Tuesday, December 31, 2024

వసుధైక కుటుంబం

 వసుధైక కుటుంబం మనదనుకుంటే 

మానవాళి సమస్తమూ మనవారే

దేశ కాల జల వాతావరణానుసారం 

రంగూ రూపు వేషం భాషలు వేరువేరైనా

హావభావాలు ఆకాంక్షలు ఒకటే

సర్వజన సౌభ్రాతృత్వం సమానత్వం

మనసా వాచా కోరుకునేవే.

ఆంగ్లేయుల పాలన కారణంగా

ప్రపంచం అనుసంధానింపబడింది.

ఆ ఏలుబడిలో ఆ ఒరవడిలో వారి వారి

సంస్కృతి భాష విద్య నలుచెఱగులా ప్రాకాయి.

పొట్టకూటి కోసమో మనుగడ కోసమో

వంటబట్టిన వేడుకలు వినోదాలు

వదలుకోలేం వద్దన్నా మానుకోలేం

అలాగని మన ఇంటి పూజగదిలోకి 

వాటిని లాక్కొచ్చి నిలబెట్టలేం

కాలక్షేపానికో కాస్త మానసిక ఆనందానికో

ఆంగ్లేయులంటగట్టిన వేడుకే అనుకున్నా

మందిలో మాధవా అన్నట్లు మనమూ

చెప్పుకుందాం ఒకరికొకరు

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.