సీ. అమ్మ! కిం అనవు యిమ్మనవునా మాటలే
వినవు నన్ను గనవు విశ్వ వపుష!
ఆర్తితో పిలచినా ఆశగా చూసినా
ఆరాట పడిన నా కభయ మీవు
నాకున్న వీలెంత నా జేయు పనియెంత
వసివాడకుండ నీ వాదు కోవ?
గుండె నిబ్బరమిచ్చి కొండంత బలమిచ్చి
సంకల్ప బలమిచ్చి సాగ నీవ?
తే.గీ. ఎంత నమ్మినవాడ విశ్వేశు దయిత!
పంతములు వోవకే హిమ వంతు దుహిత!
ఆదరించవె తల్లి ఆనంద వల్లి
కంచి కామాక్షి! కరుణించు కల్పవల్లి.2.
సీ. పరికించినా నీవు పరికించ నట్లుంట
పరిపాటి నీకు నే పాలితుడను
వినిపించినా నీకు వినిపించ నట్లుంట
సాధుల పాలి నీ సహజ గుణము
ఎటు చూతువో నీవు ఎటు విందు వెది చేతు
వో యెవరి కెఱుక ఓర్మి గలదు
పూజలే చేసినా పూనకాల్ జేసినా
భక్తి పరీక్షించు పగిది నీది
తే.గీ. ధర్మ బద్ధులౌ జనుల సంతాన వత్స
లతతొ ఆదుకో అమ్మ శ్రీ లలిత నీవు
ఆదరించవె తల్లి ఆ నంద వల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.1.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home