శూన్యం
ఉ.
శూన్య మనస్కతన్ కనులు చూచెడు దిక్కులు దిక్కుతోచకన్
యన్యమనస్కతన్ మనసు యంబర వీథుల సాగుచుండెడిన్
ధన్యత లెల్ల వేళలను ధర్మముగా లభి యింప కున్నచో
మాన్యత లేని యప్పుడిక మాటల మూటలు మూగవోయెడిన్.
చం.
గగనముతో దిగాలుగ సగమ్ముగ గుండెల పిండు బాధలన్
స్వగతముగా సుతారముగ వావిరిగా వివరించు కొందు నా
కగుపడు పేర్మిగా దలచి కాంచన సాదృశ వేదికా తటిన్
పగతురు లడ్డు రారని యపత్యులు చూడరంచు నొంటిగా.
మ.
వినువీథిన్ కనుగొంచు నిస్పృహలు వేవేలన్ నిభాయిం చుచున్
మనసా సాంత్వన మందు దాక నటులే మాటాడకన్నుండనే
వినునో మిన్ను సమస్త భావములు సంవేద్యాంత రంగంబునున్
వినదో నా మనసెంతగా నలిగి యావేశంబుతో నేడ్వగా
మ.
కనునో కానదొ మిన్ను మున్ను నను రాకాచంద్రికా రేలలో
కనుగో నౌనని నావెతలన్ దెలుప నేకాంతంబుగా నుండగా
కనులన్ కూరుకు నెప్పడో కలుగు నాకళ్ళంత విశ్రాంతమౌ
మునుపున్నట్టి వ్యధా నిధుల్ వెడలి యామూలాగ్ర శాంతంబునౌ.
మ.
గ్రహ తారా పథమై యనంతమన పర్జన్యాపథమ్మై శూన్యమై
యహముల్ రేలకు కారణం బగుచు యవ్యక్తాంత రిక్షంబులో
యిహమై తా పరమై సమాదరముగా యీ మానవా నేకమున్
యొహొహో యన్ మురిపించుచున్ తెలుపు నుద్యుక్తంబు నాకెప్పుడున్.
సీ.
మున్నేటి నీటిలో మునుగంగ లేక నే
మును గంగ( మునుగంగ ముగిసి పోవ
కన్నీటి యేటిలో కడదేర లేక నే
కసుగంది విసుగొంది కనలి పోవ
భాగీరథీ ప్రవాహ తరంగములలో నే
క్రుంకులిడుచు నట క్రుంకు బోవ
మందాకినీ ముందు కైమోడ్చి వరువాత
నే సంధ్య వార్చి మిన్నెక్కి పోవ
తే.గీ.
నిస్పృహలలోన సాంత్వన నింగి నాకు
శూన్యదిక్కుల చిరునామ శూన్యమేను
వినుతి జగదంబ వినదేమొ విన్ను వినును
గగనమైపోవ యూరడి గగన మిచ్చు.
(క్రుంకుబోవు = అస్తమించు)
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home