శ్రీ మాతా
కం.
శ్రీ వాణీ పరిసేవిత
దేవీ లలితా పరా పదే పదె నిన్నే
సేవించే భక్తుండను
కావవె వరద శుభము నొసగవె శ్రీ మాతా.1
నమ్మకమే యూపిరిగా
సుమ్మా మిగిలితి భవాని! చూడకుమీ యో
యమ్మా నా తప్పుల నిపు
డిమ్మా చేయూత ఋణపడెద శ్రీ మాతా.2
అమ్మా నీపై యెంతో
నమ్మకముంచి దిగితిని యనాథను కానీ
కమ్మా ఋణసౌకర్యము
నిమ్మా నిలబెట్టెద బడి నెంతగనో శ్రీ మాతా.3
అమ్మా నీ కనుసన్నల
నిమ్మా యానతి యలాగునే నే నడచే
నమ్మా నా తలపై యొ
ట్టమ్మా నన్నమ్ముమమ్మ అల శ్రీ మాతా. 4
అమ్మా దిక్కెవ్వరు నా
కమ్మా పదిమందికి యుపకారము జేయన్
ఇమ్ముగ నగునని దలచితి
నమ్మా మన్నించవమ్మ నన్ శ్రీ మాతా.5
అమ్మా నాదేలే త
ప్పమ్మా పడియుండుట సరిపడదని తలచా
నమ్మా పిల్లలపై మో
జమ్మా యందుకె బడి తెఱిచా శ్రీ మాతా.6
అమ్మా నావైపిటు చూ
డమ్మా దీవించవమ్మ యభయము నిడుచున్
ఇమ్మా ఋణహరణపు మా
ర్గమ్మోయి దయార్ద్ర హృదయ గా శ్రీ మాతా.7
ఏ వేళన్ నిను మరచే
నా వేరెవరిన్ తలచితినా కామాక్షీ
కావగ గదవే దీనుని
రావే యీశ్వరి యిళ యపరా శ్రీ మాతా. 8
నీవే తప్ప మరెవ్వరి
సేవే యెఱుగని మనిషికి చేదోడువు కా
వే వే రెవరిని వేడెద
రావే రక్షింపవే పరా శ్రీ మాతా. 9
నీవే సమస్త మంచును
నీవే నా దైవమంచు నెఱ నమ్మితినే
సావిత్రీ వారాహీ
నీవే దిక్కు ఖచరి! జననీ! శ్రీ మాతా.10
నమ్మితి నిన్నే కొలచుచు
నమ్మిన వారికి యిడుముల నాశము నీవే
ఇమ్ముగ చేతువనుచు ని
న్నమ్మిన వాడను చెఱపగునా శ్రీ మాతా.11
కాలమొ కర్మమొ భ్రమసితి
చాలిటు వంటి యవివేక చర్యలిక పయిన్
చాలును తల్లీ యాద్యా
యాలము సేయక ననుగనవా శ్రీ మాతా.12
సరిచేయన్ గలవంచును
మరిమరి వేడితి మృడాని మాతంగీ నీ
కరుణా పాత్రుడ గానే
పరమారాధ్యా ననుగనవా శ్రీ మాతా.13
చేతులు కట్టుకు పడి యుం
టే తిరముగ కూర్చొన గలడే నరుడెవడున్
రాతిరి పగలనకను పని
జేతును ఋణహరణము తలచిన శ్రీ మాతా. 14
నిలిపెదవో తలలెత్తుకు
కలవానిగ నిల్పి నన్ను కారుణ్య నిధీ
నలిపెదవో తలదించుకు
బలికమ్మని యీసడింతువా శ్రీ మాతా.15
ఆరాతి చేతికి చిక్కిన
రారాతి సూతి ధనమును రప్పించినచో
దారా సుతలెడ మన్నన
గా రాజిల్లగ మనగలుగనె శ్రీ మాతా.16
పాపమొ పున్నెమొ యెంచక
కాపరివై నన్నుకావగా వలెనమ్మా
పాపినిలే కాదనను నా
పాపము లన్ని శమియింపవా శ్రీ మాతా.17
కలలోనైనను కనపడి
బలిమిని యొసగెదననుచు నభయము నొసగవా
కలిమికి దూరము చేయక
నలుగురి లో నన్ను నిలుపవె నా శ్రీ మాతా.18
పిల్లల కనువుగ బడి చదు
వల్లన యిష్టమగునట్లు అందరికిన్ నా
యుల్లము నిండుగ నేర్పెద
కల్ల యెరుంగని బుడుతలకట శ్రీ మాతా.19
ఋణముల పాలై పోయెను
వణిజుల వడ్డీల పాలు వడిగా తీర్చన్
ఋణ మతి తక్కువ వడ్డీ
గుణియించునట్లు వరమడుగుదు శ్రీ మాతా.20
మంచి పనులు జేయింతువొ
ఇంచుక మిగిలిన బ్రతుకున యెంతైనా నీ
పంచన పడివుంటా యే
వంచన సలుపక నను గొనవా శ్రీ మాతా.21
ప్రతి పనికీ ధన మక్కర
అతి దీనముగా యడిగితి ననుకో వమ్మా
గతిలేని వాడిని సుతుడ
నుతి జేసి వినతుల జేతు నో శ్రీ మాతా.22
ఇప్పింతువో ఋణమొకటి
తప్పింతువొ నర్థబాధ తడబడు చుంటిన్
ఒప్పింతు నెవరి నైనను
నొప్పింతువొ నలుగురెదుటనో శ్రీ మాతా.23
మౌనమె నీ బదులైనను
మానమె నాకు నతి ముఖ్య మనుచున్ తలతున్
గాన నిక ముగింతు బ్రతుకు
నానక కన వారిజాసనా శ్రీ మాతా.24
ఎవ్వరి నడిగెద నిమ్మని
యెవ్వరి కడ యంగలార్తు యెట్లోర్తును యిం
కెవ్వరు మ్రొక్కగ లేరే
యివ్విధి తప్పించు వారలే శ్రీ మాతా.25.
ఏ కోరిక లేకుండను
నాకో వరమీయ రాదె నారాయణి నీ
రాకా ముఖ విలసిత హే
లా కారుణ్య మునను పరులా శ్రీ మాతా.26
లౌకిక జీవన యానము
నాకిక చాలును యపర్ణ! నాచే పరుషా
ధికముల పలికించకుమీ
వ్యాకుల మందెద కనుగొనవా శ్రీ మాతా.27
ఉన్నావని నాతో నీ
వన్నావని సంబర పడి పరుగిడనా నా
కన్నీ నీవే కాదా
యెన్నాళ్ళని యెదురు చూతునే శ్రీ మాతా.28
అడగాలని యనిపించదు
యడిగినను గాని బదులిడ వనిపించున్ నే
నడిగెద పదిమంది కొఱకు యె
పుడడిగిన యేమి మును తలపుకు శ్రీ మాతా.29
రారాతి ప్రసూతి! శిగను
రేరేని నగవు గనుమ పరికించితివి గా
పారాణి పదముల మిసిమి
కారాదు దూరము తరచుగా శ్రీ మాతా.30
ఏలా పలు తపనలు నా
కేలా యీ వయసులోన కిమ్మన కుండా
మూలన పడియుండక యిపు
డేలా శ్రమైక విధానమిట శ్రీ మాతా.31
అనువా కాలము చూడగ
చనునా బుడతల చదువుల సంగతి మరలా
కనవే వెనుకటి యనుభవ
మనగా బదులేమి లేదు మా శ్రీ మాతా.32
మనసంతా వ్యాకులమై
మనవారికి సరిపడని సమస్యగ యెదురై
ధన మాన హరణమై మిగి
లిన పని నాకేల యనకులే శ్రీ మాతా.33
ఏదో చేయాలని నేన్
యేదీ చేయొద్దని మన యింటా వంటా
లేదని కుటుంబిని సుతయు
వాదోపవాద ములైనవట శ్రీ మాతా.34
ఇల్లాలి పోరుతోడను
యిల్లే సమస్తమను జను లెవ్వరి తోడన్
కల్లోల కడలి తోడను
యెల్లెడలా యోటమౌను యిల శ్రీ మాతా.35
పెద్దల దీవెన లుంటే
ముద్దుగ సాధించ వచ్చు ముందర పనులన్
వద్దుర పొమ్మని రనుకో
నిద్దరి గెలుపొంద లేము నిల శ్రీ మాతా.36
జరిగిన దానికి వగవక
జరగగ వలసినది చూడ చక్కంబడు నం
చెరిగిన జాలదె సుమతుల
కరయమి గాదె. భ్రమలు తొలగవె శ్రీ మాతా.37
అందల మెక్కుట కాదే
మందితొ వ్యవహారమనగ మా యమ్మా యే
మందును విధి యిట్లున్నది
చెందురు తోబుట్టువు దయచే శ్రీ మాతా.38
ఎవ్వరెటులన్న నేనే
మివ్వ గలను బదులు మౌనమే మేలనుచున్
సవ్వడి లేకుండ నడతు
యెవ్వరి కొరకు బ్రతికెద లే శ్రీ మాతా.39
నాకో యుపకారము గా
నాకో మహా వరమనగ నందీ యవె మా
నీ కెంతేని ఋణపదును
నీ కేలొకపరి ప్రియ జననీ శ్రీ మాతా.40
ఆమ్మా మనసా వందన
మమ్మా వచసా నతి గొనుమా పరులా నే
నమ్మా నీ సుతుడను రా
వమ్మా నా యెద వసింపవా శ్రీ మాతా.41
అమ్మా యని పిలచిన చా
లమ్మా మదిలో దిటవగు నంతియె కానీ
యమ్మను మించిన దైవము
నిమ్మహి కలదె వరదాయినీ శ్రీ మాతా.42
అమ్మా షోడసిగా నిను
నెమ్మదిలో తలతు నెపుడు నిశ్చల మతినై
ఇమ్మా కాదనకట్టి శు
భమ్ము భగవతి శివవల్లభా శ్రీ మాతా.43
అమ్మా బాలా మంత్రము
నిమ్ముగ జపియించు నపుడు నిజముగ నీవే
గమ్మున కనిపించితివే
కమ్మని యనుభూతి కలుగగా శ్రీ మాతా.44
అమ్మా నీ చరణ శరణు
నిమ్మా పరిపరి విధముల నిడుముల నిడకమ్మా మే
లమ్మా నీ జపమే నా
కిమ్మా జననీ కిరాతకీ శ్రీ మాతా.45
అమ్మా యలభ్య యోగమొ
నమ్మకమో పున్నెమో జననీ జనకులే
యిమ్ముగ దీవించిరొ న
న్నమ్మా కడ దేరగ గలనా శ్రీ మాతా. 46
అమ్మా నువు జగదంబవు
ఇమ్మనుజుల కేల యిడుము లిస్తివి కారే
యిమ్మనుజులు నీ బిడ్డలు
రమ్మని పిల్లల గని యనరా శ్రీ మాతా. 47
అమ్మా నే వదరిన యున్
కిమ్మన వేలా కిరాతి వేలా యిటులన్
గమ్మున యుందువు వినవో
నెమ్మదిగా చెప్పి నంతనే శ్రీ మాతా.48
అమ్మా నిను కను గొన్నా
నమ్మా కలలోన యొక్క నాడది నిజమో
సమ్మోహనమౌ బంగరు
బొమ్మగ శ్రీ చక్రపు పనుపున శ్రీ మాతా.49
అమ్మా శ్రీ విద్యా విభ
వమ్మో పురాకృత ఫలమొ వాగ్భవ బలమో
నమ్మిక యో నడిపించును
కమ్మగ నన్ను పురుహూతికా శ్రీ మాతా. 50
నీ కరుణకు సరి పాటియె
లోకము లో వేరొకటి పలురీతుల శివే
లోకులు పలుగాకులతో
నాకేమి పనో చెఱపగునా శ్రీ మాతా.51
నిన్నే నమ్మిన రీతిగ
విన్నావా నమ్మ నొరుల విదుషీ లలితా
కన్నావా భక్తుల కొర
కున్నావా కాదని యనకో శ్రీ మాతా.52
నమ్మిన వారికీ సంపద
లిమ్ముగ నిత్తు వనిరి మునుపే రీతిగ నిన్
నమ్మన వారిని జూస్తివొ
యమ్మా నన్నటులె జూడవా శ్రీ మాతా.53
ఆమ్మా నాకొక దరిశన
మిమ్మా కనులారగ కననిమ్మా యొకసా
రమ్మా మాటాడు నాతో
నమ్మా తరియింపగ నగునా శ్రీ మాతా.54
మును నే జేసిన పాపమొ
వెనుకటి మిగిలిన విచ్చితమో నా
కనులదొ మనసుదో దోసము
కన నీయదు నిన్ను యంతగా శ్రీ మాతా.55
ఎందరికో యారాధ్యవు
కొందరి కేనట సుసాధ్యగుదువది యేలో
యందరి నొకటే రీతిగ
నెందుకు జూడవొ భవహరిణీ శ్రీ మాతా.56
తారా పథమంటిరి నిన్
తారగ కొలచిన ప్రముఖులు తామసు లైనన్
తారిణి వనుచును తారా
తారిణి వనుచు యపరాజితా శ్రీ మాతా.57
ఇహ సౌఖ్యమ్ములకై
దహరా కాసమున పంచ దశిన్ జపింపన్
యిహపర ముభయము కలుగన్
వహియింతు నుభయము నే జపము శ్రీ మాతా. 58
మోక్షము జూచిరె యెవరున్
మోక్షపు విద్య యని 'కాది' ముక్తికి నిదియే
కుక్షికి కాదని యందురు
దక్షతగా తెలుపవె వరదా శ్రీ మాతా.59
ఆద్యా నీ వొసగిన నిర
వద్యము శిరసా వహింప వలదే లలితా
సద్యః ఫలదాయిని శ్రీ
విద్యా యుపాసన భైరవీ శ్రీ మాతా.60
ఆర్యా మహా జనని నా
కార్యము సఫలము నగు వరకారాట పడన్
పర్యవ సానము లెంచను
దుర్యోగము నాకిక వలదో శ్రీ మాతా.61
మంత్రమె నాకున్న బలిమి
మంత్రమె నాదు కలిమి యనుమానము లేలా
మంత్ర యనుష్టానము స్వా
తంత్రము నిచ్చెనుకద లలితా శ్రీ మాతా. 62
చలిమల చూలికి వరద క
పాలికి శూలికి కిరాతి భగవతి కెపుడున్
కాళికి యీశికి త్రిభువన
కేళికి ప్రణతు లిడుట లెరుకే శ్రీ మాతా63
శాంకరి శాంభవి భక్త వ
శంకరి శిరసా నమోస్తు సర్వ శుభకరీ
పొంకము నొప్పగను శివ ప
ర్యంకా దీవించవె కృపయా శ్రీ మాతా.64
శారద యార్త త్రాణ వి
శారద వరదా మునీంద్ర శాస్త్ర విహితమౌ
దారిని నను నడిపించగ
నారాయణి దయ గలుంగునా శ్రీ మాతా 65
కం.
శివశంకరి మమ శంకరి
భవభయహారీ భవాని భగవతి పరులా
శివవల్లభ ప్రభా భ
క్త వశంకరి నౌమి శారదా శ్రీ మాతా. 66
ఈశానీ శర్వాణీ
ఈశీ భవాని శివాని యీశ్వరి కళ్యా
ణీ శివ రాణీ కాళి యు
మా శివదయితా నమోస్తు మా శ్రీ మాతా.67
ఆనంద భైరవివి నీ
వానందము నీ వలదె శివానీ గౌరీ
యానంద లహరి మాకు శి
వానంద లహరిని యొసగవా శ్రీ మాతా.68
కాత్యాయనీ మహా సం
స్తుత్యా యారాధ్య మీవె శుభంకరి శివే
తిర్యగ్గతి వలదు వలదు
యార్యా ఋజు గతి నిడు కృపయా శ్రీ మాతా.69
దాక్షాయణీ చిద్రూపిణి
రక్షో మార్గము మనోహరమ్మగు నటులన్
కుక్షింభర జాతికినిడి
రక్షించవే యపరా పరా శ్రీ మాతా.70
ఆర్యాణీ కళ్యాణీ
నర్యము నెఱింగి సుజనుల నానా వెతలన్
తిర్యక్ప్రేక్షణములతో
తిర్యగ్జేయవలె పార్వతీ శ్రీ మాతా.71
(నర్యము = నరునకు ఇంపైనది, తిర్యక్ప్రేక్షణము = ఓరజూపులు , తిర్యగ్జేయు = అడ్డగించు)
అపరాజితా యపర్ణా
యుపగుహ్యము నరయమి మరియున్నత్యాశన్
యప మార్గంబుల పడు మము
యుపదిష్టము నిచ్చి కావుమో శ్రీ మాతా.72
(ఉపగుహ్యము =అందుకో దగినది, అరయమి = తెలియక, ఉపదిష్టము = ఉపదేశము)
ముక్కంటి వాలుగంటి య
నిక్కంబగు జీవ వాహినిలో బడి మనుజుల్
లెక్కింపరు మంచి చెడులు
చక్కం జేయ గదవే ప్రజన్ శ్రీ మాతా. 73
దేవేశి మహేశి శివే
నీవే జగజ్జననీ కనికరించవలెన్
ఈవే కోర్కెల నమ్మా
నీవే దిక్కని కొలచితినే శ్రీ మాతా. 74
దుర్గవు దురిత విదూరవు
భార్గవి భవసాగరమను బంధ విదారీ
స్వర్గరివై దయతో స
న్మార్గ పథికుల మము జేయుమా శ్రీ మాతా.75
ద్యుతిమత మరకత శ్యామా
యతి ధృతి కిరాతి భగవతి యనుకూల్యముగా
సితకంధరు సతి యుండగ
మిత మేమి మాకని తలుపమే శ్రీ మాతా.76
వడకులమల దొర పట్టివి
యడిగిన లేదనక నొసగు యమ్మవు నీవే
తడబడి చిడిముడి కోర్కెల
నడిగితి ననుకో దొసగగునా శ్రీ మాతా. 77
వలిగుబ్బల ముద్దు సుతవు
వెలిగొండ దొర ప్రియ సతివి విశ్వేశ్వరివై
యెలమిని మాకిడ వేలా
గలరే వేరె మము కావగా శ్రీ మాతా.78
వెలిగొండ రాయుని సగమగు
తెలిగంటి వైతివి యడిగితే కాదనడే
కలిముల నీయగ వలదని
తెలివేల్పు నీ దయ కలుగదే శ్రీ మాతా.79
(తెలిగంటి = వనిత, వెలిగొండ = కైలాసం
తెలివేల్పు = శివుడు)
అచలాత్మజా భవానీ
విచలిత మనస్కులు గారె విబుధు లుదాసీ
న చలనము వలన లలనా
యుచితమె నీ మౌనము యరయుమి శ్రీ మాతా.80
మంగళ మూర్తివి సర్వ సు
మంగళ భక్తులు సతమత మగుచో భువిలో
మంగళ మగునే భువికి య
మంగళహర హర సతి వినుమా శ్రీ మాతా.81
కలిగిన కాడికి గంజియొ
కలియో తిని యుండ నీదు కలికాలము గా
కలిమిడు నాశతొ పనిమం
తులు పని జేతురు పని వలతురు శ్రీ మాతా.82
ఏలా తాపత్రయములు మా
కేలా వ్యాపారము లన కే లాడిన వా
రే లాభింతురు యంటే
యేలా నాబోటి వారి కిక శ్రీ మాతా.83
ఏమగునో యెటులగునో
నా మది కేమియు తెలియక నా కెంతో బెం
గై మనసింతై తెలిపితి
భ్రామరి నీకున్ నను మరువకు శ్రీ మాతా.84
నగజా విరజా హోమము
తగ జేతును మనసు నిలిపి తరియింపంగా
వగ జూపకు తాళను చను
వుగ నను కనుగొన వో శ్రీ మాతా.85
మాతంగీ మధుశాలిని
పీతాంబరి విష్ణు సహజ బేలగ జూడన్
జోతింగ దయిత దయతో
ద్యోతింపగ జేయుము హృదియున్ శ్రీ మాతా.86
పరమేశ్వరి యీశ్వరి యిహ
పర శుభ దాయని యచలజ పార్వతి నిన్నే
పర హితమే కామేశ్వరి
వరమని నెఱ నమ్మితి గనవా శ్రీ మాతా.87
అనుకూలింతు వనుచు నే
ననుకొంటిని శాంకరీ మనస్సుమధురమై
వినుతించితి నా నేర్పున
కనికరమగునా భవహరకరి శ్రీ మాతా.88
భవ హరమై ద్యుతి కరమై
శివ పరమై మేనకాత్మజవై విజయవై
శివ సగమై నిలచెడి నీ
కివియే నతులమ్మ వలదనకే శ్రీ మాతా.89
( హిమవంతుని భార్య మేన. వారికి మువురు సుతలు.1.ఉమ 2.ఏకపర్ణ 3. అపర్ణ)
కరమై విరి సరమై శుభ
కరమై యొప్పగ నుడివితి కందములన్ శం
కరమై యభయంకరమై
వరమై వెలుగొంద నీయవా శ్రీ మాతా.90.
మనసారగ నే పలుకగ
మనసారగ నిన్ కొలువగ మనసౌ నమ్మా
నిను కొలచుట యోగ మనుచు
నిను నమ్మిన వాడను జననీ శ్రీ మాతా.91
శ్రీ విద్య నిచ్చితివి గనుక
సేవా నిరతికి బలమిడు చేతల కింకన్
నీవే యిమ్మవకాశము
మా వేలుపు వాదుకో యుమా శ్రీ మాతా.92
శ్రీ కరి శుభకరి శాంకరి
నా కను దోయికి కనబడునా యొక సారై
నా రుచిరార్థపు రూపము
నీ రమణీయ విలసనము నిట శ్రీ మాతా.93
శ్రీ హరిసహజా గిరిజా
సాహసమగునా నినుగన సరిపోనా భ
వ్యా హరదారా యపరా
సింహరథ భగవతి తామసీ శ్రీ మాతా. 94
నీవు సనాతనివమ్మా
నీవే బాలవు భవాని నిరుపమ జననీ
నీవే గా జగదంబవు
నీవే నా వేలుపు జననీ శ్రీ మాతా.95
నీవే బగళా ముఖివిన్
నీవే పంచదశివి జననీ శ్రీ లలితా
నీవే భైరవి షోడశి
నీవే సమస్తమును జననీ శ్రీ మాతా.96
నిన్నే నమ్మితి మదిలో
నిన్నే స్థిరముగ కొలచితి నెద కోవెలలో
నిన్నే మననము జేతును
నిన్నే దరి జేరగ వలెనే శ్రీ మాతా. 97
విన్నా నమ్మా నీ కథ
లెన్నో ప్రవచనము లందు యెన్నెన్నో నే
కన్నా నమ్మా మహిమలు
కన్నార్ప కుండ నిజమనగా శ్రీ మాతా.98
ఉన్నావమ్మా గుడిలో
నున్నావమ్మా యెద యెద నున్నావమ్మా
పెన్నార్తి కను సన్నల
నున్నావంతట కనుగొనుచు శ్రీ మాతా.99
గుడిలో శిలలో విరిలో
జడిలో బడిలో యల యలజడిలో ద్యుతిలో
యిడికను నీటను గాలిని
తొడి లేక నుందువు గురుతుగ శ్రీ మాతా.100
ఆవునమ్మా కోర్కెలు తర
గవులే యుచితా నుచితము గని నీవిమ్మా
కవినై పవినై భువిపై
రవి శశి మయూఖ మన యలరన్ శ్రీ మాతా.101
కాదమ్మా కామాక్షీ
నీదరి చేరగ సుళువుగ నెఱ నమ్మిన వా
రే దరిశనమో దరియో
నీదయ వల నొంద గలుగు నిల శ్రీ మాతా.102
రాదమ్మా కైవల్యము
వాదోప వాదులకు యపవాదులకున్ కా
రాదని చులకన పడగను
లేదనుటే మేలు పనిలే శ్రీ మాతా.103
మాకంద ఫల రసాదుల
నానందముగా గొనుము సనాతని మృదులా
యానందమీవె నందా
మాకందరకున్ భగవతి మా శ్రీ మాతా.104
వందలు వేలుగ స్తుతులను
యెందరు జెప్పిరొ అయినను ఇప్పటి కిపుడే
కందములో జెప్ప మనిన
సుందర రాముని గని మనసున శ్రీ మాతా.105
నతిగా సన్నుతిగా మది
నతిగా తలుపక నుడివితి నమోస్తు లలితా
స్తుతి జేయుట కూర్చుటకున్
యతి స్థానము జటిలము యగు శ్రీ మాతా.106
ఎదలో తుందిల మందితి
మదిలో పలు ప్రశ్నలు యభిమానము లెగయన్
హృది మందిరమున నిన్నిడి
యిదిగో గూర్చితి శతకము నిటు శ్రీ మాతా.107
వెతలన్ బాపగ నిమ్మా
శ్రుతి సూక్తి నెఱుక పరచగ శుభమల నొసగన్
నతి జేయుచు నుతి జేసితి
సతి సత్యా సౌమ్య యచలజా శ్రీ మాతా.108
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home