Friday, January 25, 2019


సీ.
నీ పాద సేవలో నీ సేవ ధ్యాసలో
            కడదేరి పోయేటి కలిమి నిమ్ము
నీ నామ భజనలో నీ రూపు స్మరణలో
           తుదిశ్వాస నిశ్వాస తునియ నిమ్ము
నీ మంత్ర జపములో ఆమంత్రణము నంద
           ఆ తురీయ సమాధి యాన తిమ్ము
నీ ముద్దు బిడ్డగా నీ చంక కూనగా
           నే రాలి పోయేటి నెరవు నిమ్ము
తే.గీ.
నిను వినా లేరెవరు నాకు నెమ్మదిమ్ము
మనసు నీపైన లగ్నమై మసల నిమ్ము
ఆదరించవె తల్లి ఆనంద వల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.10.
సీ.
ఈతి బాధలు లేక నీతి బోధలు కాక
         నెమ్మదిన్ బ్రతుకగా నెలవు నిమ్ము
ఆరాట పడకుండ పోరాట మనకుండ
         అర్చనానుష్ఠాన మధమమిమ్ము
రోగ బాధలు లేక రాగ బంధము పోక
         నీదీక్షలో నన్ను నిలువ నిమ్ము
అఘములన్నియు నాకు పుణ్యముల్ సతికిచ్చి
        పసుపు కుంకుమలతో  పంపి తనను
తే.గీ.
ఆడు కోవమ్మ నాతోడ ఆటలన్ని
నిన్నె యన్నింట జూచుచూ నిమ్మళింతు
ఆద రించవె తల్లి ఆనంద వల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.9.

 
      

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home