Thursday, March 6, 2025

కరుణించు కల్పవల్లి

 సీ. 

ఉయ్యాలలూగించి ఉఱ్ఱూతలూగించి

ఉద్విగ్నమొందించి ఊరుకోకు

ఉత్తమోత్తమమంచు ఊరించి గీలించి

ఉస్సురని పించి నా ఉసురు పడకు

ఊహలన్నిటిలోన ఊసులన్నిటిలోన

ఊకొట్టి తలయూపి ఊరుకొనకు

ఉత్తుత్తి కవితలా ఉత్తుత్తి పాటలా

ఉన్మత్త మాటలా ఒక్కసారి

తే.గీ.

తలచుకోవేల వేవేల తలపులన్ని

మలచుకోవేల నామాట మంత్రమనగ

నన్ను మన్నించు మానందవల్లి

కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.


Tuesday, December 31, 2024

వసుధైక కుటుంబం

 వసుధైక కుటుంబం మనదనుకుంటే 

మానవాళి సమస్తమూ మనవారే

దేశ కాల జల వాతావరణానుసారం 

రంగూ రూపు వేషం భాషలు వేరువేరైనా

హావభావాలు ఆకాంక్షలు ఒకటే

సర్వజన సౌభ్రాతృత్వం సమానత్వం

మనసా వాచా కోరుకునేవే.

ఆంగ్లేయుల పాలన కారణంగా

ప్రపంచం అనుసంధానింపబడింది.

ఆ ఏలుబడిలో ఆ ఒరవడిలో వారి వారి

సంస్కృతి భాష విద్య నలుచెఱగులా ప్రాకాయి.

పొట్టకూటి కోసమో మనుగడ కోసమో

వంటబట్టిన వేడుకలు వినోదాలు

వదలుకోలేం వద్దన్నా మానుకోలేం

అలాగని మన ఇంటి పూజగదిలోకి 

వాటిని లాక్కొచ్చి నిలబెట్టలేం

కాలక్షేపానికో కాస్త మానసిక ఆనందానికో

ఆంగ్లేయులంటగట్టిన వేడుకే అనుకున్నా

మందిలో మాధవా అన్నట్లు మనమూ

చెప్పుకుందాం ఒకరికొకరు

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.


Thursday, November 7, 2024

ఇంకెన్నాళ్ళు

ఇంకా ఎన్నాళ్ళు ?

ఇంకా ఎన్నేళ్ళు ?

ప్రపంచ అగ్రరాజ్యంలోనే 

సమానత్వం అతివలకు అందని ద్రాక్ష.

సుమారుగా రెండొందల ఏభై ఏళ్ళ 

స్వతంత్ర అమెరికా చరిత్రలో

అబలా!  నిన్నెపుడైనా

అగ్రాసనం ఎక్కనిచ్చారా?

అద్యక్ష పీఠం అందించారా?

లింగ, జాతి వివక్షలు సమసి పోలేదా?

చెప్పుకోడానికే జ్యేష్ఠభ్రాత

చేతలలో నికృష్టభ్రాత

కనుచూపు మేరలో ఎటు చూసినా అధంతే

ఉన్నంతలో కాస్త భరతఖండమే మేలు.


Tuesday, October 29, 2024

నరకాసుర వధ

 మ.

పగ జూచున్ మగజూచు సత్య రణ సంభావ్యంబు నూహించుచున్

నగవున్ శ్రీహరికిచ్చి రెచ్చి  నరకున్ నా భీకరా రావంబుతో

తెగవేయన్నట దివ్యబాణములు సంధించె న్నమోఘంబుగా

మగవారెవ్వరు సాటియే నరకు నమ్మాన్యాభ కూలార్చగన్.


నరక చతుర్దశి శుభాకాంక్షలు.

Friday, October 25, 2024

 వయసు మీరితే

అది వరమా? శాపమా?

ఆనందాలు అవరోధాలు అపరాధాలు

ఒకటేమిటి సకల గుణదోష పూరకాలు

అన్నిటికీ అతీతంగా అందరికీ అందనంతగా

జగన్నాటక సూత్రధారిపై మనసు కుదిరితే

జగదంబ పదారవిందాలపై శరణు కోరితే

మనసుకు శాంతి హృదయ ప్రశాంతి

కరతలామలకం కమనీయం ప్రతిక్షణం

ఱెక్కలొచ్చిన పిల్లలకు దూరంగా 

జంటగా ఒకరికోసం ఒకరిగా

మనగలిగితే అదో మహద్భాగ్యం

రోగాలు రొష్టులు రాకుంటే లేకుంటే

అందరూ మనవారే అనుకుంటే

ఆదరంగా ఆప్యాయంగా

పలకరిస్తూ పులకరిస్తూ

ఉదయాస్తమానాలతో పనిలేకుండా

తృప్తిగా స్వేచ్ఛగా బ్రతకగలిగితే

అదే భూతలస్వర్గం, మానస కైలాసం