Wednesday, January 16, 2019

   పండుగంటే

పండుగంటే పదిమందీ కలుసుకోవడం
ఆనందాలూ అనుభవాలు పంచుకోడం
అనుబంధాలు సంబంధాలు పెంచుకోడం
ఆత్మీయంగా ఆప్యాయంగా పలుకరించుకోడం
పండుగంటే ప్రకృతితో పరవశించి పోవడం
పొలం గట్టుమీద కాలువ గట్టుమీద బాతాఖానీ
వరి కుప్పల వద్ద బడి సావడి వద్ద గత స్మృతులు
నెమరు వేసుకుంటూ నెనరు చాటుకుంటూ
చిరకాలపు నవయవ్వన పరిచయాలు
చిననాటి చిరునవ్వుల సంగడీలు
పునరేకం మమేకం కావడం
అరిటాకులో భోజనాలు పేకాటలో లబోదిబోలు
అత్త వారింటిలో అరిసెల భక్షణాల ఘుమఘుమలు
ఎడాది పొడుగునా ఊరించి  వచ్చిన పెద్ద పండుగ
ముక్కనుమతో మూటా ముళ్ళూ సద్దుకోమంటుంది
అమ్మాయీ పిల్లలూ ఆదివారం వస్తారు
తొందరైతే మీరే వెళ్ళండి అల్లుడు గారంటూ అత్తగారు
కాదనకు బాబూ మరో రెండు రోజులే కదా అనే మావగారు
కదల లేక వదల లేక కాదన లేక ఒంటరిగా వెళ్ళలేక
బిక్కమొహంతో బయలు దేరే జామాతల వెతలు
కిక్కిరిసిన బస్సులలో రైలు బళ్ళలో కార్లలో ప్రయాణాలు
నగరాలు  పరుగుల బ్రతుకుల ఒరవడికి నగారాలు
మరోమారు సమయం లేదు మిత్రమా అంటూ
అంతే. అంతటితో పండుగ వేడి చల్లబడి పోతుంది
పల్లె పిల్ల మూగబోతుంది పల్లెపట్టు బోసి పోతుంది
కాల గమనంలో మరో చంక్రమణం పూర్తవుతుంది.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home