అమ్మ బాల్యేందు శేఖరి. అంటే ఆమె సిగలోన నెలవంక ధరించినది. శివ భవానీలు ఇరువురకూ తలపై నెలవంక ఉంటుంది. అమ్మ చిద్గగన సదన. ఆ తలపై నెలవంక కరుణాచంద్రికలను వెదజల్లును.
నిన్న దర్శ పాడ్యమి గురించి నాకున్న ఎరుకను తెలిపితిని.
ఈరోజు ద్వితీయ. అనగా విదియ. ఈ పగలుకు విజ్ఞానం అని రాత్రికి దృష్టా అని పేర్లు. భగమాలినీ నిత్యా.
లౌకిక వ్యవహారం లో ఈరోజు నెలపొడుపు. విఘ్నేశ్వరు కథా సంపప్రదాయంగా ఈరోజు చంద్ర దర్శనం చేసి చంద్రునికో నూలుపోగు సమర్పించడం మన విధి. నిన్న దృశ్యాదృశ్యమాన మైన శశిరేఖ దృష్టానుకూలమై ఈరోజు కనిపిస్తుంది.
ద్వితీయ అంటే భార్య అని మరో అర్థం కూడా ఉంది.
అందరూ నెలవంకను ఈరోజు చూడాలను కుంటారు కాని అమ్మని నమ్ముకున్నవారు నిత్యమూ చూస్తున్నారు. అదే ఓ పద్య రూపంలో
సీ.
నెలకొక్క సారియే నెలవంక గగనాన
నీ సిగన్ నెలవంక నిత్యనూత్న
దృష్టాద్వితీయయు తానద్వితీయ యౌ
హర ద్వితీయ నువు నాకద్వితీయ
నిందలన్ పడకుండ నెలవంక గగనాన
జూతురు నూలుపోగు జుట్టి విసరి
బాల్యేందు శేఖరీ భక్త వశంకరీ
నీ సిగ నెలవంక నెనరు గురియు
తే.గీ.
తలచి నంతనె మా వాంఛితములు దీర్చు
నీ కొకరు సాటియే మహనీయ మూర్తి
నన్ను కాదనకమ్మ యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.
ఇక కృష్ణ పక్షంలో తిథి నిత్యలు క్రింద పట్టికలో గుదిగుచ్చడ మైనది.గమనించ గలరు.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home