Wednesday, April 15, 2020


సీ.
మేటిగా మముదీర్చి మెల్లగా నిలదీసి
                     మేలుగా మమ్మేల మేలమేల
మేలుకో వమ్మ మమ్మేలు కోమన్ననూ
                     మారదా  మనసేల మౌనమేల
రాతి గుండెల నాతి! రారాతి కూతురా
                    బిగిసి పోకె గిరిజ! బింకమేల
మంచు కొండల మించు మనసు కరుగబోదె
                   నించుకైన వలదె యీవి కావె
తే.గీ.
యిందు వదన! ఉదాసీన మెందు వలన
కతన మేమి కథన మేమి యాలమేమి
నా నుడి వినవే తల్లి ఆనంద వల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.31
సీ.
మందరమణి శక్తి మరు క్షితి యగ్నిఖండ
                    మనగ హ్రీంకార మగును తుదిని
రవి శశి స్మర హంస రాజను సంకేత
               ములు సౌర్య ఖండమౌ ముదముగాను
ఆ పరా మార హరాక్షరములు సౌమ్య
               ఖండ ము లవియె త్రిఖండములు మొ
దల రెంటి నడుమ రుద్రగ్రంధి మలి రెంటి
                    నడుమ విష్ణుగ్రంధి నా జివరను
తే.గీ.
నలువ గ్రంధుల స్థానముల్ నచట నుండ
భద్ర హ్రీంకార యుక్తమౌ పంచ దశివి
నా మతి గనవే తల్లి యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి. 32.

సీ.
పండ్రెండు రేకుల పద్మము దిగువన
             జ్యోతిర్ తమిశ్రమను యుగళ ముండు
ఆజ్ఞా విశుద్ధిలందా రవి ద్యుతి స్పర్శ
               చే జ్యోత్స్న గనరాదు చీకటుండు
దశశత పద్మ మంతా చాంద్రి యే నట
                నిత్య కలా యుక్త నేత్ర యోని
పరమాకలను వసింపగ యాజ్ఞ వరకుండు
                 పంచదశ కళలు పావనముగ
తే.గీ.
చంద్ర సూర్యాగ్ని కళలె శ్రీ చక్ర మగును
యయిదు పది కళల్ పంచ దశాక్షరనెడి
నా యెరుక నీవె తల్లి యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి. 33
సీ.
మధుకృత మధువృష మర్మ మెఱిగిన గాని
        వాంఛితార్థములను వడయ రనుచు
శ్రుతి సూక్తి గాన పరోక్షము నవ్వాని
         తేట తెల్లమగు నట్లు తెలియ నిమ్ము
తొలి మూడు చక్రాల నోజ చీకట్లుండు
            మిశ్రమ లోకమై మిగులు నెపుడు
విశుద్ధి చాంద్రమౌ  విమల  యాజ్ఞయె సుధా
             లోకమౌనని జెప్పు లోకరీతి
తే.గీ.
'క' 'ల' ల నడుమ వర్ణాలనే కళ లంచు
స క ల యక్షమాలాత్మికమ్ము సవివరముగ
నా కెఱుక నీవె తల్లి యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.34.

సీ.
పక్షాంత పర్యంత పంచ దశ నిశలు
        దర్శ ద్రష్టాదుల తత్వ మెఱిగి
పక్షాంత తదుపరి పంచ దశ నిశలు
     సుత సున్వతీ ప్రసూత్సర్వ మెఱిగి
సంజ్ఞాన విజ్ఞాన    చతురము లగునట్టి
    పదునైదు పేర్లతో పగలు వరలు
బహుళ పక్షమునందు ప్రష్టుతమాదిగా
    పదునైదు పేర్లతో పగలు వరలు
తే.గీ.
త్రిపుర సుందరీ కామేశ్వరీ మొదలగు
నిత్య లను సరఘలనుచు నెఱుక గలిగి
నా మనసు నేర్వ నీవె యానంద వల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.36.




0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home