సీ.
గోవునైనను గాక పోతిని నోరార
అంబా రవమ్మునే యనుచు మిగుల
రాయినైనా గాక పోతిని నీరూప
మపురూప మౌనట్లు మలచ బడగ
పూవునైనా గాక పోతిని నీ పాద
కమల సేవకే తుది గమనమనగ
సుజలమైనా గాక పోతిని నీ కభి
షేక జలముగా గాసేపు నిలువ
తే.గీ.
విలువ లేని యీ బ్రతుకు నీ వీయనేల
కలిమి లేముల నడుమ నే కనల నేల
నా వినతి వినవేల యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.39
సీ.
ఈతి బాధల మధ్య నిష్కామ యోగాన
నిరతమ్ము నిరతిగా నేగు టెట్లు
ఆలు బిడ్డల మధ్య యనవరతము నిన్ను
తలచు టెట్లు సతమత మగు టెట్లు
లోటు పాటుల మధ్య నీ సేవ కంకిత
మగుటెట్లు మనసట్లు మనుచు టెట్లు
ఆటు పోటుల మధ్య యారాట పడుటెట్లు
యార్తితో కొలుచుచు యడుగు టెట్లు
తే.గీ.
ఇంత యాతనా భరితమౌ యిహమునందు
నిత్య సమరమునందు నే నెగ్గుటెట్లు
నన్ను ఉద్ధరించవటె యానంద వల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.40
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home