదప్రియుడు కనుక సంగీతం ద్వారా మోక్షం పొందినవారు కొందరుంటే వేదవేదాంగాలు నిర్దేశించిన మార్గంలో కొందరు ముముక్షువు లయ్యారు.

తపస్సులు వేద వేదాంగాలు జపతపాలు వైరాగ్యము ఇలాంటివి అందరికీ సాధ్యపడనివి. అంచేత అందరికీ అందుబాటులో ఉండడానికి భగవత్కథా శ్రవణము/పఠనము/మననము అనేది కూడా ఇచ్చాడు. అది మిగిలిన వాటిలో దేనికీ తక్కువకాదు. అంచేత భాగవతం చదవడమో వినడమో లేక మననం చేసుకోవడమో సామాన్యులు చేయదగిన సులభ మార్గం. 

ఏ మార్గంలో వెళ్ళాలన్నా కొన్ని నియమనిబంధనలకు లోబడి సాధించుకోవాలి. అంతేగాని ఉల్లంఘన చేసి వెళ్ళకూడదు. అంచేత మనకున్న జీవన విధానానికి అనువైనది యెంచుకుని ఆ మార్గంలో కొనసాగాలి.

  ( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

   ( ౪౬ వ పద్యం )

మ.

ఉపవాస వ్రత శౌచ శీల మఖ సంధ్యోపాస నాగ్నిక్రియా

జపదానాధ్యయనాది కర్మముల మోక్షప్రాప్తి సేకూర ద

చ్చపు భక్తిన్ హరి బుండరీకనయనున్ సర్వాతిశాయిన్ రమా

ధిపు బాపఘ్ను బరేశు నచ్యుతుని నర్థిం గొల్వలేకుండినన్.

సందర్భం:

చతుర్ముఖ బ్రహ్మ నారదునకు భగవంతుని చేరు విధమును తెలుపునప్పటిది.

భావం:

శ్రీ హరి, పద్మాక్షుడు, సర్వోన్నతుడు, లక్ష్మీపతి, పాపనాశకుడు, పరుడు అంతములేని వాడు అయిన ఆ విష్ణువును మంచి గురి కలిగిన భక్తితో ఆర్తితో కొలువవలెనే గాని కేవలము ఉపవాసములు, వ్రతములు, ఆచారములు, మంచి నడవడిక, యజ్ఞములు, నిత్య సంధ్యోపాసన, అగ్నిహోత్రము, జపము, దానము,అధ్యయనము వంటి వాటిచే ముక్తి కలుగదు.

విశ్లేషణ :

అచంచలమైన విశ్వాసముతో ధర్మమైన వినతులతో భగవంతుని సన్నిధానం హృదయమందే ఏర్పాటు చేసుకుని సేవించుకోవాలే గాని ఏదో పేరుకి డాంబికంగా చేసే పనుల వల్ల ముక్తి కాదుకదా బాధల నుండి విముక్తి కూడా దొరకదు.

అయితే నిశ్చలమైన భక్తితో కొలచేటప్పుడు ఉపవాసాది కర్మలు (పైన పేర్కొన్నవి ) అన్నీ ఉపయోగములే.

ప్రతీ పథకానికి ఒక సూచన ఉంటుంది. అది షరతులు వర్తిస్తాయి. అని.

ఇక్కడ కూడా 

"అనన్యాశ్చింతయంతో మాం

యే జనాః పర్యుపాసతే

తేషాం నిత్యాభియుక్తానాం

యోగక్షేమం వహామ్యహం."

అనే షరతులతో కూడిన భీమా ఇచ్చాడు భగవంతుడు.

అలా చేసేవారికి ధీమా ఇస్తాడు.

అంచేత " త్వమేవ శరణం మమ" అనీ

" నీవేతప్ప ఇతఃపరంబెరుగ" అనీ హృదయార్పణం చేసుకున్న వారికి మాత్రమే….. 

యోగ క్షేమాలకు భరోసా. దీనిని బట్టి మనం భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఎలాంటి పట్టు పట్టాలో అవగతం కాగలదు.

   ( స శేషం )


పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు

 (  ౪౭ వ పద్యం )


మ.

సతత జ్ఞాన రమా యశో బల మహైశ్వర్యాది యుక్తుం జగ

త్పతి యజ్ఞేశు ననంతు నచ్యుతు దళ త్పంకేరుహాక్షుం శ్రియః

పతి నాద్యంత వికార దూరు గరుణా పాథోనిధిన్ సాత్త్వతాం

పతి వర్ధిష్ణు సహిష్ణు విష్ణు గుణ విభ్రాజిష్ణు రోచిష్ణునిన్.

సందర్భం:

బ్రహ్మకు శ్రీ హరి ప్రత్యక్షమై వరమిచ్చు నప్పటిది.

భావం:

జ్ఞానము,లక్ష్మి , కీర్తి, బలము,సంపదలకు ఎల్లప్పుడూ నిలయమైనవాడు లోకానికి ప్రభువు, ముగింపు లేనివాడు, నాశము కానివాడు, పద్మములవంటి కన్నులు గలవాడు, అందరకూ క్షేమాన్ని ఇచ్చేవాడు ఆద్యంతములు లేనివాడు, కరుణానిధి, సాత్త్వికులకు ప్రభువు ప్రవర్ధమానుడు, అన్నిటినీ భరించువాడు, ప్రకాశవంతమైనవాడు అయిన శ్రీ మహా విష్ణువు (ప్రత్యక్షమయ్యెను).

విశ్లేషణ:

శ్రీ హరి జ్ఞానానికి యశో బల సంపదలకు నిలయుడు. ఆయన లోకేశుడు. అయినా ప్రత్యేకించి " సాత్వతాం పతిః" అన్నారు. రజస్తమో గుణాలు కలవారు, బలవంతులూ కొంతవఱకైనా తమ్ముతాము రక్షించుకో గలరు. సాత్వికుడు తనను తాను రక్షించుకోలేని అసమర్థుడు. అంచేత వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడు. కారణం ఆ అమాయకుడు జన్మతః త్వమేవ శరణం మమ అనే కోవలో వాడు గనుక.

ఇక త్రిమూర్తులు ముగ్గురూ గొప్ప భార్యావాదులే.

ఒకరు సగం శరీరంగా మలచుకొంటే మరొకరు గుండెల్లో దాచుకున్నారు. మూడో ఆయన ముఖంలో స్థానం కల్పించాడు.

ఇంటి ఇల్లాలికి తెలియకుండా ఏమీ జరగను వీలుపడని కట్టడి చేసుకున్నారు. అందుకే వారివి అన్యోన్య దాంపత్యాలయ్యాయి.

( స శేషం )


పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు

    (౪౮ వ పద్యం ) తృతీయ స్కందం.

శా.

కందర్పాంశమునన్ దనూజు బడయం గామించి భూదేవతా

బృందంబున్ భజియించి తత్కరుణ దీపింపన్ ప్రభావంబు పెం

పొందన్ రుక్మిణి గన్న నందనుడు ప్రద్యుమ్నుండు భాస్వ చ్ఛ మూ

సందోహంబులు దన్ను గొల్వ మహితోత్సాహంబునన్.

సందర్భం:

విదురుడు తీర్థయాత్రలు చేయుచూ ఉద్ధవుని దర్శించినప్పటిది.

భావం :

మన్మథ అంశగా కొడుకును కనాలనే కోర్కెతో రుక్మిణి బ్రాహ్మణులను పూజించింది. వారి దీవెనల ఫలితంగా పుట్టిన ప్రద్యుమ్నుడు తన సమస్త సైన్యము సేవిస్తూ ఉంటే ఉత్సాహంగా ఉన్నాడా?

విశ్లేషణ:

మునుపటి తరం గతించి పోయింది. తరువాతి తరం నడుస్తోంది. విదురుడికి నాలుగు తరాలతో అనుబంధం. తనకన్న ముందు వారితో తనతోటివారైన ధృతరాష్ట్ర పాండు రాజులతో తరువాతి వారగు కౌరవ పాండవులతో ఆ తరువాతి వారగు ఉద్ధవుడు ప్రద్యుమ్నుడు సాంబుడు మొదలగు వారితో ఆయన అనుబంధం.

విదురుడు సహజంగా మితభాషి. ధర్మానికీ న్యాయానికీ కట్టుబడిన వాడు. మంచి నీతిశాస్త్రవేత్త. అందుకే ఆయన మాటకు విలువ ఎక్కువ.

ఆయన తనంత తానుగా ఏమీ చెప్పడు. అడిగితేనే చెప్తాడు. అదీ అడిగినంతే చెప్తాడు. అంచేత అతను పొరబడే అవకాశం లేదు. సలహా ఇవ్వడమంటే అలాగ శాస్త్రీయ ధార్మిక న్యాయ బద్ధంగా అడిగినంత మేఱకు చెప్పడం చాలా గొప్ప విజ్ఞత.ఊరకనే ఉచిత సలహాలు ఇచ్చేయ కూడదు.

( స శేషం )


పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు

     ( ౪౮ వ పద్యం )

మ.

అవివేకానుగత స్వకార్య జలపూరాకీర్ణమై మిత్ర బం

ధు వధూ పుత్ర జలగ్రహోగ్ర యుతమై దుర్దాంత మై నట్టి దు

ర్భవ పాథోధి దరించు వారె హరి సంబంధ క్రియా లోల భా

గవతానుగ్రహ నావ లేని యధముల్ కళ్యాణ సంధాయకా!

సందర్భం : విదుర మైత్రేయ సంవాదం.

భావం:

తెలివి తక్కువదనంకొద్దీ చేసిన తప్పులే ఒక సాగరం కాగా మిత్రులు బంధువులు సతీసుతులు అనే జలచరములతో భయంకరమైనట్టి దాట సక్యముకాని సంసార సాగరాన్ని భగవదనుగ్రహం అనే నావ లేకుండా  దాటగలరా?

విశ్లేషణ:

సంసారం ఒక సాగరం. నిజమే. మనకున్న లంపటాలే జలచరాలు. అవి మనల్ని పీల్చి పిప్పి చేసేస్తాయి. అందుకే  " నాతరమా భవసాగర మీదను నళిన దళేక్షణ రామా " అన్నారు.

కానీ ఈ సంసారం అనేది అవివేకంవల్ల ప్రాప్తించిందని యోగులంటే ప్రజాపతి కార్యంగా అనూచానంగా వస్తన్నది అని గృహస్తులు అంటారు. అందరూ యోగులైపోయి అడవిలో ముక్కు మూసుకుని కూర్చుంటే యుగాంతం ఇప్పుడే అయిపోదా?

అంచేత సంసారం సాగరం అయినా నిప్పుల కొలిమి అయినా వద్దనలేని యావ తగిలించాడు భగవంతుడు.

మరి ఈ భవసాగరం దాటడానికి ఉపాయం ఏమిటంటే భగవద్భక్తియే.

ఎందరో పేరుమోసిన నాస్తికులు కూడా భార్యల బలవంతం అనో మరోటనో మొత్తానికి గుడిమెట్లు ఎక్కిన వారు చాలామందే ఉన్నారు.

అయినా భగవంతుడు లేడని ఎవరంటారు? ఎవరూ అనలేరు. ఒక మేధావిని (శాస్త్రవేత్త) సరే భగవంతుడు లేడంటున్నావు. ఈ లోకానికి అవతల పక్కన ఏం ఉంటుంది అనడిగితే సరైన సమాధానం రాలేదు. నాణానికి ఒకవైపు బొమ్మను చూస్తే మరోవైపు బొరుసుంటుంది.

అదేనిజం.ఏకం సత్.

(సశేషం)


పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు

(౪౯ వ పద్యం)


మ.

క్రతు దానోగ్ర తప స్సమాధి జప సత్కర్మాగ్ని హోత్రాఖిల

వ్రత చర్యాదుల నాదరింప వఖిల వ్యాపార పారాయణ

స్థితి నొప్పారెడి నీ పదాబ్జ యుగళీ సేవాభిపూజా సమ

ర్పిత ధర్ముండగు వాని భంగి నసురారీ! దేవ చూడామణీ!

సందర్భం:

బ్రహ్మ విష్ణుమూర్తిని స్తుతించు నప్పటిది.

భావం:

ఓ రాక్షస సంహారీ! శ్రీ హరీ! ఎల్లప్పుడూ నిన్నే స్మరిస్తూ నీ పాదపూజా సమర్పణగా సమస్త కార్యములను చేయువానిని ఆదరించినట్లు నీవు యజ్ఞాలు, దానాలూ,తపస్సులు, సమాధి, జపము, మంచి పనులు చేయుట, నిత్యాగ్నిహోత్రమూ చేయువారిని కూడా ఆదరించవు.

విశ్లేషణ :

సమాజంలో ఒక్కొక్కరికి ఒక్కో సామర్థ్యం ఉంటుంది. ఆందులోనూ ఒకరికి ఎక్కువ సామర్థ్యం మరొకరికి తక్కువ సామర్థ్యం ఉంటాయి. ఇవన్నీ స్తాయీ భేదాలు. ఎవరి స్తాయికి తగినట్లు వారు మసలుకోవడం సహజం. అయితే ఈ తపస్సులు జపాలు దానాలు పూజలూ దండగే నంటారా? అంటే కాదు. అవన్నీ ఎంత చేసినా నీ సమస్త జీవన క్రియ భగవదర్పణంగా జరగాలి. అదీ ఇక్కడ మనం గ్రహించ వలసినది. అలా సమస్తమూ కృష్ణార్పణం అనో అనసూయార్పణం అనో అనేస్తే సరిపోదు. మనస్ఫూర్తిగా అలా అర్పించుకోవాలి. అదే అచ్చపు భక్తి అంటే. తపస్సులు జపాలు దానాలు వాటి ప్రయోజనాలు వేరువేరుగా ఉంటాయి. ఐహిక సుఖమయజీవనం కోసం భక్తి స్వర్లోక సుఖాలకోసం దానధర్మాలు సాయుజ్యం కోసం జపతపస్సమాధులు. ఎవరి స్థాయికి తగ్గది వారు కోరుకుని అనుగ్రహం పొందాలి.

( స శేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

     ( ౫౦ వ పద్యం )

చం.

ధనపశుపుత్రమిత్ర వనితా గృహకారణభూత మైన యీ

తనువున నున్న జీవుడు పదంపడి యెట్టి శరీర మెత్తిన

న్ననుగత మైన కర్మఫల మందక పోవగరాదు మిన్ను వ్రా

కిన భువి దూరినన్ దిశల కేగిన నెచ్చటనైన దాగినన్.

సందర్భం:

కపిలుడు తన తల్లి యైన దేవహూతికి పిండోత్పత్తి విధానం చెప్పునప్పటిది.

భావం:

ధనము, పశువులు,సంతానము, మిత్రులు, స్త్రీలు, గృహములు మొదలగు ఐహిక సంపదలకు కారణమై యీ శరీరంలో ఉన్న జీవుడు యీ శరీరాన్ని విడిచి మరో జన్మ ఎత్తినా సరే ఇక్కడ చేసిన మంచి చెడు కర్మల ఫలితాలను అనుభవించ వలసిందే. ఆకాశంలోకి ఎగిరిపోయినా పాతాళంలో దాక్కున్నా దిగంతాలకు పారిపోయినా సరే యీ కర్మ ఫలం అనుభవించక తప్పదు.

విశ్లేషణ:

అనాలోచితంగానో ఆవేశంతోనో చేసిన తప్పులకు ఏదో పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం వంటి వాటితో కొంత ఉపశమనం కలగవచ్చు. కాని కండబలంతో మందిబలంతో చేసే తప్పులకు ప్రాయశ్చిత్తం లేదు. ఈ పాపాలను కడిగేయడానికి మరో పుణ్యం ఏదీ ఉండదు. పాపఫలం పుణ్యఫలం విడివిడిగా అనుభవించ వలసిందే.

కాశీ వెళ్ళి గంగలో ములిగినా హెలీకాఫ్టర్ లో అమరనాథ్ వెళ్ళిన చేసిన పాపాలు కొట్టుకు పోవు. కట్టి కుడుపుతాయి. అందుకే కన్నూ మిన్నూ కానకుండా తప్పులు చేస్తే భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

సాధారణంగా ఈ జన్మల కర్మఫలం ఈ జన్మలోనే పొందడం జరుగుతుంది. కాకపోతే కొన్ని చాలా పెద్దవిగా ఉంటాయి.అవి ఒక జన్మతో పోవు.  వాటిని అనుగతకర్మఫలంగా తరువాతి జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. ఆ అనుగత కర్మఫలాలే ఈ జన్మలో సామాజిక అంతరాలుగా సృష్టించబడతాయి.

( సశేషం )



పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

  ( ౫౧ వ పద్యం ) చతుర్థస్కంధం

అనయంబున్ దనమానసంబున నవిద్యన్ ముఖ్యతత్త్వంబుగా

గని గౌరీశు దిరస్కరించిన యసత్కర్మాత్ము నీ దక్షుని

న్న నువర్తించిన వారు సంసరణ కర్మారంభులై నిచ్చలున్

జననం బందుచు జచ్చుచున్ మరల నోజం బుట్టుచు న్నుండెడున్.

సందర్భం:

జామాత యైన రుద్రుని గర్హించి దక్షుడు శపించిన పిదప నందికేశ్వరుడు కోపగించి యన్న మాటలలోనిది.

భావం:

ఎల్లప్పుడూ అజ్ఞానంతో తనకు తోచినదే నిజమైన జ్ఞానంగా భావించుతూ శివుని తిరస్కరించిన ఆ దుష్కర్ముడైన దక్షుడిని అనుసరించే వారు చావు పుటకల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండవలసిందే.

విశేషం:

దక్షునికి శివుని మీద కోపం ఎందుకంటే యజ్ఞవాటిక దగ్గరకు ఆయన రాగానే అందరూ "ప్రత్యుత్థానాభి వందనము" లు చేసారు కాని శివుడు చేయలేదు.

సనాతన ధర్మంలో మనం కూర్చుని ఉండగా ఎవరైనా వచ్చి నమస్కారం చేసి నిలబడే ఉంటే మనం కూడా లేచి నుంచుని నమస్కరించాలి. అదే ప్రత్యుత్థానాభివందనం. అదీ భారతీయ సంస్కృతి. ఒకరు నిలుచుని నమస్కరించితే మరొకరు కూర్చుని ప్రతి నమస్కారం చేస్తే అది ఎదుటవారిని అవమానపఱచుటయే.

సరే ఇంటి అల్లుడు కదా అనికూడా ఆలోచించకుండా నానా మాటలన్నాడు మామగారు. అదీ దక్షుడు చేసిన తప్పు. నానా అధర్మపు పనులు చేస్తూ పునరపి జననం పునరపి మరణం వారంతా ఆ దక్షుని అనుయాయులే అన్నమాట.

 ( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

  ( ౫౨ వ పద్యం )

సీ.

దూర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము

                   జలజంబులను జారు జలజనయను

దులసీదళంబుల దులసికాదాముని 

                  మాల్యంబులను వినిర్మమల చరిత్రు

బత్రంబులను బక్షిపత్రుని గడు వన్య

                  మూలంబులను నాది మూలఘనుని

నంచిత భూర్జత్వగాది నిర్మిత వివి

                   ధాంబరంబులను బీతాంబరధరు

తే.

దనరు భక్తిని మృ చ్చిలా దారు రచిత

రూపముల యందు గాని నిరూఢ మైన

సలిలముల యందుగాని సుస్థలములందు 

గాని పూజింపవలయు న క్కమలనాభు.

సందర్భం:

నారదుడు ధృవునికి ద్వాదశాక్షర మంత్రోపదేశము చేసి తపస్సునకు ప్రోత్సహించు నప్పటిదీ.

భావం:

గరికపోచల వలె శ్యామవర్ణము గలవానిని గరికలతోను

పద్మాక్షుని పద్మములతోను

ఎల్లప్పుడూ తులసిమాలను ధరించువానిని తులసి దళములతోను

నిర్మల చరిత్ర కలిగిన వానిని పూమాలలతోను

పక్షి వాహనుని పత్రులతోను 

మూలపురుషుడైన వానిని వనమూలికలతోను

పీతాంబరధారిని బూరుగుదూదితో చేసిన వస్త్రములతో 

మంచి భక్తితో మట్టి, రాయి, చెక్కతో చేసిన మూర్తిని మంచినీటియందు కాని శుచియైన స్థలమునందు గాని పూజించాలి.

విశ్లేషణ:

స్వాయంభువ మనువుకు శతరూప యను భార్యయందు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను ఇద్దరు కొడుకులు. ఉత్తానపాదుడు రాజ్య పరిపాలన చేసాడు. అతనికి సునీతి యను భార్య వలన ధృవుడు, సురుచి వలన ఉత్తముడు జన్మించిరి. ఒకరోజు ఉత్తానపాదుని తొడపై ఉత్తముడు కూర్చుంటే ధృవుడు కూడా అలా కూర్చోవాలని ఆశ పడతాడు.

కాని సురుచి పరుషంగా "తండ్రి తొడమీద కూర్చునుటకు నా కడుపున పుట్టావా? కావాలంటే విష్ణుమూర్తి పాదాలను ఆశ్రయించి నా కడుపున పుడితే నీకుకూడా ఆ యోగం ఉంటుంది అంది.

అంచేత తల్లి అనుమతితో "సపత్నీ మాతృ వాగిషు క్షతంబగు వ్రణంబు భగవధ్యాన రసాయనంబున మాపుకొందు" అని ఆడవికి బయలుదేరగా నారదుడు ద్వాదశాక్షరీ మంత్రోపదేశం చేస్తాడు.

దానితో ధృవుడు మూడు రాత్రుల కొకమారు వెలగ రేగు పండ్లు తింటూ మొదటి నెల, తరువాత ఆరు రోజులకొకసారి ఆకులు గడ్డి తిని రెండవ నెల, తొమ్మిది రోజులకు ఒకసారి మంచినీరు త్రాగుతూ మూడో నెల, ఆ తరువాత పన్నెండు రోజులకు ఒకసారి గాలిని తీసుకుని నాల్గవ నెల, ఆ తరువాత శ్వాసను బంధించి జితశ్వాసుడై ఒంటికాలి మీద నిల్చుని స్థాణువువలె అయిదవ నెల ఏకాగ్ర చిత్తంతో శ్రీ హరికై తపస్సు చేస్తాడు. శ్రీ హరి సాక్షాత్కారం పొందాడు.

అయిదేళ్ళ బాలుడు అంత దుస్సాధ్యమైన తపస్సు చేయవలసినంతగా అతని మనస్సు గాయపడింది. చిన్నపిల్లల మనస్సులు సుతిమెత్తన. వాటిని గాయపరచకుండా అనునయంగా చెప్పి వారిని సన్మార్గగాములను చేయాలి.

అంత మానసిక వేదనకు గురైనవారు అపమార్గం తొక్కడం లోకంలో సహజం. ధృవుడు కారణ జన్ముడు కనుక ఘోరమైన తపస్సు చేసి శ్రీ హరి సాక్షాత్కారం పొందాడు.

  ( స శేషం)


పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు

   ( ౫౨ వ పద్యం )

మ.

ధనహీనుండు నృపాలు జేరి మిగులన్ ధాటిన్ ఫలీకార మి

మ్మని యర్థించిన రీతి ముక్తి ఫలదుం డై నట్టి పంకేజలో

చనుడే చాల బ్రసన్నుడైన నతనిన్ సాంసారికం బర్థి గో

రిన నావంటి విమూఢ మానసులు ధాత్రిన్ గల్గిరే? యెవ్వరున్.

సందర్భం:

శ్రీ హరి ప్రత్యక్షమైనా సరే మోక్షప్రాప్తీ కోరుకోలేక పోయినే అని విచారించు నప్పటిది.

భావం:

పేదవాడు ఏలిక వద్దకు పోయి నూకలు తవుడు అడిగినట్లు నేను మూఢమతిలాగ రాజ్యాధికారం కోరుకున్నానేంటి? ఆ పరమాత్మ చాలా ప్రసన్నమై వచ్చినప్పుడు అలభ్యప్రదమైన మోక్షం కోరుకోవలసిందికదా! ఇలా సాంసారికాలు కోరుకున్న నాలాంటి మూర్ఖులు ఎవరైనా లోకంలో ఉన్నారా?

విశ్లేషణ:

ఏ సంకల్పంతో ఓ పని చేస్తామో ఆ ఫలితం

అందితే ప్రయత్నం ఫలించీనట్లే. ధృవుడు తన సవతి తమ్ముడికి దక్కిన గౌరవస్థానం తనకూ దక్కాలనుకున్నాడు. దక్కింది. ఇంకా రాజ్యమూ రోదశీ మండలంలో సుస్థిరస్థానం ఇవన్నీ దక్కాయి. కానీ లౌకిక చక్రంలో ఇరుక్కుపోయానే. ఇంగితం ఉన్నవాడు ఎవడైనా మోక్షం కోరుకోవాలి అన్న జ్ఞానోదయం ఆలస్యంగా కలిగింది.

తనని సృష్టించిన వెంటనే పిపీలికం అంటే చీమ బ్రహ్మ గారిని ఆత్మరక్షణ కోసం మాకు ఓ వరం ఇమ్మని అడిగింది. సరే కోరుకోమన్నాడు బ్రహ్మ. 

తను ఎవరినైనా కడితే వారు చనిపోవాలని అడుగాలనుకుని "నేను కుట్టగానే మరణించాలి" అని అడిగిందట. తథాస్తు అన్నారు బ్రహ్మగారు.

అనుకున్నదొకటి అడిగింది మరొకటి అయింది ఆఖరికి.

ఓ పండితుడు రాజుగారిని తన మాటవతో మెప్పించాట్ట. ఏంగావాలో కోరుకోమంటే నాకు నూకల జావంటే ఇష్టం. అలాగే మా గోవుకి తవుడు ఇష్టం. అవి ఇప్పించ మన్నాట్ట. చెరో బస్తా ఇప్పించారట రాజుగారు.

అడిగేటప్పుడు దాతని దృష్టిలో పెట్టుకొని అడగాలి.

బలి అంటాడు కదా

వర చేలంబులొ మాడలో ఫలములో వన్యంబులో గోవులో

హరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో

కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో

ధరణీఖండమొ కాక యేమడిగెదో ధాత్రీ సురేంద్రోత్తమా.

విధీ బలీయసీ అన్నారు. ప్రాప్త కాలజ్ఞత అనేది భగవదనుగ్రహం తో వచ్చేది. సమయం మించిపోయాక విచారించి లాభం ఏముంటుంది?

  ( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

( ౫౩ వ పద్యం ) ( సప్తమ స్కంధము )

శా.

కామోత్కంఠత గోపికల్ భయమునన్ గంసుండు వైరక్రియా

సామాగ్రిన్ శిశుపాల ముఖ్యనృపతుల్ సంబంధులై వృష్ణులున్

బ్రేమన్ మీరలు భక్తి నేము నిదె చక్రిం గంటి మెట్లైన ను

ద్దామ ధ్యాన గరిష్టుడైన హరి జెందన్ వచ్చు ధాత్రీశ్వరా.

సందర్భం :

శ్రీ హరిని నానారకాలుగా దూషించిన శిశుపాలుని ఆత్మ కృష్ణునిలో ఐక్యమైనందుకు చకితుడైన ధర్మరాజు నారదుని వివరణ కోరగా నారదుడు చెప్పిన బదులు లోనిది.

భావం: 

కామాతురులై గోపికలు, భయంతో కంసుడు, శత్రుత్వ బలంతో శిశుపాలుని వంటి రాజులు, చుట్టరికంతో వృష్టివంశపు యాదవులు, ప్రేమాభిమానాలతో మీరు, భక్తితో మేము ఆ శ్రీ హరి సాన్నిహిత్యం పొందాముకదా అలాగే నిరంతర నామస్మరణచేత పై పద్ధతులలో ఏ రకంగా అయినా ఆ శ్రీ హరిని పొందవచ్చు. ( సాయుజ్యం పొందవచ్చు )

విశ్లేషణ:

సాయుజ్యం పొందడానికి అన్నిటికంటే దగ్గరదారి శత్రుత్వమే. జయవిజయులకు సనకసనందుల శాపం సమయంలో సనకసనందనులు మూడు జన్మల వైరంతో శాప విమోచనం అనుగ్రహించారు.

హిరణ్యకశిపు సంహారానంతరం విష్ణు సేవకుల మాట చూడండి.

ఉ.

సంచిత విప్రశాపమున జండనిశాచరు డైన వీని శి

క్షించుట కీడుగాదు కృపచేసితి వీశ్వర! భక్తి తోడ సే

వించినకంటె వైరమున వేగమె చేరగవచ్చు నిన్ను నీ

యంచిత నారసింహతను వద్భుత మాపద బాసి రందఱున్.


కానీ యెవరినో గాని ఆ మార్గంలో మననీయడు పరమాత్మ. విరోధి భావం నుంచి భక్తి భావంలోకి పరివర్తన కలిగి భక్తితో నడచుకో మంటాడు.

మరలా యీ భక్తి నవవిధ మార్గాలలో ఉంటుంది.


శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం

అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం.

అని.

ఎవరి మానసిక పరిణతిని బట్టి వారికి ఒక దోవ ఉంది. అన్నింటికీ ఉన్న నిబంధన ఒకటే నిరంతర నామస్మరణ.

మరి శత్రుత్వంతో ఎలా సాధ్యమంటే

"దూషణభూషణ తిరస్కార సత్కారంబులు శరీరంబునకుంగాని యాత్మకు లేవు. శరీరాభిమానంబునం జేసి దండ వాక్పారుష్యంబులు హింసయై తోచ తెఱంగున, నేను, నాది యనియెడు వైషమ్మంబు భూతంబులకు శరీరంబునంద సంభవించు. 

అభిమానంబు బంధంబు. నిరభిమానుండై వధించినను వధంబు గాదు. కర్తృత్వ మొల్లని వానికి హింసయు సిద్ధింపదు. సర్వభూతాత్మకుండైన యీశ్వరునికి వైషమ్యంబు లేదు" అని నారదుడు వివరణ ఇచ్చాడు.

అంచేత సమస్త కార్యములను పరమేశ్వరార్పణంగా చేయడం చాలా ముఖ్యం. దీని వల్ల ఏ దోషమూ అంటదు. 

అలాగే నిరంతరం నామస్మరణ చేయడం వలన సాయుజ్య సిద్ధి అని గ్రహించాలి.

( స శేషం )


పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు

   ( ౫౪ వ పద్యం )

ఉ.

మచ్ఛిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్

జచ్చుచునుండ జూచెదరు చావక మానెడువారి భంగి నీ

చచ్చిన వారి కేడ్ఛదరు  చావుకు నొల్లక డాగవచ్ఛనే?

యెచ్చట బుట్టె నచ్ఛటికి నేగుట నైజము ప్రాణికోటికిన్.

సంధర్భం:

హిరణ్యాక్షుని వధానంతరం యముడు ప్రేతబంధువులతో బాలకుని వేషంలో వచ్చి మాట్లాడునప్పటిది.

భావం:

మోహంతో వీరందరూ యెంత విచిత్రంగా రోదిస్తున్నారో కదా! నిత్యము చావు పుట్టుకలు చూస్తూనే ఉంటారు. ఎవరైనా మరణిస్తే చావకుండా ఉండలేదన్నట్లు యేడుస్తారు. చావును తప్పించకుని దాక్కోగలమా? ప్రాణం ఉన్న జీవులన్నీ ఎక్కడ నుండి యీ నేలమీదకు వచ్చాయో అక్కడకు మరలిపోవడం సహజమే.

విశ్లేషణ:

అపమృత్యువో అకాల మృత్యువో అయితే పోయినవారి కోసం యేడ్చినా కొంత సబబు గాని వానప్రస్థంలో పోయినవారి కోసం విలపించడంలో అర్థం లేదు.

నిజంగా మనం దేనకి యేడ్వాలీ అంటే గతించినవారి కోసం కాదు మనం యేదైన కూడని పని చేస్తే ఏడవాలి. 

 కృష్ణ నిర్యాణం చూసి వచ్చిన పార్థుని చూసి ధర్మరాజు  అన్న మాటలు చూడండి. ద్వారకనుంచి వచ్చిన ఫల్గుణుడు ఏడుస్తూ పెద్దన్నగారి ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు ధర్మరాజు

కం.

ఓడితివో శత్రువులకు

నాడితివో సాధు దూషణాలాపంబులం

గూడితివో పరసతులను

వీడితివో మానధనము వీరుల నడుమన్.

కం.

తప్పితివో యిచ్చెదనని

చెప్పితివో కపటసాక్షి చేసిన మేలుం

దెప్పితివో శరణార్ధుల

రొప్పితివో ద్విజుల పశుల రోగుల సతులన్

కం.

అడచితివో భూసురులను

గుడిచితివో బాలవృద్ధగురువులు వెలిగా

విడిచితివో యాశ్రితులను

ముడిచితివో పరుల విత్తములు లోభమునన్.

శత్రువుల చేతిలో ఓడినా సాధువులను తిట్టినా ఇతర స్త్రీలను అనుభవించినా వీరుల మధ్య మర్యాద పోగొట్టుకున్నా ఇస్తానని చెప్పి ఇవ్వకపోయినా తప్పుడు సాక్ష్యం చెప్పినా చేసిన మేలు దెప్పినా శరణార్థులైన భూసురులను పశువులను రోగులను స్త్రీలను ఏడిపించినా బ్రాహ్మణుల ధనం తిరిగి ఇవ్వకపోయినా పిల్లలకు గురువులకు వృద్ధులకు పెట్టకుండా తినినా శరణన్నవారిని విదిలించుకున్నా పిసినారివై మరొకరి ధనం నొక్కేసినా

ఏడ్వాలి గాని ఊరకనే ఏడవరాదు.

అదీ ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఆత్మవిమర్శ చేసుకుంటే.

అందుకే ప్రతీమనిషీ ఆత్మ విమర్శ చేసుకోవాలి.. అప్పుడు మన తప్పులు మనకే తెలుస్తాయి. మరొకరు వేలెత్తి చూపించ నవసరం లేదు.

అంచేత ఒక మనిషి చచ్చినవారి కోసం కాక తను చేసిన తప్పుడు పనులకు ఏడ్చుకోవాలి. అదీ ధర్మం.

( స శేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

  ( ౫౫ వ పద్యం )

చం.

అడవుల మేతమేసి మనమన్యుల కెన్నడు నెగ్గు సేయ కి

క్కడ విహరింప నే డకట! కట్టడి బ్రహ్మ కిరాతు చేతిలో 

బడుమని వ్రాసెనే? నుదుట బాపపు దైవము కంటి కింత యె

క్కుడు బరు వయ్యెనే బ్రతుకు? కోమలి? యే మననేర్తు జెల్లరే?

సందర్భం:

సుయజ్ఞోపాఖ్యానంలో బాలకునివలె వచ్ఛిన యముడు చెప్పిన అడవి పిచ్చుకల కథలోనిది.

ఒకరోజు బోయవాని వలలో అడవి పిచుకల జంట చిక్కుకుంటుంది. అలా చిక్కుకున్న జంట తమ దురదృష్టానికి చింతిస్తూ ఇలా వాపోతారు.

భావం:

ఈ జన సమూహానికి దూరంగా అడవిలో మేత మేస్తూ ఎవరికీ ఏ హాని తలపెట్టకుండా మన మానాన మనం బ్రతుకుతున్నాం. అయినా కఠినహృదయుడైన బ్రహ్మ మనలను యిలా కిరాతుడి చేతిలో పడి చావమని మన నుదుట వ్రాసాడేమో! ఆ పాపపు  బ్రహ్మకు మనం అంత బరువైపోయామా కోమలీ? మన విధి అలా ఉంది. ఏమని చెప్పమంటావు.

విశ్లేషణ:

"సంచిత పాప సంచయము చావను ప్రాప్తము మోసుకొచ్చె" అన్నట్లుంది. ఈ జన్మలో మనం ఎవరికీ ఏ హానీ చేయక పోయినా గతజన్మల పాపపు సంచి మన భుజాన వ్రేలాడితే ఆ పాపపు విధి ఇలాగే కట్టి కుడుపుతుంది.

అందుకే తెలిసికాని తెలియక కాని గోవులు మొదలగు మూగజీవులను సాధు సత్పురుషులను హింసిస్తే ఆ పాపం ఒక జన్మతో తీరేది కాదు. మరో రెండుమూడు జన్మల వఱకూ దాని ఫలితాన్ని అనుభవించితే కాని ఆ పాపం కొండ కరుగదు.

 ( స శేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

  ( ౫౬ వ పద్యం )

ఉ.

ఱెక్కలు రావు పిల్లలకు ఱేపటి నుండియు మేత గానమిన్

బొక్కుచు గూటిలో నెగసి పోవగ నేరవు మున్ను తల్లి యే

దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూడ్కుల నిక్కి నిక్కి నల్

దిక్కులు. చూచుచున్న వతి దీనత నెట్లు భరింతు? నక్కటా!

సందర్భం:

సుయజ్ఞోపాఖ్యానంలో అడవి పిచ్చుకల కథలో ఆడపిచ్చుక మగనితో చెప్పునప్పటిది

భావం:

ఱెక్కలు ఇంకా సరిగా రాని పిల్లలు గూటిలో ఉన్నాయి. మనల్ని యీ కిరాతుడు బంధించి తీసుకు పోతునాడు. ఆ పిల్లలకు రేపటినుండి మేత కనిపించక ఏడ్చుకుంటాయే! గూటిలోనుంచి ఎగిరి పోలేవు. తల్లి యీ దిశగా వస్తుంది ఆదిశగా వస్తుంది అని కళ్ళు తిప్పకుండా నిక్కి నిక్కి నాల్గు పక్కలా దీనంగా చూస్తాయి. అది ఎలా భరించగలను?

విశ్లేషణ:

తల్లి మనసు చాలా ఆర్ద్రమైనది. పసిపిల్లలకు సకల సంరక్షణ తల్లే చూసుకుంటుంది. పిల్ల ఆకలి తల్లికే తెలుస్తుంది.

అది మనుజులైనా పశువులైనా పక్షులైనా అలాగే ఉంటుంది. 

సాధారణంగా పశు పక్ష్యాదులలో మరో కోణం కనిపిస్తుంది. ఒక గోవుకు తువ్వాయి పుట్టిందనుకోండి. రెండు మూడు రోజులపాటు గోవును ఇంటివద్దనే ఉంచుతారు. ఆ తరువాత అది మేతకు వెళుతుంది. మరలా సాయంత్రానికి తిరిగి కొట్టం చేరుకోవడం మామూలుగా జరిగేది. కాని ఆ ఆవుకి ఏ మధ్యాహ్నమో తన పిల్ల గుర్తుకొచ్చిందనుకోండి. ఆ ఆవు పరుగుపరుగున వచ్చి పిల్లకు పాలిచ్చి లాలించి వెళ్ళిపోతుంది మేతకు.

అలాగే మేకలు మందగా మేతకు తోలుకు పోతారు. వాటి పిల్లలు మేకలదొడ్డిలో ఉండిపోతాయి. సాయంత్రం ఆ మేకల మంద ఇంటికి చేరే సమయానికి పిల్లమేకలను దొడ్డిలోనుంచి వదులుతారు. అవి తమ తల్లులకు ఎదురుగా వెళ్ళి ఆ తల్లిని కలిసి ముచ్చటలాడుకోవడం ఒక కమనీయమైన దృశ్యం. నేను మా గ్రామంలో ఉన్నప్పుడు మా వీధిగమ్మంలో కూర్చుని రోజూ చూసేవాడిని.

అలాగే మరోటి చెబుతా. బాలాజీ అని ఒకాయన తోలుబొమ్మలాట నడిపే ఒక పెద్ద కుటుంబంగా మా వూరు వచ్చి రెండు మూడు నెలలు ఉన్నారు. ఏవో తోలుబొమ్మలాటలు చూపించారు. వారు సంచార జీవులు. వారికి రెండు కుక్కలుండేవి. వారు మరో ఊరికి వలస వెళ్ళినప్పుడు కుక్కపిల్లలు చాలా చిన్నవి వాటిని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తల్లి కుక్క రోజూ రెండు మూడు సార్లు ఆ వూరినుంచి వచ్చి పిల్లలను దగ్గరకు తీసుకొని తను తిన్నది కక్కేది. ఆ కక్కును పిల్లలు తినేవి.

అంటే ఆ తల్లి తన పిల్లల కోసం ఎంత పరితపించిందో మనం అర్థం చేసుకోవాలి.

ఈ పిచ్చుక పిల్లలు సాయంత్రం అయ్యేసరికి అమ్మ వచ్చేస్తుంది అని తమ బుఱ్ఱలు పైకి పెట్టి ఎదురు చూస్తాయి. వాటికి ఆహారం ఎవరు పెడతారు? 

ఈ ప్రపంచంలో ఏ జీవరాశికైనా తల్లిప్రేమ అలాగే ఉంటుంది. కాకి తన పిల్లకి తన ముక్కుతో పిల్ల ముక్కును పొడిచి తినడం నేర్పుతుంది.

పై పద్యంలో ఆ తల్లి ప్రాణం ఎలా విలవిలలాడుతుందో మన కళ్ళకు కట్టినట్టు చెప్పారు.

( స శేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

  ( ౫౭ వ పద్యం )


శా.

గాలిం గుంభిని నగ్ని నంబువుల నాకాశస్థలిన్ దిక్కులన్

రేలన్ ఘస్రములన్ దమః ప్రభల భూరి గ్రాహ రక్షో మృగ

వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్ర శ

స్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ! యిప్పించవే!

సందర్భం:

హిరణ్యకశిపుడు బ్రహ్మను మెప్పించి వరమడుగు నప్పటిది.

భావం:

లోకాలకు అధిపతివైన ఓ బ్రహ్మదేవా! గాలి, నేల, నిప్పు, నీరు, ఆకాశము లందుగాని దిగంతములందు గాని రాత్రిగాని పగలుగాని చీకటిలోగాని వెలుగులో గాని జలచరముల వలనగాని భూచరముల(క్రూర జంతువుల) వలనగాని పాములు,దేవతలు, రాక్షసులు, మనష్యుల వలనగాని యుద్ధములో అన్నిరకాల బాణాలు ఆయుధాల వలనగాని చావు రాని జీవితం యిప్పించుము.

విశ్లేషణ:

ఈ శరీరం పంచభూతాత్మకం. అందుకని ఈ పంచభూతాలకు అతీతంగా ఉండాలనుకున్నాడు. తనకున్న అవగాహన మేఱకు చావు ఏరకంగా రాగలదో వాటినన్నిటినీ తప్పించుకునేలా గుదిగుచ్చాడు. ఏ రకంగానూ చావులేని చిరంజీవత్వాన్ని కోరుకున్నాడు. ఇంకో మూడు మరలా అడిగాడు. అవేంటంటే తనకు ఎదురేలేని శౌర్యము, లోకపాలకులను ధిక్కరించే మహిమ, భువన త్రయ విజయం.

మొదట పదునెనిమిది రకాలు ఒకమాలగా అల్లి ఒకేవరంగా అడిగాడు. దానికి కొసరుగా మరో మూడు కోరాడు.

జాతస్యహి మరణం ధృవం అన్నది తనకు తెలియకనా? అయినా ఎప్పటికీ తనే ఆధిపత్యం వహించాలనే అత్యాశ. తమ్ముని చంపిన శ్రీ హరిని సంహరించాలనే దురాశ. చావులేకుండా బ్రతికేయాలనే పేరాశ.

'జాయతే వర్ధతే జృంభతే పరిణతే నశ్యతి' అనే అయిదు దశలు అన్ని ప్రాణులకూ సహజమైనవి. వానిని తప్పించుకోవడానికి ఎవరికీ అవకాశం లేదు. చీరంజీవులైనవారు ఇందుకు మినహాయింపు.

అలాగే జీవం లేనివి కూడా ఇదే పద్ధతిలో ఉంటాయి. ఒక సమస్య లేదా ఉద్యమం లేదా రుగ్మత వంటివి ఏవైనా ఎలా పుట్టుకొస్తాయో అలాగే కనుమరుగైపోతాయి కూడా. అది సృష్టియొక్క సహజ సిద్ధాంతం.

భగవద్దర్శనం ఆయితే నాన్న తొడమీద కూర్చోవాలనుకోవడం ఎలాంటిదో చావులేకుండా ఉండాలనుకోవడం అలాంటిదే.

 సద్యఃస్ఫూర్తి ప్రాప్తకాలజ్ఞత కల్పించవలసిన ఆ పరమేశ్వరుణ్ణి అందుకే ప్రదోషకాలంలో పూజించాలి.

  ( స శేషం )




పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

  ( ౫౮ వ పద్యం )

శా.

అన్నా! కశ్యపపుత్ర! దుర్లభంబు లీ యర్థంబు లెవ్వారికిన్

ము న్నెవ్వారలు గోర రీ వరములన్ మోదించితిన్ నీయెడన్

నన్నున్ గోరినవెల్ల నిచ్చితి బ్రవీణత్వంబుతో బుద్ధి సం

పన్నత్వంబున నుండుమీ! సుమతి వై భద్రైకశీలుండవై.

సందర్భం: 

హిరణ్యకశిపునికి కోరిన వరములిచ్చిన బ్రహ్మ హితోపదేశము గా చెప్పినది

భావం:

కశ్యపకుమారా! హిరణ్యకశపా! అసాధ్యమైన వరాలు కోరావు. నీ కఠోర తపస్సుకు మెచ్చి అన్నీ యిచ్చాను. ఇంతకుముందు ఎవరూ ఇటువంటి వరములు కోరలేదు.

ఇచ్చిన వరములను మంచిబుద్ధికలవాడవై నేర్పుగా వాడుకుంటూ శీలసంపదను కాపాడుకుంటూ జాగ్రత్తగా జీవించు.

విశ్లేషణ: 

ఒకటీ రెండూ కాదు ౧౮ ఆశల వరమాల దానికి తోడుగా జిగీషతో మరో మూడు వెరసి ౨౧ కోరికల చిట్టా నెగ్గించుకున్నాడు. ఏదో బ్రహ్మగారు తనని ఎవరూ నిదించకుండా ఉండటానికి  బాబూ చాలా జాగ్రత్తగా మంచిగా బ్రతుకు అని ఓ ఉచిత సలహా పారేసారు. అంతేకాని ఆ అడిగిన కోరికలనుబట్టే అది ఏ కుయుక్తులకో దారితీస్తుంది అని ఎవరైనా ఊహించగలరు.

అయినా ఆ హిరణ్యకశపుని ధర్మమా అని ఓ సరికొత్త రూపానికి శ్రీ కారం జరిగింది. ఓ అవతారం వెలిసింది. ఎందరికో ఆ‌రాధ్య దైవంగా నృసింహమూర్తి భక్తులను కనికరిస్తున్నాడు. ఆంధ్రదేశంలో అహోబిలం, మంగళగిరి, సింహాచలం, కదిరి, కోరుకొండ మొదలగు క్షేత్రాలు చూసి తీరవలసిందే.

( స శేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

  ( ౫౯ వ పద్యం )

శా.

లీలోద్యాన లతానివాసములలో లీలావతీ యుక్తుడై

హాలాపాన వివర్ధమాన మదలోలావృత్త తామ్రాక్షుడై

కేళిందేలగ నేను దుంబురుడు సంగీతప్రసంగంబులన్

వాలాయంబు కరంగ జేయుదుము దేవద్వేషి నుర్వీశ్వరా!

సందర్భం:

బ్రహ్మనుండి వరములు పొందిన హిరణ్యకశిపుడు ఏరకంగా ప్రవర్తిస్తున్నదీ నారదుడు తన అనుభవం తెలియజేయు నప్పటిది.

భావం:

ప్రేమపురస్సర పూదోటలోని పొదరిండ్లలో భార్య లీలావతీ సమేతుడై మధిరాపానంచే యెఱుపెక్కిన గుండ్రని కళ్ళతో ఆనందించుతూ ఉంటే నేను (నారదుడు) తుంబురుడు కలిసి వీణియలతో సంగీతాన్ని వినిపించుతూ మెల్లగా ఆ మైకాన్ని కరిగేలా చేస్తూ ఉంటాము యెల్లప్పుడూ.

విశ్లేషణ:

ఇంటినుంచి అడుగు బయటకు వేయడం వల్ల నియమోల్లంఘనాలు విశృంఖలత్వాలకూ అవకాశాలు రావడం యుక్తాయుక్త విచక్షణ సరిగా పట్టని యువరక్తం చిందులు వేయడంతో ఎందరో మందుకు వశమైపోతున్నారు. ఇందులో లింగబేధం లేదు.

ఈ మధ్య లాక్ డౌన్ సడలింపులలో మద్యం అంగళ్ళవద్ద అమ్మాయిలు కూడా బారులు తీరి నిలబడి మందు సీసాలు కొనడం చూడలేదా?

నాగరికతో చట్టుబండ మరోటో ఏదైతేనేం మనం ఎలా తయారయ్యామో ఆలోచించుకోవలసినదే.

ఓ పదవో నాలుగు రూకలొచ్చే ఊడిగమో దొరికితే చాలు తప్పుదోవ పట్టేస్తారు. ఇప్పటికీ ఈ జనం అంతే.

మరి హిరణ్యకశిపుడు మహరాజు. ఓ సాయంకాలం పూట కాస్త చుక్కేసుకుని చక్కని చుక్కని (భార్యే లెండి)వెంటబెట్టుకుని ఉద్యానవనంలోకి వాహ్యాళికి వెళ్ళాడు. కళ్ళు యెఱుపెక్కాయి. మన్మథకోలలు సోకాయి. శృంగారానికి చక్కని సమయం దొరికింది. దానికి ఊపు నివ్వడానికి బయట నిలబడి తుంబురుడు నా‌రదుడు కలిసి మంద్రస్థాయిలో సంగీతం వినిపిస్తూ మెల్లగా మత్తు దిగేలా చేస్తారట.

బెంగుళూరు ఎం.జి.రోడ్డు ముంబై కొలాబా బీచ్ విశాఖ కైలాసగిరి విజయవాడ భవానీ ఐలేండ్స్ ఇలాంటి వారికీ, ఇలాంటి పొదరిళ్ళకు ప్రసిద్ధికదా.

రాబడితోబాటు వ్యసనాలు కూడా పెఱుగుతాయి.

వాటికి లోబడకుండా వుండాలటే మంచి మనో నియతి కావాలి. నైతికవిలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ దురలవాట్లకూ లోనుకాకుండా కొత్తగా ఱెక్కలొచ్చిన ఒంటరి జీవితాలు తుంటరి బ్రతుకులు కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులూ నియమబద్ధ జీవితాన్ని శాసించాలి. సంస్కృతి సంప్రదాయాలను శ్వాసించేలా చేయాలి. లేకపోతే సంసారాలు మురికి కూపాలవుతాయి.

( స శేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

( ౬౦ వ పద్యం )

శా.

వేధోదత్త వరప్రసాద గరిమన్ వీ డంతవాడై మిముం

బాధం బెట్టుచున్న వా డని మదిన్ భావింతు భావించి నే

సాధింపం దఱికాదు కావున కడున్ సైరించితిన్ మీదటన్ 

సాధింతున్ సురలార! నేడు సనుడా! శంకింప మీ కేటికిన్?

సందర్భం:

విరించి వరజనిత గర్వాతిశయంతో హిరణ్యకశిపుడు లోకకంటకుడై దేవతలను హింసించగా దేవతలు శ్రీ హరి వద్దకు పోయి తమ దైన్యాన్ని విన్నవించారు. అప్పుడు శ్రీ హరి వారికి ఇచ్చిన హామీ.

భావం:

బ్రహ్మగారిచ్చిన వరముల వలన వీడు మహాగర్వంతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని అనుకుంటాను. అయినా వెంటనే అతనికి హాని తలపెట్టడం సరికాదని చాలా ఓర్మి వహించాను. ఇంక అతనిని వధించడమో సాధించడమో చేస్తాను. ఈరోజుకి మీరు వెళ్ళండి. అనుమానించవలసిన పని లేదు.

విశ్లేషణ:

కఠోరమైన తపఃఫలంగా పొందిన వరములతో భద్రంగా నిశ్చింతగా బ్రతకమంటే ఏరోజు ఎవరి మీద దండెత్తుతాడో ఎవడికి ఆయువు మూడుతుందో అనే భయంతో జనసామాన్యము బ్రతికేలాగ చేసాడు.

చేతికి అధికారం దక్కిన దగ్గరనుంచీ శత్రునిర్మూలనమే పనిగా పెట్టుకుంటే ఆ బాధితుల మొఱ వినేవాడూ ఉంటాడు. పాపం పండేవరకూ ఆగి పని కానిస్తాడు.

అధికారం పొందాక

 అపకారికి ఉపకారము

నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ.

అన్న బద్దెన గారి మాట శిరోధార్యం.లేకుంటే ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కాగలవు.

మనం చెప్పిన వెంటనే భగవంతుడు లగెత్తుకుని పనిచేయడు. ఎందుకంటే అలా చేస్తే మనం ఆ హిరణ్యకశిపుడు లాగ తయారవుతామని.

అందుకని మన సహనాన్ని పరీక్షిస్తూ అవతలి వాని పాపం పండాక పబ్బం గడుపుతాడు భగవంతుడు.

  ( స శేషం )



0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home