Monday, May 11, 2020

  తిరోగమనం
కలిగిన కాడికి కలో గంజో
మా ఊరిలోనే మా వారితోనే
అందుకే మూటా ముల్లె సద్దేసా
ఏలికల పిలుపు కోసం
ప్రభుత్వాలు కల్పించే
ఉచిత రైలు బండి కోసం
ఎదురు చూసే ఓపిక లేక
ఆ పిలుపందే ఆశ లేక
ఆలు బిడ్డలతో అలుపెరుగని
ఆకలి పయనం మాది
సత్తువ లేకున్నా నడుస్తూనే ఉన్నాం
ధర్మాత్ములెవరైనా పట్టెడన్నం పెడితే
ఎంగిలి పడుతూ సాగిల పడుతూ
పంటి బిగువున కష్టాన్ని దిగమింగుతూ
నడుస్తున్నాం దూరాభారం ఎంతైనా
నాది ఒంటరి పయనం కాదు
వందల కొద్దీ మందల కొద్దీ ఎందరో
అందరిదీ ఒకటే లక్ష్యం
అందరిదీ అదే నిర్వేదం
అసంఘటిత కార్మిక జనం
వలస కూలీ అరణ్య రోదనం
వందల వేల మైళ్ళ దూరాలు
ఎన్నాళ్ళకు చేరేనో గమ్యాలు
నాకైతే అగమ్య గోచరాలు.
ఇదీ నా దేశంలో బడుగు జనం
దౌర్భాగ్యం నెత్తిన మోసే గుణం
తప్పెలా జరిగిందో తప్పే జరగ లేదో
అతి సామాన్యుల నడ్డి విరిచి
నడిరోడ్డున పడేసిన లాక్ డౌన్
పస్తులతో కానకళ్ళన చచ్చేకన్నా
కలిగిన కాడికి కలో.. గంజో
మా ఊరి లోనే..మా వారి తోనే
అందుకే ఈ తిరోగమనం
అందుకే మా వూరి పయనం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home