Wednesday, December 19, 2018

        నేను ఎవరు?

సీ.
ఏ కణ సంయోగమో యోగమో యేమొ
         అండమై పిండమై అమరె నెటులొ
ఏ పూర్వ పుణ్యమో ఏరి సంకల్పమో
         ఒక తల్లి గర్భాన ఒదిగె నెపుడొ
ఓ అమ్మ కడుపులో తానుమ్మ నీటిలో
         పదినెల్లు పోరాడి బయట పడెనొ
బ్రతుకు జీవుడ! యంచు వెరపు లేదిపుడంచు
          కుయ్యిడె గొంతెత్తి కొసరి కొసరి
తే.గీ.
తను యెవరొ  తనువేమిటో తలుప లేక
ఎవరు తలి దండ్రులో యంచు తెలియ రాక
నేలపై బడ్డ తనెవర నెరుక లేక
నేను నేనను భావమే నేర్వ నపుడు.
సీ.
చన్నిచ్చి చంకిచ్చి లాలించి పోషించె
             నేపేగు బంధమో నేరు గాను
ఏ కణ మే గుణ మే ఋణ మే పణ
             మీ జన్మ నిచ్చెనో మేటి గాను
తళుకు బెళుకుల తనువు నడిపించెడి
             మనసుతో జతగూడి  మృదువు గాను
తనువుదో మనసుదో లోనున్న జీవిదో
             నేను నా దను యూహ నేర్పు గాను
తే.గీ.
వెలికి జూచు కనులు చూడ వేల లోన
మనసు తానేడ నున్నదో మరుగు గాను
ఆత్మ ఎటులుండునో ఎట గలదొ యేమొ
ఆత్మ నేనా మనసు నేన? తనువు నేన?
సీ.
తనువు కన్నను మున్ను కణములో నున్నదే
            నేనైన యీ మేను నేను కాదు
కణములో నున్న గుణమె యీ మనసు నున్న
            నెలవెరుగని మది నేను కాదు
కణములో నెటనుండి వస్తినో  తెలియమి
           నా కణమును కూడ నేను కాదు
రూపధారిగ వసించి నశించు జీవినా
                      నిజముగా జీవినీ నేను కాదు
తే.గీ.
నేను గాని యీ మేనిపై నేల తలపు?
నేను గాని యీ మనసెట్లు నిలువరింతు?
నేను గాని జీవిని గ నే నెరపు టెట్లు?
తెలివి గలవారు నేనేరొ తెలుప గలరు.
చం.
తెలియని 'నేను' కోసమని తెల్సిన మేనును నేను కాదనన్
తెలివగునా వితర్క మవదే యని సంశయ మేల నా మదిన్
వలదు వితండ వాదనలు వావిరిగా నిక నేను వేరు యీ
కలతల మేను వేరు కను గానని యామది వేరు రూఢిగా.
ఉ.
నేనెవరో మనస్సెవరొ నెయ్యపు మేనెవరో యెరింగినన్
యీ నయనమ్ములన్ ముడిచి యీమది నొక్కెడ కట్టిపెట్టి లో
లోనకు జూడ నేర్చినను లోపల దాగిన 'నేను' తెల్వదా
నేనది యాత్మయో యితర నే పథమో వివరంబుగా నటన్.
మ.
కనులన్ గానని శక్తి యొక్కటది నిక్కంబై యధోత్కృష్టమై
తనువున్ గూడి యుపాథిగా మెలగు నేతత్సంయమీంద్రమే
వినుతిన్ బొందిన యాత్మయౌ బుధులదే వేదప్రమాణంబుగా
మనసా జూడగ జెప్పి రందు పరమాత్మన్ గూడ నచ్చటే.





          
        

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home