Tuesday, December 25, 2018



    వినుతి

మ.
కలలో కన్నుల పంటగా కనిన సాకారం బగున్ నాకలల్
తలలో నాల్కగ నొద్దికై బ్రతుక నంతా మిథ్యయా శాంకరీ
కలిమిన్ గోరితినా యభీష్ట మిది కాకన్ యన్య మొద్దంటినా
బలవంతంబుగ పట్టు పట్టి నతిగా బంగార మిమ్మంటినా?
మ.
వినవే నామొఱ లొక్క సారి విని నా విజ్ఞాపనల్ దోషమై
న ననున్ కాదనవే దయామయి! శివే! నా కన్నులారా నినున్
కనుగొంటే పదివేలదే జనని నాకా యోగ మిప్పించవే
జననీ శార్వరి శాంకరీ గిరిజ నా జన్మంబు ధన్యంబునౌ.
మ.
కనులున్ కాయలు కాయునట్లు నిను నీ కళ్యాణ వైభోగమున్
గన నారాట పడున్ సదా యభయదా! కన్పింపవే యీశ్వరీ
మును నే జేసిన పాపమా యితర మా ముమ్మాటికీ నేరమా
కనవే శాంభవి శారదా పురుల! యాకర్ణింపవే నా వ్యధల్.
మ.
సిరులో సంపదలో మహా విభవమో చేలంబులో స్వర్ణమో
ధరణీ ఖండమొ రాజయోగమొ మహోదారంబుగా భార్గవీ
కరుణా సింధువు యిమ్ము యిమ్మనుచు నిన్ కాసింత బాధించితే
వరముల్ పెక్కులు కోరితే దొసగు నీ వాత్సల్యమున్ కోరెదన్.
మ.
వలదంచున్ వలదంచు వీలు పడ దే వాదోపవాదంబులా
ఖలుడా పొమ్మని పార ద్రోలకు విశాఖా మాతృ మూర్తీ! సదా
కొలచే వారికి కొంగు బంగరువు నాకున్ నాకుటుంబానికిన్
బలమై సంపదయై మదీయ కవితాభావమ్మువై యుండవే.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home