Tuesday, July 24, 2018

అక్షమాల



అక్షమాల

కం.
శ్రీ వాణీ పరిసేవిత
దేవీ! శ్రీ చక్ర రాజ్ఞి! దీనుని నన్నున్
గావవె ఓ శుభ కారిణి
నీవే దిక్కని కొలచితినిను శ్రీ లలితా.   1.

శ్రీ లలితా మదుపాస్యా!
లాలిత మృదుపద కవితల లహరీ యాద్యా!
ఏలా మొర లాలింపవు
చేలా నను గనవదేల  శ్రీ శ్రీలలితా.  2
(చేలానను= చెప్పినట్లు విను దాసుడనైన నన్ను)

శ్రీ మాతా కరుణాలయ!
నీ మంత్రో పాసన ననునిత్యము జేయన్
భ్రామరి ! నే నింకెవ్వరి
తో మొర లిడుదు నను గాచు దుర్గా లలితా. 3
(భ్రామరీ= శ్రీ విద్యాధిష్టాన దేవత , భ్రమరాంబ)

అమ్మా నమ్మితి నామది
నిమ్మా సత్కార్య శక్తి నిటలాక్షు సతీ
కొమ్మా నా వినతుల్ చను
విమ్మా భవాని దయామయీ శ్రీ లలితా. 4
కం.
ఆశలు తీరగ కొలచెద
ఆశా పాశముల త్రుంపు మార్యా దేవీ
ఆశ నిరాశ లదేలా
మా! శర దిందు వదనా యుమా! శ్రీ లలితా. 5
కం.
ఇష్టా పూర్తికి దిక్కయి
కష్టార్జితపు పరి పుష్టి కాదన కమ్మా
తుష్టి కి లోటేల జనని
మృష్టాన్నము నీదు పూజ మా  శ్రీ లలితా. 6
కం.
ఈశ్వరి నిన్ నెఱ నమ్మితి
విశ్వేశు దయిత! దయార్ద్ర విభవ ! వినదగున్
నా శ్వాస శివో హమ్మను
నశ్వర సుఖమేల వలదననె శ్రీ లలితా. 7
కం.
ఉవిదల చెంగట వరలెడు
ఉవిదిత భాగ్యము జగతికి నుపకారమటే
సవతియు నీకేల జనని?
ఆ వక్ర గమన పునీత యటె శ్రీ లలితా.8
(ఉవిదితము= హరి హరులచే ఎఱుగ బడినది)
పోతన గారి ప్రయోగం :
మెఱగు చెంగట నున్న మేఘంబు కైవడి
ఉవిద చెంగట నుండ నొప్పువాడు.
కం.
ఊరట లేని బ్రతుకునన్
పోరాడగ శక్తి లేదు పోరితి పెక్కులన్
మారాడక కరుణించుమి
యా‌రా టము తీర్చవె కృపయా శ్రీ లలితా.  9
కం.
ఋత సత్యంబుల పల్కెద
సతతము శాంతిగ బ్రతుకగ సాధ్యం బౌనా?
వెతలన్ దెచ్చెడు పనుల మ
న తరమగునె నీ దయను వినా శ్రీ లలితా.  10
(ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి)
కం.
ౠమను బీజాక్షరమును
నా మది సమ్మోహన మగు నానాటికి నీ
నామ స్మరణమె శరణము
మామక సంకట హరము యుమా! శ్రీ లలితా.  11
(ౠమ్= సమ్మోహనకర బీజాక్షరము ,
మామక= నాయొక్క)
కం.
(అ)లులు (దంత్య) చజ లను దిగ మ్రింగిరి
      తెలుగుకు నవతర చెఱపగు తెగులది కలిగెన్
      తెలుగుకు గత వైభవమును
      కలుగగ జేయుమిక చండికా శ్రీ లలితా. 12
కం.
ఏ తీరుగ  నిక నను దయ
జూతువొ తల్లీ! తవ పద జోతలె శరణ
మ్మాతతముగ జననీ నీ
వే తప్పక నన్ను గావవే  శ్రీ లలితా.  13
కం.
ఐహిక విషయా శక్తియు
గృహమేధికి తప్పని సరి ఋణాను బంధం
బహరహమున్ వేధించున్
రహి యొనగూర్చవె  పరాపరా శ్రీ లలితా.  14
(గృహమేధి= గృహస్తు , రహి= ఆనందము , నేర్పు
పెద్దన గారి మనుచరిత్రలో
రహిపుట్ట చంద్ర గాత్రముల రాల్ కరగించు
విమల గాంధర్వంబు విద్య మాకు)

కం.
ఒనరన్  తాపసు లెందరొ
నినుపాసించియె ముముక్షువు లైరి భవానీ!
ననుపవ సింపించి పిలచి
నినుపా సింపించిన జననీ! శ్రీ లలితా.   15
కం.
ఔదల దాల్తు సదా తవ
పాద సరోజములసదృశ భక్తి తలిర్పన్
సాదర మొప్పగ కొలచెద
నీ దయ కురిపించవె జననీ శ్రీ లలితా.  16
కం.
అంబరమే సరి హద్దుగ
సంబర పడిపోదును కృప చాటిన చాలున్
అంబారంబని మురిసెద
లంబి ముదంబందదె  కలలా శ్రీ లలితా.  17.
(అంబారం = ఇంటికి కొనివచ్చిన పంట , ధాన్యరాశులు ,
లంబి = కుటుంబం)
కం.
ఆః పరుల! నీవె తప్ప యి
తః పర మెరుగ శరణార్థి తవ సేవార్థిన్
సః పరమార్థము నీవె స్వ
తః పార మార్థికుల సరితవు శ్రీ లలితా.  18
(ఆః= అంగీకరించు , పరుల= ఉమ , సః = హంస బీజం ,
సరిత= చరిత్ర)
కం.
కవితా మర్మము నేర్పిన
శివగామి! ఉత్తమ కాది విద్యా మర్మం
బుల్ వివ రముగ నెఱుక జే
యవె శరణంటిని దయ జూపవె శ్రీ లలితా.  19
(కాది విద్య = శ్రీ విద్య)
కం.
ఖలముల్ దునుముటయున్ సం
కుల కలుషిత  మనముల సరకున్ కడ తేర్చన్
విలసిత వాగ్భవ వైభవ
మిల సర్వ జనులకు నీయుమీ శ్రీ లలితా. 20
కం.

గమక విశేషమొ వరమో
సమయా చార పథ మున్ ప్ర సాదించి ననున్
క్రమముగ నీపద సేవా
కొమరుని జేసితివి జివరకున్ శ్రీ లలితా.  21
(గమకము=ప్రయత్నము , సమయాచారము= సాలంకృత లలితోపాసనా విధము)
 కం.
ఘనమై విస్తృత మై మో
హనమై వరలెడునది భవహరమై  వరమై
మానస మానస సరసిని
మునుగన్ జేయు తవ నామ మో శ్రీ లలితా.  22
(మానస మానస సరసి= మనస్సు అనెడి మానస సరోవరమున)
కం.
జ్ఞాన మొసంగని  విద్య న
జ్ఞానము  మన యుదర పోషణార్థము హూణం
బే నని  రుద్దిరి మా తల న
జ్ఞానులు జ్ఞానప్రసూన! నా శ్రీ లలితా. 23

కం.
చదువుల మర్మము  జ్ఞానమొ
ఉదర నిమిత్తమొ ఎరుగని యున్మత్త మిదే
చదివిన యజ్ఞానుల గనిన
విదుర వి వేకము లొసంగ వే శ్రీ లలితా.  24
కం.
ఛాందసు డందురు కొందరు
సందర్భోచిత హితోక్తి సలహా నీయన్
సుందర వాచస్పతి యని
రెందరొ నను వాగథీశ్వరీ శ్రీ లలితా.  25
కం.
జవ జీవము లున్ జాతికి
ప్రవిమల శ్రుతి పలుకులె మన ప్రమాణ మయ్యెన్
వేవేల వత్సరా లీ
చవిలేని చదువులదేల సతి శ్రీ లలితా.  26
కం.
ఝరియై నిర్ఝరణీ రొద
యై రమ్యంబై యెద సొదయై శ్రేయంబై
వరలన్ జూడుము కవితా
త్వరితా జనితా విభవపు వడి శ్రీ లలితా.  27
కం.
ఞ యనునాశిక మైనను
ఛాయా మాత్రమె కననగు సాహిత్యమునన్
దాయాదుల ఘాతుకమా
మాయము జేసిరి గదె కనుమా శ్రీ లలితా. 28
కం.
టపటప వదరుగ జాలను
కపటపు మమకారము వెటకారము లెఱుగన్
అపకారము నే జేయను
యుపకారమె వృత్తి నాకు యో శ్రీ లలితా.  29
కం.
ఠవరను గాను చటుక్కున
కవనము చెప్పన్ యితోధిక ప్రయత్నముతో
హవనము కవనము నేర్చితి
ప్రవిమల నవావరణ వివరము శ్రీ లలితా. 30
(ఠవర= నేర్పరి)
కం.
డమరుక మణి న్యాయంబగు
సమయానికి తగు సహాయ సౌలభ్యంబౌ
మమ విన్నపముల్ కొని కా
ది మహా విద్యయె సమస్త ధీ శ్రీ లలితా. 31.

(డమరుక మణి న్యాయం = ఒక చర్యకు రెండు ఫలితాలు, ఎలానంటే డమరుకం మధ్యలో దారం కట్టి దానికి చివరన చెక్క ముక్క ఉంటుంది. అది రెండు పక్కల శబ్దాన్ని సృజిస్తుంది. అలాగే ఒకే పనికి రెండు వ్యతిరేక ఫలితాలు లభించితే దానిని డమరుక మణి న్యాయం అంటారు)
కం.
ఢాకా జూపక నాపై
నీ కరుణా లేశము పడనీయవె జననీ
నాకేలా యీ యిడుములు
శాకాంబరీ! కృప జూపు చాల్ శ్రీ లలితా.  32
( ఢాకా = ప్రతాపము, ఇదే తఢాఖా అని కూడా వాడుకలో ఉంది.)
కం.
ణిసిధాత్వర్థము గారెడు
పసికూనను గాను వట్టి పామరుడన్ నా
కిసు మంతయు లేదు పటిమ
వసి వాడితి నలసితి కనవా శ్రీ లలితా.  33
(ణిసిధాత్వర్థము = ముద్దు)
కం.
తనియన్ జాలదు నా మది
ని నుపాసించగను ముక్తి నే  పొందుటకా
ధన మన ములనిడి చదివిం
పనె  పదిమందిని ఘనముగ  వర శ్రీ లలితా. 34
కం.
థూయని మొగమున నుమియకు
నా యాశ దురాశ యనకు నాకు గ తీవే
నే యాశింతును తల్లీ
నే యంబ్రహ్మను వలదన నిన్ శ్రీ లలితా. 35
(యంబ్రహ్మ =  తెలివి తక్కువ వాడు)
కం.
ద్వ్యర్థి ప్రయోజనములతో
సార్థక మౌ నాదు జన్మ స్వార్థమొ యది ని
స్స్వార్థమొ నే నెఱుగక పర
మార్థ మదియే యని  తలతు మది శ్రీ లలితా. 36

(ద్వ్యర్థి = రెండు అర్థముల గల కావ్యము , జీవితం అనే కావ్యానికి స్వార్థ ప్రయోజన మైన మోక్షము , నిస్స్వార్థ మైన జనహితము ఉంటేనే ఆ బ్రతుకుకు పరమార్థం అని నా గట్టి నమ్మకం)
కం.
ధరణీ సుర ధర్మము గా
పరహిత మనమున గడుపుచు బ్రతికెద నమ్మా
వరమిమ్మా బ్రాహ్మీ! నే
పరసుఖ ఆనంద నాథు వగ శ్రీ లలితా. 37
(పర సుఖానంద నాథ అనేది నా దీక్షా నామం)
కం.
నను బ్రోవమనుచు చెప్పరె
అను నిత్యము కొలచెడి జను లారా ఉమకున్
వినవే చూడవె దలుపవె
జననీ! దాక్షాయిణీ!  ఖచరి! శ్రీ లలితా. 38
కం.
పవి విరియౌ విరి పవియౌ
తవ కరుణా సుధ యొకింత దగిలిన యంతన్
లవలేశము నీ దయకున్
యవకాశము నీవె నీవె యన శ్రీ లలితా.  39
( పవి= వజ్రము/మెరుపు)
 కం.
ఫలిత మవశ్యము నీ దయ
వలసిన యత్నమె జనతకు వరమౌ ఏ వ్యా
కులమున్ జెందక మేమా
కుల పడకుండ కనుమీ సుగుణి శ్రీ లలితా. 40
(ఆకులపడు= చెదరి పడు)
కం.
బ్రతుకగ వచ్చును కృషితో
బ్రతుకు భగవ దర్పణముగ  బ్రతుకొక యోగం
బె తవ! కృపచే
వెతలం బెట్టకు ననున్ శివే! శ్రీ లలితా.  41

కం.
భగమొన గూర్పవె భక్తుడ
భగవతి! శాంభవి! భవాని! భార్గవి! కాళీ!
జగదాధారీ! కృపయా
వగ జూపక నా మొఱ వినవా శ్రీ లలితా. 42
(భగము = మోక్షము , జ్ఞానము , ఐశ్వర్యము)
కం.
మమ తాపము గనుమమ్మా
సమయా భావము నుపేక్ష జూపక కృపయా
మమతా సమతా పరయా
హిమజా! ఒసంగవె కాళి హే! శ్రీ లలితా. 43.
కం.
యమ నియమములన్ యోగా
క్రమముల్  సాధ్యమె జనాళి కందరకున్ నన్
క్షమియించవె శ్రోతవ్యం
మమ విన్నపం జగదంబ! మా! శ్రీ లలితా.44
కం.
రహి పొరలన్ దరి జేర్చవె
యిహపర సాధనల బల్మి నీవె హిమసుతా!
సహనము గణుతింపకుమీ
దహరాకాశ వికసిత త్రిథా! శ్రీ లలితా. 45
( రహి పొరలన్= ఆసక్తి అధిక మగునట్లు)
కం
లాలస మైన మనంబుతొ
నేలా పరువిడి బరువుల నెత్తితి చాలున్
జాలు శ్రమం బయ్యెడిన్ త
ల్లీ! లా వొకింతయు లేదులే శ్రీ లలితా. 46.
                                             
కం.
వర మడిగెదనని తడబడి
పొరబడితినొ కడు యిడుముల బొసగి గడుప నా
మొర వినియు వినని విధమది
సరి యగునె  జనని! శరణు నొసగు శ్రీ లలితా. 47
కం.
శరణని వేడిన యర్థిని
అరియైనన్ పగలు మాని ఆదర మిడరే
శరణని చరణము లంటిన
కరుణార్థిని కావవె కినుకా? శ్రీ లలితా. 48
కం.
షోడశి గా పంచదశిగ
వేడుకగా బాలగ కొలువిడి వర మిడినన్
ఆడితి నోడితి వేడితి
వాడితి కడదేరలేక వగ శ్రీ లలితా. 49
కం.
సరఘల్ వలె రొద సేయుచు
పరిపరి విధముల మనుజులు బాధించితిరో
నెరిగురి చూపవు ఆర్తుల
మొర వినగ నాల మదేల మును! శ్రీ లలితా. 50
కం.
హరికిన్ తోబుట్టువు యై
హరునికి యర్థాంగివై సహాయము  నీవే
హరియింపవె పాతకముల
తరుణోపాయ మెరిగించెదవె  శ్రీ లలితా. 51
కం.
'ళ' రహిత మయ్యె నిఘంటుల
  పర పీడనచే తనాది పదములు లేవే
నరజాతి సమస్త చరిత
పరపీడనమే యదేమి పనొ శ్రీ లలితా. 52

కం.
క్షమితము లేని కుపితుడన్
సమయస్ఫూర్తియు నొకింత చాలని నన్నున్
సుమతుని జేయ గతిస్త్వం
 రమణీ లలామ! యుమా!పరా శ్రీ లలితా. 52
కం.
క్షరమౌ లౌకిక సుఖముల్
స్థిరమంచుపరిశ్రమించు స్థిరతరు తెరువున్
పరికింపరు పామరులీ
ధరణిన్ తెలియమి సింహధరా శ్రీ లలితా.53
(స్థిరతరుడు = పరమాత్మ, సింహ ధర = పార్వతి)
కం.
ళాక్షర మేలా స్వేచ్ఛా
వీక్షణమందె పద కోశ పేటిని దుర్గే!
ళాక్షర మల్లె ననున్ ఏ
శిక్షకు గురిసేయకు శివశివ  శ్రీ లలితా. 53
(ళ+అక్షర= ళాక్షర, )
కం.
హరి యంచున్ హరు డంచు ము
సిరిన తగవులు బహు కీడు జేసె తెలుగుకున్
హరి హరులు పరస్పర మొ
క్కరని యెరుంగరె బుధుల్ నగజ! శ్రీ లలితా.  54.
కం.
సవితా చంద్రుల సాక్షిగ
నవతా దీర్ఘము శమింప నా వలగాదే
భవిత అగమ్య  గోచర
ము విధి యిటులై మిగిలితిని మృదు  శ్రీ లలితా. 55.
(నవత=దుఃఃఖము)
కం.
షోడశి జపమే విధియై
నుండెడి భక్తుల నుపేక్ష నొప్పకుమి శివే!
కూడితి కాపురుషుల వెను
కాడక కావవె  పరా! సకల! శ్రీ లలితా. 56.
(కం.
షట్పద స్వనమై ఘనమై
రాట్పడు చున్నది మనంబు శ్రీ విద్యా వి
రాట్పథ మందున నానా
గీట్పాటు లడ్డు పడు చుండిన శ్రీ లలితా. 56)
కం.
శారద జ్యోత్స్నా నిశలన్
శారద నవరాత్రు లంచు సేవింపరె నిన్
శారద! సకల జనులు వి
శారదులై కృప వడయరె శివె! శ్రీ లలితా. 57
(1శారద=శరత్కాలపు , 2.శారదనవరాత్రులు= దేవీ నవరాత్రులు, 3. శారద = పార్వతి, 4. విశారదులు = నేర్పరులు)

కం.
వరమై పరమై స్వరమై
వరదై స్థిరమై వెలసిన వానై యీవై
వరదా కృపయా పరయా
పరిపాహి సదా యచలజవర! శ్రీ లలితా.  58.

కం.
లలనా లలామ యేలా
లలిత లలిత పద చలితవు లలితవు కనవే
కలకల మాలంబేలా
వెలవెల నాపన్ కనుగొనవే శ్రీ లలితా. 59
(లలనా లలామ= శ్రేష్టమైన స్త్రీ, 1లలిత= మృదువైన, 2 లలిత= మనోజ్ఞమైన , పదచలిత = మాటలకు కదిలెడి
3లలితవు = శ్రీ లలితవు , ఆలంబేలా = ఆలస్యమేల
వెలవెలన+ఆపన్= వెలవెలపాటును ఆపుటకు , కలిమిలు = సంపదలు)

కం.
రజనీ కర స్మిత వదనా
సుజనా నంద వరదా వసుంధర ధరజా
అజరామర జీవనమీ
వె జనని శాకాంబరీ శివే శ్రీ లలితా. 60
(వసుంధర ధరజ = కొండ కూతురు / పార్వతి)
కం.
యతినై ప్రాసను నేనై
శ్రుతినై  కవితా విశేష శ్రుతమతి నై నీ
కృతినై పద సన్నిధిలో
నుతినై కడదేరి పోవనో శ్రీ లలితా.  61
కం.
మయివడి మొదలిడి వెతలకు
భయపడి తడబడి వెనుకకు పరిగిడ గలనా
నియమము విడువక యడుగిడి
పయనము కడ వరకు జరుపవా శ్రీ లలితా.62
(మయివడి = ఒప్పుకొని)
కం.
భవహర మగునని యెంచి స
వివరం బంచు సగుణవిధి  విధమే మేలం
చు వరంబంచు పురాకృత
సువిధా పున్నెముగ నెంచుచున్ శ్రీ లలితా. 63
కం.
బగళా! భైరవి! శూలిని!
త్రిగుణా! బాలా! సలలిత  త్రిపురి సతీ
నగజా! మంగళ గౌరీ!
అగణిత వరదా!నమామి యభి శ్రీ లలితా.  64
కం.
ఫలితం దైవా ధీనం
అలయక కృషి సేయుటే సదాచార మగున్
తెలియని దీశ్వరు నిచ్ఛయె
తెలివిడి నడిపింపవె జగతిన్ శ్రీ లలితా. 65
కం.
పరహిత మతినై  కొలచుచు
విరజా హోమము సలిపిన విడివడి పోదే
ల రజోగుణంబు? గిరిజా!
పరిపాలయమామ్ భవహరప్రద శ్రీ లలితా. 66
కం.
నే నెవరీ మేనెవరు
నే నే శక్తిచె వికాసిని యగుచు నుంటిన్
నేనా శక్తిని కాంచగ
నానా యత్నము లు జేతునా శ్రీ లలితా. 67
కం.
ధరణీ ఖండమొ కనకమొ
స్థిర ధన రాశులొ పదవులొ సిరులిడ నిన్
శరణాగతితో  నీ కడ
వరమడిగితి కావవే సుబల! శ్రీ లలితా.  68
కం.
దర్శన మిమ్మా అమ్మా
దర్శని జూపవె భవాని! తరియింపవె నే
కర్శయితను కాదనకే
దిర్శెన పూదండ వేసితిన్ శ్రీ లలితా. 69.
(దర్శని = దారి, కర్శయిత = ఊడిగం చేయువాడు, దిర్శెన పూవు = శిరీష కుసుమం)
 కం.
థుడనా చ్ఛాదిత ఘటమీ
కడు రమ్యం బగు శరీర కవచం బందున్
విడివడి వెలిగెడి దీపపు
నడి శిఖలో వుందు వం చనరె శ్రీ లలితా. 70
(థుడన = మూత, దీపపు నడి శిఖలో =  తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా  వ్యవస్థితః అన్న మంత్ర పుష్పం లోని ఋక్కుఆధారంగా)
కం.
తమి తీరన్ నిను కొలువగ
అమితా నందమగునపుడు యవస్థలేలా?
భ్రమయా? వ్యాకుల తన్నిడి
కుమిలింపకు న న్నికన్ సగుణ శ్రీ లలితా. 71
(తమి = తృప్తి)
కం.
ణ్యములో మానస సరసిలొ
యమునా నదిలో ప్రవిమల యచ్చర నదిలో
న మునుగ, బోవునె యఘముల్
తమ మనసులు మారకున్న, తరి శ్రీ లలితా. 72
(ణ్యము = బ్రహ్మ లోకమందలి సరస్సు , మానస సరసి = మానస సరోవరము)
కం.
ఢమఢమ డమరుక ధ్వానం
గమక వినోదం స్వరానుకూలపు విభవం
సమధిక జ్ఞానాలంబం
గమనింపగ నీ దయ యనుగమి  శ్రీ లలితా. 73
కం.
డాకఽ దరుమ లేక కలసి
రాక సమయ మోర్మి తో పరగుచు నుంటిన్
నాకము నందనె నీదయ
సోకిన కరుణించవె సరసున్ శ్రీ లలితా. 74
(డాకన్ = శౌర్యముతో, సురస = పార్వతి)
కం.
ఠంగన మమ్మ మదక్కర
చెంగట నీబంటుగ నట చేరితినే నీ
ముంగిట నిల్చెడి భక్తుడ
మంగళ గౌరీ! సరె యనుమా శ్రీ లలితా. 75
(ఠంగన = పొట్టిది/చిన్నది, అక్కర = కోరిక)
కం.
టక్కరి మాటలు తెలియవు
గ్రక్కున యనృతము నోట గనమో యమ్మా
చిక్కితి చిక్కుల పెక్కుల
చక్కగ శాంతిగ బ్రతికిన చాల్ శ్రీ లలితా. 76
కం.
ఞ కిణిహి యయ్యెనొ నోటికి
ఒకమాటైనను అనకనె ఒరిగిన కతనన్
ఇకమీదేమి ఒరుగునో
చకితం బగు వర్ణమాల చన శ్రీ లలితా.77
(కిణిహి = పళ్ళు తోము కొను ఉత్తరేణి , చకితము = భయము)
కం.
ఝంకారమ్మై పర్విడి
ఓంకారమ్మై మొదలిడి ఒరవడియై  మా
శాంకరి పదములపై నిలు
పంకజమై నా కవిత సభన్ శ్రీ లలితా. 78
కం.
జననం బాదిగ భక్తితొ
అనుదిన నతులన్ మెలగితి నమ్మా కనవే
అనఘుని మొఱలాలింపవె
విని వినని విధమది యరయవే శ్రీ లలితా. 79
(అనఘుడు = నిర్దోషి)
కం.
ఛాయా మాత్రము నెరుగక
జాయా సుతలకు తెలుపక జరిపిన యఘమీ
మాయా విభవము బరువై
కాయపు కష్టము కన ననఘా శ్రీ లలితా.80
కం.
చిరుదర హాసమె మాకఘ
హరమౌ క్రీగంటి చూపు వరమౌ నమ్మా
వరదా యనుకూలింంపవె
కరుణా హృదయా త్వరితముగా శ్రీ లలితా.81
కం.
జ్ఞానమె యర్ఘ్యము జ్ఞేయ
మ్మన హవి యే జ్ఞాత హోత యనుకొన జ్ఞాతృ
జ్ఞాన జ్ఞేయాన మభే
దన  శ్రీ చక్ర యజన మవదా శ్రీ లలితా. 82
( భావనోపనిషత్తు లో 11 వ మంత్రం:
జ్ఞాన మర్ఘ్యం, జ్ఞేయం హవిః, జ్ఞాతా హోతా , జ్ఞాతృజ్ఞాన జ్ఞేయానా మభేద భావనం శ్రీ చక్ర పూజనం)
కం.
ఘనమై యవ్యయమై నే
మును జేసిన పుణ్యమో యమోఘమొ  ఇంతై
నను శ్రీ విద్యో పాసన
కనువుగ మలచిరి  రమణుడు కడు శ్రీ లలితా. 83
కం.
గంగిక తటిపై నిన్ ప్ర
త్యంగిరగా లలితగ వరదా కొ
ల్వంగ నుబలాట మమ్మా
చెంగలి నిమ్మా యభవుని చెలి! శ్రీ లలితా. 84
(చెంగలి = సామీప్యము)
కం.
ఖచరీ! మదపేక్షగ  నీ
వచలాత్మజ వందురంత వడిగా కనిపిం
చుచు నుండవే తనిసెదన్
శుచిరోచిధరీ వరమిడు శుభ శ్రీ లలితా. 85
(ఖచరి = పార్వతి , శుచిరోచి = చంద్రుడు)
 కం.
కలుషిత వాతా వరణము
నలుదెసలను వ్యాప్తి నొందె నగజా! విలువల్
పలుచ బడె నిసీ నాగరి
కులె వీరందరు? సహింపకో శ్రీ లలితా.  86
కం.
ఆః కరణం తవ నామం
స్వః కానందము నొసంగు సాధన యందున్
యః కారయత్సర్వం తా
వః కుర్వంతు యన తూగవా శ్రీ లలితా. 87
(ఆః = స్మరించు, స్వః = ఆత్మ , యఃకారయత్సర్వం = ఇదంతా ఎవరు చేయించుచున్నారో, తావః = వారే, కుర్వంతు = చేసెదరు, యఃకారయతి సకరోత్యేవ అని ఒక సామెత. దానినే అర్థం మార్చకుండా కొద్ది పాటి మార్పుతో చెప్పాను. కారణం. విసర్గ మధ్యలో ఉంచి తెలుగులో మాటలు లేవు. సంస్కృతంలోంచి ఎరువు తెచ్చుకో వలసిందే)
కం.
అంకిలి సెప్పక నేర్చితి
శంకర మని భగవతి పద సన్నిధి కొల్వన్
బింకము పోవ నసాధ్యము
శంకరి  నిను గొలచెద ననిశము శ్రీ లలితా. 88
(అంకిలి = అడ్డు, శంకరము = శుభముల నొసగు)
కం.
ఔచితి యగునా తగునా
తాచిక లాడుచు నపేక్షితము లిమ్మనుచున్
సూచింప నారాట పడగ
బ్రోచిన మము చాలదా పరుల! శ్రీ లలితా.    89
కం.
ఓ లలితా నా యెద నీ
ఆలయమగు నోలగమగు నంతియె సదా
పాలయ మామ్ పరిపాహి శి
వే లోపము లెంచకే  సువిధ శ్రీ లలితా. 90
(ఓలగము = కొలువు) దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ప్రయోగం:
ఈ యనంత పథాన ఏచోటికా చోటు
నీ యాలయమ్మౌను నీ యోలగమ్మౌను.
(కం.
ఒగి నే నేర్చితి నమ్మా
తగు రీతిన్ తవ జప తపముల్  పూజల్
తగనే నిను దర్శింపగ
విగతుడ నమ్మా దయామయీ శ్రీ లలితా.91)
(ఒగి = శ్రద్ధగా, విగతుడు = వెలుగు లేని వాడు)
కం.
ఒరులేమన మా కేమిటి
వరదా భయదా సదా భవాని, శివానీ
చెరగై నీవుండగ నీ
స్మరణే శ్రీ రామ రక్ష మా! శ్రీ లలితా. 92
(చెరగు = దిక్కు)
కం.
ఐనను గృహమేధి యగుట
చే నగు బాటు పడకుండ  జీవించ వలెన్
నానా బాధలు పడుచున్
ఏనాటికి శాంతి దొరకునే శ్రీ లలితా.93
కం.
ఏటి కెదురీదు చుంటి యి
దేటి యవస్థ యఘమేమి యెటు జేసితి  నా
బోటి కులీనుల కేలా
పాటుల సోకోర్చుటంత పని శ్రీ లలితా. 94
కం.
ఎలుగెత్తి ఏడ్వ  లేను స
జల నయనాలతొ దిగులుగ చతికిల పడకన్
విలువల వలలో పడి నే
విలవిల లాడితి నను కనవే శ్రీ లలితా. 95
కం.
ఎడద యె డారిలొ నేనొక
నిడివి తెలియని తెరువరిని గాని వడిగా
వడివడిగా పడి లేచే
బుడుతను ఆదుకొనవే త్రిపుర శ్రీ లలితా.96
కం.
లులు లకు పట్టము గట్టిరి
లులు యని పేరిడి బహుళ విలోల దుకాణం
బుల సంస్థకు మలయాళీ
పలు దేశంబుల నిలిపిరి వర శ్రీ లలితా. 97
కం.
ఋశము లెరుంగని నీ దయ
వశమై నీ పాద సేవ వ్యసనం బై నా
దశ ఘనమై యొక వరమై
శశి శేఖరి నే తరింతు శివె శ్రీ లలితా. 98

కం.
ౠ యగు చున్నది యమ్మా
పాయక నను గావవే కృపా సింథూ! నా
ఛాయకు నిడుముల నంపక
చేయూత నొసంగుమమ్మ శివె! శ్రీ లలితా. 98
(ౠయగు = భయమగు)
కం.
ఊసాడ వమ్మ నాతో
బాసాడ వె యమ్మ నీదు పాదాల కడన్
నే సోలి పోదు అటులనె
నే సాగుచు రాలిపోదునే శ్రీ లలితా. 99
కం.
ఉటజాంతస్థల వేదికన్
నిటలాక్షు దయిత! కృపావనీ! నా యెదలో
దిటమరి నై యేర్పరచితి
తటపట మాని యుపవిసతు త్వం శ్రీ లలితా. 100
కం.
ఈవరివై మము కావవె
వావిరిగా మా వినతుల పని శైల సుతా
భావా వేశపు వాక్ఝరి
తో వదరినచో క్షమించు తది శ్రీ లలితా.101.
(ఈవరి = దానశీలి)
కం.
ఇతర మనో వాంఛ లణచి
పతితుని భాగవతునిన్ కృపా సాగరి నన్
సతతము పవశింపించవె
శ్రుతి సూక్తి విభావ మాతృ శ్రీ శ్రీ లలితా. 102

కం.
ఆశా పాశమ నంతము
రాశీభూత విభవంబు రాసిచ్చినయున్
యాశ యడంగ దదేలనొ
మా శీల మదే గదే ఉమా శ్రీ లలితా. 102
కం
అరిది జపః ఫల మంతయు
తరిగి మదశ్రు నయనాల దవిలి తనిసి ని
స్సరి యీతి బాధ లలయవె
వరదా నీదయ గరుపవా శ్రీ లలితా.  103
కం.
శ్రీ హరి భగినీ! నే శి
వోహమ్మంచు జపియింతు వోజగ మాతా
యాహా యిదేమి చిత్రమో
యూహ కలంగు నపుడప్డు యుమ! శ్రీ లలితా. 104
(ఓజగ = పద్ధతిగా)
కం.
శ్రీ కైవల్యార్థ పథం
బై కాదిని యాశ్రయించి భాగవతులనే
కుల్ కైవల్యం బందిరి
నాకా యవకాశ ముండునా శ్రీ లలితా.105
కం.
శ్రీ కరమౌ శుభ కరమౌ
సాకా రమ్మౌ యిహపర సాధన యంచున్
నే కడు భక్తిన్ దవిలి శ
శాంక ధరీ సాగెద ననిశం శ్రీ లలితా.  106
కం.
శ్రీ చక్రో పరి వేష్టిత!
శ్రీ చంద్ర కళా సషోడశీ! మాతంగీ!
హే చాముండీ! శతథా
నీ చరణ ద్వయము నమ్మి నిట శ్రీ లలితా. 107
కం.
శ్రీ విద్యోపాసకులకు
శ్రీ వాణీ వర ప్రసాద శ్రీ మంతులకున్
సావిత్రీ జప కరులకు
నీవి నొసగు నక్షమాల నే శ్రీ లలితా. 108

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home