Friday, March 4, 2022

ఇచ్చేవాడు ఈశ్వరుడు

 శా.

నిన్నున్ గొ‌ల్చిన పుణ్యమో యఘమొ నన్నీరీతి నిల్పంగ నీ

వన్నింట న్నను వెన్కవెన్కకు కడున్ వాపోవ త్రోయంగ జూ

డన్నిన్నేమని నిగ్గదీతు విధి యడ్డంబైనదంచున్ యెదన్

నన్నున్ నేనిక తిట్టుకొందు నదియే నాపాలి యోదార్పగున్.

మ.

కన్నా నెన్నియొ స్వప్నముల్ బ్రతుకు సంఘర్షోచితమ్మంచు నీ

వున్నావన్నిట యండదండగ యటం చున్నా మహోత్సాహినై

యిన్నాళ్ళున్ యిపుడే గదా తెలిసెడిన్ యీ నీ యుదాసీనతన్

నిన్నేమీ యనలేనుగాని యిక నన్నే శక్తి మన్నించునో?

శా.

నీవే తప్ప యితఃపరంబెరుగ నే నిన్నాళ్ళు, యిప్డెట్లు వే

రే వారిన్ కడదేర్చ మంచడిగెదన్ రేవైన చావైన నీ

ద్రోవం దప్ప జుమీ పరాఙ్ముఖ పరా! దుర్భేద్య పాపాబ్దిలో

ద్రోవం దెన్నుయు కానరాక నిటులే దుర్వాసినై పోయెదన్.

మ.

తనువే శాశ్వతమా పరాత్పరునిపై ధ్యాసేనియున్ లేక నీ

మన సేలా యిహసౌఖ్య లాలస నసామాన్యంబుగా పారెడిన్

యనువై యున్నపుడే యితోధికముగా యార్జించరే పుణ్యమున్

తను వేరంచును తన్వు వేరనుచు చిత్తభ్రాంతిఁ దున్మాడరే.

ఉ.

ఇచ్చెడి వాడు యీశ్వరుడు యీ తను విచ్చినవాడతండె నా

కిచ్చకు దోప జేయునది యీశ్వరుడే కృత మియ్యదంచు వా

కృచ్చెడు వాడు నీశ్వరుడె సృష్టి సమస్తము నీశ్వరేచ్ఛ చే

చచ్చుచు పుట్టుచున్ జనుట చర్విత చర్వణ మీశ్వరేచ్ఛయే.

ఉ.

నేను నిమిత్త మాత్రుడను నేనని నాదని వాదులాడ నంతయున్

కానని వాని కూర్మియని కాయ నికాయము నీశ్వరోలగ

మ్మే నన యీ కుటుంబ భరమే ధరణీసుర జన్మమందున

న్నూనుచు నూగులాడుచు నుసూరు మటంచును నన్ను నిల్పెడిన్.


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home