సీ.
ఒకవంక యాశతో యొకవంక బెంగతో
నెలవంక వలె నేను నెగడు చుంటి
ఒకసారి భయమునన్ యొకసారి భవములన్
వేసారి పోవుచున్ వెతల నుంటి
యభయ ముద్రను జూచి యభయ మిచ్చెద వంచు
యభయంకరీ వినుమంచు యంటి
వినుతు లెన్నియొ జేసి విన్నవించితి నమ్మ
వివశుడై శరణంటు వేడుకొంటి
తే.గీ.
ఎదురు చూపూల యెడదకు యెండమావి
నెదురు పడనీకు చూపించు నీటి బావి
నా మనవి విను తల్లి యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.44
సీ.
నెలకొక్క సారియే నెలవంక గగనాన
నీ సిగన్ నెలవంక నిత్యనూత్న
దృష్టాద్వితీయయు తానద్వితీయ యౌ
హర ద్వితీయ నువు నాకద్వితీయ
నిందలన్ పడకుండ నెలవంక గగనాన
జూతురు నూలుపోగు జుట్టి విసరి
బాల్యేందు శేఖరీ భక్త వశంకరీ
నీ సిగ నెలవంక నెనరు గురియు
తే.గీ.
తలచి నంతనె మా వాంఛితములు దీర్చు
నీ కొకరు సాటియే మహనీయ మూర్తి
నన్ను కాదనకమ్మ యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.45
సీ.
శారద యామినీ సమయ విభవమందు
శ్రీ చక్ర సారూప్య సేవ నిమ్ము
శారదా రూప శ్రీ చక్రమే జగమంత
ఈమేను శ్రీ మేరు వే యనెరిగి
శారదా వాగ్రూపి సాక్షర స్ఫురఝరి
న్నిడి భావాంబర మేలు కొమ్ము
శారద కామరాజ సుశక్తి బీజముల్
నిరతము మదిని నిర్ణీత మిమ్ము
తే.గీ.
శారదా కృపా భర సుధా స్రవము నొసగి
మోక్ష మార్గము నందు మమ్మోప నిమ్ము
నన్ను మన్నించ వమ్మ యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి. 46.
సీ.
తలపు లన్నియు భవత్తంత్రమై పలుకు ల
న్నియు మంత్ర మయములై నిలువ నిమ్ము
నిరతి యంతయు మనికి నియమమై మనగల్గు
నియతి నిమ్ము నను పునీతు జేసి
నిశ్చల మతినై యనిర్వచనీయ సు
ధా స్రవంతిని నన్ను తనియ నిమ్ము
వర్షోరు ధారా పరంపరలన్ కృప
గురియ నిమ్ము మనసు కుదురు నిమ్ము
తే.గీ.
అరసి యరయక జేసిన యఘము లన్ని
కృతకమన జేసి నాకు నిష్కృతిని యిమ్ము
నన్ను గావుమో తల్లి యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.47.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home