Monday, February 4, 2019

సార్థకత


ఆరు పదుల జీవన గమనంలో
ఎత్తు పల్లాలు కలిమి లేములు
ఎన్నో ఎన్నెన్నో ఆధిగమించాను
ఎత్తు మూటల నాటి మురిపాలు
తప్పటడుగుల నాటి బోసి నవ్వులు
జ్ఞప్తి లేకున్నా గుర్తు రాకున్నా
చిరుత కూకటి నాటి చిలిపితనాలు
కురుచ నిక్కరు నాటి ఆటపాటలు
గురుతున్నాయ్ గురుతున్నాయ్.
పొరుగూరి చదువులో పోటీలు
ఇస్కూలు చదువులో స్నేహాలు
కాలేజీ ముంగిట కుఱ్ఱకారు కలేజాలు
పుస్తకమే సమస్తం గా గడిపిన రాత్రులు
మరచిపోలేదింకా మరపు రావింక
నిరుద్యోగ పర్వంలో నిగర్వంగా
వలస బ్రతుకులో సగర్వంగా
గుండె గుప్పెట పట్టి మనసు కట్టిపెట్ఞి
తప్పటడుగులు పడకుండా
ఎవరికీ గుదిబండ కాకుండా
ఆకర్షణలకు దూరంగా చన్నీటి జలకాలు
ఎలా మరువ గలను? ఏలా మరువ గలను?
విధి వంచితమో హృది సంచితమో
కొన్ని పోగొట్టుకున్నా కొన్ని సాధించుకున్నా.
అదేమి చిత్రమో విధి వైపరీత్యమో
ఒక చేత ప్రభుతలో పనికి నియామక లేఖ
మరొక చేత మనసు దోచిన మనిషి శుభలేఖ
కా‌లచక్రం గిఱ్ఱున తిరిగి పోయింది
వలస కూలీగా వెనకేసుకున్న రూకలు నాలుగు
విశ్రాంత జీవనానికి ముట్టిన మాడలు మరో నాలుగు
ఇల్లు ఇల్లాలు చూలు అనందాలు
  అంత‌లోనె  మహా రోగాలు శస్త్రచికిత్సలు
ఏదైనా చేద్దామంటూ కొందరి సంప్రదింపులు
తీరా దిగాక వేదనలూ ఆవేదనలూ
అనుభవం నేర్పిన పాఠం ఒకటే
నీ సొమ్ములే కావాలి కాని నీవు కాదు
దాని కోసమే అంగలార్చినా చొంగ కార్చినా
డబ్బుకు లోకం దాసోహం అదే ముదావహం
నీతి నిజాయితీ నిన్నటి మాట
కులమూ మతమూ కంపుల మూట
అదే నిజమైతే కాలుడి ముంగిట
తల వంచుకు నిలచేరా ఉరికంబం ఎక్కేరా
మనిషిగా సాధించిన దేముంది
ఈ బ్రతుకుకు సార్థకత ఇంకేముంది?


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home