Wednesday, January 23, 2019


         తీర్పు చెప్పండి

ఒక ముసలాయన లౌకిక విషయాలనుంచి దూరంగా ఉండదలచి తన ఆస్తులు కుటుంబ వ్యాపారం అన్నీ పిల్లలకు పంచి ఇచ్చేసి భగవత్సేవలో కాలం గడపాలని నిర్ణయించుకున్నాడు.
అతనికి ముగ్గురు కొడుకులు ఇద్దరు కుమార్తెలు. అందరికీ పెళ్ళిళ్ళు అయి అంతా బాగానే ఉన్నారు. పెద్ద వాడు దూరంగా కలకత్తా లో రైల్వే లో ఉద్యోగం. రెండోవాడు మొదటినుంచి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయం వ్యాపారమూ చూస్తున్నాడు. మూడోవాడు అమెరికాలో ఉద్యోగం. పెద్ద అమ్మాయి వకీలు చిన్నమ్మాయి బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరు.
కుటుంబ రావుకు వారసత్వం గా వచ్చిన ఐదెకరాల జీడితోట మూడెకరాల పల్లపు భూమి అలాగే ఉన్నాయి. అతనో చిన్నపాటి కంట్రాక్టరు. పిల్లలను అందరినీ బాగానే చదివించాడు. మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసాడు. భార్య పోయి మూడేళ్ళు అయింది. రెండోవాడు ఇంటర్ లో ఉండగా అతను మంచాన పడి ఒక సంవత్సరం ఇంటిపట్టునే ఉండిపోవటంతో ఆ రెండో కొడుకే అతని పనులన్నీ చక్కబెట్టే వాడు. ఇప్పుడు ఆస్తి బాగానే పెరిగింది. కాంట్రాక్టులు పోటీ మూలంగా కిట్టుబాటు కావడంలేదు. అయినా అడపాదడపా ఒకటీ అరా చేస్తున్నారు. వ్యవసాయ భూమి పదెకరాల పల్లం పదిహేనెకరాలు జీడితోట గా పెరిగింది.
ఐదుగురు పిల్లలనూ సకుటుంబంగా సంక్రాంతి కి పల్లె కు రమ్మన్నాడు. కాదనకుండా ఆనందంగా అందరూ వచ్చారు.
తన మనసులో మాటను అందరికీ చెప్పి ఈ ఆస్తిని ఎలా పంచాలో ఎవరికి వారు ఓ కాగితంపై రాసి ఇమ్మన్నాడు.
మరునాటికి అందరూ ఇచ్చేసారు.
తను అన్నీ చదువుకోవడం జరిగింది.
సరే. అందరినీ ఆ రాత్రి సమావేశ పరచి వారు రాసి ఇచ్చిన వివరాలు చదివి వినిపించడం మొదలు పెట్టాడు.
1. పెద్దవాని అభీష్టం: ఒక ఎకరం పల్లం మూడెకరాల తోట అమ్మ బంగారంలో సగం ఆడ పిల్లలకు మినహాయించి మిగిలింది సమానంగా ముగ్గురికీ పంచమన్నాడు.
2 పెద్దమ్మాయి ఆలోచన: వకీలు కదా. ఆస్తి హక్కు సంతానం అందరికీ సమానమే. అంచేత అన్నీ ఐదు వాటాలు వేసి ఇచ్చేయమంది.
2వ వాడు: అందరి అభిప్రాయాలను విన్నాక మాత్రమే తను రాసిచ్చినది చదవమని ఉంది. సరే.
3వ వాడు మొత్తం నగదుగా మార్చేసి ఐదు వాటాలు వేసేయ మన్నాడు.
2వ అమ్మాయి: ఒక ట్రస్టు ఏర్పాటు చేసి విద్య వైద్యం ఉచితంగా ఊరివారికి అందేలా చేసి ఈ మొత్తం ఆస్తి ఆ ట్రస్టుకి ఇచ్చేద్దాం. అంది
2 వ వాడు: తాత ఇచ్చిన ఆస్తిని తండ్రి ఎలా కాపాడాడో అలాగే అఖండంగా ఉంచుదాం. పిల్లలు అందరికీ పెళ్ళిళ్ళు ఇక్కడే జరుపుకుందాం. ప్రతి సంక్రాంతి నీ ఇక్కడే వేడుకగా చేసుకుందాం. పేదపిల్లలకు చదువులకూ పెళ్ళళ్ళకూ సహాయపడదాం. ఉమ్మడి ఆస్తిని ఉమ్మడిగా నే ఉంచుదాం.
తండ్రి: ఇందులో ఎవరూ నా అవుసరాలకు ఆసరా గురించి ఆలోచించలేదేం?
గతించిన మీ అమ్మకు సంవత్సరానికి ఒకసారి చేసే శ్రాద్ధ కర్మ చేయవద్దా?
అందరి పిల్లలకూ నేను సమాన అవకాశాలు కల్పించి ప్రయోజకులయ్యే లాగా చేసానా? 
అలా కాకుంటే జరిగిన అన్యాయం దానికి ఇతోధిక పరిష్కారం ఉండవద్దా?
ఈ రోజు ఎవరెవరు ఎంతెంత సంపాదిస్తున్నారు? వెనకబడిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వఖ్ఖరలేదా?
ఈ ప్రశ్నలకు జవాబులు ఎవరికి వారే రేపు ఒక్కొక్కరు గా వచ్చి చెప్పండి. అన్నాడాయన.
అంతే.
ఆ తరవాత ఒక్కసారిగా అపోహలూ స్వార్థంతో కుయుక్తులు మొదలయ్యాయి. ఒకరన్న మాట ఇంకొకరికి కిట్టడం లేదు. ఒకరంటే ఒకరికి అసూయ అనుమానాలు ఆరంభ మయ్యాయి.
మరి మీరైతే  ఎలాగ ఏం చేయమంటారో చెప్పండి.
మీ తీర్పు వారికి ఎంతో విలువైనది. దయచేసి స్పందించండి.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home