Thursday, January 31, 2019

   కొదవేమి లేదులే తల్లి

కొదవేమి లేదులే తల్లి! ఆనంద వల్లీ
ఎదనిండ మది నిండ నీవుండగా...
కొదవేమి లేదులే తల్లి మా కల్పవల్లీ
నేను నాదని వాపోక నీ అండ ఉండగా //కొదవేమి//
కోరికల కోరలకు  కొరగాని వానిగా
చేరికల తీరులకు సరిపోని వానిగా
సొమ్ములే కాని నే పనికిరానపుడు
కిమ్మనా లేక నే మిన్నకున్నపుడు //కొదవేమి//
చిల్లి గవ్వయు లేక ఇల్లాలు చిందేసినా
ఇల్లు గుల్లయి పోయి నే బోసి పోయినా
ఉదయాస్తమానాలు నీ పూజలుండగా
పయనిస్తు నీ కడకు నే చేరు చుండగా //కొదవేమి//
తలపు లన్నియు నీకు పలుకులన్నియు నీకు
నా గుండె గాయాల గేయాల సరములే నీకు
నా నోట నా చేత మంగళారతులు నీకు
అస్తి నాస్తి సమస్తమూ నీ వరములే నాకు//కొదవేమి//
కలిమినిచ్చిన నీవు కన్నీరునూ యిచ్చి
కష్టాలు దుఃఖాలు ఆశలూ నష్టాల నిచ్చి
ఒకసారి ఆనంద డోలికల నూగించి వే
రొకసారి అశ్రునయనాల ఆర్త నాదాల నీయగా
 //కొదవేమి//
(ఈ పాటకు ప్రేరణ శ్రీ సి.రాజగోపాలాచారి గారు వ్రాసిన
'కురై ఒండ్రుమ్ ఇల్లై మరైమూర్తి కన్నా' అన్నపాట. ఆందులోని కురై ఒండ్రుమ్ ఇల్లై అన్నదాన్ని కొదవేమి లేదు అని అనువదించా. మిగిలింది నా స్వంతం.)

Tuesday, January 29, 2019


హంసగీతి.
భగవతి చండికి భక్త జనాదర భార్గవి శాక్రికి పార్వతికిన్
అగణిత శక్తికి మన్మథ హారి విలాసిని శైలజ శాంకరికిన్
మృగపతి పత్నికి మంగళ మూర్తికి మృత్యు విడంబక మానసికిన్
మృగధర ధారికి మాత మనస్విని మాలిని యీశికి మ్రొక్కెద నేన్.

        ఒకటై పోదాం



చక్కని చుక్కా ఎక్కడికైనా నాతో వస్తావా
చిక్కితె చక్కా ఎక్కడికైనా నీతో వస్తాలే
మబ్బుల పైన రోదసి లోకి పోదాం వస్తావా
అబ్బుర పడుతూ చప్పున పోదాం రాలేవా
అంత తొందరా? ఎందు కంతగా?
మబ్బుల మేనా అబ్బుర పడనా
చందురు ముందర నడవాలంటే //చక్కని//
చీకటి మాటున చీటికి మాటికి పిలిచానా
రేపటి పూటకు రగిలే వగలే తెలిసేనా
ఆకలి కూటికి అర్రులు చాచిన అలుసే కాలేదా
కలిసి తిరిగితే మనసు కలిపితే సరదా చాల్లేదా
ఏంత సొబగులే?
 అంత వలదులే
తేటి కోసమే
మేటి వేసము
పూల తేనెలా
 ఓల లాడితే //చక్కని//
రివ్వురివ్వునా గువ్వల జంటగ ఎగిరే పోదామా
మూడుముళ్ళతో ఒకటై జంటగ తిరిగే వద్దామా
పెద్ద వారితో సద్దు బాటుగ చెప్పేసు కుందామా
కాదు కూడదూ ఒప్పు కోనిచో వద్దను కుందామా
సంశయ మేలా?
 మౌనమె మేలా?
తప్పగు నేమో?
తప్పదు వామ్మో!
ఇపుడేం చేద్దాం?
ఒకటై పోదాం.//చక్కని//


Sunday, January 27, 2019

    ఏమవుతావో

నదిలో నీరువు నీవయితే
వెన్నెల నేనై  వాలిపోతా
చల్లని వెన్నెల  నీవయితే
మెరిసే మురిసే సైకతమవుతా
ఆ సైకత తీరం నీవయితే
తను తాకే వీచీ బాలిక నవుతా
వీచీ బాలికా తపనవు నీవయితే
నిలువరించే చెలియలి కట్టను నేనవుతా
చెలియలి కట్టవు నీవయితే
వీచే చల్లని గాలిని నేనవుతా
ఆ శీతల వాయువు నీవయితే
ఆస్వాదించే హృదయం నే నవుతా
ఆ హృదయం పరస్పరమైతే
జీవితమే ఓ నందన వనం.

Saturday, January 26, 2019


హంసగతి.
చలిమల చూలికి జంగమ శూలికి సాంబ కపాలికి చంద్రిలుకున్
యలయక దక్షిణ కాళికి నీల సరస్వతికిన్ పద సంపదతో
లలితకు కాది విలాసిని షోడసి లంభకు తాండవ లాస్యకు నా
తలపుల తల్లికి తామసి మా జగదంబకు మ్రొక్కెద తత్పర తన్.
(లంభ , చలిమల చూలి , కాది విలాసిని, తామసి= పార్వతి , జంగమ శూలి, చంద్రిలుడు= శివుడు)

చదువుల రాజ్ఞికి శారద వాణికి స్వంజుని రాణికి సన్మతితో
పదముల మూటలు పాటల పెట్టెలు పద్దెపు మాలలు పంచుచు నా
యెద సడు లన్నియు నేర్చెద కూర్చెద నీప్సిత సిద్ధిగ నెంతగనో
 మది చతు రోక్తుల మంజుల వాగ్భవ మంద సరస్వతి మా త కృపన్.
హం.
వనరుహ లోచని వారిజ వాసిని వాక్పతి భామిని వాణికివే
మనసున కొల్చుచు మాటల మల్లెల మాలలు కూర్చుచు మక్కటిగా
చనువున జెప్పిన సంగతి గా గొన ఛందసు కందెడు ఛాందసమై
కనుగొన వేడ్కతొ కచ్ఛపి ధారికి కర్కశ హారికి కానుకగా.



Friday, January 25, 2019


సీ.
నీ పాద సేవలో నీ సేవ ధ్యాసలో
            కడదేరి పోయేటి కలిమి నిమ్ము
నీ నామ భజనలో నీ రూపు స్మరణలో
           తుదిశ్వాస నిశ్వాస తునియ నిమ్ము
నీ మంత్ర జపములో ఆమంత్రణము నంద
           ఆ తురీయ సమాధి యాన తిమ్ము
నీ ముద్దు బిడ్డగా నీ చంక కూనగా
           నే రాలి పోయేటి నెరవు నిమ్ము
తే.గీ.
నిను వినా లేరెవరు నాకు నెమ్మదిమ్ము
మనసు నీపైన లగ్నమై మసల నిమ్ము
ఆదరించవె తల్లి ఆనంద వల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.10.
సీ.
ఈతి బాధలు లేక నీతి బోధలు కాక
         నెమ్మదిన్ బ్రతుకగా నెలవు నిమ్ము
ఆరాట పడకుండ పోరాట మనకుండ
         అర్చనానుష్ఠాన మధమమిమ్ము
రోగ బాధలు లేక రాగ బంధము పోక
         నీదీక్షలో నన్ను నిలువ నిమ్ము
అఘములన్నియు నాకు పుణ్యముల్ సతికిచ్చి
        పసుపు కుంకుమలతో  పంపి తనను
తే.గీ.
ఆడు కోవమ్మ నాతోడ ఆటలన్ని
నిన్నె యన్నింట జూచుచూ నిమ్మళింతు
ఆద రించవె తల్లి ఆనంద వల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.9.

 
      

ఏ ఆశయ సాధన కోసం
ఏ లక్ష్యపు ఛేదన కోసం
ఏ కనులలో కసి దాగుందో
ఏ మనసులో తమి లేకుందో
వెతికి ఉతికి ఆరెయ్యాలనుకున్నా

Wednesday, January 23, 2019


         తీర్పు చెప్పండి

ఒక ముసలాయన లౌకిక విషయాలనుంచి దూరంగా ఉండదలచి తన ఆస్తులు కుటుంబ వ్యాపారం అన్నీ పిల్లలకు పంచి ఇచ్చేసి భగవత్సేవలో కాలం గడపాలని నిర్ణయించుకున్నాడు.
అతనికి ముగ్గురు కొడుకులు ఇద్దరు కుమార్తెలు. అందరికీ పెళ్ళిళ్ళు అయి అంతా బాగానే ఉన్నారు. పెద్ద వాడు దూరంగా కలకత్తా లో రైల్వే లో ఉద్యోగం. రెండోవాడు మొదటినుంచి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయం వ్యాపారమూ చూస్తున్నాడు. మూడోవాడు అమెరికాలో ఉద్యోగం. పెద్ద అమ్మాయి వకీలు చిన్నమ్మాయి బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరు.
కుటుంబ రావుకు వారసత్వం గా వచ్చిన ఐదెకరాల జీడితోట మూడెకరాల పల్లపు భూమి అలాగే ఉన్నాయి. అతనో చిన్నపాటి కంట్రాక్టరు. పిల్లలను అందరినీ బాగానే చదివించాడు. మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసాడు. భార్య పోయి మూడేళ్ళు అయింది. రెండోవాడు ఇంటర్ లో ఉండగా అతను మంచాన పడి ఒక సంవత్సరం ఇంటిపట్టునే ఉండిపోవటంతో ఆ రెండో కొడుకే అతని పనులన్నీ చక్కబెట్టే వాడు. ఇప్పుడు ఆస్తి బాగానే పెరిగింది. కాంట్రాక్టులు పోటీ మూలంగా కిట్టుబాటు కావడంలేదు. అయినా అడపాదడపా ఒకటీ అరా చేస్తున్నారు. వ్యవసాయ భూమి పదెకరాల పల్లం పదిహేనెకరాలు జీడితోట గా పెరిగింది.
ఐదుగురు పిల్లలనూ సకుటుంబంగా సంక్రాంతి కి పల్లె కు రమ్మన్నాడు. కాదనకుండా ఆనందంగా అందరూ వచ్చారు.
తన మనసులో మాటను అందరికీ చెప్పి ఈ ఆస్తిని ఎలా పంచాలో ఎవరికి వారు ఓ కాగితంపై రాసి ఇమ్మన్నాడు.
మరునాటికి అందరూ ఇచ్చేసారు.
తను అన్నీ చదువుకోవడం జరిగింది.
సరే. అందరినీ ఆ రాత్రి సమావేశ పరచి వారు రాసి ఇచ్చిన వివరాలు చదివి వినిపించడం మొదలు పెట్టాడు.
1. పెద్దవాని అభీష్టం: ఒక ఎకరం పల్లం మూడెకరాల తోట అమ్మ బంగారంలో సగం ఆడ పిల్లలకు మినహాయించి మిగిలింది సమానంగా ముగ్గురికీ పంచమన్నాడు.
2 పెద్దమ్మాయి ఆలోచన: వకీలు కదా. ఆస్తి హక్కు సంతానం అందరికీ సమానమే. అంచేత అన్నీ ఐదు వాటాలు వేసి ఇచ్చేయమంది.
2వ వాడు: అందరి అభిప్రాయాలను విన్నాక మాత్రమే తను రాసిచ్చినది చదవమని ఉంది. సరే.
3వ వాడు మొత్తం నగదుగా మార్చేసి ఐదు వాటాలు వేసేయ మన్నాడు.
2వ అమ్మాయి: ఒక ట్రస్టు ఏర్పాటు చేసి విద్య వైద్యం ఉచితంగా ఊరివారికి అందేలా చేసి ఈ మొత్తం ఆస్తి ఆ ట్రస్టుకి ఇచ్చేద్దాం. అంది
2 వ వాడు: తాత ఇచ్చిన ఆస్తిని తండ్రి ఎలా కాపాడాడో అలాగే అఖండంగా ఉంచుదాం. పిల్లలు అందరికీ పెళ్ళిళ్ళు ఇక్కడే జరుపుకుందాం. ప్రతి సంక్రాంతి నీ ఇక్కడే వేడుకగా చేసుకుందాం. పేదపిల్లలకు చదువులకూ పెళ్ళళ్ళకూ సహాయపడదాం. ఉమ్మడి ఆస్తిని ఉమ్మడిగా నే ఉంచుదాం.
తండ్రి: ఇందులో ఎవరూ నా అవుసరాలకు ఆసరా గురించి ఆలోచించలేదేం?
గతించిన మీ అమ్మకు సంవత్సరానికి ఒకసారి చేసే శ్రాద్ధ కర్మ చేయవద్దా?
అందరి పిల్లలకూ నేను సమాన అవకాశాలు కల్పించి ప్రయోజకులయ్యే లాగా చేసానా? 
అలా కాకుంటే జరిగిన అన్యాయం దానికి ఇతోధిక పరిష్కారం ఉండవద్దా?
ఈ రోజు ఎవరెవరు ఎంతెంత సంపాదిస్తున్నారు? వెనకబడిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వఖ్ఖరలేదా?
ఈ ప్రశ్నలకు జవాబులు ఎవరికి వారే రేపు ఒక్కొక్కరు గా వచ్చి చెప్పండి. అన్నాడాయన.
అంతే.
ఆ తరవాత ఒక్కసారిగా అపోహలూ స్వార్థంతో కుయుక్తులు మొదలయ్యాయి. ఒకరన్న మాట ఇంకొకరికి కిట్టడం లేదు. ఒకరంటే ఒకరికి అసూయ అనుమానాలు ఆరంభ మయ్యాయి.
మరి మీరైతే  ఎలాగ ఏం చేయమంటారో చెప్పండి.
మీ తీర్పు వారికి ఎంతో విలువైనది. దయచేసి స్పందించండి.

Tuesday, January 22, 2019


కం.
ప్రస్తుత మప్రస్తుతమీ
ప్రస్తుత మెల్లను వినీత ప్రాశస్త్యమ్మౌ
ప్రస్తుత మైన పిదప వి
ప్ర స్తుతి చేయ గలరన్న ప్రస్తావ్యంబౌ.

Monday, January 21, 2019



   శూన్యం

ఉ.
శూన్య మనస్కతన్ కనులు చూచెడు దిక్కులు దిక్కుతోచకన్
యన్యమనస్కతన్ మనసు యంబర వీథుల సాగుచుండెడిన్
ధన్యత లెల్ల వేళలను ధర్మముగా లభి యింప కున్నచో
మాన్యత లేని యప్పుడిక మాటల మూటలు మూగవోయెడిన్.
చం.
గగనముతో దిగాలుగ సగమ్ముగ గుండెల పిండు బాధలన్
స్వగతముగా సుతారముగ వావిరిగా వివరించు కొందు నా
కగుపడు పేర్మిగా దలచి కాంచన సాదృశ వేదికా తటిన్
పగతురు లడ్డు రారని యపత్యులు చూడరంచు నొంటిగా.
మ.
వినువీథిన్ కనుగొంచు నిస్పృహలు వేవేలన్ నిభాయిం చుచున్
మనసా సాంత్వన మందు దాక నటులే మాటాడకన్నుండనే
వినునో మిన్ను సమస్త భావములు సంవేద్యాంత రంగంబునున్
వినదో నా మనసెంతగా నలిగి  యావేశంబుతో నేడ్వగా
మ.
కనునో కానదొ మిన్ను మున్ను నను రాకాచంద్రికా రేలలో
కనుగో నౌనని నావెతలన్ దెలుప నేకాంతంబుగా నుండగా
కనులన్ కూరుకు నెప్పడో కలుగు నాకళ్ళంత విశ్రాంతమౌ
మునుపున్నట్టి వ్యధా నిధుల్ వెడలి  యామూలాగ్ర శాంతంబునౌ.
మ.
గ్రహ తారా పథమై యనంతమన పర్జన్యాపథమ్మై శూన్యమై
యహముల్ రేలకు కారణం బగుచు యవ్యక్తాంత రిక్షంబులో
యిహమై తా పరమై సమాదరముగా యీ మానవా నేకమున్
యొహొహో యన్ మురిపించుచున్ తెలుపు నుద్యుక్తంబు నాకెప్పుడున్.
సీ.
మున్నేటి నీటిలో మునుగంగ లేక నే
             మును గంగ( మునుగంగ ముగిసి పోవ
కన్నీటి యేటిలో కడదేర లేక నే
             కసుగంది విసుగొంది కనలి పోవ
భాగీరథీ ప్రవాహ తరంగములలో నే
            క్రుంకులిడుచు నట క్రుంకు బోవ
మందాకినీ ముందు  కైమోడ్చి వరువాత
            నే సంధ్య వార్చి మిన్నెక్కి పోవ
తే.గీ.
నిస్పృహలలోన సాంత్వన నింగి నాకు
శూన్యదిక్కుల చిరునామ శూన్యమేను
వినుతి  జగదంబ వినదేమొ విన్ను వినును
గగనమైపోవ యూరడి గగన మిచ్చు.
(క్రుంకుబోవు = అస్తమించు)

Sunday, January 20, 2019

   త్వమేవాహమ్

పుడమి తల్లి ఒడిలో తీసుకున్న తొలి శ్వాసకు
అవయవ స్పందనతో నవలోకం చూపినందుకు
ఒడలు పులకించిన ఆనందాతిరేకంలో ఓ ఆలాపన
ఆ ఊపిరి నేర్పిందీ మట్టి బొమ్మకు నేననే ప్రేలాపన
ఆ నేను నాదిగా మారి మోహమయ బంధనాల చిక్కి
ధన కనక వస్తు వాహన సంసార వ్యామోహంగా బలుపెక్కి
విశ్వజనీన లక్షణమైన అహంగా రూపాంతరం చెంది
ధార్మిక సామాజిక నైతిక నియతి  కతీతంగా సాగి
అహంకారమై ప్రతీకారమై వ్యామోహాల ప్రాకారమై
విశ్వ విజేతగా విఱ్ఱవీగి అహమేవ బ్రహ్మాస్మి గా సాగిసాగి
అలుముకున్న పులుముకున్న ఐహికాల చెఱల నుండి
అంతిమ శ్వాస అదే దీర్ఘనిశ్వాస పుడమికే ఒప్పజెప్పి
ఊపిరి మటుమాయం కాగానే యీ మేను మట్టి కాగానే
ఈ బొందిని వట్టి కట్టెగా విడచి పారిపోతుందా 'నేను'
ఆ పై దాని ఆచూకీ ఎవరికీ తెలిసే వైనం లేదు
ఊపిరి ఉండగానే ఆ నేనును వెదికి వెదికి
గుండె లోతుల్లో ఎటనున్నా మాటేసి పట్టుకుంటే
ఈ మోహాలు వ్యామోహాలు అహంకారాలు అంటని
పరమాత్మ స్వరూపంగా కనిపిస్తే దర్శిస్తే
అపుడా ఆత్మ పరమాత్మలు పరస్పరం
త్వమేవాహమ్ త్వమేవాహమ్ అంటూ 
 పలుకరించు కుంటూ ఒకటైపోవా?

  దేవదేవా!

ఆప్తుడనుకున్న వాడు
ఆమడ దూరంలో ఆగిపోతే
ఆత్మీయుడైన వాడు
కనుమరుగై కనరాకుంటే
నా గుండె బరువులు దించే
గురువులు కరువైతే
నా ఆత్మ క్షోబకు అంతం తెలియక
నా మది రోదనల ఆవేదనల ఆవల
అశ్రు నయనాలతో కనుకొలకులలో
బాధల గాధలే చెక్కిళ్ళపై చారికలైతే
కిం కర్తవ్యమంటూ శూన్యంలోకి చూస్తూ
ఎకాఎకీ ఏకాకిగా నను మిగిలించిన క్షణాలు
ఒంటరి పోరాటంలో తెంపరి ఆక్రోశంలో
దేవదేవా! చేయూతగా నిలచి నడిపించవా?
ఒడిదుడుకులు సద్దుమణిగి మరో ఉషోదయం
గురువుల నే నమ్మిన వారల వాక్బలంతో
అందుకోనా త్వరలోనే మరో నవోదయం
రాబోయే వసంతం నాకూ ఓ వసంతం
అని నన్ను నేను నిబాళించుకుంటూ
దేవదేవా! నిన్నే నమ్ముకుంటూ
గడుపుతున్నా మసలుతున్నా.

Thursday, January 17, 2019

ఏమని వినిపించను

కనులు చెమ్మగిల్లితే పాట
కలలు సన్నగిల్లితే పాట
ఎడద పొంగితే పాట
బెడద లొంగితే పాట
నింద మోసినా పాటేే
మంది మెచ్చినా పాటే
ఏమని నా పాట వినిపించను
ఏలని నా మాట మురిపించను. // ఏమని//
ఆశ పడ్డా మనసు ఆరాటమే
ఓడి పోనీ బ్రతుకు పోరాటమే
లేని పోనీ తపన జంఝాటమే
ఆడి పోసే జనుల బాహాటమే
మాటల మూటలై పెల్లుబికితే
మానస వీణపై శృతి మీటితే  //ఏమని//
కనుల నిండా కలలు కనుమూసితే
మనసు నిండా గుబులు మసిబారితే
చేతి కందిన ఫలము చెయి జారితే
గుండె లవిసిన చెలిమి కసు గందితే
కన్నీటి గంగలో పునీతమై
మిన్నేటి పొంగులో స్నపనమై
పదముల పదనిస పెదవుల కదలిన //ఏమని//

Wednesday, January 16, 2019

   పండుగంటే

పండుగంటే పదిమందీ కలుసుకోవడం
ఆనందాలూ అనుభవాలు పంచుకోడం
అనుబంధాలు సంబంధాలు పెంచుకోడం
ఆత్మీయంగా ఆప్యాయంగా పలుకరించుకోడం
పండుగంటే ప్రకృతితో పరవశించి పోవడం
పొలం గట్టుమీద కాలువ గట్టుమీద బాతాఖానీ
వరి కుప్పల వద్ద బడి సావడి వద్ద గత స్మృతులు
నెమరు వేసుకుంటూ నెనరు చాటుకుంటూ
చిరకాలపు నవయవ్వన పరిచయాలు
చిననాటి చిరునవ్వుల సంగడీలు
పునరేకం మమేకం కావడం
అరిటాకులో భోజనాలు పేకాటలో లబోదిబోలు
అత్త వారింటిలో అరిసెల భక్షణాల ఘుమఘుమలు
ఎడాది పొడుగునా ఊరించి  వచ్చిన పెద్ద పండుగ
ముక్కనుమతో మూటా ముళ్ళూ సద్దుకోమంటుంది
అమ్మాయీ పిల్లలూ ఆదివారం వస్తారు
తొందరైతే మీరే వెళ్ళండి అల్లుడు గారంటూ అత్తగారు
కాదనకు బాబూ మరో రెండు రోజులే కదా అనే మావగారు
కదల లేక వదల లేక కాదన లేక ఒంటరిగా వెళ్ళలేక
బిక్కమొహంతో బయలు దేరే జామాతల వెతలు
కిక్కిరిసిన బస్సులలో రైలు బళ్ళలో కార్లలో ప్రయాణాలు
నగరాలు  పరుగుల బ్రతుకుల ఒరవడికి నగారాలు
మరోమారు సమయం లేదు మిత్రమా అంటూ
అంతే. అంతటితో పండుగ వేడి చల్లబడి పోతుంది
పల్లె పిల్ల మూగబోతుంది పల్లెపట్టు బోసి పోతుంది
కాల గమనంలో మరో చంక్రమణం పూర్తవుతుంది.

Tuesday, January 15, 2019


తే.గీ.
కనుమ నాడైన దిగిరావె కనుమ వాసి
కనుమ మా కడగండ్ల నొక్క పరి హరుడ
స హిమ కనుమ సుత శివా పశుపతి వీవు
పశుల మమ్ము దీవించవా పార్వతీశ.

Sunday, January 13, 2019

  భోగి శుభాకాంక్షలు
తే.గీ.
భోగి మంటల లో తమ  భోగ లాల
సనలు హవ్య వాహను కిచ్చి సాధు జనులు
భవిత తీర్చి దిద్దు కొనరె భక్తి తోడ
భోగి పండగ నాటి విభూతి యనగ.
చీడ పీడల విదలించి చితికి జేర్చి
భోగ భాగ్యోదయము గోరి భోగి మంట
వేసి గుమిగూడు మూన్నాళ్ళ వేడుక యిది
 భోగి శుభకామనలు మీకు బోలెడన్ని.

Friday, January 11, 2019

యువతా!


యువతా ఓ యువతా!
స్ఫుర విద్రుమ కల్పలతా!
నవభారత యువకాశల
విద్యుల్లతా! మేథో సంపద్విలసితా!
విశ్వ విఫణి లో విజ్ఞాన కరదీపికా!
భగవద్గీతా ప్రతిపాదిత జ్ఞాన కళికా!
నైపుణ్య ఝరీ తరంగ తురంగమా
వైవిధ్య విద్యా విలసిత కురంగమా
శ్రమైక జీవన విధాన పథాన
విశ్వాస నిశ్వాస ఘంటాపథాన
సృజనచాతుర్య మేథో వికాస
మూలధన సంపదలతో
ఎల్ల లెరుగక ఎల్లెడలా దేశ దేశాల
భారతీయ బావుటా నెగుర వేస్తూ
ప్రతి మనిషీ తన కోసం
తన దేశం కోసం
చైతన్య సమాజం కోసం
అసూయా ద్వేషాల కతీతంగా
సంపద సృష్టిస్తూ అందరికీ పంచుతూ
రమించండి! శ్రమించండి! విశ్రమించండి.

(యువజన దినోత్సవ సందర్భంగా)

ఎదుర్కోలు

అనంత హేమంత సీమంత వధూటి
చేమంతి పూబంతి విరితోపుల వసుంధర
శీత సమీర పులకిత లజ్జా ప్రతీక
సువర్ణ చ్ఛాయా ధాన్య విస్తార పుడమి
దహనహితకర సుమనస్సంసేవ్యమాన
కుసుమవతి మేదినీ హేమంత వధూటి
క్రాంతి పథనిర్దేశ్య సంక్రాంతి వేళ
పౌష్య లక్ష్మిగ పౌరులందరి పలుకరించు
ధాన్య రాశుల తోడ తా ధాన్య లక్ష్మి గ
పల్లెపల్లెన పల్లకీ లెక్కి ఊరేగు
రంగురంగుల రంగవల్లుల రంజిల్లు రాజ్ఞి
హరిదాసుల గంగిరెద్దుల సాక్షిగా
మన యింటి మొగసాల మనల మన్నించి
నిలచి దీవించు నా హేమంత వధూటి
ఆమెయే మన యింటి పౌష్య లక్ష్మి
ఆ రాకకై ఆమెకై హారతులు పట్టి
ఎదురేగి ఎదసాగి స్వాగతిద్దాం
నేటి రేపో రేపు మాపో ఆవల నాటికో
ఆమె ఆగమనం కోసం ఎదురు చూద్దాం.

Tuesday, January 8, 2019

  స్వగతం.
కం.
శ్రీ లలితా కృప చేతను
కాలానుకూలముగా సుకర్మ యుతుడుగా
బాలన్, షోడశి కొలచెడి
శూలిని  వర రాళ్ళపల్లి సుందర రామా! 1.
కం.
కవితా జనితా ఘనతల్
సవితా తపసా వెలుగుల సాదృశ మౌరా!
పవియై కవియై భువిపై
సువిదుడ వౌ! రాళ్ళపల్లి సుందర రామా. 2
(సవితా=సూర్యుని, తపసా= చంద్రుని, పవి= వజ్రాయుధము)
కం.
తమకై బ్రతుకై మెలిగే
భ్రమతో వసియింతురేల  భ్రాతలు కారా?
సమతా వాదమె గనరే?
సుమతులనగ రాళ్ళపల్లి సుందర రామా.3
కం.
జపమో తపమో జేయుచు
నుపవసియించుచు సదా మను మనుచు మనసా
శపథంబును గొనరాదా
సుపథంబదె రాళ్ళపల్లి సుందర రామా. 4.
కం.
కనదా వినదా మనసే
నిను నీదను వాదనలను నిరతము కసిగా
తనుపుగ హరి హరుల కొలచు
చును గడిపే రాళ్ళపల్లి సుందర రామా. 5.
కం.
నేనను నాదను భావము
మానదు స్వార్థమును వీడి మనలేమా యీ
మానవ మనసే యంతా?
సూనమె కద రాళ్ళపల్లి సుందర రామా.6
(సూనము = శూన్యము)



Saturday, January 5, 2019

 Oh God! Take care of me


Needs not me not my wish
Needs my money only money
Oh God! Am I so bad?
What a pity people are so pretty
What is done is past and lost
Why not do now is the quest
If so I relent, I repent.
When my pocket is full
Lavishly I nurtured
When my pocket is dull
Sparingly I am convinced
If really there's a need be
I am doubtful of these bees
May not peep at me to
May not think of me to
Caressing might be the sin
Parenting might be the din
Oh God! Take care of me
My Lord! Keep drive of me.

Wednesday, January 2, 2019

పల్లె - నాడు - నేడు

ఒకప్పటి మన గ్రామీణం
ఎందరికో అది ఆరో ప్రాణం
ఎత్తులెన్ని ఎదిగినా
ఎంత దవ్వు తా నేగినా
ఎత్తు మూటల నాటి
చిన్ని కూకటి నాటి
ఆ పల్లె గుండెల్లొ పదిలం
ఆ పల్లె వెన్నెల్లొ ఎదిగినం
గుమ్మ పాలల్లొ నురుగల్లె
అమ్మ మాటల్లొ మధువల్లె
అందరూ ఒక్కటిగ బ్రతికినం.
నాజూకు నగిషీలు
నగరాల వాసనలు
యంత్రాల చప్పుళ్ళు
కుతంత్రాల తమ్ముళ్లు
చూరు చూరుకు పట్టి
వ్రేలాడు తున్నవి నేడు
ఒకప్పటి
ఆప్యాయతలు అనుబంధాలు
మారిపోయి
రూపాంతరం చెందిన అమీబాలు
టపుక్కున పట్టుకుని
గుటుక్కున మింగేసే
తిమింగలాలు
ఉడుకుచేస్తే మందు బిళ్ళ దొరకదు కాని
ఉడుకు చేసే మందు బుడ్డి దొరుకుతుంది
ఉపాధి హామీ వచ్చాక
ఆరుగాలం పోయి
ఆరుగంటల కూలి
అమలౌతోంది.
అడ్డపొగలు పోయినాయి
బెల్ట్ షాపులొచ్చినాయి
ఇంటింటికీ మోటర్ సైకిల్
టీవీ, సెల్ ఫోన్లు ఫ్రిజ్ లు
ఒకటేమిటి పట్నం సరుకంతా
పల్లెల్లో దొరుకుతాయి.
పల్లెపట్టు చూస్తుంటే
కళ్ళంట నీళ్ళు కారతాయి.