Thursday, January 31, 2019

   కొదవేమి లేదులే తల్లి

కొదవేమి లేదులే తల్లి! ఆనంద వల్లీ
ఎదనిండ మది నిండ నీవుండగా...
కొదవేమి లేదులే తల్లి మా కల్పవల్లీ
నేను నాదని వాపోక నీ అండ ఉండగా //కొదవేమి//
కోరికల కోరలకు  కొరగాని వానిగా
చేరికల తీరులకు సరిపోని వానిగా
సొమ్ములే కాని నే పనికిరానపుడు
కిమ్మనా లేక నే మిన్నకున్నపుడు //కొదవేమి//
చిల్లి గవ్వయు లేక ఇల్లాలు చిందేసినా
ఇల్లు గుల్లయి పోయి నే బోసి పోయినా
ఉదయాస్తమానాలు నీ పూజలుండగా
పయనిస్తు నీ కడకు నే చేరు చుండగా //కొదవేమి//
తలపు లన్నియు నీకు పలుకులన్నియు నీకు
నా గుండె గాయాల గేయాల సరములే నీకు
నా నోట నా చేత మంగళారతులు నీకు
అస్తి నాస్తి సమస్తమూ నీ వరములే నాకు//కొదవేమి//
కలిమినిచ్చిన నీవు కన్నీరునూ యిచ్చి
కష్టాలు దుఃఖాలు ఆశలూ నష్టాల నిచ్చి
ఒకసారి ఆనంద డోలికల నూగించి వే
రొకసారి అశ్రునయనాల ఆర్త నాదాల నీయగా
 //కొదవేమి//
(ఈ పాటకు ప్రేరణ శ్రీ సి.రాజగోపాలాచారి గారు వ్రాసిన
'కురై ఒండ్రుమ్ ఇల్లై మరైమూర్తి కన్నా' అన్నపాట. ఆందులోని కురై ఒండ్రుమ్ ఇల్లై అన్నదాన్ని కొదవేమి లేదు అని అనువదించా. మిగిలింది నా స్వంతం.)

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home