Tuesday, February 22, 2022

పోతన పద్యాలు ఆణిముత్యాలు-3

 పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

   ( ౬౧ వ పద్యం )

శా.

పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ హాస లీ

లా నిద్రాదులు సేయుచున్ దిరుగుచున్ లక్షింపుచున్ సంతత

శ్రీ నారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సం

ధానుండై మఱచెన్ సురారిసుతు డేతద్విశ్వమున్ భూవరా!

సందర్భం:

హిరణ్యకశిపునకు నలుగురు పుత్రులు. అందు ప్రహ్లాదుని గుణగణములను వివరించు నప్పటిది.

భావం:

రాజా! బాలకుడైన ప్రహ్లాదుడు పానీయములు త్రాగుతూ, ఆహారము తినుచూ, మాట్లాడుచూ, నవ్వుచూ, నిద్రించుచూ అన్ని సమయములలోనూ శ్రీ హరి పాదపద్మములపైన ధ్యాసతో ఈ ప్రపంచాన్నే మఱచెను.

విశ్లేషణ:

ధృవుడు పంచశరద్వయస్కుడైనా కఠోరమైన వాయుభక్షణ వ్రతంతో శ్రీ హరిని మెప్పించాడు. కాని ప్రహ్లాదుడు అందరు పిల్లల లాగనే ఉంటూ మనస్సును మాత్రం నిరంతరం శ్రీ హరి పాదాల మీద ఉంచాడు. ఏ సాక్షాత్కారాలు వరప్రదానాలు ఆశించలేదు. ఇది కామితార్థములు లేని పరిపూర్ణభక్తి. శ్రీ హరి నామస్మరణమే ఏకైక లక్ష్యం. దానికి ప్రతిఫలంగా ముక్తిని అడగాలని ఎక్కడా అనుకోలేదు. ఈ బ్రతుకు ఆ నామస్మరణకోసం. అంతే.

ఋషులు మునులు జపతపస్సమాధి విధానం వేరు. బాహ్యప్రపంచం నుంచి విడివడి చేసేవి అవి.

ప్రహ్లాదుడు బాహ్యప్రపంచంలో వుంటూనే నిరంతర హరి నామస్మరణ చేసాడు.

ఆ ప్రహ్లాదుని జీవన వైవిధ్యం ఎంతో స్ఫూర్తిదాయకం. సర్వం కృష్ణార్పణంగా మనగలగడం, మనస్సును పరమాత్మ చుట్టూ పరిభ్రమింప చేయడం అనేది మనమూ నేర్చుకుంటే సుఖదుఃఖాలకు అతీతంగా బ్రతుకవచ్చు.

  ( సశేషం)


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

  ( ౬౨ వ పద్యం )


శా.

పుత్రుల్ నేర్చిన నేర్వకున్న జనకుల్ పోషింతు రెల్లప్పుడున్

మిత్రత్వంబున బుద్ధి సెప్పి దురితోన్మేషంబు వారింతు రే

శత్రుత్వంబు జలంప రెట్టియెడ నా సౌజన్య రత్నాకరున్ 

బుత్రున్ లోకపవిత్రు దండ్రి నెగులుం బొందింప నెట్లోర్చెనో

సందర్భం:

నారద యుధిష్టరులు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు గురించి మాట్లాడుకొను నప్పటిది.

భావం:

ఓ నారద మహర్షీ! లోకంలో తన కొడుకులు విద్యాబుద్ధులు నేర్చుకున్నా నేర్చుకోక పోయినా సరే తండ్రులు ఎల్లప్పుడూ పోషించుతారు. వారి నడవడిక సరిగా లేకుంటే స్నేహంతో మంచిగా చెప్పి సరిదిద్దుతారు. ఏ తండ్రికీ కొడుకుపై విరోధ భావం ఉండదు. 

మఱి ఈ హిరణ్యకశిపుడు తన కొడుకును లోకంలో పవిత్రుడూ మంచి తనానికి సముద్రం లాంటి ప్రహ్లాదుని శిక్షించడానికి మనసెలా వచ్చిందో?

విశ్లేషణ:

ప్రతి తండ్రి తన వంశాంకురమైన కొడుకు బాగా చదువుకుని సుగుణశీలుడై మంచి పేరు తెచ్చుకోవాలని ఆశపడతాడు. అందుకోసం తను చేయతగినంత కృషి చేస్తాడు. ఆ లక్ష్య సాధనలో ఎన్నో శ్రమలు మరెన్నో త్యాగాలు చేస్తాడు. అందుకుగాను వృద్ధాప్యంలో ఆ కొడుకు తనకు సంరక్షణ కల్పించడం అనేది ఓ ప్రతిఫలం.

అందుకే కొడుకు పుట్టగానే 'పుత్రోత్సాహం' అని వేడుకగా ఆనందాన్ని అందరితో పంచుకుంటారు.

కొడుకు పుడితే సంతోషించని వారెవరుంటారు?

చంద్రుని వలన తారకు కొడుకు పుట్టినప్పుడు చెప్పిన మాట చూద్దాం.

ఆ.

బుద్ధిమంతు డైన బుధుడు పుత్రుం డైన

మేను పెంచి రాజు మిన్ను ముట్టె

బుద్ధిగల సుతుండు పుట్టినచో దండ్రి

మిన్ను ముట్ట కేల మిన్న కుండు?

చంద్రుడే కాదు ఎవరైనా పొంగిపోతారు అలాగ.

మరి ఆ కొడుకు సరిగా చదవక పోయినా చెడు బుద్ధులతో మసలినా తండ్రి అనునయంగా చెబుతాడు. తను ప్రయోజకుడయ్యేవరకూ పోషించుతాడు. ఇది మన సనాతన సంప్రదాయం.

ఈ రాక్షసరాజేంటో కొడుకుని హింసించమని భటులకు చెప్తాడు. అతనికి ఎలా మనస్సొప్పిందో!

ఊహల కందని విషయం.

( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

 ( ౬౩  వ పద్యం (

ఉ.

బాలు బ్రభావిశాలు హరి పాదపయోరుహ చింతనక్రియా

లోలు గృపాళు సాధు గురు లోక వదానత ఫాలు నిర్మల

శ్రీలు సమస్త సభ్య నుతశీలు విఖండిత మోహవల్లికా

జాలు నదేల తండ్రి వడి జంపగ బంపె? మునీంద్ర! సెప్పవే.

 సందర్భం:

నారదుడు ధర్మరాజుకు ప్రహ్లాద చరిత్ర చెప్పనప్పటిది.

భావం:

ఓ నారద మహర్షీ! బాలుడు, తేజోసంపన్నుడు, శ్రీ హరి పాదపద్మములపై మనస్సు నిల్పినవాడు, దయగలవాడు, పెద్దలు , గరువుల పాదములపై నుదురును ఆనించి కొలచేవాడు, స్వచ్ఛమైన శోభగలవాడు, లోకములోని జనులందరిచే  పొగడబడిన శీలము గలవాడు, మోహబంధనం నుండి విడివడినవాడు అయిన ఆ ప్రహ్లాదుని కన్నతండ్రియే ఎందువలన జంపుటకు పురమాయించెను? కాస్త చెప్పవలెను.

విశ్లేషణ:

ప్రహ్లాదుడు చిన్నపిల్లాడు. ఏదైనా తప్పుచేస్తే అనునయ వాక్యాలతో సర్దిచెప్పి సరిచేయాలి కదా తండ్రి. మరి యిదేమి చిత్రం? చంపేయమన్నాడు?

పోనీ ఆ కొడుకు దుష్టుడా? దుర్మార్గుడా?

ప్రహ్లాదుడు ఎలాంటి వాడంటే

సీ.

తనయందు నఖిల భూతములందు

            నొకభంగి సమహితత్వంబున జరుగువాడు

పెద్దల బొడగన్న భృత్యుని కైవడి 

             చేరి నమస్కృతుల్ సేయువాడు

కన్నుదోయికి నన్యకాంత లడ్డంబైన 

       .      మాతృభావన సేసి మరలువాడు

తల్లిదండ్రులభంగి ధర్మవత్సలతను

               దీనుల గావ జింతించు వాడు

తే.

సములయెడ సోదరస్థితి జరుపువాడు

దైవతములంచు గురువుల దలచువాడు

లీలలందును బొంకులు లేనివాడు

లలితమర్యాదుడైన ప్రహ్లాదు డధిప!

అంటే

సకల జీవులనూ తనతో సమానంగా భావిస్తాడు, పెద్దవారు ఎవరైనా తారసపడితే సేవకుని వలె చేరి నమస్కరిస్తాడు, ఆడువారినందరినీ తన తల్లులులాగ భావిస్తాడు, దైన్యజనులను తలిదండ్రుల వలె కాపాడుతాడు, తనతోటివారిని సోదరులుగా గురువులను దైవంగా భావిస్తాడు, అబద్ధాలు చెప్పడు. నిజంగా లలితమర్యాదుడు ఆ బాలుడు. శ్రీ హరి పాదపద్మలపైనే తన మనస్సును లగ్నంచేసిన గొప్ప భక్తుడు ఆ ప్రహ్లాదుడు.

నిజమే, కాని ఆ తండ్రికి విరోధి శ్రీ హరి. ఆ శ్రీ హరి చేతిలో హిరణ్యాక్షుడు మరణించాడు. ఆ శ్రీ హరి మాట మఱచిపొమ్మంటే వినే రకం కాదుకనుక గురువులకు లొంగడం లేదు కనుక తనకు వీనివలనే మరణం వస్తుందనే భీతితో కొడుకుని చంపేయమన్నాడు. అంతకన్న గత్యంతరం లేక. ఎంతైనా రాక్షసరాజు కదా మానవుల వలె ఎందుకు ఆలోచిస్తాడు?

ఆ.వె.

తల్లి దండ్రి మీద దయలేని పుత్రుండు

పుట్ట నేమి? వాడు గిట్ట నేమి?

పుట్టలోన చెదలు పుట్టవా? గిట్టవా?

విశ్వదాభిరామ వినుర వేమ.

అన్న వేమన గారి తలంపు హిరణ్యకశిపుని తలంపు ఒకే కోవలోకి చెందినవి. 

తల్లిదండ్రుల అభీష్టం మేఱకు పిల్లలు నడచుకోవడం సామాజిక న్యాయం. అలా కాదంటే ఆత్మహత్యలూ అల్లకల్లోలాలు చవి చూడాలి.

 ( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

   ( ౬౪ వ పద్యం )

క.

చదువని వా డజ్ఞుండగు

చదివిన సదస ద్వివేక చతురత గలుగుం

జదువగ వలయును జనులకు

జదివించెద నార్యులొద్ద జదువుము తండ్రీ!

సందర్భం:

ప్రహ్లాదునకు గురువుల వద్ద చదువు చెప్పించి ఈతని బుద్ధి సరిచేయాలని తండ్రి భావించి కొడుకుతో చెప్పునప్పటిది.

భావం:

చదువుకోనివారు అజ్ఞానులగుదురు. చదువుకుంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగిన నేర్పు అలవడుతుంది. ఆంచేత జనులందరూ చదువుకోవాలి. అందుకే నిన్ను పూజ్యులైన ఆర్యులవద్ద చదివించెదను. శ్రద్ధగా చదువుకో నాయనా!

విశ్లేషణ:

చదువు ఎంత ప్రాముఖ్యమంటే మనకు నిద్ర, ఆహారము, బట్టలు ఎంత ముఖ్యమో చదువు కూడా అంతే ముఖ్యం.

చదువుకోకపోతే అనేక విషయాలు తెలుసుకోలేని తెలియని దుర్భర జీవితం గడపాల్సి వస్తుంది. అంచేత చదువు అందరికీ తప్పనిసరి.

మరి ఎవరి దగ్గర చదువుకోవాలి? ఆర్యుల వద్ద. ఆర్యులు వేదవాఙ్మయ ద్రష్టలు. జ్ఞానులు. పండితులు దైవభక్తి సంపన్నులు శాస్త్ర కోవిదులు. వారివద్ద చదువుకోవాలి.

ఈరోజు రేపూ అందరూ చదువు చెబుతున్నారు. అయినా ఆర్యసంతతి వారి దగ్గర చదువుకుని పాడైపోయిన వారెవరూ ఇప్పటికీ లేరు. అందుకే పూజ్యులైన ఆర్యుల వద్ద చదువుకోవాలి.

హిరణ్యకశిపుడు రాక్షసరాజు. ఆయన కొడుకుని ఏ రాక్షసుల వద్దనో చదివించుకోవచ్చు కదా. కాని 'ఆర్యులొద్ద చదువుము తండ్రి' అన్నాడు. వారి కులగురువు భార్గవ వంశంలో వాడైన శుక్రాచార్యుల కొడుకులు చండామార్కుల వద్ద చేర్పించాడు. ఇక

చదువు ఎంత మంచి సంపద అంటే

ఉ.

విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్

విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్

విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్

విద్య నృపాల పూజితము విద్య నెఱుంగని వాడు మర్త్యుడే?

అన్న భర్తృహరి మాటలు నిత్య సత్యాలు.

మరి ఆ చదువు చదివినా సరే దుర్మార్గంగా ప్రవర్తించుతున్నారనేకులు అని అంటే మంచీచెడూ తెలుసుకునే నేర్పు పక్కనబెట్టి నొక్కేసే నేర్పు సంపాదించుతున్నారు. అది వారి ప్రారబ్దం. అందుకే

చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా

చదువు నిరర్థకంబు గుణసంయుతు లెవ్వరు మెచ్చరెచ్చటన్.

అన్నది మఱచిపోకూడదు.


  ( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

   ( ౬౫ వ పద్యం )

శా.

అంధ ప్రక్రియ నుండు రాడు పలుకం డస్మ త్ప్రతాపక్రియా

గంధం బించుక లేదు మీరు గురువుల్ కారుణ్యచిత్తుల్ మనో

బంధుల్ మాన్యులు మాకు బెద్దలు మముం బాటించి యీ బాలకున్

గ్రంథంబుల్ చదివించి నీతికుశలుం గా జేసి రక్షింపరే.

సందర్భం:

చండామార్కులను హిరణ్యకశిపుడు ప్రహ్లాదునకు చదువు చెప్పమని కోరునప్పటిది.

భావం:

ఈ బాలుడు గ్రుడ్డివాని వలె ఉన్నాడు. నా గొప్పతనం గురించి ఏమీ మాట్లాడడు. అసలు అటువంటి గుణాలు కనిపించవు. ఇక మీరు

గురువులు, మంచి దయగలవారు, మాకు మానసికంగా చుట్టాలు, పూజింపదగినవారు, మాకు పెద్దలు, నా దీనావస్థను తెలుసుకొని వీనిచే గ్రంథాలు చదివించి నీతి నిజాయితీలు అలవడేలాగ చేసి నన్ను రక్షించండి.

విశ్లేషణ:

ఎవరినైనా ఒక వ్యక్తిని సమాజంలో ఉన్నతునిగా తీర్చిదిద్దగలిగేది గురువు మాత్రమే. అందుకే గురువుకు అంత విలువ. రాక్షసరాజైనా హిరణ్యకశిపుడు కూడా గురువు గారి కుమారులను  గురువుతో సమానంగా భావించి ఎంతో గౌరవించి వారితో ఆయన అనుబంధాన్ని వివరించి కొడుకును అప్పజెప్పాడు.

వెనకటికి మరో రాజుగారు మూర్ఖుడైన తన కొడుకును విష్ణుశర్మకు అప్పజెబితే ఆరు నెలల్లో నీతి కోవిదుడుగా చేసి చూపించాడు.

ఓ జమీందారు నా కొడుకుని కొడతావా అని ఓ గురువును నిలదీస్తే ఆ గురువు నిర్లిప్తంగా ఆ కుఱ్ఱాడిని వదిలేసారు. ఆఖరికి ఆ అబ్బాయి ఎందుకు కొరగాకుండా పోయాడు.

అందుకే సద్గురువుల వద్ద చదువుకోవాలి. ఆ గురువే దైవంగా భావించాలి. ఆ గురువు సమక్షంలో అవిద్యకు చోటుండదు.


అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయః

చక్షురున్మీలనం యేన తస్మై శ్రీ గురవేనమః.


అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించడానికి జ్ఞానమనే కాటుకపుల్లతో జ్ఞాన నేత్రాన్ని వికసింప చేసేవాడు గురువు. అతనే బ్రహ్మ , విష్ణువు, మహేశ్వరుడు. సాక్షాత్తు పరబ్రహ్మ.

అందుకే అటువంటి గురువుని ఆశ్రయించాలి.

శ్రీ గురుస్సర్వ కారణభూతా శక్తిః అని విశ్వసించాలి.

    ( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

   ( ౬౬ వ పద్యం )

ఉ.

మోదముతోడ దైత్యకులముఖ్యుడు రమ్మని చీర బంచె బ్ర

హ్లాదకుమారకున్ భవ మహార్ణవ తారకు గామ రోష లో

భాది విరోధివర్గ పరిహారకు గేశవ చింతనామృతా

స్వాద కఠోరకున్ గలుషజాల మహోగ్రవనీ కుఠారకున్.

సందర్భం: 

కొన్ని రోజుల పిమ్మట కొడుకు ఎంతవరకూ సరిదిద్దబడ్డాడో తెలుసుకోగోరి ప్రహ్లాదుని రమ్మని కబురు పంపి నప్పటిది.

భావం:

ఎంతో ఆనందంతో తన కమారుడైన ప్రహ్లాదుని, సంసారసాగరమందు తరించినవానిని, కామక్రోధాది అరిషడ్వర్గములను జయించినవానిని, శ్రీ హరి చింత వినా ఇతరమెరుగని వానిని, పాపములనే మహాటవిని ఛేదించుటలో గొడ్డలి వంటి వానిని రమ్మని రాక్షసరాజైన హిరణ్యకశిపుడు కబురు పంపెను. 

విశ్లేషణ:

ప్రహ్లాదుడు జన్మతః పరమభాగవతుడు. "పూర్వజన్మ పరమభాగవత సంసర్గ సమాగతంబైన ముకుంద చరణారవింద సేవాతిరేకంబున"ఉండేవాడు. నిరంతరం ఆ పరమాత్మ చింతనలో ఉండేవాడు. ఎప్పడైన చిన్న యెడబాటు కలిగితే దుఃఖించేవాడు.

ఒకోసారి ఆ శ్రీ హరి భావనలో మునిగి తేలుతూ బిగ్గరగా పాడుకునేవాడు.

మరోసారి నేనా శ్రీ హరిని చూసాను అని ఎగిరి గంతులేసేవాడు.

ఆనందపరవసుడై కేశవా పరమేశ్వరా అని పిలుస్తూ ఆనందభాష్పాలతో మూగబోతాడు.

మనస్సును అన్యాక్రాంతం కాకుండా అప్రమత్తతో సంచరిస్తూ బుధజన విధేయుడై పరమభాగవతశ్రేష్టుడై ఉన్న ప్రహ్లాదునికి తండ్రి రమ్మని చెప్పినట్లు చారులవలన వర్తమానం అందింది.

ఇక హిరణ్యకశిపుడు పుత్రుని పై మమకారం ఓ పక్క శత్రువును కీర్తించుతున్నాడనే బాధ మరోపక్క వేధించుతున్నాయి. అంచేత ఉత్కంఠ అతనికి.

ఎంతైనా తన కొడుకు నాలుగు మంచిమాటలు చెప్తూ ఉంటే విని ఏ తండ్రి సంతోషించడు?

ఆ పిల్లల మాటలు అనుదిన సంతోషములై, శ్రమ,తాప,దుఃఖములను పోగొట్టునవి అయి తండ్రులకు మరలమరలా వినాలనిపించేవిగా ఉంటాయి.

"ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు" అని చిన్ని కృష్ణుని చూసి మురిసి పోలేదూ! ఆ చిన్నపిల్లలకు కల్మషమూ స్వార్థమూ తెలియవు. నేను నాది అనే భావన ఉండదు. అందుకే పిల్లలు దైవస్వరూపులు అన్నారు. ఆ చిన్నపిల్లలను ఒడిలోనో తొడపైనో కూర్చోబెట్టుకుని కథలు కబుర్లు పాటలు పద్యాలు చెప్పుకోవడం జీవితంలో ఓ మధురమైన మరపురాని ఘట్టం.

అందరు తండ్రుల వలనే ఈ తండ్రీ ఆరాట పడ్డాడు.

( సశేషం )



పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

   (౬౭ వ పద్యం )


ఉ.

ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి నూతి లోపలం

ద్రెళ్ళక వీరు నే మను మతిభ్రమణంబున భిన్ను లై ప్రవ

ర్తిల్లకసర్వము న్నతని దివ్యకళామయ మంచు విష్ణు నం

దుల్లము జేర్చి తా రడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ.

సందర్భం:

ప్రహ్లాదుని తనతండ్రి నాయనా నీకు నచ్చిన విషయం ఏదైనా చెప్పమంటే ప్రహ్లాదుని సమాధానం.

భావం:

ఓ రాక్షసప్రభూ! శరీరము ధరించిన జీవులందరూ (మానవులు )

ఇల్లనే చీకటి నూతిలో పడకుండా నేను వేరు మీరు వేరు అనే విపరీత భావంతో మతి చలించినవారై సంచరింపక ఈ సృష్టి సమస్తమూ ఆ పరమాత్ముని దివ్య కళా స్వరూపమని యెఱింగి ఆతని యందే హృదయమును/మనస్సును చేర్చి అడవిలో ఉన్నా సరే అదే మేలు. (ఈ భువిలో నేను నాది అనే భావనతో బ్రతుకుట శుద్ధ దండగ.)

విశ్లేషణ:

భవబంధాలకు చిక్కకుండా సాంసార మురికి కూపంలో దిగబడకుండా నిశ్చలమతితో పరమేశ్వర చింతనామగ్న మనస్కులు కావాలంటే దానికి యెంతో పూర్వజన్మ సుకృతం కావాలి. అందరికీ అంతటి భాగ్యం దుర్లభం.

ప్రజాపతి కార్యం కోసమో చతుర్ముఖ బ్రహ్మగారి ఆజ్ఞానుసారమో గృహస్తాశ్రమం స్వీకరించక తప్పదు. మనం తీసుకునే అన్నపానీయాలు రూప రస గంధములను ఆకర్షించ పురిగొల్పుతాయి. దాని మూలంగా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు మనస్సే ఇల్లౌతుంది. అందుకే సామాన్యులకు యవ్వనబిగిలో అబ్బిన అరిషడ్వర్గాలు ఆత్మీయం కాగలవు. కాస్త వయసు మీరాక పశ్చాత్తాప హృదయంతో నైనా అంతర్మధనం ఆరంభం అవుతుంది.

అందువలనే ధూర్జటి ఎలా వాపోయాడో చూడండి.

శా.

ఆలంచున్ మెడగట్టి దానికి నపత్యశ్రేణి గల్పించి త

ద్బాలవ్రాతము నిచ్చి పుచ్చుకొను సంబంధంబు గావించి యా

మాలార్కంబున బాంధవంబనెడి ప్రేమం గొందరం ద్రిప్పగా

సీలన్సీల నమర్చినట్లొసంగితో శ్రీ కాళహస్తీశ్వరా.


సంసారం అనే బంధంలో ఒక భార్యని అంటగట్టి తనతో పిల్లలను కలిగి వారికి పెళ్ళిళ్ళకోసం ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఇలా ఒకదానితో మరొకటి గొలుసులాగ అల్లుకు పోతూ ఉంటే నిరంతర పరమేశ్వర చింతన యెలా సాధ్యమౌతుంది?

దీనికి సమాధానంగా వచ్చినవే

"ఉపవాసవ్రత శౌచశీల మఖ సంధ్యోపాసనాగ్ని క్రియా జపదానాధ్యయనాదు " లన్నీ.

సమస్త క్రియలనూ పరమేశ్వరార్పణంగా భావిస్తూ తరించడమే గృహస్తాశ్రమంలో చేయదగినది.

  ( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

  ( ౬౮ వ పద్యం )

మ.

సురలం దోలుటయో! సురాధిపతులన్ స్రుక్కించుటో! సిద్ధులం

బరివేధించుటయో! మునిప్రవరులన్ బాధించుటో! యక్ష కి

న్నర గంధర్వ విహంగ నాగపతుల న్నాశంబు నొందించుటో! 

హరి యంచున్ గిరి యంచు నేల చెడ? మోహాంధుండవై పుత్రకా!

సందర్భం: ప్రహ్లాదుని రప్పించి తండ్రి నీ కిష్టమైన విషయం చెప్పమంటే హరినామస్మరణ అంటాడు ప్రహ్లాదుడు. దానికి హిరణ్యకశిపుడు చెప్పిన జవాబు.

భావం:

కుమారా! దితి వంశంలో పుట్టిన మనము చేయవలసింది దేవతలను ( అదితి వంశీయులను ) తరిమేయడమో, దేవతల రాజులను చంపడమో, సిద్ధులను పట్టి పీడించడమో, తపస్సు చేసుకునే మునులను బాధించడమో, యక్ష కిన్నర గంధర్వ పక్షి సర్ప ప్రభువులను నశింపజేయడమో. అదిమాని హరి గిరి అంటూ అజ్ఞానంతో ఎందుకు చెడిపోతావు?

విశ్లేషణ: 

ప్రతి కుటుంబానికి వంశపారంపర్యంగా వచ్చే విధులు ప్రజ్ఞలు వృత్తులూ ఉంటాయి. అవి ఆచరించడం వారి ధర్మం.

దితి సంతానం అయిన రాక్షసులకు అదితి సంతానమైన దేవతలను ఓడించి ఆ రాజ్యం లాక్కోవడం ప్రధానం. దితి అదితి స్వయంగా అప్పచెల్లెళ్ళు. వారి మధ్యనున్న స్పర్ధ కారణంగా దేవదానవుల యుద్ధాలు.

దితి అదితి గురించి కొంచెం తెలుసుకుందాం:

బ్రహ్మ మానస పుత్రులలో మరీచి ఒకరు. ఆయన భార్య కళ . ఆయన కొడుకు కశ్యపుడు. అతను ప్రజాపతి. అతనికి దక్షుని కుమార్తెలైన దితి, అదితి, కద్రువ, వినుత, దను, అరిష్ట, సురస, సురభి, తామ్ర, క్రోధనక, ఇడ, ఖస, ముని ఆనే ౧౩ మందితో  పెళ్ళి చేసారు. 

అందులో దితి సంతానం దైత్యులు (రాక్షసులు), హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు.

అదితి సంతానం ద్వాదశాదిత్యులు.. ఇంద్ర , మిత్ర , భాగ, త్వష్ట, వరుణ, అర్యమ, వివస్వను, సవిత్ర, పూష, అంషు.

వీరు దేవతలు.

కద్రువ సంతానం నాగ జాతి.తక్షకుడు కర్కోటకుడు మొదలైన వారు.

వినత సంతానం పక్షి గణం. అనూరుడు, గరుడుడు, సగరుడు.

దను సంతానం వందమంది. వారు దనువులు. అందులో విప్రఛిత్తి కొడుకు మయుడు.

అంటే నిజానికి యిది సవతి పిల్లల పోరన్నమాట.

రాక్షసవంశజులకు ప్రధమ కర్తవ్యం దేవతలను ఓడించి రాజ్యం లాక్కోవడం. అది ఆధిపత్య పోరు.

అందుచేత ఇలాంటి పనులు చేయమన్న తండ్రిది కాదు తప్పు. 

మరి దితి సంతానానికి రాక్షస గుణం ఎందుకు వచ్చిందంటే,  ఒకసారి అదితి, కద్రువ, వినత గర్భవతులైనారని తెలిసిన దితి కశ్యపుని వద్దకు పోయి మోహపరవశయై కామోత్కంఠత తెలియ జేస్తుంది. అది అసురసంధ్యా సమయం. కశ్యపుడు చీకటి పడేవరకూ ఆగమంటాడు. తక్షణం పని కావలసిందే అంటుంది. విధీ బలీయసీ ఆని కశ్యపుడు అంగీకరిస్తాడు. దితి గర్భవతి అయింది. కానీ అసురసంధ్యాసమయంలో సంగమించుటచేత ఆసురీగుణ గరిష్టులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులను కన్నది. ఆ కారణంగా వారికి ఆసురీ గుణాలు వచ్ఛాయి.

మరి ప్రహ్లాదుడకి ఎందుకు రాలేదు ఆ గుణాలు అంటే జయవిజయులకు సనకసనందనులు చెప్పిన శాప విమోచన మార్గం సుగమం కావడం, దితికి కశ్యపుడిచ్చిన మాట నిలబడడం, లీలావతీ గర్భస్త శిశువుకు నారదుడిచ్చిన మంత్రోపదేశం వెరసి ప్రహ్లాదుని వైష్ణవ భక్తి.

( సశేషం )



పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

( ౬౯ వ పద్యం )

శా.

అజ్ఞుల్ గొందఱు నేము దామనుచు మాయం జెంది సర్వాత్మకుం

బ్రజ్ఞాలభ్యు దురాన్వయ క్రమములన్ భాషింపగా నేర రా

జిజ్ఞాసా పథమందు మూఢులు గదా! చింతింప బ్రహ్మాది వే

దజ్ఞుల్ త త్పరమాత్ము విష్ణు నితరుల్ దర్శింపగా నేర్తు రే?

సందర్భం:

హరిగిరి అంటూ ఎందుకు చెడిపోతావన్న హిరణ్యకశిపుని ప్రశ్నకు ప్రహ్లాదుని సమాధానం.

భావం:

జ్ఞానములేని కొందరు మేము వారు అంటూ మాయలో పడి ఉంటారు. ఆ సర్వాత్మకుడైన పరమేశ్వరుడు ప్రజ్ఞ చేత లభించనివాడు, ఇది అతని రూపం అని నిర్దేశించుటకు వీలుపడనివాడు వేదవిదులైన బ్రహ్మాదులకే ఇదమిత్థము అని చెప్పనలవికాని ఆ పరమాత్ముడైన విష్ణుని తెలుసుకునే మార్గం కూడా తెలియని ఇతరులు ఎలా దర్శింపగలరు?

విశ్లేషణ:

భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపి. కానీ ఆ భావంతో ఎల్లవేళలా బ్రతుకు వెళ్ళదీయడం సర్వసంగపరిత్యాగులకే కష్టసాధ్యం. మరి సామాన్యులు అలా ప్రవర్తించగలరా?

వీలు పడదు. అంచేత ఆ యెఱుకతో ఉంటూ లౌకిక జీవనం గడిపితే స్పర్ధలు వచ్చే అవకాశం ఉండదు.

భగవంతుడు భక్తసులభుడు అని ఒకసారి బ్రహ్మాది మహాత్ములకే కష్టసాధ్యం అని మరోసారి అంటున్నారు అనడిగితే మనం గుర్తు పెట్టుకోవలసింది అచంచలమైన విశ్వాసం.

 ఆ నమ్మికతో ఉంటూ సాధన చేస్తే సాధ్యమే. ఇంతకుముందు చెప్పుకున్నాంకదా 

కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు….

.ప్రేమన్ మీరలు భక్తి నేము నిదె చక్రింగంటి మెట్లైన

అన్నమాట గుర్తు పెట్టుకోవాలి.

ఇందులో తరతమ బేధాలున్నాయి.

సామాన్యులు కోరుకునేది అనుగ్రహం

సాధకులు కోరుకునేది సాక్షాత్కారం

ఉపాసకులు, పిపాసకులు కోరేది సాయుజ్యం.

వీటి గురించి మరొకప్పుడు చూద్దాం.

 (సశేషం)


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

   ( ౭౦ వ పద్యం )

సీ.

మందార మకరంద మాధుర్యమున దేలు

            మధుపంబు వోవునే మదనములకు

నిర్మల మందాకినీ వీచికల దూగు

            రాయంచ సనునె తరంగిణులకు

లలిత రసాల పల్లవ ఖాది యై చొక్కు

            కోయిల సేరునే కుటజములకు

బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక

            మరుగునే సాంద్ర నీహారములకు

తే.

అంబుజోదర దివ్య పాదారవింద

చింతనామృత పానవిశేషమత్త

 చిత్త మేరీతి నితరంబు జేరనేర్చు

వినుతగుణశీల! మాటలు వేయునేల?

సందర్భం:

హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు తన కర్తవ్యం తెలియచేసినది.

భావం:

మందారపూల మకరందపు మాధుర్యాన్ని ఆస్వాదించే తుమ్మెద ఉమ్మెత్త పూలపై వాలునా?

నిర్మలమైన దివిజగంగా ప్రవాహములలో తేలియాడు రాజహంస వాగులు వంకలకు వెళ్ళునా?

లేతమామిడి చిగుళ్ళను తినే కోయిల కొండమల్లెలు తింటుందా?

నిండు పున్నమి వెన్నెలను స్వీకరించే చకోరపక్షి దట్టమైన మంచు కొఱకు చూచునా?

పద్మనాభుని దివ్యమైన పదపద్మముల ధ్యానామృతం సేవించుటచే బాగా మత్తెక్కిన నా మనస్సు మరొకటి ఎలా కోరుకుంటుంది?

చెప్పుకోదగ్గ గొప్ప గుణములగల మీకు వేయి మాటలు చెప్పాలా?

విశ్లేషణ:

ఈ పద్యం తెలియనివాడు తెలుగువాడే కాడంటారు. భాగవతానికే వన్నె తెచ్చిన ఆణిముత్యం యీ పద్యం.

తుమ్మెద పూల మకరందాన్ని సేవిస్తుంది. హంస చక్కని స్వచ్ఛమైన గంగాఝరిలో తిరుగుతుంది.

కోయిల మావిచిగురు తింటుంది.

చకోరం పండువెన్నెలను స్వీకరిస్తుంది. కీటకములైన పక్షులైన తుమ్మెద, హంస, కోయిల, చకోరములకు జన్మతః వచ్చిన గుణములవి. అలాగే ప్రహ్లాదుడు జన్మతః శ్రీ హరి భక్తుడు. 

అభీష్టవస్తువులు లభించినంత వరకూ వాటి మనస్సు ఇతరములపైకి పోదు. అలాగే ఈ బాలుని మనస్సు మిగిలిన వాటి జోలికి పోదు.

కడుపుమానంతో ముడిపడిన వాటికి ఒక తృప్తి అనే స్థాయి ఉండొచ్చు కానీ మనస్సుకు అది వర్తించదు. అంటే క్రమక్షీణోపాంత సిద్ధాంతానికి (Law of diminishing marginal utility)ఈ మనస్సు మినహాయింపు అన్నమాట. అందులోనూ భక్తిపారవశ్యంలో ఎంత లభించినా తనివి తీరదు.

కవిత్వ పరంగా ఈ పద్యానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి.

వ్యాసులవారి భాగవతంలో ఈ భావానికి మూలం లేదు. ఇందులో పోతన తన స్వీయానుభూతిని పరకాయప్రవేశం చేయించాడని విజ్ఞులు అంటారు.

అయితే పోతనకు ముందు పాల్కురికి సోమనాథుడు తన బసవ పురాణంలో ఇదే భావంతో చెప్పినది చూద్దాం.

ద్విపద:

క్షీరాబ్దిలోపల గ్రీడించు హంస 

గోరునే పడియల నీరు ద్రావంగ

జూతఫలముల జుంబించు జిలుక

జాతి బూరుగుమ్రాని పండ్లు గన్గొనునె

రాకామలజ్యోత్స్న ద్రావు చకోర

మాకాంక్ష సేయునే చీకటి ద్రావ

విరిదమ్మి వాసన విహరించు దేటి

పడిగొని సురియునే ప్రబ్బలి విరుల.


ఈ పదగుంఫనానికి మెఱుగులు దిద్ది భక్తిని జోడించి ప్రహ్లాదుని చేత సీసమాలికగా ఉంచాడు పోతన.


మరి దీనిని అనుకరించిన వారూ ఉన్నారు.

నందికొట్కూరి సిద్ధయోగి తన యోగీశ్వర విలాసంలో

పదపడి తనతల్లి పాలు ద్రావంగ

మది నిచ్చయించెడు మాతంగపోత

మేలీల నైనను స్పృహనూరబంది

పాలకు బోవునే భక్తైకలోల

అంభోజ బృందాంత రాయుతైకాంత

బంభరంబులు చనునె బర్భరంబులకు

సంపూర్ణ పూర్ణిమా చంద్రచంద్రికల

గుంపుననుండు చకోర సంచయము

చేరునే దట్టపు చీకట్ల కడకు

క్షీర పాధోధి  వీచీ నిత్య యుత సు

ధార సానంద మత్తమరాళచయము

కూరిమి జెర్చునే కుంటలకడకు

సహకార ఫలసార సౌఖ్యసత్కీర

బహుళౌఘ మేగునే బదరిశాకలకు

నూతన ముదిర బంధుర తోయపాన

చాతకం బాసించి చనునె నూతులకు

లీల నీ భంగి మేలిమి కృపావాల

శీల వాగ్జాల ప్రసిద్ధచే మున్ను

పుడమి బోధించి శంభుడవైన నిన్ను

విడిచి హూత్పద్మంబు వేరొక్కదారి

జనదయ్యజియ్య శిష్యశాంత శయ్య.


ఇదే భావాన్ని పాల్కురికి సోమనాథుడు మరోసారి తన చతుర్వేదసారము అనే కావ్యంలో వ్రాసారు.

సీ.

రాకామలజ్యోత్స్నద్రావ నిచ్చలు గన్న

             నా చకోరకంబుల కరుచి యగునె

సహకారపల్లవచయములు దొరకిన

             జగతి  కోవెలలకు జప్పనగునె

క్షీరాబ్దిలోపల క్రీడింప గలిగిన

             భువి రాజహంసకు బుల్ల నగునె

విరిదమ్మి వాసన వెల్లి ముంచిన గ్రోలు

             షట్పదముల కనాస్వాద మగునె

  బహుళతరదయార్ద్రభావప్రభావన

  మహిమ దనరు జంగమంబు రాక

  యతుల భక్తి పరుల కావశ్యకంబగు

  బరిహృతాభిషంగ! బసవలింగ!

అంటే ఈ భావం కవిహృదయాలను ఎంతగా అలరించిందో ఊహింపనగును. పోతన దానిని చక్కెరపాకంలో ముంచి మరింత మధురిమతో అందించాడు. అందుకే ఈ పద్యం అందరికీ యిష్టం.

  ( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

    ( ౭౧ వ పద్యం )

చం.

తనయుడు గాడు శాత్రవుడు దానవభర్తకు వీడు దైత్య చం

దనవనమందు గంటకయుత క్షితిజాతము భంగి బుట్టినా

డనవరతంబు రాక్షసకులాంతకు బ్రస్తుతి సేయుచుండు దం

డనమున గాని శిక్షలకు డాయడు పట్టుడు కొట్టు డుద్ధతిన్.

సందర్భం:

చండామార్కులు హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడు మాటలకు లొంగే రకం కాదు . దండనతో సరిచేయమని చెప్పినది.

భావం:

ఈ బాలుడు రాక్షసరాజుకు శత్రువేగాని కొడుకు కాదు. రాక్షసకులం అనే చందనవనంలో పుట్టిన ముళ్ళపొద వీడు. ఎప్పుడూ రాక్షస కులాంతకుడైన విష్ణువును స్తుతి చేస్తూ ఉంటాడు. దండనతోనే గాని చదువులతో (శిక్షా మార్గంలో) కుదుటపడే రకం కాదు. అందుకని పట్టుకుని బాగా కొట్టండి.

విశ్లేషణ:

బాలుడు పంచశరద్వయస్కుడు. చెప్పేవి చూస్తే తర్కశాస్త్రం లో విషయాలు, భక్తి వేదాంతాలు మాటాడుతాడు. రాజువద్ద గురువులు తలవంచుకునేలా చేసాడు.

 గురుపుత్రులు లౌక్యం తెలిసిన వారు కనుక పట్టి చితగ్గొట్టి బుద్ధి చెప్పండి అని ఆ పని రాజుకే వదిలేసారు. వారి నెత్తిమీద వేసుకుంటే నిందలే మిగులుతాయని ఊహించారు. 

పుత్రుల్ నేర్చిన నేర్వకున్న జనకుల్ పోషింతురని మిన్నకుంటాడో

నాలుగు తన్నులు తన్ని సరిచేసుకుంటాడో రాజుగారి ఇష్టం.

ఒక హరిపాదాక్రాంతుని శిక్షించిన పాపం చండమార్కులకు అంటదు. అదీ ఆ లౌక్యంలో పరమార్థం.

(సశేషం)


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

   ( ౭౨ వ పద్యం )


ఉ.

త్రిప్పకుమన్న ! మా మతము దీర్ఘము లైన త్రివర్గపాఠముల్

దప్పకు మన్న ! నేడు మన దైత్యవరేణ్యుని మ్రోల నేము మున్

చెప్పినరీతి గాని మఱి సెప్పకు మన్న ! విరోధి నీతులన్

విప్పకు మన్న ! దుష్టమగు విష్ణుచరిత్ర కథార్థ జాలముల్.

సందర్భం:

చండమార్కులు ఏకాంతంగా మరి కొన్నాళ్ళు చదువు చెప్పి రాజు వద్దకు తీసుకుని పోవుచూ ప్రహ్లాదునికి చెప్పిన ముందుజాగ్రత్త.

భావం:

ప్రహ్లాదా ! ఈ దినం మరలా మీ తండ్రి గారివద్దకు వెళుతున్నాం. అచట నీవు మాట మార్చకు. నీకు నేర్పిన సుదీర్ఘములైన ధర్మశాస్త్రము అర్థశాస్త్రము కామశాస్త్రములలో  పొరపాటు లేకుండా చెప్పు.  మేము చెప్పినది కాక మరొకటి యేదీ చెప్పకు. మీ తండ్రికి విరోధి అయిన విష్ణువు కథలుగాని ఆయన నీతులు గాని చెప్పకు. జాగ్రత్త !

విశ్లేషణ :

గురువులు పఠింపించినవి తెలియకనా ? ప్రహ్లాదునికి? ఇతని వలన మిగిలిన శిష్యులకు ఈ జాఢ్యం అంటకుండా ప్రహ్లాదుని ఏకాంతంలో చదివించారు. అందులో భాగంగా సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించి, నీతికోవిదుడయ్యాడని నమ్మకం కలిగాక పునస్సంధానానికి పూనుకొన్నారు. ముందుగా లీలావతికి చెప్పి సాలంకృతుడిని గావింపించి తీసుకుని వెళ్ళారు. 

తండ్రికి లేకలేక కలిగిన కొడుకు మీద ఎంతో ప్రేమ ఉంటుంది. అక్కడ మరలా తేడా వస్తే అది మరణశాశనమే. అందుకే ఉద్విగ్నత ఆ తండ్రికి. బాలుడికి ధర్మార్థ కామ శాస్త్రములే నేర్పారు.

మోక్షం గుఱించి నేర్పలేదు. కారణం ఏలికలకు ధర్మ అర్థ కామములే ఉంటాయి. రాజులకు రణంతోనే స్వర్గం.  ధృవుని వృత్తాంతంలో ఆ విషయం వివరించబడింది.

( సశేషం )




పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

    ( ౭౩ వ పద్యం )

శా.

చోద్యం బయ్యెడు నింతకాల మరిగెన్ శోధించి యే మేమి సం

వేద్యాంశంబులు  సెప్పిరో? గురువు లేవెంటన్ పఠింపించిరో?

విద్యాసార మెఱుంగ గోరెద భవ ద్విజ్ఞాత శాస్త్రంబులో

పద్యం బొక్కటి చెప్పి సార్థముగ తాత్పర్యంబు భాషింపుమా.

సందర్భం:

హిరణ్యకశిపుని వద్దకు ప్రహ్లాదుని తీసుకుని గురుపుత్రులు రాగా తన కొడుకు ఏమేమి నేర్చుకున్నాడో చెప్పమన్నది.

భావం:

నాయనా! చాలాకాలమైంది కదా! ప్రత్యేకంగా నీకేమేమి గొప్ప విషయాలు గురువులు  నేర్పారో? నీ వెంత నేర్చావో తెలుసుకోవాలని ఉంది. నీవు నేర్చిన ఏ శాస్త్రం నుంచైనా ఒక పద్యం చెప్పి దాని భావం ప్రస్ఫుటించేలాగ తాత్పర్యం చెప్పుము.

విశ్లేషణ:

పూర్వం గురుకులంలో చదువులుండేవి. పిల్లలు తమ ఊరు విడిచి మరో ఊరు వెళ్ళి గురువుగా రింటనే ఉంటూ చదువు కోవాలి. ఎప్పుడైనా ఇంటికి వస్తే ఆ తనయుడు  ఏమి నేర్చుకున్నాడో పరిశీలించేవారు. హిరణ్యకశిపుడు కూడా తనకు నమస్కరించిన  కొడుకుని  చూచి దీవించి, గాఢాలింగనం చేసి తన తొడమీద కూర్చోబెట్టుకుని లాలించి ముద్దులాడి చుంచు దువ్వి (ముంగురులు సవరించి), గెడ్డం పట్టుకుని, చెక్కిలి నిమిరి, శిరస్సును చుంబించి ఆనంద బాష్పాలు కార్చుతూ ఉబ్బితబ్బిబ్బు అయ్యాడు.

అది ఒక తండ్రి కి తన సంతానం మీదుండే వాత్సల్యం. 

అలాగే తండ్రికి ఈయ వలసిన గౌరవం ప్రకారం ప్రహ్లాదుడు మొదట నమస్కరించాడు. నా కొడుకు ప్రయోజకుడయ్యాడనే ఆనందం ఆ తండ్రిది.

నేర్చుకున్నదాంట్లో నీకు నచ్చిన పద్యం చెప్పి వివరించమన్నాడు ఆ తండ్రి. అది బాగా చెపితే ఇద్దరికీ జన్మ సార్థకమే.

 జీవితంలో ఓ తనయుడుగా ఓ తండ్రిగా అటువంటి అనుభవం పొందిన వారికి తెలుస్తుంది అందులోని మాధుర్యం.

( స శేషం )


పోతన పద్యాలు -- ఆణిముత్యాలు

(  ౭౪ వ పద్యం )

మ.

తను హృ ద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా

ర్చనముల్ సేవయు,నాత్మలో నెఱకయున్ సంకీర్తనల్ చింతనం

బను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స

జ్జను డై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!

సందర్భం:

తండ్రి ప్రశ్నకు ప్రహ్లాదుని సమాధానం.

భావం:

ఓ రాక్షస రాజా!

సఖ్యము, శ్రవణము, దాస్యం ,  వందనం, అర్చన, సేవ, ఆత్మనివేదన, సంకీర్తన, చింతన 

అనే నవవిధ భక్తి మార్గములలో సర్వాంతర్యామి యైన శ్రీ హరిని నమ్మి మంచివాడై మసలుట మంచిది.

విశ్లేషణ:

అన్నిటికన్నా శ్రేష్టమైనది మనోవాక్కాయకర్మల ద్వారా చెలిమిని పొందడం. ఇది సాధించితే సామీప్యం లభించినట్లే.

ఆయన కథలు లీలలు నిరంతరం వినడం

ఆయనకు దాసుడుగా భావించి భక్తిని పదిమందిలో పెంపొందించడం

ఆయనకు ఎల్లప్పుడూ ప్రణతులు సమర్పించుకోవడం

తనివి తీరా పూజ చేయడం

సుప్రభాతం నుంచి ఏకాంతం వరకూ రకరకాల సేవలు చేయడం

చేసే ప్రతిపనీ పరమేశ్వరార్పణంగా చేయడం

మనసు మైమరచి పోయేలాగ పాడుకోవడం

ఎల్లప్పుడూ ఆయన గురించి ఆలోచించడం.ఈ వివిధ రకాల మార్గాలలో

ఎవరి స్థాయికి తగిన మార్గంలో వారు భక్తిని అంది పుచ్చుకోవాలి. ఆ మార్గంలో చరించాలి. తరించాలి.

  ( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

     ( ౭౫ వ పద్యం )

శా.

అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక స

ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావళీ

బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ద ద్రవ్యముల్ క్రోడ స

ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్.

సందర్భం: తండ్రికి ప్రహ్లాదుని సమాధానం.

భావం:

గ్రుడ్డివాని కంటికి వెన్నెల, చెవిటి వాని చెవికి శంఖం, మూగవాని నోటితో  మంచిగ్రంథములను చెప్పించుట, పేడివానికి ఆడవారిపై కోరిక, కృతజ్ఞత లేని చుట్టరికము, పిసినారి చేతిలో ధనము,

బూడిదలో పోసిన హోమద్రవ్యములు, పందికి సువాసనలు, హరి భక్తి లేనివారి సంసారములు ఎందుకూ కొఱగావు.

విశ్లేషణ:

ఈ సృష్టిలో ప్రతీ వస్తువుకూ ఒక పని, ప్రతిపనికీ ఓ ప్రయోజనం, ప్రతి ప్రయోజనానికీ ఒక అనుభూతి ఉండడం సహజం. అలా సహజసిద్ధమైన గుణాలు కోల్పోయినపుడు అవి నిరుపయోగమే.

గుడ్డివానికి వెన్నెలైనా చీకటైనా తేడా లేదు.

చెవిటి వాని చెవిలో శంఖం ఊదినా ఊదకున్నా ఒకటే.

మూగ వాడు మంచి చదువుల గురించి చెప్పినా చెప్పకపోయినా అంతే.

పేడివాడు పెళ్ళి చేసుకున్నా లేకున్నా ఒకటే.

కృతజ్ఞత లేని చుట్టాలకు మేలు చేసినా చేయకున్నా ఒకటే.

పిసినారి చేతిలో ధనం ఉంటే వాడు ఉపయోగించడు సరికదా ఇంకొకడికి ఇవ్వడు.

పందికి పన్నీరు జల్లినా బురద నీరు జల్లినా తేడా లేదు.

అలాగే భగవంతునిమీద భక్తిలేని వాడు బ్రతికినా లేకున్నా ఒకటే. 

అవకాశం, అవసరం కల్పించి అందుకు వలసిన వనరులను ఇచ్చిన ఆ భగవంతునిపై కృతజ్ఞత లేకపోతే ఆ జీవితం మహా దారుణమే.

   ( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

     ( ౭౬ వ పద్యం )

సీ.

కమలాక్షు నర్చించు కరములు కరములు

              శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ

సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు

               శేషసాయికి మ్రొక్కు శిరము శిరము

విష్ణునాకర్ణించు వీనులు వీనులు

                మధువైరి దవిలిన మనము మనము

భగవంతు వలగొను పదములు పదములు

                పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి

తే.గీ.

దేవదేవుని జింతించు దినము దినము

చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు

కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు

తండ్రి! హరిజేరు మనియెడి తండ్రి తండ్రి.

భావం: ఓ తండ్రీ!

ఆ పద్మనయనుణ్ణి పూజించే చేతులే చేతులు.

ఆ లక్ష్మీపతిని వివరించే నాలుకే నాలుక.

ఆ దేవతలను రక్షించే వానిని చూసే చూపులే చూపులు.

అనంతునిపై శయనించే ఆయనకు మ్రొక్కే శిరస్సే శిరస్బు

ఆ విష్ణుకథలు వినే చేవులే చెవులు.

ఆ మధు అనే రాక్షసుని జంపిన ఆయనపై నిలచిన మనస్సే మనస్సు.

ఆ భగవంతునివైపు కదిలే పాదములే పాదములు.

ఆ పురుషోత్తముని మీద నెలకొన్న బుద్ధియే బుద్ధి.

ఆ పరమాత్మను గురించి ఆలోచించిన దినమే దినము.

ఆ చక్రధారియైన హరిని గురించి చదివిన చదువే చదువు.

ఆ లక్ష్మీపతిని గురించి చెప్పిన గురువే గురువు.

ఆ శ్రీ హరిని చేరుకోమని చెప్పిన తండ్రియే తండ్రి.

విశ్లేషణ:

సృష్టిలో ప్రతి జీవి ఎన్ని జన్మలెత్తినా పరమాత్మలో ఐక్యం పొందడమే అంతిమ లక్ష్యం.

మానవ జన్మ అన్నిటికన్నా మిన్న. అందులో మరలా పరమ భాగవతోత్తముడుగా జీవించడం మరింత శ్రేష్టం.

అంచేత అవకాశం మేఱకు  ప్రతివారు దానికోసం ప్రయత్నించాలి.

తల్లిదండ్రులు చిన్నప్పటినుంచీ పిల్లలను ఆదోవలో నడిపించి ప్రోత్సహించాలి.

ఈ శరీరం పరమేశ్వరపాదాక్రాంతమై రాలిపోవాలి.

ఈ కోవలో మరో మనీషి జడభరతుడు. అతను ఒంటిమీద ధ్యాసలేకుండా కేవలం పరమేశ్వర ధ్యాసలో ఉండేవాడు. నోరువిప్పి మాటాడేవాడు కాదు. ఆ కథ మరోసారి చూద్దాం. అలాగే కాశీలో త్రిలింగస్వామి అనే ఒక తెలుగు దిగంబర యోగి ఉండేవారు. సుమారు 250 సంవత్సరాలు బ్రతికారు.

ఇంకా ఎందరో మహానుభావులు ఆ రకంగా చరించి తరించారు.

  ( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

    ( ౭౭ వ పద్యం )

సీ.

కంజాక్షునికి గాని కాయంబు కాయమే?

              పవన గుంభిత చర్మభస్త్రి గాక

వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే? 

              ఢమఢమధ్వని తోడి ఢక్క గాక

హరిపూజనము లేని హస్తంబు హస్తమే?

               తరుశాఖ నిర్మిత దర్వి గాక

కమలేశు జూడని కన్నులు కన్నులే?

               తను కుడ్య జాల రంధ్రములు గాక

ఆ.

చక్రి చింతనము లేని జన్మంబు జన్మమే?

తరళ సలిల బుద్బుదంబు గాక

విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే?

పాదయుగము తోడి పశువు గాక.

సందర్భం:

ప్రహ్లాదుడు తండ్రికి చెప్పిన సమాధానం లోనిది.

భావం:

ఆ పద్మములవంటి కన్నులు గల విష్ణువు కొఱకు ఉపయోగపడని శరీరము శరీరమా? 

అది (కమ్మరి వాని కొలిమి లోని) గాలి తిత్తి గాని,

ఆ శ్రీ హరిని స్తుతించని నోరు కూడా నోరేనా? 

ఢమఢమ అంటూ సవ్వడి చేసే ఢంకాగాని,

ఆ విష్ణువుకు పూజ చేయలేని చేయి ఒక చేయి యేనా?

కఱ్ఱముక్కతో జేసిన గరిటె గాని

ఆ కమలాక్షుని చూడని కన్నులు ఏమన్నా కన్నులా?

శరీరం అనే గోడకు పెట్టిన కన్నాలు గాని,

చక్రాయుధుని మీద మనస్సు పోక పోతే అదీ ఓ జన్మేనా?, స్వచ్ఛమైన నీటిలో గాలిబుడగ గాని,

పరమాత్మ మీద భక్తిలేను వాడు కూడా జ్ఞానియేనా?

రెండు కాళ్ళ పశువు గాని.

విశ్లేషణ:

'గ్రామసూకర శునకశ్రేణు లింటింట దిరుగవే దుర్యోగ దీన వృత్తి'ని అని ఈసడింపబడని ఉన్నతమైన మానవ జన్మ పొందినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞులమై ఉండాలి. అది మన ప్రధమ కర్తవ్యం. అలా కాని జీవితం కమ్మరి వాని కొలిమిలో గాలి తిత్తి లాంటిది. దానికంటూ గొప్ప ప్రయోజనం లేదు.

మనకు ఈ జన్మ యిచ్చినందుకు ఆతనికి ప్రణుతి చేయలేని ఈ నోరు రణగొణధ్వని చేయడానికా?

ఇక్కడ ఒక విషయం మననం చేసుకుందాం.

మూకశంకరులని కంచి పీఠాధిపతి ఉండేవారు. ఒకరోజు కామాక్షి ఆలయంలో అమ్మ తన నోటిలోని తమ్మి తీసి అక్కడ ఉన్న పండితులకు ఇవ్వబోతే ఉచ్ఛిష్టం ( ఎంగిలి) అని తీసుకోలేదట. మూకశంకరులకు ఇవ్వగానే ఆయన స్వీకరించారు. ఆ వెంటనే వారి గళం విడింది. అయిదు వందల శ్లోకాలు అమ్మ మీద చెప్పారు. అవి. ఆర్యాశతకం, పాదారవింద శతకం, స్తుతిశతకం, కటాక్ష శతకం, మందస్మిత శతకం.

కామాక్షి దేవి సంతోషించి నీకేం కావాలో కోరుకోమంది. ఆయన నా గొంతు మూగపోవాలని కోరారట. అదేమి అని అమ్మ అడిగితే ఈ నోటితో మరేమీ మాట్లాడలేను నీ ప్రణుతి వినా అన్నారుట. తధాస్తు అని దీవించింది అమ్మ.

అలాగే గోవు తన నోటంట 'అంబా' అని మాత్రమే అంటుంది. ఆ నోటితో మరోటి పలకడం ఇష్టంలేని ధన్య జీవులు వారు.

ఈ చేతులతో ఏమేమి పనులు చేసినా దేవపూజకి కూడా ఉపయోగ పడకపోతే అవి తెడ్డితో సమానం,

ఈ కళ్ళతో రంగురంగుల ప్రపంచం చూస్తున్నాం. అలాగే ఆ భగవంతుని కూడా చూడాలని ఆరాట పడాలి. లేకుంటే అవి ఈ దేహానకి పెట్టిన కన్నాలు మాత్రమే.

అంచేత భగవంతునిమీద భక్తి లేని జీవితం నీటిమీద గాలిబుడగ. ఇంక ఆ మనిషి రెండు కాళ్ళ పశువు తో సమానం. భగవన్నామ స్మరణలోనే ధన్యత.

( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

   ( ౭౮ వ పద్యం )

ఉ.

తప్పులు లేవు మావలన దానవనాథ! విరోధిశాస్త్రముల్ 

సెప్పము క్రూరు లై పరులు సెప్పరు మీ చరణంబు లాన సు

మ్మెప్పుడు మీ కుమారునకు నింతయు నై జమనీష; యెవ్వరుం

జెప్పెడిపాడి గాదు ప్రతిచింత దలంపుము నేర్పు కైవడిన్.

సందర్భం: కొడుకు హరిభక్తిని విన్న హిరణ్యకశిపుడు చండామార్కులను మీరు నేర్పిన విద్య ఇదేనా అని అడుగునప్పటిది.

భావం:

ఓ రాక్షసరాజా! మావల్ల ఏ పొరపాటు జరగలేదు. మీ శత్రువు కథలు చెప్పలేదు. దురుద్దేశ్యంతో మరెవరూ కూడా చెప్పలేదు. ' మీ కాల్మొక్తా'. ఈ హరిభక్తి మీవాడికి సహజంగా వచ్చిందేగాని యెవరూ చెప్పేటంతటిది గాదు. నేర్పుగా తరుణోపాయం ఆలోచించవలెను.

విశ్లేషణ:

శుక్రాచార్యుల వారు భృగుప్రవరులు. ఆడితప్పరు. ఈ కుఱ్ఱవాడికి పూర్వజన్మవాసనలతో జన్మతః అబ్బినది హరిభక్తి. అంతేకాని ఒకరు నేర్పితే వచ్చినది కాదు. గాఢతరభక్తిపారవశ్యం అంత సులభం కాదు. అటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు.

సదాశివబ్రహ్మేంద్రులు, బ్రాహ్మణస్వామిగా పరిచయమై శ్రీ రమణులుగా పేరొందిన రమణమహర్షి ఈ కోవలోవారే. రామకృష్ణులు అటువంటి వారే. వారందరిదీ భక్తి పారవశ్యమో సత్యాన్వేషణో ఏదైనా కానీండి. భగవంతుని మీద నిరంతర ధ్యాస.

' మీ చరణంబు లాన' అన్నారు పోతన. అంటే ' నీ బాంచను కాల్మొక్తా' అనే నేటి మాటకు సమానమైనది. ఈ రకమైన అలసత్వం పోతన నాటికి కూడా బాగా బలపడే ఉందన్నమాట.

  (సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

  (౭౯ వ పద్యం)


అచ్చపు జీకటిం బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై

చచ్చుచు బుట్టుచున్ మఱల జర్విత చర్వణు లైన వారికిన్

జెచ్చెర బుట్టునే? పరులు సెప్పిన నైన నిజేచ్ఛ నైన నే

మిచ్చిన నైన గానలకు నేగిన నైన హరిప్రబోధముల్.

సందర్భం:

ఒజ్జలు చెప్పని ఈ బుద్ధులు నీ కెలా వచ్చాయని అడిగిన తండ్రికి ప్రహ్లాదుని సమాధానం.

భావం:

కటికచీకటిలో పడి సంసారులై యింద్రియలోలురై చావుపుటకల చక్రంలో తిరుగుతున్నవారికి భగవంతునిపై భక్తి సులభంగా  తమంతట తమకు కలుగదు, ఇంకొకరు చెప్పినా, ఎవరైనా దానంగా యిచ్చినా, అడవులకు పోయినా సరే ఆ భక్తి కలుగదు.

విశ్లేషణ:

జీవితం అంటే ఏమిటి? అని ప్రశ్నించుకుంటే సమాజంలో కోటానుకోట్ల మంది

 పుట్టడం పెరగడం కొంచెం చదవడం సంపాదన పెళ్ళి పిల్లలు అవసానం

అన్నట్లుగా కనిపిస్తుంది. ఇదంతా ఒక మాయాలోకం.ఇందులో జీవుడికి దేవుడనే స్పృహ లేక ఇంద్రియాధీనతతో కామక్రోధాది అరిషడ్వర్గాలతో స్వార్ధమే సర్వస్వంగా భావిస్తూ అందని ద్రాక్షలను అందించడానికో ఆపదనుంచి గట్టెక్కించడానికో పనికొచ్చే ఉపకరణంగా దేవుడు మిగిలిపోతాడు.

అటువంటి విషయలోలత్వం నుంచి బయటపడాలి. నిస్సంగత్వం అలవరచుకోవాలి. అంటీఅంటనట్లుండాలి.

అంతేకాని జాయతే వర్థతే జృంభతే పరిణతే నశ్యతి అని ఆ చట్రంలో గిఱగిఱా తిరిగేవారికి స్వతస్సిద్ధంగా రాదు, ఇంకొకరు చెప్పినా తలకు ఎక్కదు. అది ఒక జన్మలో సాధ్యం కాకపోయినా ఆ మార్గంలో పయనించాలి.

జీవన్ముక్తి లేదా మరణాన్ముక్తి అనేవి చాలా ఉన్నత లక్ష్యాలు. కనీసం వాటి దరిదాపులకు చేరినా గొప్పే.

కనీసం ఆరుపదుల వసంతాలు చూసిన తరువాత నైనా కళ్ళు తెఱవాలి.

భజగోవిందం భజగోవిందం

గోవిందం భజ మూఢమతే

నహినహి రక్షతి డుక్రుంకరణే.

అన్న ఆదిశంకరుల హెచ్చరిక మనకోసమే.

( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

   ( ౮౦ వ పద్యం )

ఉ.

కాననివాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువుల్

గాననిభంగి గర్మములు గైకొని కొందఱు కర్మబద్ధు లై 

కానరు విష్ణు గొంద ఱట గందు రకించన వైష్ణవాంఘ్రి సం

స్థాన రజోఽభిషిక్తు లగు సంహృతకర్ములు దానవేశ్వరా!

సందర్భం:

తండ్రికి ప్రహ్లాదుని సమాధానం లోనిది.

భావం:

ఒక కళ్ళు కనిపించని కబోధిని సహాయంగా తీసుకుని మరో అంధుడు గొప్పగొప్ప వస్తువులను చూడలేకపోయినట్లే కొందఱు కర్మబద్ధులై ఆ కర్మలను ఆచరించడంలోనే కాలం గడిపేస్తారు. మరికొందరు అచట వైష్ణవభక్తుల పాదధూళితో అభిషేకించబడి ( తలపై ధరించి ) కర్మలను విడచి పునీతులై విష్ణు సాక్షాత్కారం పొందుతారు.

విశ్లేషణ:

ఇద్దరు అంధులు జతగూడితే వారేం చూడగలరు? ఒకరినొకరు కూడా చూసుకోలేరు. వారి మనోఫలకం మీద 'అలోకంబగు పెన్జీకటి' తప్ప వేరే ఏమి ఉంటుంది?

సంసార బంధంలో చిక్కుకున్న వ్యక్తి మరో సంసారితో జతగూడితే ఆ సాంసారిక ఉత్థానపతనాల అనుభూతులు తప్ప ఒరిగేది ఏం ఉంటుంది?

అంచేత ఈ కర్మ బంధాలకు అతీతంగా ఉండేవారి సహవాసంతో 'తామరపాకున నీటిబొట్టుగా' ఉంటూ వారి ఆశీస్సులతో భగవంతుని సన్నిధిలో మనస్సుని లగ్నం చేసుకుని భగవత్సాక్షాత్కారం పొందిన మహానుభావులూ ఉన్నారు.( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

   ( ౮౧ వ పద్యం )

శా.

అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శే

షాంగశ్రేణికి రక్షసేయు క్రియ నీ యజ్ఞుం కులద్రోహి దు

స్సంగుం గేశవ పక్షపాతి నధముం జంపించి వీరవ్రతో 

త్తుంగఖ్యాతి జరించెదన్ గులము నిర్దోషంబు గావించెదన్.

సందర్భం:

తెంపున బాలుడాడిన మాటలకు హిరణ్యకశిపుని ప్రతిచర్యలోనిది.

భావం:

శరీరములోని అవయవాలలో ఏదేని ఒకటి చికిత్సకు వీలుపడకుండా చెడిపోతే వైద్యులు ఆ అంగాన్ని తొలగించి మిగిలినవాటిని రక్షిస్తారు. అదేవిధంగా ఈ అజ్ఞానియైన కులద్రోహిని, విష్ణుపక్షపాతిని, నీచుణ్ణి చంపించి గోప్ప శౌర్యపు కీర్తితో బ్రతుకుతాను. కులదోషాన్ని తొలగిస్తాను.

విశ్లేషణ:

హిరణ్యకశిపుని రాజ్యం విష్ణువ్యతిరేక సామ్రాజ్యం. ఆ రాజ్యానికి అతను ప్రభువు. రాజుగా అతని ధర్మం రాజ్యనర్మాన్ని కులకట్టుబాటునీ నిలబెట్టడం. స్వపర భేదం లేకుండా రాజనీతిని ప్రయోగించడం.

తన స్వంత కొడుకే శత్రుస్తోత్రాలు చేస్తే అతను తన ప్రజలకు ఏం సమాధానం చెప్పగలడు?

అందుకే చికిత్సకు లొంగని రుగ్మత అంటిన అవయవాన్ని వైద్యుడు తొలగించినట్లు ఈ బాలుణ్ణి త్రుంచి పారేయమన్నాడు. అది అవివేకంతో అన్నమాట కాదు. రాజనీతితో చెప్పినమాట.

(సశేషం)


పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు

    ( ౮౨ వ పద్యం )

ఉ.

తన్ను నిశాచరుల్ వొడువ దైత్యకుమారుడు మాటిమాటి కో

పన్నగశాయి! యో దనుజభంజన! యో జగదీశ! యో మహా

పన్న శరణ్య! యో నిఖిలపావన! యంచు నుతించు గాని తా

గన్నుల నీరుదేడు భయకంప సమేతుడు గాడు భూవరా!

సందర్భం:

రాజాజ్ఞను అమలుపఱచిన సేవకులు తిరిగి హిరణ్యకశిపునకు వివరించునప్పటిది.

భావం:

శూలములతో తనను పొడిచి రాజభటులు హింసించుతుంటే ఆ రాచబిడ్డ కళ్ళంట నీరు పెట్టడు, భయంతో హడలిపోడు, పైపెచ్చు ఓ శేషశాయి! ఓ రాక్షసవైరి! ఓ లోకేశా! ఆపదలో ఉన్నవారిని కాపాడేవాడా! మహా పవిత్రమైనవాడా! అంటూ ఆ శ్రీ హరిని స్తుతించుచున్నాడు.

విశ్లేషణ:

శరీరం గాయాలకు దెబ్బలకు తట్టుకోలేదు. కాని ఆ గాయాలు, తాడనాలు అధికమైతే శరీరం తన స్పృహను కోల్పోతుంది. ఆ తరువాత ఎలా హింసించినా శరీరం ఎక్కువగా ప్రతిస్పందించదు.

ప్రహ్లాదుని భక్తిపారవశ్యం ఉన్మత్థస్థాయిలో ఉంది.

అప్పుడు శరీరం స్పృహలో ఉండదు. ఆ సమయంలో ఏ శారీరక శిక్షకూ మనసు స్పందించదు.

అటువంటి లౌకికాతీత స్థాయిలో ఉండేవారు బాహ్యప్రపంచంతో అనుసంధానం కాకుండా ఉండిపోతారు.

అలాగే కొందరు భౌతిక సాధన ద్వారా శరీరాన్ని కవచంలా తయారు చేసుకోగలరు. ఉదా: నాగసాధువులు.

ప్రహ్లాదుడి మనస్సు

'అంబుజోదర దివ్తపాదారవింద మత్త'మై ఉంది. అంచేత శిక్షలు అతని మనస్సుని కదిలించలేక పోయాయి. 

శరీరం మీద శూలాలు గుచ్చినప్పుడు రక్తం కారాలి. అలా జరిగిందా లేదా మనకు తెలియదు.

ఏది ఏమైనా అదొక ఉన్మత్త ఆవస్థ.

(సశేషం)



పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

   ( ౮౩ వ పద్యం )

ఉ.

ముంచితి వార్ధులం గదల మొత్తితి శైలతటంబులందు ద్రొ

బ్బించితి శస్త్రరాజి బొడిపించితి మీద నిభేంద్రపంక్తి ద్రొ

క్కించితి ధిక్కరించితీ శపించితి ఘోర దవాగ్నులందు ద్రో

యించితి బెక్కు పాట్ల నలయించితి జావ డిదేమి చిత్రమో!

సందర్భం:

ప్రహ్లాదుడు తన మనసు మార్చుకోకపోవడంతౌ చింతాక్రాంతుడైన తండ్రీ తనలో తను మధనపడుతూ అనుకున్నది.

భావం:

సముద్రంలో ముంచాను, గదలతో మొత్తించాను, కొండల మీదనుంచి త్రోయించాను, కత్తులవంటి ఆయుధాలతో పొడిపించాను, ఏనుగుల చేత తొక్కించాను, కసిరాను, శపించాను, మంటలలోకి త్రోయించాను, యింకా యెన్నో రకాలుగా హింసించాను. అయినా ఆదేమి వింతో వీడు చావలేదు.

విశ్లేషణ:

రాజులు మహాపరాధులకు నేరుగా మరణదండన వేసేవారు. అవి ఉరితీయడం, శిరస్సు ఖండించడం వంటివి.

అపరాధిలో పరివర్తన రావాలనుకుంటే ప్రహ్లాదునికి వేసిన శిక్షల లాంటివి వేసేవారు. ఆ శిక్షలకు తట్టుకోలేకనో భయపడో మనసు మార్చుకోగలరనే సదుద్దేశం అందులో దాగుంది.

కాకపోతే యీ ప్రహ్లాదుడు దేనికీ భయపడటం లేదు బాధపడటం లేదు.

ఒక్కప్రక్క కొడుకనే అభిమానం మరోప్రక్క శత్రువుకి భక్తుడు అనే ఆక్రోసం. ఏంచేసి సరిచేయాలి? తన కొడుకునే సరిచేయలేనివాడు మిగిలినవారికి ఏం చెప్పగలడు?

ఏ తండ్రికీ యింతకన్న వేరే నరకం ఉండదు. ఈ బాధ ఎవరితో చెప్పుకోగలడు? ఎవరు తీర్చగలరు తన దుర్దశను? ఆవేదనను?

 (సశేషం)


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

   ( ౮౪ వ పద్యం )


శా.

శుభ్రఖ్యాతివి నీ ప్రభావము మహాచోద్యంబు దైత్యేంద్ర ! రో

ష భ్రూయుగ్మ విజృంభణంబున దిగీశవ్రాతమున్ బోరులన్

విభ్రాంతంబుగ జేసి యేలితి గదా ! విశ్వంబు వీ డెంత ! యీ

దభ్రోక్తుల్ గుణదోష హేతువులు చింతం బొంద నీ కేటికిన్?

సందర్భం:

' వీడు మహా తపఃప్రభావ సంపన్నుండు. వీని కెందును భయంబు లేదు. వీని తోడ విరోధంబునం దనకు మృత్యువు సిద్ధించు.' అని నిర్ణయించుకొని విచారించుచున్న హిరణ్యకశిపునకు చండామార్కల ఉపశమన వాక్యంబుల లోనిది.

భావం:

ఓ రాక్షస రాజా ! పరిశుభ్రమైన కీర్తి గలవాడవు, నీ ప్రభావం యెంతో విచిత్రంగా ఉంటుంది, కోపంతో కంటి బొమముడి చిట్లిస్తే దిక్పాలకులను యుద్ధములందు భయపడేలాగ లోకాలను పాలించితివికదా వీ డనగా యెంత? వీని అల్పప్రేలాపనలు చెడుబుద్ధి వలన వచ్చినవే. అందుగురించి నీ వెందుకు బాధ పడతావు?


విశ్లేషణ:

హిరణ్యకశిపుడు లోకాలను గడగడలాడించాడు. తన కొడుకు వలన మరణం తప్పదని తెలిసిన తరువాత ఏంచేయాలో తెలియని అయోమయావస్థ. మార్గాంతరం చెప్పడానికి గురువు దగ్గరలో లేకపోవడం, కొడుకు ఏ హింసకూ భయపడక పోవడం చూస్తుంటే మనసులో ఏదో కీడు తప్పదనిపిస్తోంది. శునశ్శేపుని కథ గుర్తుకొస్తోంది.

ఎంతటి ధైర్యసాహసాలున్నా ఇటువంటి విపత్కర పరిస్థితిలో నిరుపయోగమే.

( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

  ( ౮౫ వ పద్యం )

శా.

అక్షీణోగ్ర తపంబు మందరముపై నర్థించి మా తండ్రి  శు

ద్ధక్షాంతిం జనియుండ జీమగమి చేతన్ భోగిచందంబునన్

భక్షింపంబడె బూర్వపాపములచే బాపాత్మకుం డంచు మున్

రక్షస్సంఘము మీద నిర్జరులు సంరంభించి యుద్ధార్థులై.

సందర్భం: ప్రహ్లాదుడు తన సంగడికాండ్రకు పూర్వవృత్తాంతము చెప్పునప్పటిది.

భావం:

మా తండ్రి ఘోరమైన తపస్సు చేయడానికి మందరపర్వతం పైకి ప్రశాంత చిత్తంతో వెళ్ళెను. అది తెలుసుకొని దేవతలు " వీడు చీమల బారిన పడ్డ పాములాగ తన పాపాలకు తానే బలి అయ్యెన"ని తలంచి రాక్షసులపై యుద్ధానికి బయలుదేరెను.

విశ్లేషణ:

అకుంఠిత దీక్షతో తపస్సులు చేయడం రాక్షసులకు బాగా అవవాటు. అలా తపస్సుచేసి సాక్షాత్కారం పొందాక కోరిన వరాలు చాలా వరకూ అసంధర్భాలే. ఆ వరగర్వంతో దేవతలను హింసించడం పరిపాటిగా మారింది.

దేవతలు కూడా అవకాశం కోసం ఎదురు చూడ్డం, సందు దొరకగానే దండెత్తడం, పీడించడం మామూలే. ఇందులో తప్పెవరిదో తేల్చడం ఎవరితరం? ఇవి నిజానికి సవతి పిల్లల తగాదాలు.

  ( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

   (౮౬ వ పద్యం)

శా.

నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు న్నిర్వైరి జన్మాంతరా

విర్భూతాచ్యుత పాదభక్తి మహిమావిష్టుండు దైత్యాంగనా 

గర్భస్థుండగు బాలకుండు బహు సంగ్రామాద్యుపాయంబులన్

దుర్భావంబున బొంది చావడు భవ ద్దోర్దర్ప విభ్రాంతుడై.

సందర్భం:

హిరణ్యకశిపుని భార్య యైన లీలావతిని బంధించి తీసుకుపోతున్న దేవేంద్రునితో నారదుడు చెప్పినది.

భావం:

ఈ బాలుడు దేనికీ భయపడనివాడు. శత్రువులు లేనివి. మంచి భగవద్భక్తిగలవాడు.గతజన్మలనుండీ హరిభక్తి లో గొప్పవాడు. ఇప్పుడు లీలావతీ గర్భంలో ఉన్నాడు. యుద్ధాలవలనగాని మాయోపాయాలవలన యితనికి చావురాదు. నీ బలపరాక్రమాలు అతనిని ఏమీ చేయలేవు.

విశ్లేషణ:

జన్మాంతర సంస్కారం లేకుండా యెవరూ భాగవతోత్తములు కాలేరు. ముక్తి అనేది ఒకే జన్మలో లభించడం దుర్లభం. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యములు ఒక్కోటి సాధించుకుంటూ పరమాత్మను చేరడానికి ఎన్నోజన్మల తపఃఫలం అవసరం. ప్రహ్లాదుడు జీవన్ముక్తుడు. ఎన్నోజన్మల నుంచి హరిభక్తి బాగా జీర్ణించుకున్నవాడు. అంచేతనే అతని మనోవాక్కాయకర్మలు ఏ హింసకూ లొంగలేదు. అతను అంతటి ధృఢచిత్తుడు. ఆ విషయం త్రికాలవేది అయిన నారదమహర్షికి తెలుసు గనుక దేవేంద్రునికి వివరంగా చెప్పాడు. అందునా గర్భిణీ స్త్రీలను పట్టి పీడించడం చాలా దుర్మార్గం కాగలదు. అందుకే ఆమెను తన ఆశ్రమంలో ఉండనివ్వమన్నాడు.

 (సశేషం)


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

  (౮౭ వ పద్యం)

శా.

రక్షోబాలుర నెల్ల నీకొడుకు చేరం జీరి లోలోన నా

శిక్షామార్గము లెల్ల గల్లలని యాక్షేపించి తా నందఱన్

మోక్షాయత్తుల జేసినాడు మనకున్ మోసంబు వాటిల్లె నీ

దక్షత్వంబున జక్కజేయవలయున్ దైతేయవంశాగ్రణీ !

సందర్భం:

రహస్యంగా ప్రహ్లాదుడు యితర బాలురకు హరిభక్తీనీ ప్రబోధించుచున్నాడని చండామార్కులు హిరణ్యకశిపునికి తెలిరజేయునప్పటిది.

భావం:

ఓ రాక్షసవంశశిరోమణీ! నీ కొడుకు తతిమ్మా బాలురందరినీ చేరదీసి మా అధ్యాపనములన్నీ కల్లలని ఆక్షేపించుతూ వారిని మోక్షానికి సన్నద్ధం చేస్తున్నాడు. ఏదో మోసం జరుగుతోంది. నీ దక్షతలోనే దీనిని చక్కదిద్దాలి.

విశ్లేషణ:

ఎంతటి శత్రువునైనా మన పక్కనున్న వాడిచేత కొట్టించాలి. మనమే ముందుకు దూకేయరాదు. ఇదొక గొప్ప చతురత. చండామార్కులు ఆ చతురతలో మంచి ప్రావీణ్యులు.

"అంతిమ బాధ్యత తల్లి గాడిదదే" అని లోకోక్తి. బయటవారందరూ తప్పించుకున్నా తండ్రికి తప్పదు కదా. చండామార్కులు వారూ అదే శలవిచ్చారు. ఇంకేంవుంది? ఆయనకి కోపం తలకెక్కింది. కొడుకుని పిల్చి చంపుకుంటాడో నచ్చజెప్పుకుంటాడో మానుకుంటాడో ఆయన యిష్టం.

 ( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

   ( ౮౮ వ పద్యం )

శా.

కంఠక్షోభము గాగ నొత్తిలి మహాగాఢంబుగా డింభ ! వై

కుంఠుం జెప్పెదు దుర్జయుం డనుచు వైకుంఠుండు వీరవ్రతో

త్కంఠాబంధురు డేని నే నమరులన్ ఖండింప దండింపగా 

గుంఠీభూతుడు గాక రావలదె మద్ఘోరాహవ క్షోణికిన్.

సందర్భం:

చండామార్కుల సలహా మేరకు హిరణ్యకశిపుడు తన కొడుకును సరిదిద్దే ప్రయత్నంలో కొడుకుతో అన్నమాటలివి.

భావం:

ఓరి అర్భకుడా! నీ గొంతు నొప్పిపెట్టేలా గట్టిగా నువ్వు అరవడమేగాని నిజంగా బలసంపన్నుడు పౌరుషం ఉన్నవాడైతే  ఆ శ్రీ హరి నేను దేవతలను యుద్ధంలో చీల్చి చెండాడుతుంటే వెనక్కి తగ్గి ఎక్కడో నక్కి ఉండక నా యెదుటకు రావద్దా?

విశ్లేషణ:

దానవుల బలపరాక్రమాలవల్లనో వారు పొందిన వరముల వల్లనో నారాయణుడు యుద్ధభూమిలో కాక ఒంటరిగానే వారుపొందిన వరాలను బురిడీ కొట్టించేలాగో మాయోపాయం చేతనో ఓడించే ప్రయత్నం చేసాడు. అందులో సమర్థత అసమర్థతలమాట అటుంచి లోకకళ్యాణం కోసం మరో అవతారం ఎత్తడం అనే బృహత్ప్రయోజనం కూడా ఉంది.

ప్రతి కష్టానికి మాటున ఓ సుఖం లేదా మరో అవకాశం దాగి ఉంటాయి. ఒడుపుగా అందిపుచ్చుకోవడంలోనే విజ్ఞత తెలిసి వస్తుంది.

  ( స శేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

  ( ౮౯ వ పద్యం )

మ.

కలడంబోధి గలండు గాలి గల డాకాశంబునన్ గుంభినిన్

గల డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలం ఖద్యోత చంద్రాత్మలన్

గల డోంకారమునన్ ద్రిమూర్తులఁ ద్రిలింగ వ్యక్తులం దంతటన్

గల డీశుండు గలఃడు దండ్రీ ! వెదకంగా నేల యీ యా యెడన్.

సందర్భం:

నిజంగా విష్ణువు ఉన్నాడా ఉంటే యుద్ధానికి యెందుకు రాడన్న హిరణ్యకశిపుని ప్రశ్నకు ప్రహ్లాదు డిచ్చిన సమాధానంలోనిది.

భావం:

ఓ తండ్రీ! ఆ  ఈశుడు (విష్ణువు) కడలిలో,గాలిలో,ఆకాశంలో, మట్టిలో, నిప్పులో, దిక్కులలో, రేయింబవళ్లలో, సూర్యచంద్రులలో, ప్రణవనాదంలో, త్రిమూర్తులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో, స్త్రీ పురుష నపుంసకములనబడే మూడు లింగజీవులలో, యెల్లెడలా ఉన్నాడు. ఇక్కడ అక్కడా యని వెదకడం ఎందుకు?

విశ్లేషణ:

హిరణ్యకశిపుడు హరివైరి. అతని దృష్టిలో విష్ణువు భగవంతుడు కాదు. ఎంతోమంది రాక్షసులు శివ , బ్రహ్మ భక్తులు. అంచేత

భగవంతుడు సర్వాంతర్యామి అని అతనికి చెప్పనవసరం లేదు. కాని ఆ పరమేశ్వరుడే విష్ణువు అని ప్రహ్లాదుని వాదన. అంచేతనే పై పద్యంలో విష్ణువు అని అనకుండా ఈశుండు ఆన్నాడు.

మరి ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే పంచభూతాలలోనూ రేయి పగళ్ళలోను ఖద్యోత చంద్రాదులందు త్రిమూర్తులలో త్రిలింగ వ్యక్తులలో ఉన్నాడు. సరే.

త్రిలింగవ్యక్తులంటే ఏమిటి?

ఆడ, మగ , నపుంసక అనేవి త్రిలింగములని తెలుసు కదా.

మనది త్రిలింగ దేశం కదా. మరి ఇక్కడ ఉన్నవారు త్రిలింగ వ్యక్తులు కారా? 

అంటే తెలుగు వారందరూ త్రిలింగ వ్యక్తులే.

అందుకేనేమో పోతన ద్వ్యర్థిగా ఆ సమాసము వేసారని నా కనిపిస్తుంది.

 ( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

   ( ౯౦ వ పద్యం )

శా.

అంభోజాసను డాది గాగ దృణపర్యంతంబు విశ్వాత్ము డై

సంభావంబున నుండు ప్రోడ విపుల స్తంభంబునం దుండడే?

స్తంభాంతర్గతు డయ్యు నుండుటకు నే సందేహమున్ లేదు ని

ర్ధంభత్వంబున నేడు గానఁబడు బ్రత్యక్ష స్వరూపంబునన్.

సందర్భం:

విష్ణువు సర్వాంతర్యామి అన్న ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో ఉంటాడా ఆని అడిగితే ప్రహ్లాదుని సమాధానం.

భావం:

పద్మాసనుడైన బ్రహ్మ మొదలు గడ్డిబఱక వఱకూ అన్నింటిలోనూ ఉండే విశ్వాత్ముడైన ఆ నేర్పరి ఇంత పెద్ద స్తంభంలో ఉండడా? స్తంభంలోనూ ఉంటాడనడానికి సంశయమే లేదు. కావాలంటే ఇప్పుడే కనిపిస్తాడు ప్రత్రక్షంగా.

విశ్లేషణ:

ఆయన అణువు నుండి బ్రహ్మాండం వఱకూ అన్ని చరాచరములలోనూ అంతర్లీనమై ఉంటాడు. అందులో సందేహించవలసిన పనిలేదు. అటులైనచో మరి మన కెందుకు కనిపించడం లేదూ అనేది ప్రశ్న.

ఆయన తేజోమయ రూపాన్ని ఈ కళ్ళతో చూడలేం. దానికి కావలసింది జ్ఞానచక్షువులు.

ఎంతమంది జీవితకాలం శ్రమించి దర్శనభాగ్యం పొందారు. ఆ భగవంతుడు అన్నిచోటులా ఉన్నప్పుడు ఈ కళ్ళకు ఆ తేజోమయ రూపద్యుతిని చూడగలిగే శక్తి సాధించాలి. దానికోసమే తాపత్రయమంతా.

ప్రహ్లాదుడు భక్తి మార్గంలో  అత్యున్నత స్థాయి చేరుకున్న భక్తుడు. అతనికి యీ ప్రపంచంలో దైవం కనిపించని స్థలం కాని వస్తువు కాని లేవు. అంచేత అతను చూసాడు. ఎంతో చిన్న గడ్డిబఱక లో ఉండేవాడు అంత పెద్ద స్తంభంలో ఎందుకు ఉండడు? అనేది అతని ప్రతిప్రశ్న. అంతేకాదు నాకు కనిపిస్తున్నాడు. మీకు కూడా కనిపిస్తాడు అన్నాడు.

( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

  ( ౯౧ వ పద్యం )

ఉ.

సంచిత విప్రశాపమున జండనిశాచరు డైన వీని శి

క్షించుట కీడుగాదు కృపజేసితి వీశ్వర ! భక్తి తోడ సే

వించినకంటె వైరమున వేగమె చేరగవచ్చు నిన్ను నీ

యంచిత నారసింహతను వద్భుత మాపద బాసి రందఱున్.

సందర్భం:

నరసింహమూర్తి ని కని విష్ణుసేవకులు యిట్లనిరి.

భావం:

విప్రకుమారులైన సనకసనందుల శాపం వలన (జయవిజయులే హిలణ్యాక్ష హిరణ్యకశిపుని గా జన్మించారు.) చండశిసనుడైన యీతనిని శిక్షించుటలో తప్పులేదు. నిజానికి మేలే చేసావు. అయినా భక్తితో కన్నా శత్రుత్వంతోనే నిన్ను త్వరగా చేరుకోవచ్చు. ఈ నరసింహావతారం చాలా గొప్పది. అందరూ ఆపదనుండి బయటపడ్డారు.

విశ్లేషణ:

మోక్షం పొందడానికి

సాత్వికులకు భక్తిమార్గం చెప్పబడినట్లే రౌద్రభీకరభుజబల గర్వితులకు శత్రుత్వం చెప్పబడింది.

అందులో ఈ దానవ సోదరులు అగ్రగణ్యులు.

ఎవడైతే దేవుడు లేడనో కాడనో వాదిస్తాడో అతని మనస్సు నిరంతరం ఆ దైవం గురించి యోచిస్తూనే ఉంటుంది. ఆంటే ' అనన్యాశ్చింతయంతో మాం ' అన్న షరతును పాటించడమే కదా.

భక్తిపారవశ్యంలో ప్రహ్లాదుడు అగ్రగణ్యుడు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం' అన్నట్లే ఆయనకు ఎటుచూచినా ఆ శ్రీ హరే కనిపించే వాడు.

  ( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

(౯౨ వ పద్యం )

సీ.

ప్రళయార్క బిబంబు పగిది నున్నది గాని

                నెమ్మోము పూర్ణేందు నిభము గాదు

శిఖి శిఖాసంఘంబు చెలువు చూపెడు గాని

                 చూడ్కి ప్రసాద భాసురము గాదు

వీర రౌ ద్రాద్భు తావేశ మొప్పెడు గాని

                  భూరి కృపారస స్ఫూర్తి గాదు

భయద దంష్ట్రాంకుర ప్రభలు గప్పెడు గాని

                   దరహిసతాంబుజాతంబు గాదు

తే.గీ.

కఠిన నఖర నృసింహ విగ్రహము గాని

కామినీజన సులభ విగ్రహము గాదు

విన్నదియు గాదు తొల్లి నే విష్ణు వలన

గన్నదియు గాదు భీషణాకార మనుచు.

సందర్భం:

నృసింహుని చూచిన బ్రహ్మ రుద్రేంద్ర సిద్ధ సాధ్య పురస్సరులైన వారందరూ స్తుతించి ఆయన రోషానలాన్ని తగ్గించమని లక్ష్మీదేవిని కోరగా లక్ష్మి తన భర్తను చూచి చెప్పిన  మాట.

భావం:

"ఆయన వదనం ప్రళయకాలపు సూర్యబింబంలా వుందే గాని చల్లని పున్నమినాటి చంద్రునిలాగ లేదు.

ఆయన చూపు అగ్నిజ్వాలలు వలే వుంది గాని అనుగ్రహిస్తున్నట్లుగా లేదు.

ఆ రూపం వీర రౌద్ర అద్భుత రసాలతో భయంకరంగా వుందేకాని దయా రసస్ఫూర్తిగా లేదు.

ఆయన కోరలు దంతములు భయంకర ప్రకాశముగా వున్నాయే కాని చిరునగవులు చిందే పద్మకాంతిగా లేదు.

ఆయన విగ్రహం కఠినమైన గోళ్ళుకలిగిన నరసింహము గాని కామినీ జనులకు అందివచ్చే కమనీయ విగ్రహం కాదు.

ఇది వఱకెన్నడూ విష్ణువు వద్ద యిటువంటి అవతారం గుఱించి వినలేదు, మరెక్కడా చూడనూలేదు."

అంది లక్ష్మీదేవి.

విశ్లేషణ:

ఆయన పరమాత్మ. భక్తజనహృదయ మందార మకరందాస్వాద చతుర చంచరీకముగా ఆ లక్ష్మీదేవి చూసిందే కాని యింత రోషానల మూర్తిని చూడలేదు. ఆయన కోపం తగ్గి ప్రసన్నభాసురుడుగా ఉంటేనే ప్రాణికోటికి అభయం.

మరి ఆయనను సాధారణ స్థాయికి తీసుకురాగలిగే శక్తి యితరులలో లేక లక్ష్మీదేవిని కోరితే ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది.

క.

పలికెదనని గమకము గొను 

బలికిన గడు నలిగి విభుడు ప్రతివచనములం

బలుక డని నిలుచు శశిముఖి 

బలువిడి హృదయమున జనువు భయమును గదురన్.

ఇక యామె పరిస్థితిని గమనించిన బ్రహ్మగారికి విషయం అర్థమైంది. ఆయన కోపం చల్లార్చడం యీమె వల్లగానిపని యని. ఈ సారి ప్రహ్లాదుని పంపుతారు ఆయనన ముందుకు.

( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

  ( ౯౩ వ పద్యం )


మ.

అమరుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సతాత్పర్య చి

త్తముల న్నిన్ను బహుప్రకారముల నిత్యంబున్ విచారించి  పా

రము ముట్ట న్నుతి సేయ నోప రట నే రక్షస్తనూజుండ గ

ర్వ మదోద్రిక్తుఁడ బాలుడన్ జడమతిన్ వర్ణింప శక్తుండనే.

సందర్భం:

ప్రహ్లాదుడు నృసింహుని స్తుతించుట.

భావం:

ఓ శ్రీ హరీ! దేవతలు, సిద్ధులు, మునీశ్వరులు, చతుర్ముఖ బ్రహ్మాదులు, తదేకబుద్ధితో అనేక రకాలుగా తెలుసుకుంటూ శిఖరాగ్రములు చేరియూ నిన్ను స్తుతించుటకు సరిపోరట. 

నేనో రాక్షసకుమారుడను, గర్వంతో పొగరెక్కినవాడిని, బాలుడను మఱియు మూర్ఖుడను. మరి నేను వివరించగలనా?

విశ్లేషణ:

ప్రహ్లాదుడు వయసులో చిన్నవాడు. భక్తిలో చాలా పెద్దవాడు. మిగిలిన వారు భక్తిలోనూ వయసులోనూ కూడా గొప్పవారే. కాని ఒక నిర్భీకుడైన భక్తుడే ఆ రౌద్రరూపాన్ని శాంతింప జేయగలడని పెద్దల తలంపు.

ఎంతకాదన్నా చిన్నపిల్లడంటే మనసు కరగని కఠినహృదయం ఉండదుకదా.

మరి బాలుడు తన వినయాన్ని సంస్కారాన్ని ప్రతిబింబించేలాగ పెద్దలను గౌరవిస్తూ తనను తాను తక్కువచేసి చెప్పుకున్నాడు. అది అతని ఔన్నత్యం.

( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

  ( ౯౪ వ పద్యం )

మ.

తపమున్ వంశము తేజమున్ శ్రుతము సౌందర్యంబు నుద్యోగము

న్నిపుణత్వంబు ప్రతాప పౌరుషములు న్నిష్ఠా బల ప్రజ్ఞలున్

జప యోగంబులు జాల వీశ్వర! భవ త్సంతుష్టికై దంతి యూ

ధపు చందంబున భక్తి సేయవలయున్ దాత్పర్య సంయుక్తు డై.

సందర్భం:

ప్రహ్లాదుడు నృసింహుని స్తుతించుట.

భావం:

ఓ శ్రీ హరీ ! నిన్ను సంతృప్తి పరచుటకు తపస్సు, వంశము, తేజస్సు, వేదాధ్యయనము, చక్కందనము, హోదా, నేర్పు, ప్రతాపము, పౌరుషము, నియమనిష్టలు, జపములు మొదలగునవి యేవియూ చాలవు.

గజేంద్రునివలె భక్తితో ఆర్తితో సేవించి సాధించుకోవాలి.

విశ్లేషణ:

ఆ భగవంతుని సంతృప్తి పఱచుటకు సాధారణ భక్తి సరిపోదు. ఈ "ఉపవాసవ్రతశౌచశీల మఖ సంధ్యోపాసనాది" కర్మలతో సులభ సాధ్యం కాదు.

మరి గజేంద్రునివలె సేవించాలట. ఆ గజేంద్రుడు దశలక్షకోటి యేనుగలకు రాజు. అంతటి వాడుకూడా "లేరే మ్రొక్కెద దిక్కుమాలిన మొఱాలింపన్ ప్రపుణ్యాత్మకుల్" అని ఎదురు చూసి "మిథ్యా మనోరథ మింకేటికి దీని గెల్వ సరి పోరం జాల రాదంచు" తన లావు వైరి బలమున్ జింతించి

తన "మనంబున నీశ్వర సన్నిధానంబు గల్పించుకొని" శరణాగతితో "నీవే తప్ప యితః పరం బెరుగ" అని వేడుకున్నాడు. అంతేకాదు "అరక్షిత రక్షకుండైన యీశ్వరుం డాపన్నుండైన నన్నుం గాచు గాక" అనే ఒక నమ్మకంతో "నింగి నిక్కి చూచుచూ నిట్టూర్పులు నిగిడింపుచూ బయలాలకించుచూ" ఏ దిక్కునుంచి వస్తున్నాడో అని ఎదురు చూసాడు. ఆఖిల రూపముల్ తనరూప మైనవాడు వినడె చూడడె తలుపడె వేగ రాడె అనే అంతటి అపారమైన నమ్మకం, అన్యధా శరణం నాస్తి అనే శరణాగతి వెఱసి ఆ శ్రీ హరిని ఉన్నపళంగా వచ్చి రక్షించేలాగ చేసాయి.

అటువంటి భక్తితో సాధ్యం కానిది ఏముంటుంది?

( సశేషం )


పోతన పద్యాలు ---ఆణిముత్యాలు

  ( ౯౫ వ పద్యం )

ఉ.

శ్రీమహిళా మహేశ! సరసీరుహగర్భుల కైన నీ మహో

ద్దామ కరంబుచే నభయదానము సేయని నీవు బాలుడన్

దామస వంశ సంభవుడ దైత్యుడ నుగ్ర రజో గుణుండ ని

స్సీమయన్ గరాంబుజము శీర్షము జేర్చుట చోద్య మీశ్వరా!

సందర్భం:

ప్రహ్లాదుడు నృసింహుని స్తుతించుట.

భావం:

ఓ లక్ష్మీపతి! బ్రహ్మవంటి వారిని కూడా నీ దివ్యమైన హస్తంతో అభయమీయని నీవు బాలుడను తామస వంశంలో పుట్టిన రాక్షసుడను తీవ్రమైన రజోగుణమున్నవాడిని అయిన నా తలపై నీ భవ్య హస్తం ఉంచి దీవించడం యెంత విచిత్రమో కదా!

విశ్లేషణ:

భగవంతునికి శత్రుత్వ మిత్రత్వాలు అంటవు. అందుచేతనే తనతో శత్రుత్వం సాధించుచున్న హిరణ్యకశిపుడి కొడుకైనప్పటికీ ప్రహ్లాదుని మీద శ్రీ హరి కృప అంత విశేషమైనది. ప్రహ్లాదుడు కారణజన్ముడు. అతని భక్తి మహోన్నతమైనది. విష్ణుమూర్తి అతనిని దీవించి నీకేం కావాలో కోరుకో వరమిస్తాను అంటే నన్నెందుకు ఆశామోహభ్రాంతుణ్ణి చేయాలనుకుంటావు. నాకు ఏ కోరిక లేదు. వద్దు. నిష్కాముడిగా మననిమ్ము అంటాడు. అది ఆతని నిష్కామభక్తి. అంతటి మహోన్నత భక్తిపారవశ్యం మూర్తీభవించిన వారి గురించి వినడం కూడా ఒకభాగ్యమే.

 ( సశేషం )



పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

  ( ౯౬ వ పద్యం )

మ.

జలజాతప్రభవాదులున్ మనములో జర్చించి భాషావళిన్

పలుకన్ లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు మీ యింటిలో

జెలియై మేనమఱంది యై సచివుడై చిత్తప్రియ సఖుం డై మహా

ఫలసంధాయకు డై చరించుటది మీ భాగ్యంబు రాజోత్తమా !

సందర్భం: ప్రహ్లాద చరిత్ర చెప్పిన తరువాత నారదుడు ధర్మరాజుకు చెప్పిన మాట.

భావం:

ఓ యుధిష్టరా ! పద్మసంభవుడైన బ్రహ్మ మొదలగువారు మనసులో వితర్కించుకొని మాటల ద్వారా చెప్పలేని జనార్దనుడనే ఆ పరబ్రహ్మ మీ యింటిలో స్నేహితుడుగా, మీ మేనమఱదిగా, మంత్రిగా, మీకు ఆత్మీయుడుగా సత్ఫలితాలను చేకూర్చువాడుగా  తిఱుగాడడం  నిజంగా యెంతటి భాగ్యమో కదా!

విశ్లేషణ:

ఆ పరమాత్మ స్వరూపం యిదీ యని ఖచ్చితంగా చెప్పడం యెవరికైనా చాలా కష్టమే. ఆయన అరూపి, అపురూపి, సురూపి, సర్వరూపి.

"ముక్తసంగులైన మునులు,దిదృక్షులు

సర్వభూత హితులు సాధు చిత్తు

 లసదృశ వ్రతాఢ్యులై కొలతు…"

రట్టివానిని "నల్లనివాడు పద్మ నయనమ్ములవాడు.." అనో " మిగుల బొడవైన తెల్లని మేనివాని

మృడుని.." అనో

"నీలమేఘశ్యామా రామా" అనో  యెలా యిదమిత్థమని  చెప్పగలం? ఆ పరమాత్మ సాక్షాత్కారం కోసం యెంతోమంది యెన్నో రకాలుగా యత్నిస్తూ ఉంటారు. అటువంటి ఆ పరమాత్మ ఆ పాండవుల యింట సఖుడుగా మఱిదిగా మంత్రాంగము చేసేవాడిగా ఆత్మీయుడుగా సత్ఫలితసంధాతగా లభించడం మహాభాగ్యం.

అంటే వారందరికీ సాలోక్య సామీప్య సారూప్యాలు లభించినట్టే. కాని వారిలో యెందరు ఆ వాసుదేవుని పరమాత్మగా గుర్తించారనేది పెద్దప్రశ్న. కుంతీ ద్రౌపది మాత్రమే ఆ కృష్ణుని మనసా వాచా భగవంతునిగా గుర్తించారు. మిగిలినవారిది సమయానుకూలం.

ఈ కలికాలంలో యెవరైనినైనా భగవంతుడని అంటే దానికి తార్కాణాలు నిదర్శనాలు చూపించమనే నైజం మనది. అంచేత మనది భగవంతుని గుర్తించలేని మాయపొరల మైకం కమ్మిన చూపు. 

ఈ విషయంలో శ్రీ రమణులు, రామకృష్ణ పరమహంస వంటివారితో నడచిన వారి మాటలు విన్నాం కదా.

మనం మన కళ్ళతో చూస్తేగాని నమ్మలేని వైకల్య స్థితిలో ఉన్నాం.

   ( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

    ( ౯౭ వ పద్యం )

శా.

అన్యాలోకన భీకరంబులు జితాశానేకపానీకముల్

వన్యేభంబులు గొన్ని మత్తతను లై వ్రజ్యా విహారాగతో 

దన్యత్వంబున భూరి భూదర దరీ ద్వారంబులం దుండి సౌ

జన్యక్రీడల నీరుగాలివడి గాసారావగాహార్థమై.

సందర్భం:

త్రికూట పర్వతము తత్ప్రదేశ వైశిష్ట్యాన్ని శుకమహర్షి పరీక్షిత్తు కు చెప్పునప్పటిది.

భావం:

పరులకు చూస్తేనే భయం కలుగునట్టి, దిగ్గజములను కూడా జయించగల ఏనుగులో కొన్ని మత్తేభములు మందగా విహరించుటచే కలిగిన దప్పికచే ఉన్నతమైన పర్వతగుహలందు సయ్యాటలాడి నీటిగాలి వాలును పసిగట్టి సరస్సులో మునుగుటకు బయలుదేరెను.

విశ్లేషణ:

గజేంద్ర మోక్షం కథ గర్వమదాంధులకు కనువిప్పు లాంటిది. నాకేంటి అని బరి తెగించే కామాంధుడో మదాంధుడో పాలకుడో ఎంతటివారైనా రావే ఈశ్వర కావవే వరద అని రోదించక తప్పదని చెప్పకనే చెప్పేకథ.

ఆ మకరి మహా గర్వాపహారి. రజస్తమోగుణ పరిహారి. అహంకారాన్ని మమకారిన్ని రాజరికాన్ని నిష్ప్రయోజనములని నిరూపించిన మహోపకారి.

యోగసాధనా దృష్టితో చూడవలసిన రహస్యార్థ సంకేతార్థ పద్యాలు చాలానే ఉన్నాయి ఈ ఘట్టంలో.

ఇక ప్రస్తుత పద్యంలో మదించిన మత్తేభములు షాడ్గుణ్యపూరితములై విచ్చలవిడిగా విహరిస్తున్నాయి. ఒక యోగి అభయంకరమైన నిశ్చల మనస్సుతో సమాధిలో ఉంటూ భయం కల్పించుకుని షాడ్గుణ్యములను విచ్చలవిడిగా విడిచిపెట్టినచో కుటస్థాది రూపప్రతీకలైన గజములు  భూరిభూధర గుహలనుంచి అంటే మూలాధారం నుంచి బయలుదేరి పరేంగితములకు భయంకరములై దిగ్దేవతలను జయించి విహరించుచున్నవి. క్షుత్పిపాసలు శోకమోహములు జరామరణములు అను షడూర్ముల నిలయమైన మనో సరసి (సహస్రారం) వైపు బయలుదేరినవి.

 ( సశేషం )



పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

  ( ౯౮ వ పద్యం )

మ.

కలభంబుల్ చెరలాడుఁ బల్వలము లాఘ్రాణించి మట్టాడుచున్ 

ఫలభూజంబులు రాయుచున్ జివురు జొంపంబుల్ వడిన్ మేయుచున్ 

బులులం గారెనుపోతులన్ మృగములన్ బోనీక శిక్షింపుచున్

గొలకుల్ సొచ్చి కలంపుచున్ గిరులపై గొబ్బిళ్ళు గోరాడుచున్.

సందర్భం:

త్రికూటపర్వత ప్రాంతంలో విహరించే గున్న యేనుగుల వర్ణన.

భావం:

గున్న యేనుగులు

 చిన్నిచిన్ని నీటి గుంటలను వాసన చూసి కాళ్ళతో తొక్కుతూ పండ్ల చెట్లను వొరుసుకుంటూ లేజివురు గుత్తులను తింటూ పులులను అడవిదున్నలను లేళ్ళను ఏడిపిస్తూ శిక్షిస్తూ నీటిమడుగులలో దిగి వాటిని కలచివేస్తూ కొండలపై గెంతులు వేస్తూ వాటిలో అవే ఎకసక్కెము లాడుకుంటున్నాయి.

విశ్లేషణ:

క్షీరసాగర మధనంలో ఉబికి వచ్చింది త్రికూటం. ఆ కొండకు మూడు శిఖరాలుంటాయి కనుక దానిని త్రికూటం అన్నారు. ఆ మూడు శిఖరాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలు. అక్కడ కిన్నెర గరుడ గంధర్వులు తిరుగుతూ ఉంటారు. అక్కడి ఓషదీ సంపద యెంతో విలువైనది. అంతటి మహోన్నతమైన  ప్రదేశంలో ఏ ప్రాణి అయినా పరమాత్మతో అనుసంధానం కావడానికి యత్నించాలి. కాని ఆ గుంపులో ఉన్నవి

 యువరక్తంతో ఉఱకలేస్తున్న గున్న ఏనుగులు. వాటి ఆగడాలకూ కేరింతలకూ హద్దులు లేవు. అవి మనుషులలో ఉండే మదమాత్సర్య మృగలక్షణాలకు ప్రతీకలు. ఉచితానుచితాలతో నిమిత్తం లేకుండా పరుగులుతీసే మదోన్మాదం ఎలా పరిణమిస్తుందో తెలియజేయడం యీ వర్ణన ప్రధానోద్దేశంగా భావించవచ్చు.

  ( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

    ( ౯౯ వ పద్యం )

మ.

అట గాంచెన్ గరణీ విభుండు నవ ఫుల్లాంభోజ కల్హారమున్

నట దిందిందిర వారమున్ గమఠ మీన గ్రాహ దుర్వారమున్

వట హింతాల రసాల సాల సుమనో వల్లీ కుటీ తీరమున్

చటులోద్ధూత మరాళ చక్ర బక సంచారంబుఁ గాసారమున్.

సందర్భం:

త్రికూటమందలి గున్న ఏనుగులు కొన్ని గుంపులోనుండి విడివడి విహరిస్తూ ఒక నీటి మడుగును చూచినప్పటిది.

భావం:

ఆ గజరాజు అచ్చట తాజాగా విచ్చుకున్న తామరలు కలువలతో కూడినది, వాటి పై తారాడుతూ నృత్యం చేస్తున్న తుమ్మెదల సమూహముతో గూడినది, తాబేళ్ళు చేపలు మొసళ్ళతో నిండి దాటశక్యము గానిది, మఱ్ఱి తాడి మామిడి మద్ది వృక్షములతోను లతానికుంజములతో, హంసలు చక్రవాకములు కొంగలు సంచరించుచున్నది అయిన  ఒక సరస్సును చూచెను.

విశ్లేషణ:

ఆ గజరాజు కొన్ని యువ యానములతో కలిసి మందలోనుండి విడివడి తిరుగుచుండెను. దురహంకార బల మదగర్వపూరిత మానవుడే ఆ గజరాజు. యువకుడేమీ కాదు. అయినా యువ గజములతో తిరుగుతున్న మహానుభావుడన్నమాట. నిజానికి మోక్షగామి యైన వాడు  సాధకుడై సాయుజ్యం పొందగలిగే మార్గాన్ని వివరించడమే యీకథ ముఖ్యోద్దేశం. అంచేత

విషయాసక్తమైన మనస్సు అనే గజరాజు తాజాగా విచ్చుకున్న తామరలు కలువలు ఉన్న అంటే చతుర్దళ కమలం (మూలాధారం లో) షడ్దళకమలం ( స్వాధిష్టానంలో ) దశదళ కమలం (మణిపూరం లో) ద్వాదశదళ కమలం ( అనాహతం లో ) షోడశ దళ కమలం (విశుద్ధమందు) ద్విదళ కమలం ( ఆజ్ఞా యందు) సహస్రారంలో సహస్రదళ కమలం వంటివి మనస్సును వికసింప జేసే మంత్ర సంకేత కలువలను గల

చంచలమైన మనస్సులో జనించే నానా తలంపులనే చంచరీకములు ఆ కమలముల వద్ద రొద చేస్తుండగా

లౌకిక జీవనం అనే మడుగులో స్వార్థమనే తాబేళ్ళు ఆశ లనే చేపలు బాంధవ్యములనే మొసళ్ళు గల,

  బహువార్షికములైన మఱ్ఱి, నిటారుగా ఎదిగే తాడి తీయతీయని ఫలదాయిని అయిన మామిడి సాత్విక స్వభావి యైన మద్ది వృక్షములు లతా నికుంజములు గల,(ఇవి అన్నియూ ఐహిక సుఖేచ్ఛాచిహ్నములు) 

హంసలు చక్రవాకములు కొంగలు గల సరస్సును చూచెను. జీవుడే హంస. పరమాత్మ కృపాసుధ కోసం వెంపర్లాడే అక్షులనే చకోర పక్షులు ఒంటికాలిమీద తపస్సు చేసుకునే ధ్యేయం అనే కొంగలు కనిపించాయి. అదే మన మానస సరోవరం.

ఆ మానస సరోవరంలో మునిగి తేలుతూ బంధనాల నుండి విముక్తి పొంది జీవుడనే హంస పరమహంసలో విలీనం కావడమే ముక్తి.

   ( స శేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

  ( ౧౦౦ వ పద్యం )

శా.

పాదద్వంద్వము నేల మోపి పవనున్ బంధించి పంచేద్రియో

న్మాదంబుం బరిమార్చి బుద్ధిలతకున్ మాఱాకు హత్తించి ని

ష్కేద బ్రహ్మపదావలంబన రతిన్ గ్రీడించు యోగీంద్రు మ

ర్యాద న్నక్రము విక్రమించెఁ గరి పాదాక్రాంత నిర్వక్రమై.

సందర్భం:

మడుగులో దిగిన గజరాజును ఒక మొసలి నోట కఱచి నీటిలోనికి లాగుతుంటే ఏనుగు తప్పించుకుని ఒడ్డుకు చేరే ప్రయత్నంలో ఆ రెండింటికీ భీకరమైన పోరు జరిగింది. ఆ యుద్ధంలో మొసలి ఏ విధంగా ఏనుగును బంధిస్తోందో వివరించునప్పటిది.

భావం:

మొసలి తన ముందరి రెండు కాళ్ళను గట్టిగా నేలకు ఆనించి శ్వాసను నియంత్రించి పంచేద్రియములను ఉగ్గబట్టి  తన వివేచనకు మరో మారాకును పొదిగి దుఃఖరహిత మనోభావంతో పరబ్రహ్మను ఆలంబన చేసుకునే యోగీంద్రుని వలె ఆ ఏనుగు పాదాన్ని కదలకుండా పట్టుకుంది ఆ మొసలి.

వివరణ:

***ఈ పద్యంలో అనేక నిగుఢ యోగ మార్గాలు ఉన్నాయి.క్లుప్తంగా  విన్నంత తెలియవచ్చినంత తేటపఱతును.***

ఇక్కడ ఆపదలో ఉన్నది గజరాజు. దానిపై పట్టుసాధించిన ఆనందంలో ఉన్నది మకరం. ఆ మొసలి పూర్వజన్మలో" హుహూ" నామ గంధర్వుడు. దేవల ముని శాపం వలన మకరిగా జన్మించినా పూర్వ వాసన పోలేదు.

ఆ మకరి అవలంభించినది ఒక యోగప్రక్రియ.

"పూర్వాభ్యాసేన తేనైవ హ్రేయతేహ్యవశోపిసః" అన్న గీతావాక్యం ప్రకారం ఆ మకరికి పూర్వ వాసనలున్నాయి.

అంచేత ముందరి కాళ్ళు నేలకు ఆనించి శ్వాసను బంధించి పంచేద్రియములను నియంత్రించి అంటే ప్రత్యాహారము గావించి ' బుద్ధిలతకున్ మాఱాకు హత్తించి' అంటే మనస్సును నిశ్చలం చేసుకుని సమాధి స్థితికి చేర్చి (మాఱాకు హత్తించి),

'నిష్కేదబ్రహ్మ పదావలంబన గతిన్ ': దుఃఖాతీతమైన మనస్సు పరబ్రహ్మానుసంధానం పొందినట్లుగా అంటే "దుఃఖ సంయోగ వియోగం సంజ్ఞితం" అన్నట్లుగా

'నక్రము విక్రమించె': ఆ మొసలి విజృంభించింది.

మొసలిని కామానికి లేదా స్వార్థానికి ప్రతీకగా పోల్చితే మరి అది యోగసాధన చేయడం అసందర్భంకదా! 

" అనాది కామో అహం స్వభావః" అని ప్రమాణం. ఆ విధంగా అహం స్వభావం అనాది కామమే యగును. ఈ అహంకారము మూడు రకాలు. 1. ముఖ్యము: అహం బ్రహ్మాస్మి 2.గౌణము: అహం జీవః  3.తుచ్ఛము: అహం దేహః.

అహం బ్రహ్మాస్మి యనుదాని ననుసరించి అది అనాది కామమగును.

అందుచే పరబ్రహ్మము గురించి యోగసాధన చేసింది ఆ మొసలి.

"పాదద్వంద్వము" అంటే మఱియొక విచారణ కలదు.

స్త్రీ దేవతా ఉపాసనలలో "పాదుకాంత దీక్ష" అని ఉంటుంది. అనగా మంత్రసిద్ధి పొందాక తురీయమును మహావాక్యమును స్వీకరించుటయే పాదుకాంతము. అంటే ప్రకృతి, పురుషులను ఏకరూపముగా ధ్యానించుట పాదుకాంతమగును. అప్పుడు ఉభయుల పాదములనూ పాదద్వంద్వము అందురు. దేవళములందు శఠగోపముపై పాదద్వంద్వము లుండును. అనగా శివ శక్తి సమ్మేళనమును శిరసావహించుట యను ఆచారమది.

అటువంటి పాదద్వంద్వము ను మనములో ప్రతిష్టించుకొని శ్వాసను బంధించి ఒక యోగప్రక్రియ ద్వారా బ్రహ్మానుసంధానమయి యుండుట ఒక సాధన.

పవనో బధ్యతే యేన

మనస్తే నవ్య బధ్యతే

మనస్చ బధ్యతే యేన 

పవనస్తేనవ బధ్యతే.

వాయువు చేత మనస్సు, మనస్సు చేత వాయువు నిర్బంధించబడును. ఇది శ్రుతి ప్రమాణం.

అంచేత మొసలి వాయువుని బంధించి బ్రహ్మానుసంధానమైంది.

"మారాకు హత్తించి":

శివ పంచాక్షరీ లోని "మ"కారమునకు నారాయణాష్టాక్షరి లోని "రా" కు జోడించి రామతారక మంత్రజపంచేత ముముక్షువగుట అని కూడా కొందరందురు.

సంసార దుఃఖ సంయోగ రహితమగు యోగమే బ్రహ్మానందం.

అటువంటి బ్రహ్మపదావలంబనచే ఆనందించెడి యోగిపుంగవుని వలె జీవపాదము అను ఆనందపాదము, తురీయపాదము అను రెంటినీ నిశ్చలముగా ఆక్రమించి నిర్భయముగా నా మకర మున్నది.

(స శేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

 (  ౧౦౧ వ పద్యం )

ఊహ కలంగి జీవనపు టోలమునన్ బడి పోరుచున్ మహా

మోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సం

దేహము బొందు దేహిక్రియ దీనదశన్ గజ ముండె భీషణ

గ్రాహ దురంతదంత పరిఘట్టిత పాద ఖురాగ్ర శల్య మై.

సందర్భం: కరి మకరిల భీకర పోరులో బ్రహ్మపదం అందిన యోగివలె మకరి గట్టిగా పట్టుకొని ఉంటే దిక్కుతోచని స్థితిలో మనసు మొద్దుబారి గజము ఉందని చెప్పునప్పటిది.

భావం:

కలతపడిన మనస్సుతో జీవతపు మఱుగున పడి పోరాడుతూ విశేషమైన మోహంతో కూడిన మార్గాన్ని వదిలించుకో లేక సంశయపడే దేహి వలె మహాదీనావస్థలో ఆ ఏనుగు ఉంది. భీకరమైన జవదాటలేని మొసలి దంతములకు కరి కాలిగిట్టల శల్యములు చిక్కి ఉన్నవి.


విశ్లేషణ:

అటు మొసలి బ్రహ్మపదాన్ని ఒడిసి పట్టుకున్న యోగి వలె విజృంభించుతుంటే యిటు ఏనుగు జీవనయాన ఉత్థాన పతనాలలో చిక్కుకుని మోహమునకు వశమై తప్పించుకునే మార్గాంతరం తెలియక బిక్కుబిక్కుమంటూ దిక్కుతోచని స్థితిలో ఉంది.

ఇప్పుడు భగవంతుడు ఎవరిని కృతార్థుడిని చేయాలి? ఒక మహాయోగి పుంగవుని వలే ఉన్న మకరినా? దీనావస్తలో ఉన్న కరినా?

మోహభరజీవితం అనే ప్రవాహంలో కొట్టుకుపోయే వారికి తనని తాను కాపాడుకోవడం కూడా చాలా కష్టమైన పనే. కాపాడుకోవలసింది ముందు తన బొంది. ఆ తరువాతే పదిమందీ. ఏంచేయాలో పాలుపోవడం లేదు. మిగిలిన ఆడ ఏనుగులు గట్టుమీద నిలబడి చూడడమే గాక చేయగలిగేది ఏమీ లేదు. ఇక మకరికి స్వంత బలం కన్నా స్థానబలం ఎక్కువ. అంచేత పట్టు సాగించింది. 

ఏనుగు ఇన్నాళ్ళూ తెగబలిసి తిరిగినా ఆ బలదర్పాలు కొఱగాకుండా పోయాయి.

కింకర్తవ్యతా విమూఢత్వంతో చతికిల పడడం ధీర లక్షణం కాదు కనుక, తను గజరాజు కనుక రణభూమిలో ఎత్తులు జిత్తులు తెలుసు కనుక మరొకరి సహాయం లేకుండా ఈ మకరాన్ని వదిలించుకోగలనా అనే సందేహంలో పడింది.

మాయ, మోహము అనే వాటికి బందీలైతే ఎంతటివారి బ్రతుకైనా కడగండ్ల పాలగునని మనం గ్రహించాలి.

( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

  (౧0౨ వ పద్యం )


మ.

పృథుశక్తిన్ గజ మా జలగ్రహముతోఁ బెక్కేండ్లు పోరించి సం

శిథిలం బై తనలావు వైరి బలమున్ జింతించి మిథ్యా మనో

రథ మింకేటికి దీని గెల్వ సరి పోరం జాలరా దంచు స

వ్యథ మై యి ట్లను బూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్.

భావం:

అధికమైన లేదా కూడగట్టుకొన్న బలంతో ఆ ఏనుగు మొసలితో చాలాకాలం పోరాడి చితికిపోయి తనకున్న బలమెంత? శత్రువు బలమెంత?  అని చింతించి దీనిని గెలుస్తానని అనుకోవడం వృధా. దానితో సరితూగుతూ పోరాడడానికి తన బలం సరిపోదు అని అనుకుని తనపూర్వజన్మ ఫలితంగా కలిగిన దివ్యజ్ఞానంతో.

విశ్లేషణ:

అది రెండు బలమైన జీవుల మధ్య యుద్ధం. ఒకరికి స్థానబలం తోడైంది. పట్టుదొరికింది. ఇద్దరికీ పూర్వజన్మ పుణ్యఫలం ఉంది. అయినా పోరాటం పోరాటమే. ఆరాటం ఆరాటమే.

అందులోనూ ఒక చతురత మరో విజ్ఞత కలసిన వైనం. ఎప్పటికప్పుడు యుక్తులు ఎత్తుకు పైయెత్తులు వేస్తున్నా సుదీర్ఘ కాలం పోరాటం సాగించినా దశలక్షకోటి కరణీనాథుడైన మత్తు దిగిపోయింది ఆ మత్తేభానికి. మరికొంత అదనపు బలం లేకుండా శత్రువును ఓడించలేమని అర్థమైపోయింది. ఇప్పుడు ఆ అదనపు బలం కూడగట్టడం ఎలాగ అనేది ప్రశ్న.

భగవత్కృప అంటే భగవంతుడు వచ్చి నరుడా! ఏమి నీ కోరిక అని అడగడం కాదు. సరియైన సమయంలో సరియైన ఆలోచన కల్పించి దానిని ఆచరింప జేయడమే భగవదనుగ్రహం. దానికి పూర్వజన్మ సుకృతమో యిప్పటి సొధనయో ఉపకరించాలి.

అందుచేత హుహూనామ గంధర్వుడైన గజరాజుకు తనపూర్వజన్మ సుకృతంవల్ల తనుగెలుస్తాననుకోవడం మిథ్య అనీ దానిని ఓడించగల సమానమైన సత్తా తనకులేదని తులనాత్మకంగా ఒక అంచనాకు వచ్చింది. కింకర్తవ్యం అనేది ఇప్పుడు ఆలోచించగలదు.

ఆపద వచ్చినప్పుడు  గాభరా పడకుండా పరిస్థితిని పరిసరాలను సరిగ్గా అంచనా వేసుకుని యుక్తాయుక్త వివేచన చేయడం దానిని ఆచరించడంలోనే విజ్ఞత లేదా పరిణతి ఉపయుక్తమౌతుంది. అదే భగవదనుగ్రహం అంటే.

 ( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

  ( ౧౦౩ వ పద్యం )

శా.

ఏ రూపంబున దీని గెల్తు నికమీ దే వేల్పుఁ జింతింతు నె

వ్వారిన్ జీరుదు నెవ్వ రడ్డ మిక ని వ్వారి ప్రచారోత్తమున్

వారింపం గలవార లెవ్వ లఖిల వ్యాపారపారారణణుల్ 

లేరే మ్రొక్కెద దిక్కుమాలిన మొఱాలింపన్ ప్రపుణ్యాత్మకుల్.


భావం:

ఏ రకంగా యీ మకరీమీద గెలుపు సాధించగలను? ఏ దేవుని కోసం ఆలోచించను ? ఎవరిని పిలవవలెను? నాకు అడ్డుపడి రక్షించే వారెవరు? ఈ జలచరప్రముఖమైనదానిని నిలువరించగల వారెవరు? సమస్త చేష్టలయందు ప్రావీణ్యులైన వారు గొప్ప పుణ్యమూర్తులు లేరా? ఉంటే వారికి ఈ దిక్కుమాలిన మొఱను ఆలకించే వారెవరూ లేరా?

విశ్లేషణ:

తనబలం, ప్రత్యర్థిబలం తులనాత్మకంగా పరిశీలించిన ఆ గజరాజు ఆపన్నివారకుడు ఆపన్నప్రసన్నుడు ఎవరైనా ఉన్నారా అని వివేచన మొదలు పెట్టింది. శత్రువు మహాబలమైన జలచరం. నానానేకప రాజునైన తనకే అసాధ్యముగా యున్న ఆ జలచరాన్నుంచి తనను తప్పించడానికి అంతకన్నా బలమైన ప్రాణి కావాలి. అంచేత సమస్త చేష్టలనూ అంటే ఎంతటి పనైనా చేయగలవారెవరూ లేరా? ఉంటే వారికి నా దిక్కుమాలిన మొఱ ఆలకించమని ప్రణమిల్లుతాను అనుకొంది.

అంతటి ఆపదలోనూ సరియైన ఆలోచనాప్రస్థానం ఎలా సాగుతూ ఉందో గమనించాలి.

ప్రత్యర్థి బలం ఇదేనా? ఇంకా కొంత దాగి ఉందా? తెలియదు. తనకన్నా బలవంతులు యెవరైనా వచ్చినా దాచుకున్న బలంతో పుంజుకుంటే? అందుకే చిన్న పామునైనా పెద్ద కఱ్ఱతో కొట్టాలన్నట్టుగా ఎంతటి పనినైనా చక్కపెట్టగలిగే అఖిలవ్యాపార పారాయణులు, మంచిపుణ్యాత్ములు అయినవారి కోసం ఆలోచించింది. పుణ్యాత్ములెందుకంటే వారికి ఉపకారం చేసే గుణం ఉండాలి కదా! లేకుంటే వారెందుకు దెబ్బలు తినాలి?

అంతటివారు ఎవరుంటారు? బహుశః ఈశ్వరుడే.

( స శేషం )


పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు

  ( ౧౦౪ వ పద్యం )

శా.

నానానేకప యూధముల్ వనములోనం బెద్దకాలంబు స

న్మానింపం దశలక్షకోటి కరణీనాథుండ నై యుండి మ

ద్దానంభః పరిపుష్ట చందన లతాంత చ్ఛాయలం దుండలే

కీ నీరాస నిటేల వచ్చితి భయం బెట్లోకదే యీశ్వరా!


భావం:

ఓ ఈశ్వరా!

అనేకములగు ఏనుగుల గుంపులు ఎంతో కాలంగా గౌరవంగా సత్కరించుచుండగా పదిలక్షల కోట్ల ఆడ ఏనుగులకు మగడనై నా తొండముతో జల్లిన నీటితో ఏపుగా ఎదిగిన గంధపు తీవెెల మాటున/నీడన హాయిగా ఉండలేక యీ నీటికోసం ఎందుకు యిటు వచ్చాను? భయమౌతోంది. ఎలాగో మరి?

విశ్లేషణ:

ఆ అడవిలో ఉన్న ఏనుగుల మందలు అన్నీ కూడా ఎంతో కాలంగా సత్కరిస్తున్నాయి నువ్వే మా నాయకుడవని. దానితో అహంకారం బాగా తలకెక్కింది. యాదృచ్ఛికమో పురాలోచితమో కొన్ని ఆడ గున్న ఏనుగులతో విహరిస్తూ దారి మళ్ళాయి. 

ఆ కేరింతలు తుళ్ళింతలకు దాహార్తి కలిగింది. కనిపించిన మడుగులో నీళ్ళు తాగి పోతే ఏ గోలా లేదు. అక్కడ జలకాలాటలు మొదలయ్యాయి. ఇంతలో మొసలి పట్టుకుంది.

అసలు,  వయసులో ఉన్న స్త్రీ రూపం కనిపిస్తేచాలు పురుషజీవి మనసు అదుపు తప్పిపోతుందన్నమాట. 

చివరికి కష్టాలు కన్నీళ్ళపాలు.

పదిలక్షలకోట్ల ఆడయేనుగులకు మగడననే గర్వం గతుక్కుమంది. నానానేకప యూధములకూ నాయకుడననే అహం సహం అయిపోయింది.

ఎంత పొరబాటు జరిగి పోయింది? ఇప్పుడెలాగ?

గతజలసేతుబంధనం వలన ప్రయోజనం లేదు. ఈశ్వరా! భయంగా ఉంది (మరణం తలచుకుంటే).

రజస్తమో గుణాఢ్యుడైన గజరాజు కు నేలచూపులు మిగిలాయి.

ఇంక మిగిలినవి రెండే అవకాసాలు.

సర్వకార్యసమర్థుడైన మహానుభావుడు ఎవరైనా రక్షించగలగాలి.

లేదా మరణమే శరణ్యం.

శత్రువు చేతికి చిక్కి వీరమరణం పొందడానికి మనస్సు సహకరించదు. బలాఢ్యునికోసం ప్రయత్నించి "త్వమేవ శరణం మమ" అని ప్రాధేయపడడమే గత్యంతరం.

ఎంతటి బలవంతుడు! ఎలా విలవిలలాడుతున్నాడో!

 ( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

   (౧౦౫ వ పద్యం)


ఉ.

ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీన మై 

యెవ్వనియందు డిందు బరమేశ్వరు డెవ్వడు మూలకారణం

బెవ్వ డనాది మధ్య లయు డెవ్వడు సర్వము దాన యైన వా

డెవ్వడు వాని నాత్మ భవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

భావం:

ఈ లోకాన్ని 

సృష్టించినదెవరు? 

ఎవరి లోపల అంతర్భాగమై ఉంటుంది?

ఎవరిలో విలీనమైపోతుంది?

పరమేశ్వరుడు, అన్నిటికీ మూలకారణమైనవాడు ఎవరు?

దీనికి ఆది మధ్య ఆంతము ఎవరు?

అన్నీ తానే అయిన వాడెవడు?

ఆత్మలో ఉండే ఆ పరమాత్మ ఎవరు?

సమాధానం:

ఈశ్వరుడు.

ఆయనను శరణు వేడుకొందును.

విశ్లేషణ:

ఈ పద్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

పద్య నిర్మాణం: చిన్నిచిన్ని తేలిక మాటలతో నిగూఢమైన వేదాంతాన్ని ప్రతిబిబించిన పద్యం.

వాక్య నిర్మాణం లో తెలుగుదనం మాని సంస్కృత విధానం తో చెప్పబడింది. ఆంటే ఎవరి వల్ల పుట్టిందో ఎవరిలో ఉంటుందో ఎవరిలో లయమౌతుందో.. అలా చెప్పడం.

పద్యం మొత్తానికి మిగిలే ప్రశ్న ఎవరు? అనేది. ఆ ఎవరు అనేమాటకు ఎన్నోరకాల విభక్తి ప్రత్యయాలు జతగూర్చి పేర్చినది.

తత్వవిచారం:

ఈ లోకావిర్భావం ఎలా జరిగింది? దానికి మూలకారణం ఎవరు? ఇది ఒక పరిప్రశ్న. 

ఇది కార్యకారణ సంబంధాన్ని సూచిస్తుంది.

సృష్టి రహస్యాన్ని విడమరిచే వివేచన.


యతో వా ఇమాని భూతాని జాయన్తే

యేన జాతాని జీవంతి

యత్‌ ప్రయంత్యభిసంవిశంతి

తద్‌ విజిజ్ఞాసస్వ తద్‌ బ్రహ్మేతి.

అని తైత్తరీయం చెబుతోంది.

లోకం లేదా జగత్తు లేదా సృష్టి లేదా ప్రకృతి, ఇవి అన్నీ ఒకటే. పర్యాయ పదాలు.

ప్రకృతి కన్నా జీవుడు, జీవుని కన్నా బ్రహ్మమూ సూక్ష్మమైనవి. ఆ మహా సూక్ష్మమైన బ్రహ్మములో జగమంతా ఇమిడి ఉంది.

అటువంటి బ్రహ్మమును చేరుకోవడం ఎలా? 

ఏదేని ఒక గమ్యం చేరడానికి అనేక మార్గాలు ఉంటాయి.

అలాగే ఆ బ్రహ్మమును చేరడానికీ యోగము భక్తి జ్ఞానము తపము… ఇలా అనేక వసతులు ఉన్నాయి.

ఎవరి స్థాయికి తగినది వారు యెంచుకోవచ్చు.

ఇక గజరాజుది ఒకటే ఆలోచన. శత్రువు చాలా బలమైనది కనుక అసాధారణ శక్తిసామర్ధ్యాలు ఉన్నవారే దానిని వధించగలరు. అంతటి ప్రజ్ఞావంతుడెవరు? ఎవరో కాదు ఈశ్వరుడే. మరి ఆ యీశ్వరుడెవరు? దానికి సమాధానమే పద్యంలోని ప్రశ్నలన్నీ.

మరొకటికూడా మనం గుర్తుంచుకోవాలి. మకరికి కావలసింది ముక్తీ. కరికి కావలసింది విముక్తి. దీనాలాపాలన్నిటినీ విన్న హరి మొదట మకరికే ముక్తినిచ్చాడు. అది ఆయన ధర్మ నిబద్ధత.

విజ్ఞాన కోణం:

సైన్స్ అని చెప్పుకునే విజ్ఞాన శాస్త్రంలో Big bang theory అని ఒకటి ఉంది.దాని ప్రకారం అణువులోని పరమాణువుల విస్ఫోటనం వలన ఈ సృష్టి ప్రారంభమైందనీ, ఆ విస్ఫోటనంవల్ల కలిగిన కాంతి పరావర్తనానికి ఆవల వెలుగు ఉందనీ విస్ఫోటనానికి ముందు కాఱుచీకటి లేదా శూన్యమూ ఉండేదనీ చెబుతుంది.

ఈ పద్యంలో ప్రతిపాదించిన పరమేశ్వరుడే ఆ పరమాణువు. అక్కడనుండి ఉద్భవించి అందులోనే ఉంటూ ఆ పరమాణువులోనే విలీనమౌతుందని చెప్పిన భావం యాదృచ్ఛికమా?

కానేకాదు. మన శాస్త్రాలు ప్రతిపాదించినదే ఆ Bigbang theory లో ప్రతిబింబించబడింది.

దీని గురించి "లోకంబులు లోకేశులు" అన్న పద్యం వచ్చినప్పుడు మరింత సావధానంగా చూద్దాం.

ఈ పద్యం శ్రీ కృష్ణదేవరాయలుకు బాగా నచ్చిందేమో! ఆముక్తమాల్యద లో ఓ పద్యం చూడండి.

ఎవ్వని చూడ్కి జేసి జనియించు జగంబు, వసించు నిజ్జగం

బెవ్వని యందు, డిందు మరి యెవ్వనియం దిది, యట్టి విష్ణుతో

నివ్వల నొక్క వేల్పు గణియించిన పాతకి నౌదు నేడనే

నెవ్విధినైన నిన్గదియనేని, యనన్విని బంధ మూడ్చినన్‌.

రాయలవారికి పోతనగారి పద్యం బాగా నచ్చి ఉండాలి. అందుకే ఆ భావాన్ని తీసుకుని పోతనగారి సరళికి దగ్గరగా వ్రాశారు.

అలాగే పరిమి వేంకట కవి గారిది మరో పద్యం యిలాగే ఉంది. అదీ చూడండి.

ఎవ్వనిచే జగంబు జనియించు, వసించు నశించు, నవ్యయుం

డెవ్వడు కార్యకారణము లెవ్వడు భూతనమాశ్రయుండువా

డెవ్వడు చిత్కళాసహితుడెవ్వ డపారదాత డీవెకా

యివ్వసుధాస్థలిన్ వెదుకనేనిక కూడలి సంగమేశ్వరా!


   ( స శేషం )


పోతన పద్యాలు ---- ఆణిముత్యాలు

   ( ౧౦౬ వ పద్యం )

కం.

లోకంబులు లోకేశులు

లోకస్థులుఁ దెగినతుది నలోకంబగు పెం

జీకటి కవ్వల నెవ్వడు 

నేకాకృతి వెలుగు నతని నే సేవింతున్.

భావం:

ఈ లోకాలు, లోకపాలకులు, లోకులు నశించిపోయిన పిదప ఏ లోకమూలేని శూన్యమైన అలోకమునకు అవతల ప్రక్క ఎవడు తానొక్కడై ప్రకాశించుతూ ఉంటాడో అతనిని సేవించెదను.

విశ్లేషణ:

పద్యం చాలా చిన్నది. ఇందులో ఒక్క అక్షరం కూడా వ్యర్థమైనది లేదు. భావం చాలా అరుదైనది. ఒక శాస్త్ర వేత్తకు ఊహకందని పరమ యదార్థాన్ని ఆవిష్కరించిన పోతన ఎంత ఎత్తుకి ఎదిగి ఆలోచించాడో చెప్పనలవి కాదు.

ఎవ్వనిచే జనించు అన్న పద్యంలో సృష్టిమూలం పైన పరిప్రశ్నలు సంధించిన మహానుభావుడికి చక్కని సమాధానం మనోఫలకం మీద తారాడింది. పోతన మనో నేత్రంతో చూసిన శాశ్వత శక్తిని మనముందు ఆవిష్కరించబడినది.

సృష్టి జరిగిన తరువాత కొన్నికోట్ల సంవత్సరాల తరువాత లేదా ఎప్పుడో ఒకప్పుడు ప్రళయం తథ్యం. అప్పుడు సూర్యచంద్రులూ పంచభూతాలు భూ భూధర వనాలు ఏమీ ఉండవు. అదొక గడాంధకారం. అదే పెంజీకటి. దానిని కూడా నియంత్రించే వాడొకడు ఉండాలి కదా! 

ఆ కటిక చీకటికి మరోవైపు అంటే వెనకపక్కన  మిణుకుమిణుకుమంటూ ఒక్కడే ఉంటాడో అతడు ఖచ్చితంగా శాశ్వతుడు. అందుకే మిగిలాడు. అంచేత అతనే ఆ భగవంతుడు.

మరో అభిప్రాయం చూద్దాం.

లోకం అంటే అవస్థ అని కూడా అర్థం ఉంది. వాడో వెఱ్ఱిమాలోకం అంటారు కదా!

అవస్థలు మూడు జాగ్రత్ స్వప్న సుషుప్తులు. ఇక్కడ లోకంబులు అంటే ఆ మూడు అవస్థలే. వాటి అధిపతులైన విశుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అనేవారే ఆ లోకేశులు. మరి లోకస్థులు? ఇంద్రియాలు అంతఃకరణము, అహంభావం అనేవి ఈ లోకాలను అనుభవించును కనుక ఆవే లోకస్థులు. ఈ దేహమే మహా భువనభాండం. ఇవన్నీ దాటిపోయిన పిదప (అదే తెగిన తుది అంటే ) ఏకోన్ముఖుడై అంటే నిశ్చల నిర్వికల్ప సమాధి స్థితిలో దృగ్గోచరమయ్యే కాంతిపుంజమే పరంజ్యోతి.

లోకములు అంటే సూక్ష్మ భూత పంచీకరణముల వలన ఏర్పడిన గోళకములు . ఇవి రెండురకాలు అనులోమ విలోమములు.

బ్రహ్మణోరవ్యక్తం

అవ్యక్తాత్ మహా 

మహతః పంచతన్మాత్రాణి

పంచతన్మాత్రేభ్యో పంచభూతాని

పంచభూతేభ్యో మహాభువనాని.

అంటే బ్రహ్మము నుంచి అవ్యక్తము, అవ్యక్తము నుంచి మహత్, మహత్తునుంచి పంచతన్మాత్రలు (శబ్ద స్పర్శ రూప రస గంధములు)

పంచతన్మాత్రల నుండి పంచభూతములు (నేల నీరు కాంతి గాలి నింగి )పంచభూతములచే లోకాలు ఉద్భవించాయి.ఇది అను లోమం.

ఇంక విలోమం అంటే క్రిందనుంచి పైకి.

సత్వ రజ స్తమో గుణములచే పంచభూతములను విభజించి పంచీకరించగా వచ్చునవి.

సత్వ సమిష్టి గుణంచేత అంతఃకరణ చతుష్టయము (మనో బుద్ధి చిత్త అహంకారములు)

సత్వ వ్యష్టి వలన జ్ఞానేంద్రియములు ( చర్మము కళ్ళు చెవులు నాలుక ముక్కు)

రజో సమిష్టి వలన పంచప్రాణములు ( ప్రాణ అపాన ఉదాన వ్యాన సమాన వాయువులు)

రజో వ్యష్టి వలన పంచ కర్మేంద్రియములు (వాక్కు హస్తములు పాదములు గుదము జననేంద్రియము)

తమోగుణయుక్త పంచభూతములలో సగభాగం తీసుకుని వీటన్నింటినీ కలిపితే ఏర్పడునవి గోళకములు అనబడే లోకములు. అందుచేత లోకములంటే ఇంద్రియస్థానములు, లోకేశులు అంటే ఇంద్రియములు, లోకస్థులు అంటే ఇంద్రియాధి దేవతలు ఇవి తెగిన తుది అంటే ఇవన్నీ నశించాక అని.

వాక్కును మనస్సునందు మనస్సును బుద్ధియందు బుద్ధిని మహత్తత్వమునందు మహత్తత్వమును అవ్యక్తము ( పెంజీకటినందు) నందు లయం చేయగా ఇక మిగిలింది శూన్యమే. దానినే అలోకము అన్నాడు పోతన. దానికి అవతల ఉన్నవానిని కొలిచెదను అన్నాడు.

శాశ్వత చిరునామా:

కొంతమందికి సగుణబ్రహ్మము నచ్చదు. అంటే ఎదో రూపాన్ని ఆరాధించడం నచ్చదు.భగవంతుడు కూడా మనలాగే సంసారమూ పిల్లలూ బాదరబందీలతో ఉంటే ఎలాగనీ. వారికోసమే పోతనగారు ఊహించిన పరబ్రహ్మస్వరూపం.

ఆది ఏకాంతం. ఆయన వినా జగత్తే లేదు. అంతా చీకటి. ఆ శక్తి విశ్వాన్ని సృజించగలదు అలాగే హరించగలదు. ఆ శక్తి లేదా పరబ్రహ్మం శాశ్వతమైనది. అందుకే అది భగవంతుని శాశ్వత చిరునామా అంటారు కొందరు.

 దానికి మ్రొక్కుతా అన్నాడు.

విజ్ఞానశాస్త్రం ప్రకారం:

మహా వ్యాకోచ సిద్ధాంతం అంటే Big bang theory.

దీని ప్రకారం భూమి నీరు గాలి కాంతి ఆకాశం అనేవేవీ లేని నిరామయమైన శూన్యంలో ఒక విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం పరమాణు విస్ఫోటనం అని అది వ్యాకోచించుతూ విస్తరిస్తూ ఉంటే ఈ విశ్వం రూపుదిద్దుకుందనీ చెప్పే సిద్ధాంతం అది. ఆ విస్ఫోటనం కు ముందు కాలం లేదు కార్యం లేదు కారణం లేదు. అటువంటి మహాగాడాంధకారం ఉండేది.

పరిణామ సిద్ధాంతం: ఈ జగత్తంతా ఒకే భూమి ఫలకంగా ఉండేదని ఒక విస్ఫోటనంవల్ల వాయువు ధూళి ఎగసిపడి రకరకాల సంయోగ వియోగాలు జరుగుతూ విశ్వం విస్తరిస్తోందనీ చెప్పబడింది.

మతవిశ్వాసాలు:

ప్రతీ మతం వారు వారి దేవుడే ఇదంతా సృష్టించాడనీ చెప్పుకోడంలో పస లేదు. కారణం.

కిరస్తానీ మతం ఆరంభమై 2020వ సంవత్సరంలో ఉన్నాం ఇప్పుడు. విశ్వం జనించి కొన్ని వందల కోట్ల సంవత్సరాలైంది. ఈ క్రీస్తు అన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం లేనివాడు ఎలా సృష్టించగలడు?

ఇస్లాం మతం వయస్సు 14లేదా 15 వందల సంవత్సరాలు మాత్రమే. అంచేత అల్లా సృష్టించాడన్నా అదీ ఓ అబద్ధమే.

హైందవ మతం:

దశావతారాలలో ఏ అవతారం ఈ జగత్తును సృష్టించినట్లు చెప్పలేదు. ఉన్నదానినే మునిగిపోకుండా కాపాడినవి మత్స్య కూర్మావతారాలు. హైందవమతం ఎవరు ఎప్పుడు స్థాపించారో ఎవరికీ తెలియదు. అందుచేత అది సనాతన ధర్మంగా చెలామణీలో ఉంది. అందులో కూడా అవతారాలన్నీ ఒక నిర్ణీత ప్రయోజనం లేదా లక్ష్యంతో వచ్చినవి. ఆపని ముగించుకుని ఆ అవతారాలు ముగిసిపోయినా శాశ్వతమైన భగవంతుని ప్రతిపాదించినది సనాతన ధర్మమే.

అంత చిన్నపద్యం మాటున ఎంత గంభీరమైన భావం ఉందో కదా! అందుకే ఈ పద్యం తెలుగు సాహిత్యంలోనే అగ్రాసనము నధిష్టించింది.

 ( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

    ( ౧౦౭ వ పద్యం )

గీ.

ముక్తసంగులైన మునులు దిదృక్షులు

సర్వభూత హితులు సాధుచిత్తు

లసదృశవ్రతాఢ్యులై కొల్తు రెవ్వని

దివ్యపదము వాడు దిక్కు నాకు.

సందర్భం:

గజేంద్రుని దీనాలాపం.

భావం:

లంపటాలన్నింటినీ విడచిపెట్టిన మునులు, భగవత్సాక్షాత్కారం పొందగోరే వారు, ప్రాణులన్నిటి మీద దయజూపే వారు, సత్వగుణం కలవారు, సాటిలేని వ్రతదీక్ష గలవారు ఎవరి పాదపద్మములను కొలుస్తారో అతడే నాకు దిక్కు.

విశ్లేషణ:

మునులు సాయుజ్యం కోరుకుంటారు. కొందరు సాధకులు సాక్షాత్కారం కోరుకుంటారు. అన్ని జీవులమీద దయ కలిగి ఉండే సాత్వికులు నిత్యమూ ఆ పరమాత్ముని పాదపద్మములను కొలిచెదరో అతనే దిక్కు నాకు.

 అతనని నేను కొలుతును. పరమాత్మ ఒక్కడే అనే సత్యాన్ని గ్రహించి ఆతనికోసం వెంపర్లాడడమే తనకున్న గత్యంతరం అని తెలుసుకో గలుగుట నిజంగా గతజన్మానుసంక్రమపుణ్యఫలమే.

( సశేషం)


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

   (౧౦౮ వ పద్యం )

సీ.

వర ధర్మ కామార్థ వర్జితకాములై

             విబుధు లెవ్వాని సేవించి యిష్ట

గతి బొందుదురు చేరి కాంక్షించువారి క

             వ్యయ దేహ మిచ్చు  నెవ్వాడు కరుణ

ముక్తాత్ము లెవ్వని మునుకొని చింతింతు

              రానంద వార్ధి మ గ్నాంతరంగు

లేకాంతు లెవ్వని నేమియు గోరక

              భద్రచరిత్రంబు బాడుచుందు

ఆ.వె.

రా మహేశు నాద్యు నవ్యక్తు నధ్యాత్మ

యోగగమ్యు బూర్ణు నున్నతాత్ము

బ్రహ్మ మైన వాని బరుని నతీంద్రియు

నీశు స్థూలు సూక్ష్ము నే భజింతు.


సందర్భం:

గజేంద్రుని దీనాలాపములు

భావం:

జ్ఞానులు ధర్మార్ధకామములను విడచివేసి ఎవరిని సేవించి వారికి కావలసిన వరాలను పొందుతారో

మనోనియమంతో ఎవరైతే తనకు చేరువ అవుదురో వారికి నాశనములేని శరీరమును (స్వర్గ వాసమును) దయతో  ప్రసాదిస్తాడో

సంసారబంధాల నుండి విముక్తి పొందిన వారు ఎవరిని నిరంతరం ధ్యానిస్తారో

ఆనందసాగరంలో మునిగితేలేవారు అంటే బ్రహ్మానందానుభూతిలో వుండేవారు, అనన్యభక్తులు  నిష్కాములై ఎవరి కథలను పాడుతూ ఉంటారో

ఆ మహేశ్వరుడు, తొలి పురుషుడు, ఇలా ఉంటాడని చెప్పబడనివాడు, ఆధ్యాత్మిక యోగమార్గంలో పొందదగినవాడు, సంపూర్ణుడు, ఉన్నతమైన ఆత్మగలవాడు, పరబ్రహ్మస్వరూపుడు, పరుడు, ఇంద్రియములకు అందనివాడు, ఈశ్వరుడు సమస్తము తానే యైనవాడు, పరమాణువంతటి చిన్నవాడు అయిన ఆ పరమాత్మను నేను భజించెదను.

విశ్లేషణ;

మంచి జ్ఞానంతో ఉన్నవారు భగవంతుని మెప్పించి వరాలను పొందుతారు. వారికి జ్ఞానం ఉన్నా దేహభ్రాంతి పూర్తిగా నశించక పోవడంతో నిష్కామ యోగానికి ఆమడ దూరంలోనే ఉంటారు.

భక్తితో నిరంతర నామస్మరణతో కొందరు స్వర్గలోకప్రాప్తి పొందుతారు. వారికి కూడా ధర్మార్ధకామాలపై వ్యామోహం పోలేదన్నమాట. స్వర్గంలో అనంత సుఖాలను పొందుతారు.

1.కొందరు సర్వసంగపరిత్యాగులై సన్యాసులై నిరంతరం ధ్యానంలో ఉంటారు.

 2.ఇంకొందరు అటువంటి ధ్యానవస్థలో భాగంగా బ్రహ్మానందాన్ని పొంది అందులోనే రమిస్తూ ఉంటారు. వారిది సమాధిస్థితి.

 3.మరికొందరు అనన్యభక్తులు నిష్కాములై భగవత్కథలను పాడుతూ ఉంటారు. 

ఈ మూడు రకాలవారు కోరుకునేది సాయుజ్యం మాత్రమే.

ఇక ఆ భగవంతుడు ఎవరయ్యా అంటే అతడే మొట్టమొదటివాడు, ఇదమిత్థంగా ఇలా ఉంటాడని చెప్ప వీలుపడనివాడు, ఆధ్యాత్మిక మార్గంలో చేరదగినవాడు, ఉన్నతమైన ఆత్మగలవాడు, అతనే పరుడు, బ్రహ్మాండ మంతటి పెద్దవాడు, పరమాణువంతటి చిన్నవాడు అయినవాడెవరో ఆ పరమాత్మ ను ప్రార్ధించెదను అన్నాడు. సరే అది గజేంద్రుడి పరిణతి.

జ్ఞానం ఉన్నా దేహభ్రాంతి పోకపోతే అదికావాలి ఇదికావాలి అని కోరుకుంటారు.

మంచి భక్తితో ఉన్నా అర్ధకామాలతోనే ఉండేవారికి దివిసీమలో స్థానం దొరుకుతుంది.

ఇక నిష్కామభక్తులు ఆధ్యాత్మిక యోగంతో సాయుజ్యం పొందగలరు.

దీనినిబట్టీ స్థాయీబేధాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటే మనం ఏ కోవలో ఉన్నామో తేల్చుకోవచ్చు.

( సశేషం )


పోతన పద్యాలు --- ఆణిముత్యాలు

  ( ౧౦౯ వ పద్యం )

కం.

కలఁడందురు దీనుల యెడ 

గలఁడందురు పరమయోగి గణముల పాలన్ 

కలఁ డందు రన్ని దిశలను

గలఁడు గలండనెడి గలఁడో లేఁడో?


సందర్భం:

గజేంద్రుని దీనాలాపములు.

భావం: ఉన్నాడంటారు దైన్యజనులపాలిట ఆ భగవంతుడు.

ఉన్నాడంటారు మహాయోగిపుంగవువుల చెంత

ఉన్నాడంటారు దశదిశలలోనూ

మరి ఆ ఉన్నాడు ఉన్నాడన్నవాడు నిజంగా ఉన్నాడో? లేడో?

విశ్లేషణ:

ఎన్ని రకాలుగానో సదసద్వివేచన చేసిన గజరాజుకి ఆపన్నప్రసన్నుడు, అరక్షితరక్షకుండు అయిన ఆ శ్రీ హరి కోసం ఎదురు చూసి చూసి విసివి వేసారిపోయి అలిసిపోయి 

ఉన్నాడా? అసలున్నాడా? ఉంటే ఎందుకు కదిలి రావడంలేదు? అనే సంశయానికి గురయ్యాడు కించిత్సమయం.

మనం ఎవరినైనా పిలిచినప్పుడు వారు మరోచోట ఉన్నప్పుడు, పలుకకపోతే మనమూ అలాగే అనుకుంటాము.

నిజానికైతే గజరాజు యొక్క మానసిక పరిణతి అత్యుత్తమంగా ప్రవర్ధిల్లింది. ఆ పరిణతికి సంశయం రావడం అసమంజసమే.

కలడు కలండనెడివాడు కావగ రాడే? అని ఆలోచించదగిన మానసిక స్థాయిలో కూడా లోకసహజమైన విధానాన్నే ఎంచుకున్నాడు పోతన.

అది లోకరీతి. అయినా ఆంతలోనే తమాయించుకుని నన్ను కాపాడుటకు తప్పక వస్తాడనే నమ్మికకు వస్తాడు గజరాజు.

(స శేషం)


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home