Sunday, January 20, 2019

   త్వమేవాహమ్

పుడమి తల్లి ఒడిలో తీసుకున్న తొలి శ్వాసకు
అవయవ స్పందనతో నవలోకం చూపినందుకు
ఒడలు పులకించిన ఆనందాతిరేకంలో ఓ ఆలాపన
ఆ ఊపిరి నేర్పిందీ మట్టి బొమ్మకు నేననే ప్రేలాపన
ఆ నేను నాదిగా మారి మోహమయ బంధనాల చిక్కి
ధన కనక వస్తు వాహన సంసార వ్యామోహంగా బలుపెక్కి
విశ్వజనీన లక్షణమైన అహంగా రూపాంతరం చెంది
ధార్మిక సామాజిక నైతిక నియతి  కతీతంగా సాగి
అహంకారమై ప్రతీకారమై వ్యామోహాల ప్రాకారమై
విశ్వ విజేతగా విఱ్ఱవీగి అహమేవ బ్రహ్మాస్మి గా సాగిసాగి
అలుముకున్న పులుముకున్న ఐహికాల చెఱల నుండి
అంతిమ శ్వాస అదే దీర్ఘనిశ్వాస పుడమికే ఒప్పజెప్పి
ఊపిరి మటుమాయం కాగానే యీ మేను మట్టి కాగానే
ఈ బొందిని వట్టి కట్టెగా విడచి పారిపోతుందా 'నేను'
ఆ పై దాని ఆచూకీ ఎవరికీ తెలిసే వైనం లేదు
ఊపిరి ఉండగానే ఆ నేనును వెదికి వెదికి
గుండె లోతుల్లో ఎటనున్నా మాటేసి పట్టుకుంటే
ఈ మోహాలు వ్యామోహాలు అహంకారాలు అంటని
పరమాత్మ స్వరూపంగా కనిపిస్తే దర్శిస్తే
అపుడా ఆత్మ పరమాత్మలు పరస్పరం
త్వమేవాహమ్ త్వమేవాహమ్ అంటూ 
 పలుకరించు కుంటూ ఒకటైపోవా?

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home