Monday, May 13, 2019

 పర్జన్య వీరుడా

అపోహానంద బంధురా
ఆడంబరానంద సుందరా
పర్జన్య వీరుడా
సౌజన్య శూరుడా
వికటాట్టహాస నటనా తత్పరా
నీ వర్షోరు ధారా పరంపరలకై
నీ మమతానురాగ పలుకరింతలకై
నీ వచోసుధా ప్రవాహమునకై
నీ కరుణార్ద్ర దృగ్గాంగ ఝరీ స్నపనమునకై
అవనీ లలామ ఆబగా ఆకాశం వైపే చూస్తోంది
కర్తరీ భానుప్రతాప శోషిత మతియై
గాద్గతికయై, పర్యాప్తస్వేద జలాంగియై
నిరీక్షణాక్లేశ క్షోభితయై , చింతితయై
అనుక్షణం నీ రాకకోసం నీకోసం
ఎదురు చూసి ఎదురు చూసి
ఎదను పరచి ఎదురుకోలు పలకాలని
ధరణీ నవలామణి తహతహ లాడుతోంది
కనికరించవా చిలుకరించవా నీదయలు
పర్జన్య వీరుడా ? సౌజన్య శూరుడా?

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home