Monday, February 7, 2022

పాహిమామ్

    పాహిమామ్

శా.

అమ్మా! నమ్మితి నిన్ను నా హృదయ మందారాధ్య దైవంబుగా

నమ్మా! నమ్మితి నీ యుపాసనల యానందంబు వర్థిల్లు నం

చమ్మా! నమ్మితి నీ కృపారస సుధా సారమ్ము వర్షించి న

న్నమ్మా! కాతు వటంచు  షోడశి! పరా! నారాయణీ! యీశ్వరీ!

మ.

మనసంతా తవనామమే కదులు నమ్మా! ప్రత్యవస్థన్ శివే!

తనువంతా పులకాంకిత మ్మగును నీ ధర్మేష్టి నాద్యా! వినన్

చనువంతా కవనమ్ముతో దనివి తీర్చంగల్గినన్ జాలులే

వినుమంతా కరుణాంతరంగనిలయా! విశ్వేశ్వరీ! పాహిమామ్.

శా.

ఏ నెన్నాళ్ళిటు లుందునో తనువు నింకేరీతిగా సాగునో

ఉన్నన్నా ళ్ళనునిత్య సేవలకు నే యుత్పాతముల్ కూర్ప కిం

కెన్నాళ్ళిట్లు చరింతునో లలిత! నా కిష్టంబు నీ సేవలో

ఉన్నన్నాళ్ళు తరించనీ జనని! సర్వోత్కృష్ఠ సంధాయినీ.

మ.

కవనోత్సాహమొ భక్తి తత్పరతయో కాలామృతా యోగమో

తవ సేవా గరిమా విశేషమొ  విపత్కాలావలంబమ్ముగా నెంచియో

భవ బంధాపరి వృత్త చిత్త మదియో భావాంబరా రాటమో

భవితాదృశ్య భయంబొ నా మనసులో ప్రద్యోతమౌ పద్యమై.

మ.

కొనకంటం గనినంత జాలు నిను గోరంగోర నే కోర్కెలన్

నిను గన్నంతనె కల్గు సంపదల నన్యేచ్ఛా సుసంవేద్యముల్

యని వాక్రుచ్చిరి నాది శంకరులు యవ్యాజానురక్తిన్ సదా

మనసా కొల్చెడి నన్ను యర్భకుని కమ్మా! యీవె? నీ దర్శనమ్.

శా.

కన్నారన్ నిను నొక్కతూరి  నెదుటన్  గన్నం జాలు కాత్యాయనీ

కన్నుల్ కాయలు కాసి పోయినవి యింకా శంకలేలా?మహా

పన్నానేక శరణ్య! శంకరివి సౌభాగ్యాల వారాశివే

ఛిన్నాభిన్నము సేయకమ్మ కృపయా చిద్రూపిణీ శాంకరీ.

శా.

ఈవే యీశ్వరి? కావవే పరుల? యీ యీ యీప్సితానేకముల్

నీవే యీయకనున్న దిక్కెవరు? మన్నింపం దగున్ భక్తులన్

రావే భ్రామరి! రాకమానవు గదా? రాకేందు బింబాననా

నీవే తప్ప యితఃపరం బెఱుగమో నీరేజ పత్రేక్షణా.


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home