Wednesday, June 27, 2018

వినమ్రంగా

కం.
గురువై ఈ సకల చరా
చర జీవులకు విభుడై ప్రశాసకుడై తాన్
తెరువై చెఱువై పరువై
హరుడై వెలుగొందు వాని ప్రస్తుతి జేతున్.1

పరుడై ఈశ్వరుడై భవ
హరుడై హరుడై పరాత్పర స్వరూపుండై
వరుడై ఘనుడై తోడై
స్మరహరుడై యొప్పు వాని స్మరింతు నెపుడున్.2

వరమై మహా విభవమై
తారా నివహపు వెలుగుల తావై యా ధ్వాం
తారాతి విహా రమ్మై
ధరణీ ధరుడై వెలిగెడి తండ్రిన్ కొలతున్.3
(నివహము=గుంపు, ధ్వాంతారాతి=సూర్యుడు)

జలమయమై తమిశ్రమమై
విలయమ్మై తానొకండె ఏకాంతమునన్
నిలచిన శాశ్వతు నచ్యుతు
తలువని తలపుగ  తలతును తలపుల మూలున్. 4

దేహము దేహియు వేరని
యిహమున తనువును తనదని తెలియక పోగా
కుహనా జ్ఞానము చిదిమిన
మహనీయుని  యాత్మ మూలు మదిలో తలతున్.5
తలపుల మూలము తానై
తలకెక్కిన యహమనునది తానై తానే
కలిమికి బలిమికి కొలువై
కొలచిన వారికి శుభమిడు గోపతి గొలతున్.6
(గోపతి =శివుడు)
జగతికి గురువై వెలుగై
ప్రగతికి పేరై బ్రతుకుల ప్రజ్ఞానమ్మై
యగణిత శంకరుడై తాన్
జగముల నడిపెడు దిసమొల జంగము కొలతున్.7
వేదియు వేదము తానై
వేదాంతపు సారమై సువేశా స్థలమై
యాదియు నంతము నొకడై
ప్రోది యగునాతని కొలతు ప్రోక్షిత మతినై.8
అలఘుల్ గురువులు నాయెడ
ల లఘువుల నితోధికముగ లాఘవమొప్పన్
చలన మనోదీప్తి న్న
న్నలఘున్ జేసిన గురువుల నాత్మ దలంతున్.9
(లఘువుల=వడివడిగా)

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home